కథా..పరిణామక్రమం

Mon,December 28, 2015 12:41 AM

కథంటే మెదడు పొరల్లో విద్యుత్ కాంతితో కొత్తదారు లు వేయాలి. గుండె గదుల్లో ఏదో కొత్త సంస్కారపు రక్తాన్ని నింపిపోవాలి. ధమనులు, సిరల్లోకి పల్లె నుంచి కడుముంతలో తెచ్చిన గాయాల సలుపును ప్రసరింపజేయాలి. వంకలుగా తిరుగుతూ సాగిపోయే వాగు నీటి వడిని దేహంలోకి వొంపిపోవాలి. చదివి మూసేసినా హృదయంలో ఒక ఎడతెగని ముసురును కురిపించాలి. అది సృష్టించిన ప్రకంపనలతో మనిషి నిలువెత్తు కదిలిపోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కథ మానవ జీవితంలోని హిం సను, బాధను, సుఖాన్ని, సంతోషాన్ని, దు:ఖాన్ని, పెనుగులాటను, జీవితాల్లో నిశ్శబ్దంగా జరుగుతున్న విధ్వంసాన్ని కశ్కెతో పాలగోకు తీసి తినిపించినట్లు కొంచెం కొంచెంగా తినిపించాలి. మనిషి ఊహాపోహలకు పోయిన ఆదిమ కాలంలోనే కథ పుట్టిం ది. వేదాలు, ఇతిహాసాలు, పురాణాల నుంచి లౌకిక సాహిత్యం దాకా కథలేని సాహిత్యమే లేదంటే అతిశయోక్తి కాదు. చివరికి కవిత్వంలో కూడా ఏదో ఒక కథ అంతర్లీనంగా, నిగూఢంగా తొంగిచూస్తూనే ఉంటుంది. కథ మనిషితో పాటు నడిచి వచ్చే ఒక రసగంగా ప్రవాహం. నదిలాంటి శిల్పంతో సాగే ప్రాచీన కథల్ని పక్కకి పెడితే, భారతీయ భాషల్లో ఆధునిక కథది కూడా సుదీర్ఘ చరిత్ర. అందులో ప్రాంతీయ అస్తిత్వ వాదంతో ప్రజాకాంక్షలను వ్యక్తీక రించిన కథలు సమాజ మార్పులో గణనీయమైన పాత్రను పోషిం చాయి. సమాజాన్ని నడిపించాయి.

ఒక ప్రాంతానికే పరిమితమైన లేక ఇతర ప్రాంతాల నుంచి వేరు పరచదగిన ఆచార సంప్రదాయాలు, సంస్కృతి, వేష, భాష లు, భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, నైసర్గిక స్వరూపం, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు, స్వభావం, సంస్కారం, విప్లవాలు, పోరాటాలు, అభివృద్ధి, క్షీణతలు, కరువులు, వలసలు, ఆధిపత్యాలు, ఆక్రమణలు, వివక్ష.. ఇలా ప్రాంతీయ అస్తిత్వాన్ని చాటి చెప్పే విషయాలు ఎన్నో. వీటి ప్రభావం నుంచి తప్పించుకొని రచనలు చేసే రచయితలు ప్రపంచంలో ఎవరూ ఉండరేమో! అలా తెలుగు సాహిత్యంలో ఆదికావ్యం నుంచి ఇప్పటి కథా సాహిత్యం దాకా ఈ ప్రభావం ఎంతో కొంత ప్రతీ రచనపై ఉందని గుర్తించక తప్పదు. ఇలా చూసినపుడు ప్రతీ రచనలో ప్రాంతీయ అస్తిత్వ మూలాలు తప్పకుండా కనబడతాయి. ఈ మూలాలు కవిత్వంలో, కథా సాహిత్యంలో మరింత ఎక్కువగా కనిపిస్తాయి. ప్రాంతీయ ముద్రతో పుట్టినవే అయినా అవి విశ్వవ్యాప్తమవుతాయి.

తెలుగులో తొలి కథలు రాసిన భండారు అచ్చమాంబ, గురజాడ అప్పారావు సంఘసంస్కరణ దృషితో కథలు రాసినా వాటి ని జాగ్రత్తగా గమనిస్తే మనకు ప్రాంతీయ మూలాలు కనిపించక మానవు. గురజాడ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన చాసో కథల్లో ముఖ్యంగా బొండుమల్లెలు, వాయులీనం, ఏలూరెళ్లాలి, ఎందుకుపారేస్తాను నాన్నా, కుక్కుటేశ్వరం తదితర కథల్లో కళింగాంధ్ర ప్రాంతీయ అస్తిత్వ మూలాలు కనిపిస్తాయి. ఆ తరువాత రావిశాస్త్రి కథల్లో అక్కడి భాష, న్యాయవ్యవస్థ డొల్లతనం, అధికార యంత్రాంగం, పీడనను చిత్రించిన కథలు చాలా ఉన్నా యి. ఆరుసారా కథలు, సారో కథలు, కలకంటి కంట కన్నీరు మొదలైన కథల్ని చెప్పవచ్చు. తరువాత ప్రాంతీయ జీవన చిత్రణకి, ప్రాంతీయ సమస్యలకు పెద్దపీట వేసిన వారు కాళీపట్నం రామారావు. ఆయన రాసిన యజ్ఞం కథ ఆ ప్రాంతంలోని దోపి డీ, పీడన, వెట్టిచాకిరీలను చర్చించిన కథ. కారా రాసిన చావు, సంకల్పం, భయం, ఆర్తి తదితర కథల్లో అక్కడి సంఘర్షణలు, ఆ సమాజంలోని వైవిధ్యాలు, వైరుధ్యాలు, ఆ ప్రాంత సమస్యలు కళ్ళకు కడతాయి. పలాస, ఆలమండ ప్రాంతాల్లోని రాజుల రాజరికం క్రమంగా పడిపోయిన విధమంతా కె.ఎన్.వై. పతంజలి కథల్లో కనిపిస్తుంది. ఎ. వి. రెడ్డి శాస్త్రి, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, చింతా అప్పలనాయుడు, కొప్పుల భానుమూర్తి, బమ్మిడి జగదీశ్వరరావు, కె. ఎన్. మల్లీశ్వరి, జి.ఎస్. చలం, మల్లిపురం జగదీష్ తదితర కథకుల కథల నిండా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జీవన సంఘర్షణలు, దోపిడీ, అడవి బిడ్డల బతుకుల్లోని చీకటి, మైదాన ప్రాంతాల వారు గిరిజన జాతులను ఎలా దోచుకుంటున్నదీ కనబడుతుంది. చాసో సంపాదకత్వంలో వచ్చిన కళింగాంధ్ర కథలు మాత్రమేగాక నాగావళి కథలు, వంశధార కథలు, జంఝావతి కథలు, కథాపార్వతీపురం మొదలైన సంకలనాలను గమనిస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రజల బతుకుల్లోని అగాధాలు తెలుసుకోవచ్చు.

1970 నుంచే తెలంగాణ ప్రాంత కవులు, రచయితలు గూడూ రి సీతారాం, జి. సురమౌళి, కాళోజీ , ఇల్లిందల సరస్వతీదేవి, పి. యశోదారెడ్డి, మాదిరెడ్డి సులోచన, తాడిగిరి పోతరాజు, బోయ జంగయ్య, బి.ఎస్.రాములు, దాశరథి రంగాచార్య.. ఎంతో మంది కథకులు తెలుగు కథను సుసంపన్నం చేస్తూనే తెలంగాణ సోయితో తెలంగాణ తెలుగులోనే కథలు రాశారు. 1970 తరువాత తెలంగాణ కథను విప్లవోద్యమాలు ప్రభావితం చేశా యి. విప్లవ పోరాటాలు,రైతు కూలీ సంఘాలు, గోదావరిఖని రామగుండం ప్రాంతాల్లోని బొగ్గు పొరల్లోని కార్మికుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇవన్నీ అంతో ఇంతో ఇక్కడి కథను ప్రభావి తం చేశాయి. తెలుగు కథకు విప్లవ చైతన్యాన్ని అద్దాయి. ముఖ్యం గా అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, బి.ఎస్. రాము లు,కాలువ మల్లయ్య, ఉప్పల నర్సింహం, భూపాల్ లాంటి కథకులు తెలుగు కథకు ప్రాంతీయతతో పాటు విప్లవోద్యమ చైతన్యా న్ని కూర్చారు. అల్లం రాజయ్య రాసిన అతడు, మధ్యవర్తులు, మహాదేవునికల మనిషిలోపలి విధ్వంసం భూమి కథలు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి రాసిన జాడ, చావువిందు, పనిపిల్ల, ఇల్లు కథలు చదివితే 1970 తరువాతి తెలంగాణ జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ జరిగిన విధ్వంసాలన్నీ బోధపడతాయి. ఆడెపు లక్ష్మీపతి, సదానంద శారద కథ ల్లో కూడా ఇక్కడి సంక్లిష్టతలు, సంఘర్షణ సజీవంగా సాక్షాత్కరిస్తాయి. 1985 తరువాత ప్రపంచీకరణ నేపథ్యంలో తెలంగాణలో ఈ ప్రాంతీయ అస్తిత్వ స్పృహ మరింత పెరిగిందని చెప్పాలి. పులుగు శ్రీనివాస్, నందిని సిధారెడ్డి, బి. వి. ఎన్. స్వామి పెద్దింటి అశోక్ కుమార్, బెజ్జారపు రవీందర్, జెజ్జారపు వినోద్ కుమార్, పి. చంద్, జూకంటి జగన్నాథం, కాసుల ప్రతాపరెడ్డి, అనిశెట్టి రజిత, పంజా ల జగన్నాథం, కె.వి.నరేందర్, వేముల ఎల్లయ్య, పూడూరి రాజిరెడ్డి, కటుకోజ్వల మనోహరాచారి లాంటి వారి కథల్లోనూ, ఎన్నో కథా సంకలనాల్లో తెలంగాణ సోయితో కూడిన కథలున్నాయి. ఈ ప్రాంతపు అస్తిత్వ స్పృహను చాటి చెప్పాయి.

ఉత్తరాంధ్ర, తెలంగాణల్లో కథా రచన సంఘసంస్కరణోద్యమ కాలంలో మొదలైతే రాయలసీమలో కథా రచనకు చాలా కాలం పట్టింది. రాయలసీమ తొలితరం కథా రచయితలైన కె. సభా, మధురాంతకం రాజారాం, రారా, వై.సి.వి.రెడ్డి, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, జి.రామకృష్ణ, తూమాటి దోణప్ప, సింగమనేని నారాయణ మొదట్లో మధ్యతరగతి సమస్యల్ని, మానవీయ సంఘర్షణల్ని చిత్రించినా తరువాత్తరువాత ఎవరి ప్రాంతపు సమస్యల్ని వారు చిత్రిక కట్టడం కనిపిస్తుంది. రాయలసీమ సమస్యల్ని చిత్రించిన కథకులు కె. సభా, కలువకొలను సదానంద, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, పులికంటి కృష్ణారెడ్డి, వి.ఆర్. రాసాని, మధురాంతకం మహేంద్ర, నరేంద్ర, చిత్తూరు పరిసర ప్రాంతాల సమస్యలను, కష్టాలను ఎంతో సమర్థవంతంగా చిత్రించారు.

ప్రాంతీయ అస్త్తిత్వ స్పృహతో కథలు రాసిన వారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వారు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి. ఆయన రాసిన నమ్ముకున్న నేల, కూలిన బురుజు, గడ్డి, విశ్వరూ పం, పీర్లసావిడి తదితర కథల్లో విశ్వనాథరెడ్డి రాయలసీమ కరు వు బీభత్సాన్ని, వ్యవసాయ సంక్షోభాన్ని, రైతు హీన స్థితిని, రాజకీయ నాయకుల కుటిలత్వాలను, కుల మత వివక్షలు, అణచివేతలు, పీడనలు ఇలా ఎన్నో సమస్యల్ని పట్టి చూపుతాయి. సింగమనేని నారాయణ అడుసు, జూదం, బండినారాయణ స్వామి నీళ్లు, వానరాలే, నడక, చిలుకూరి దేవపుత్ర మన్నుతిన్న మనిషి, శాంతి నారాయణ కళ్లమైపాయ, రాప్తాడు గోపాలకృష్ణ మర్రినీడ మొదలైన కథలు రాయలసీమ ప్రాంత సామాజిక పరిణామాలు, ఇక్కడి ఛిద్రమైన బతుకుల వెతలన్నీటిని కళ్లముందుంచుతాయి. నాగప్పగారి సుందరరాజు, చక్రవేణు, పాణి, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, వేంపల్లి షరీఫ్, వేంపల్లి గంగాధర్, మహమ్మద్ ఖదీర్ బాబు, కాశీభట్ల వేణుగోపాల్, సుంకోజి దేవేంద్రాచారి, పలమనేరు బాలాజీ, జి. వెంకటకృష్ణ, ఎం. హరికిషన్, ఇనాయతుల్లా, కె. సుభాషిణి తదితరులు ఎంతో మంది రాయలసీమ కథను ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో నడిపిస్తున్నారు. ఇక్కడి సమాజంలో కొంతలో కొంత వరకైనా కదలిక తెస్తున్నారు.
ప్రపంచంలో ఏ ప్రాంతంలో పురుడుపోసుకున్న కథ అయినా ఆప్రాంతపు మట్టి వాసన, కష్టాలు, కన్నీళ్లు, ఆనంద విషాదాలు, ఆ మనుషుల మనస్తత్వాలు.. ఆ ప్రాంత ప్రత్యేకతలన్నింటినీ కడుపున దాచుకొని పుడతాయి. ప్రపంచీకరణకు విరుగుడు స్థానికతే అన్నప్పుడు ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో ప్రపంచం అన్ని ప్రాం తాల నుంచి విస్తృతమైన సాహిత్యం రావాల్సి ఉంది. ముఖ్యంగా కథా సాహిత్యం చాలా వెలువడాలి. ఎందుకంటే కథే సమాజాన్ని ఎక్కువగా, సమర్థవంతంగా పట్టించుకుంటుంది. ప్రకటిస్తుంది. ఇప్పుడు మనం అస్తిత్వ చలనాల దశకు చేరుకున్నాం కాబట్టి ప్రతీ ఒక్కరూ తమ ప్రాంతపు అస్తిత్వ చైతన్యాన్ని కలిగిఉండాలి. అప్పుడే తమ ప్రాంతపు సుఖాలు, దు:ఖాలన్నీ అర్థం అవుతా యి. మనుషులు, మట్టి అర్థం అవుతాయి. అప్పుడే జీవితం, జీవనం సంపూర్ణ వికాసం చెందుతాయి.

తెలంగాణ ఉద్యమాన్ని చిత్రించిన కథలు చాలా వచ్చాయి. తెలంగాణ చౌక్ పేర బి.వి.ఎన్. స్వామి ఈ కథల్ని సంకలనం చేశారు. పెద్దింటి అశోక్ కుమార్ రాసిన యుద్ధనాదం, బెజ్జారపు వినోద్ కుమార్ రాసిన కొత్తరంగులద్దుకున్న కల తదితర కథలు గుర్తింపు పొందాయి. సామాన్య రాసిన కొత్తగూడెం పోరగాడికో లవ్ లెటర్ కూడా ఉద్యమ సమయంలో వచ్చిన మంచి కథ. నూటపదహారేళ్ల తెలుగుకథ ప్రయాణంలో ముందుతరం కథకు లు ఏం చెప్పారు, ఎలా చెప్పారు అనేది ఈ తరం కథకులు తెలుసు కుంటే కథల్లో ఇంకా రికార్డు కాని జీవితమేంటో, ఎక్కడ తమ కు జాగా ఉందో అర్థం అవుతుంది. మనమెక్కడ మొదలు పెట్టా లో అవగాహన అవుతుంది.
(నవంబర్18, 2015న తెలంగాణ సారస్వత పరిషత్తులో జరిగిన కథా రచయితల అధ్యయన శిబిరంలో తెలుగు కథా విస్తరణపై చేసిన ప్రసంగ పాఠం నుంచి కొంత భాగం..)

తెలుగు సాహిత్యంలో ఆదికావ్యం నుంచి ఇప్పటి కథా సాహిత్యం దాకా ఈ ప్రభావం ఎంతో కొంత ప్రతీ రచనపై ఉందని గుర్తించక తప్పదు. ఇలా చూసినపుడు ప్రతీ రచనలో ప్రాంతీయ అస్తిత్వ మూలాలు తప్పకుండా కనబడతాయి. ఈ మూలాలు కవిత్వంలో, కథా సాహిత్యంలో మరింత ఎక్కువగా కనిపిస్తాయి. ప్రాంతీయ ముద్రతో పుట్టినవే అయినా అవి విశ్వవ్యాప్తమవుతాయి.

1180
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles