మిద్దె మీద అడవిని సృష్టించాడు


Thu,February 21, 2019 12:50 AM

ప్రభాత మేలుకొలుపులు పాడే పక్షుల కిలకిలరావాలు.. బాగా పండిన రెడ్ చెర్రీని కమ్మగా ఆరగించే కోయిలలు... ఉదయాన్నే పక్షుల వేటకు బయల్దేరే పిల్లులు... కొలనులో అలలు అలలుగా ఈదులాడే చేపలు.. నీటితావులో లిల్లీన నడుమ తిరిగే నత్తలు, ఆల్చిప్పలు.. చెట్ల మీద గెంతులేసే ఉడుత పిల్లలు.. ఆకును మలిచి కుట్టి గుడ్లు పెట్టే టైలర్ బర్డ్స్... చేపలకోసం వచ్చి వాలే కొల్లేటి కొంగలు.. చెలిమెలో నీటికోసం వరుస కట్టే పక్షులు.. పచ్చదనానికి మదురిమలద్దే తేనెపట్టులు.. నిరంతరం ఊసులాడే లవ్ బర్డ్స్ .. సందేహం లేదు ఇది అడవే... నగరంలో ఓ మిద్దెపై వెలసిన అడవి. సింహం లేని ఈ అడవికి రాజు వేగేశ్న రామరాజు..
rama-raju
హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో రామరాజు ఇటుకా ఇటుకా పేర్చి, ఇంటిని నిర్మించారు. మొక్కను మొక్కను చేర్చి, ఇంటిపై అడవిని సృష్టిం చారు. పల్లె నుంచి పట్నం బాట పట్టినా మట్టివాసన మరిచిపోలేక, మొదట తన ఇంటి చూట్టూతా కొన్ని మొక్కలు నాటారు. తామున్న ఇంటిలో ఐదు పోర్షన్లు ఉన్నా. అందరివీ స్కూటర్లే కావడంతో పార్కింగ్ స్థలంలో కూడా ఫైకస్ జాతి మొక్కలు నాటారు. నెమ్మదిగా కార్లు వచ్చి చేరాక, పార్కింగ్ స్థలంలో చోటు లేక, అక్కడి మొక్కలను పైకి తరలించారు. టెర్రస్ మీదికి మార్చాక సరైన ఎండ సోకి మొక్కలు చాలా పచ్చగా, ఏపుగా పెరిగాయి. తరువాత క్రమక్రమంలో వివిధరకాల, విభిన్నజాతుల మొక్కలను తన మిద్దె తోటలోకి చేర్చారు. ఇదంతా ఒక్కరోజులో జరిగిన అద్భుతం కాదు, ఏండ్ల తరబడి చేసిన కృషి అంటారు రామరాజు.

మండుటెండల్లో పెరిగేవి, నీడ మాటున ఒదిగేవి, మంచు ఒడిలో మనుగడ సాగించేవి.. ఒకటేమిటి స్థానికంగా కనిపించే మొక్కల నుంచి, వివిధ వాతావరణ పరిస్థితుల్లో, భిన్న భౌగోళిక ప్రాంతాల్లో పెరిగే మొక్కల దాకా పలురకాల ను ఒక్క గూటి మీదికి చేర్చారు రామరాజు. షేడ్ నెట్ కింద నీడలో రుద్రాక్ష, కాఫీ, స్ట్రాబెర్రీ వంటి పలురకాల మొక్కలను పెంచుతున్నారు. రుద్రాక్షకు చల్లని వాతావరణం కల్పించడానికి ఎలిఫెంట్ ఇయర్, మనీప్లాంట్ వంటి వివిధ రకా ల మొక్కలు పెంచుతున్నారు మొక్కలతోనే కాక, పక్షులు, జంతువులతో తన వన కుటీరాన్ని జీవవైవిధ్య వేదికగా మలిచారు.

ఈ మిద్దెతోటలో ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతులు, దుంపజాతులు, పండ్లజాతులు, పూలమొక్కలు, ఔషధ మొక్కలు, రుద్రాక్ష, బ్రహ్మకమలం, ఆల్ స్పైసీ వంటి అరుదైన మొక్కలు కనిపిస్తాయి. మింట్ తులసి, కర్పూర తులసి, కృష్ణతులసి, విష్ణుతులసి వంటి ఆరు రకాల తులసి మొక్కలు ఒక్కచోటే కళకళలాడుతున్నాయి. ఏడేండ్ల క్రితం నాటిన పంపరపనన పెద్ద పెద్ద కాయలు కాస్తున్నది. పదహారేండ్ల కిందట నాటిన కరివేపాకు ఇప్పటికీ తాజాగా నవనవలాడుతున్నది. పది సంవత్సరాల వయసు ఉన్న సీమ చింతపూతతోఎప్పుడూ కళకళలాడుతుంది. నాలుగేం డ్లు కాసే పెరినీయల్ కందికొమ్మలు కాతతో వంగిపోతున్నాయి.

ఇప్పుడిక్కడ సుమారు 350 కుండీల్లో 100 రకాల పైగా మొక్కలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఒక్క ఎకరం స్థలం కొనుక్కోలేకపోయాను. ఆ కొరతను పద్దెనిమిది వందల చదరపు అడుగుల కొద్ది స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచడం ద్వారా తీర్చుకుంటున్నాను. పల్లెలో పుట్టి రైతు కుటుంబంలో పెరిగిన నాకు పట్టణం వచ్చాక, నా లోపలి పచ్చదనాన్ని, గుండెలో తడిని నిలిపి ఉంచింది ఈ మిద్దెతోటే అంటారు రామరాజు.

rama-raju5
ఈ అడవిని మామూలు మిద్దె మోయగలదా అనే సందేహం చాలామందికి వస్తుంది. దీనికి సమాధానంగా ఇంటి నిర్మాణ సమయంలో చూపిన ముందుచూపే కారణం అంటారు రామరాజు. పైన మరో అంతస్తు కట్టుకునేందుకు వీలుగా ముందుగానే మా స్ట్రక్చరల్ ఇంజినీర్ ఇంటిని డిజైన్ చేశారు. అందువల్ల ఇంత బరువు డాబా మీద మోపినా, ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. అలాగే లీకేజీ సమస్యలు లేకుండా వాటర్ ప్రూఫింగ్ చేశాం. ఒకసారి స్ట్రక్చరల్ ఇంజినీరును తీసుకువచ్చి చూపిస్తే, ఏం ఫరవాలేదు. బరువు ఒకేచోట ఉండే లా కాకుండా, డాబా అంతటా పంపిణీ అవడం వల్ల కూడా బరువు సమ స్య ఉండదు. ఒక స్క్వేర్ ఫీట్ 250 నుంచి 300 కిలోల బరువును ఆపగలుగుతుంది అని భరోసా ఇచ్చారు. ఆ ధైర్యంతోనే ఇన్ని మొక్కలు పెంచగలుగుతున్నాననిఅంటారాయన.

మిద్దె తోట భారాన్ని పైకప్పు తట్టుకునేలా చూసేందుకు రామరాజు క్రమపద్ధతిని పాటిస్తూ, తేలికైన ఆకుకూరలను తోట మధ్య భాగంలోను, బరువైన కుండీలను, చెక్కపెట్టెలను బీము ల మీదకు వచ్చేలా అమర్చుకున్నారు. కుండీల, పెట్టెల బరువును తగ్గించుకోవడం కోసం, మట్టి త్వరగా ఎండిపోకుండా ఉండటం కోసం, ప్రతి కంటెయినర్లో 35 శాతం మట్టి, 35 శాతం కోకోపిట్, 30 శాతం వర్మికంపోస్టు వాడుతున్నారు. చీడపీడల నివారణకు రసాయనాలు వాడకుండా, కట్టెబూడిద, వేపనూనె, వెల్లులి రసం వంటివి ఉపయోగిస్తున్నారు. పదిహేనేండ్లుగా తన కుండీల్లోని మట్టిని మార్చకుండా, ప్రాకృతికంగా మంచి ఉత్పత్తిని సాధించడం ఆశ్చర్యమే.

తెలంగాణ ఉద్యాన శాఖ నిర్వహించే గార్డెన్ ఫెస్టివల్లో స్మాల్ సైజ్ వెజిటబుల్ గార్డెన్ విభాగంలో వరుసగా మూడుసార్లు మొదటి బహుమతి అందుకున్న రామరాజు నిత్యప్రయోగశీలి. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ నే ఉంటారు. సిమెంటు తొట్టిలో నీళ్లు నింపి, కొలను ఏర్పాటుచేసి, లక్కీ బంబూ, వాటర్ లిల్లీ మొక్కలు నాటి, నత్తలు, ఆల్చిప్పలు, రెండు మూడు రకాల అక్వేరియం చేపలు పెంచుతున్నారు. పారా పిట్ వాల్ చుట్టూ ఇను ప వైర్లు కట్టి, వాటి మీద చిక్కుడుతోపాటు ఎయిర్ బంగాళాదుంపలను పండిస్తున్నారు. మిద్దె తోటలో ఓ మూలకర్రలతో దడి కట్టి, దానికి కొబ్బరి తాడు చుట్టి, దొండపాదును పాకించారు. ఇది చూడడానికి అందంగా, కాయలను తెంపడానికి సులువుగాను ఉంది. రోజూ పండే కూరగాయలు, పండ్లలో మా అవసరాలకు పోను మిగిలిన వాటిని తమ ఇంటి కింది పోర్షన్లలో ఉండే వారికి, మిత్రులకు ఇస్తుంటారు రామరాజు. మన చేత్తో పండించిన వాటిని ఇతరులకు ఇవ్వడంలో ఉండే ఆనందమే వేరు. అసలు మిద్దెతోట ఆనందానికి ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది అంటారు రామరాజు.

ఈ మిద్దెతోటలోఅణువణువునా సౌందర్యం తొణికిసలాడుతుంది. అడుగడుగునా జీవవైవిధ్య సృష్టి పలుకరిస్తుంది. మొక్కల మొదళ్లలో తెల్లని గులకరాళ్లు, చిట్టి చిట్టి బొమ్మలు, బుల్లి బుల్లి బొమ్మరిల్లు కనువిందు చేస్తుంటే, కువకువలాడే రంగురంగుల లవ్‌బర్డ్స్, తెల్ల గువ్వలు ఊహలకు రెక్కలందిస్తాయి. అందుకేనేమో ఇప్పటి మూడువేలకు పైబడి స్కూలు పిల్లలు దీన్ని సందర్శించారు. తాము చూడని, తమకు తెలియని ప్రకృతి నిస్సర్గ సౌందర్యాన్ని తమ కళ్లతో ఆస్వాదించారు, జీవావరణ వ్యవస్థ వాస్తవిక స్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నారు.

రోజూ ఈ మొక్కల్లో తిరిగే నన్ను ఇవి గుర్తుపడతాయి. నాతో రహస్యాలు పంచుకుంటాయి. నాలుగు మొక్కలు నాటానో లేదో, మొత్తం ప్రకృతే ఇక్కడ వాలిపోయింది. పున్నమి రాత్రి మా మిద్దెతోటలో కూర్చొంటే, నిజంగా వెన్నెలతో తడుస్తున్న అడవిలో ఉన్నట్లుగా ఉంటుంది. జీవితంలో ఇంతకంటే ఆనందం ఏముంటుంది అంటారాయన.
-కె.క్రాంతికుమార్ రెడ్డి
నేచర్స్ వాయిస్

ఈ అడవిలో..

నిజంగా ఒక మిద్దె మీద ఇంత వైవిధ్యాన్ని సృష్టించడం మాటలు కాదు. కాని రామరాజు చేతల్లో దాన్ని చూపించారు. ఇలా ప్రతి ఇంటి మీద చేయగలిగితే కాలుష్య నగరం ఒక ఆకుపచ్చని అడవిలా మారుతుంది.

rama-raju2
ఆకుకూరలు: పాలకూర, తోటకూర, బచ్చలికూర, చుక్కకూర, పూదీనా, కొత్తిమీర, గోంగూర, కరివేపాకు

rama-raju6
కూరగాయలు: వంగ, టమాటా, మిరప, దొండ, బెండ, చెర్రీ టమాటా, పొట్ల, కాకర, సొర, గుమ్మడి, ఎయిర్ బంగాళాదుంప, బూడిద గుమ్మడి. మునగ, నేతిబీర

పండ్ల మొక్కలు: తైవాన్ జామ, బొప్పాయి, బత్తాయి, సరోటా, నారింజ, నిమ్మజాతి (3 రకాలు), రేగు, వాటర్ యాపిల్, సీమచింత, రెడ్ చెర్రీ, డ్రాగన్‌ఫ్రూట్, బుడ్డ బులసకాయ, స్టార్‌ఫ్రూట్, స్ట్రాబెర్రీ, వెలగ, నేరేడు, చింత, ఖర్జూర, పనస, పంపరపనస, లిచి, పెద్ద ఉసిరి, సీడ్ లెస్ గజనిమ్మ

rama-raju3
పూలమొక్కలు: ఇంపాల లిల్లీ, కాక్టస్ జాతి పూలమొక్కలు

rama-raju4
అరుదైన మొక్కలు: రుద్రాక్ష, కాఫీ, మిరియాలు, కర్పూర తులసి, సబ్జి, 8 రకాల తులసి, 5 రకాల బోన్సాయ్ (మర్రి, జువ్వి, రావి, 2 ఫైకస్ వెరైటీ) కాక్టస్మొక్కలు (బ్రహ్మ, నాగజెముడు), బ్రహ్మకమలం, స్ట్రాబెర్రీ జామ, ఆల్ స్పైసీ, పచ్చకర్పూరం మొక్క దుంపకూరలు కంద, పెండలం, చిలగడదుంప, క్యారెట్, ముల్లంగి, బీట్ రూట్

ఔషధ చెట్లు: జిల్లేడు, ఉమ్మెత్త, ఉత్తరేణి, తులసి, ఏకబిల్వం, వావిలి మహాబిల్వం, కలబంద, శ్రీగంధం, ఎర్రచందనం
(వీటితో పాటు చెరకు, తమలపాకు, గోరింటాకు, మనీ ప్లాంట్ వంటి ఇతర మొక్కలు...)
rama-raju7

2156
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles