బాల సాహిత్య వైశిష్ట్యం

Mon,November 16, 2015 12:30 AM

హితేన సహితం సాహిత్యం.. హితాన్ని చేకూర్చేది సాహిత్యం. అది జీవనది వంటిది. ఎన్నెన్నో అనుభవాలు, అనుభూతులు పంచుకుంటుంది. సాహిత్యం నిరంతరాయంగా ప్రయోజనాలను చేకూరుస్తూనే ఉంటుంది. సాహిత్యం ఎన్నెన్నో శాఖలుగా విస్తరించింది. అందులో బాలసాహిత్యం ముఖ్యమైనది. అది పిల్లలనలరిస్తుంది. ఆడిస్తుంది, పాడిస్తుంది. పెద్దలను సైతం బాల్యపు జ్ఞాపకాలలోకి దించగలుగుతుంది.
బాలసాహిత్యం అంటే..

పేరులో పెన్నిధి ఉన్నట్లు బాల అనే పదంలోనే ఇది ఎలాంటి సాహిత్యం, ఎవరి కోసం ఉన్న సాహిత్యం అని ఇట్టే తెలిసిపోతుంది. శిశువు జన్మ మొదలు బాల్యదశ ముగిసేవరకు పారే విజ్ఞానమంతా బాల సాహిత్యం అనవచ్చు. ఆటపాటల దశ నుంచి పాఠశాల దశ ముగిసే వరకు సాగేదంతా బాల సాహిత్యంగా చెప్పవచ్చు.
ముమ్మటుడు కావ్యం వల్ల యశస్సు, సంపద, వ్యవహార జ్ఞానం, అమంగళ పరిహారం, సమయస్ఫూర్తి, ఉపదేశం కలగాలంటారు. పైవన్ని బాల సాహిత్యం వల్ల సమకూరుతాయని చెప్పవచ్చు.

బాలసాహిత్యం పుట్టుక: బాల సాహిత్యం ఎప్పుడు ఎలా పుట్టిం దో కచ్చితంగా చెప్పలేం. కానీ పెద్దల అభిప్రాయం ప్రకారం మాతృహృదయ జనితం తల్లి జోల పాటలు, లాలిపాటలు, నిద్రబుచ్చే మాటలు, పాటలు, చేతల నుంచి బాల సాహిత్యం పుట్టుక జరిగిం ది. తొలి బాల సాహిత్యవేత్తలు తల్లులే అని చెప్పవచ్చు. పిల్లల ఆటపాటలలో మమేకమవగా తల్లి హృదయం ఆనందంతో మాటై, పాటై, కథయై పరిఢవిల్లింది.

బాల్యపు ఊసులే జీవితమంతా ప్రవహిస్తూ ఉత్తేజాన్ని, చైతన్యాన్నిస్తాయి. చిన్నారుల మొదటి గురువు తల్లి. పాలతో పాటు మౌఖిక సాహిత్యాన్ని అలవోకగా అందిస్తుంది. పసి మనసులు వాటితో ఆనందాన్ని పొందుతూ ఆటలాడుకోవడం సర్వసాధారణం. తాతలు, అవ్వలు, అమ్మమ్మలు.. మొదలైనవారు పసి హృదయాలతో ఆడిపాడి లాలించి వారిని అలరిస్తున్న క్రమంలో బాలసాహిత్యాన్ని సృజిస్తున్నారు.
కల్పనాశక్తి పెరుగుతున్న క్రమంలోనే సాహిత్యం పుడుతుంది. పాల సముద్ర మథనంలో అమృతం పుట్టినట్లు మనస్సులోనే మథనం సాగి బాలసాహిత్యం పుడుతుంది. పెద్దలు బాలల కోసం రాస్తున్నది ఒక విధమైతే, పిల్లలు తమ గురించి తాము రాసేది మరో విధం. బాలలు వాగ్రూపంలోనే సృజిస్తున్నా అది నిరంతరం కొనసాగుతూనే ఉన్నది.

బాలసాహిత్యం: విత్తనం నుంచే మహా వృక్షం ఎదిగినట్లుగా బాల్యం నుంచి బాలసాహిత్యం ఎదుగుతూ వచ్చింది. పాల్కురికి సోమనాథుని బసవపురాణంలోని బాల్యం వర్ణనను బాలసాహిత్యంగా చెప్పవచ్చు. నాచన సోమనాథుడు, శ్రీనాథుడు, మొదలైన కవులు కూడా తమ రచనల్లో పిల్లల ఆటలు, పాటలు వర్ణించారు. సుమతి శతకం, వేమన శతకం తదితర శతకాలలో కూడా బాల సాహిత్య ఛాయలు కన్పిస్తాయి.

మహాభారతం, రామాయణం, బసవపురాణం, కేయూర బాహు చరిత్ర. పోతన భాగవతం మొదలైన గ్రంథాలలో బాలసాహిత్యం వికాసదశలు మనకు కనిపిస్తాయి.ఆధునిక తెలుగు బాల సాహిత్యానికి మూలం కాశీ మజిలీ కథ లు, పంచతంత్ర కథలు లాంటి ఊకుడు కథలు బాలసాహిత్య నిధులు. ఆధునిక యుగంలో బాల సాహిత్యం ఎన్నెన్నో మార్పులు సంతరించుకున్నది. బాలసాహిత్యం పురోగతి సాధించినది.
గేయ, పద్య, గద్య, రూపాలలో బాల సాహిత్యం కన్పిస్తున్నది. చిన్నయ సూరి నీతి చంద్రికలో కథలుగా రాశారు. కందుకూరి వీరేశలింగం, వెంకటరత్నం పార్వతీశ కవులు బాలసాహిత్యాన్ని వెలువరించారు. నీతి దీపిక, నీతి కథ మంజిరి, బాల గీతావళి ఆ కోవలోకే వస్తాయి. ఆధునికంగా మర్యాదరామన్న కథలు అక్బర్ బీర్బల్ కథలు, మొదలగు కథల పుస్తకాలు బహుళ ప్రచారంలోనున్నవి.

గురజాడ అప్పారావు, గిడుగు వెంకటసీతాపతి, చింతా దీక్షితులు, దాశరథి, సినారె వేముగంటి నరసింహాచార్యులు మొదలైనవారు బాల సాహిత్యాన్ని సృజించినవారే.వెలగా వెంకటప్పయ్య, ఉత్పల సత్యనారాయణ, ముళ్ళపూడి వెంకటరమణ, కె.రామలక్ష్మి, డాక్టర్ మలయశ్రీ, బెహర ఉమా మహేశ్వరరావు, ఐత చంద్రయ్య, ఎన్నవెళ్లి రాజమౌళి, శివ్వాల ప్రభాకర్, బెలగాం భీమేశ్వరరావు, పెందోట వెంకటేశ్వర్లు, ఉండ్రాళ్ల రాజేశం, అమ్మన చంద్రారెడ్డి మొదలగువారు బాలగేయాలు కథలు రాస్తూ బాలసాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు.

అనపర్తి సీతారామాంజనేయులు, అత్ల రాఘవయ్య, సోమసుందర్, గోలి ప్రతాప్, వేజేండ్ల సాంబశివరావు, అలపర్తి వెంకటసుబ్బారావు, బీవీ నర్సింహారావు, పెమ్మరాజు సావిత్రి, అవధాని రమేశ్, నీలకంఠ పాండురంగం, నార్ల చిరంజీవి, మిరియాల రామకృష్ణ, నాసరయ్య, సుధానిది, మహీదర నళినీ మోహనరావు, సభా, న్యాయపతి రాఘవరావు, రెడ్డి రాఘవయ్య మొదలైన బాల సాహిత్య కవులు, రచయితలు ఈ తరం పిల్లల గురించి గేయాలు, కథలు రాస్తున్నారు.

దాసరి వెంకటరమణ, డాక్టర్ హరికిషన్, చొక్కపు వెంకటరమణ, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, పైడిమర్రి, రామకృష్ణ, వేదాంత సూరి, డాక్టర్ అమరవాది నీరజ, సతీష్‌కుమార్, భూపాల్, వాసాల నర్సయ్య, ఆకెల్ల వెంకటసుబ్బలక్ష్మి, పెండెం జగదీశ్వర్, వర్కోలు లక్ష్మయ్య, ఎడ్ల లక్ష్మి, డబ్బీకారు సురేందర్, డాక్టర్ అడవాల సుజాత, మేకల మదన్‌మోహన్‌రావు, వాసరవేణి రాములు మొదలైన వారు బాల సాహిత్యపు శిఖరాలను అదిరోహిస్తూనే ఉన్నా రు. వారి కలం నుంచి గేయాలు, కథలు, వ్యాసాలు, నాటికలు మొదలైన ప్రక్రియలలో బాలసాహిత్యం జాలువారుతూనే ఉన్నది.

మాట, ఆట, పాట, కథ పిల్లలకు ప్రీతికరమైనవి. ఈ నాలుగింటి కలబోత బాలసాహిత్యం. చదివినా, విన్నా, చెప్పినా మనసులు వికసించి విజ్ఞానపథంలో ఆనంద పుష్పాలు వెదజల్లుతున్నాయి.
బాలసాహిత్య విశిష్టత: నేటి బాలలే రేపటి పౌరులు. వారికి బాల సాహిత్యం అవసరం ఉన్నది. శరీరం ఎదుగుదలతో పాటు మానసి క ఎదుగుదల కూడా సక్రమంగా ఉండాలి. మానవీయ విలువలు, సమాజ విలువలు, ధైర్యసాహసాలు, విజ్ఞాన విషయాలు మొదలైనవి ఎన్నో అవసరం. వారి మనోవికాసానికి బాల సాహిత్యం విరివిగా రావాలి.పిల్లలకు అందుబాటులో ఉండాలి. దానికిగాను కవు లు, రచయిత బాలసాహిత్యాన్ని వెల్లువలా రాయవలసి ఉన్నది. విద్యను విడిచి సాహిత్యాన్ని చెప్పలేం. సాహిత్యాన్ని కాదని విద్యను బోధించలేం. సాహిత్యమే మనిషిని మనీషిగా చేస్తాయి.

2571
Tags

More News

VIRAL NEWS