అటవీ చెట్ల పెంపకానికి ప్రోత్సాహం

Thu,September 13, 2018 01:24 AM

అడవుల నుంచి లభించే ముడి సరుకుల్లో కలప చాలా ముఖ్యమైనది. కలప గట్టిదనంతో ఇనుముకు సమానంగానూ, సిమెంటు కంటే 5-6 రెట్లు ఎక్కువ కలిగి ఉంటుంది. ఇనుము, సిమెంట్ కంటే కలపకు ధ్వనిని, ఉష్ణాన్ని ఆపే శక్తి ఎక్కువ. అందుకే ఈ మధ్యకాలంలో ఇళ్లలోపలి గోడలకు తాపడంగా టేకు వెనీర్ ైప్లెవుడ్‌లను, నేలపై పరుచడానికి కూడా వీటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు.
Teak-Plantation
కలప అడవుల నుంచి లభిస్తుంది. చెట్ల పెంపకం ద్వారా కలపను నిరంతరంగా పొందవచ్చు. కానీ ఇనుము, సిమెంట్ తయారీ వనరుల విషయంలో అలా కాదు. వీటి ముడిసరుకులను అధికం గా వినియోగించడం ద్వారా ప్రకృతిలో వీటి నిల్వలు తరిగిపోతున్నాయి. అందువల్ల కలపనిచ్చే చెట్లను అధికంగా పెంచి దీనిని అధిగమించవచ్చు. అందుకే కలపను జాతీయ సొత్తుగా పరిగణిస్తా రు. తెలంగాణ ప్రభుత్వం హరితహరంతో రాష్ట్రంలో మొక్కలను పెంచేందుకు పెద్దపీట వేసింది.అంతేగాక ఉపాధి పథకంలో మొక్క లు నాటేందుకు ప్రోత్సహిస్తున్నది. కలపను భవన నిర్మాణంలో వివిధ దశల్లో ైప్లెవుడ్, అగ్గిపెట్టెలు, అగ్గిపుల్లలు, వివిధ రకాల వస్తువులు, పెన్సిళ్లు, వివిధ రకాల వస్తువులు, రైల్వే బోగీలు, లారీ బాడీలు, ప్యాకింగ్ పెట్టెలు వివిధ రకాల ఫర్నీచర్ తయారీల్లో, కలప గుజ్జును పేపరు తయారీలో వాడుతారు. అడవుల నుంచి లభించే కట్టెలు కలపగా వాడాలంటే అవి కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి.

కలపకు ఉండాల్సిన లక్షణాలు..

కలప దృఢంగా, తేలికగా, గట్టిగా, మంచి రంగు కలిగి, కణాల అమరిక, అనుసంధానం, యంత్రపు కోతకు తట్టుకునే శక్తి కలిగి ఉండాలి. కలప తక్కువ సుడులతో ఉండి, లోపల ఎలాంటి సూదిమొన రంధ్రాలు లేకుండా ఉంటే అలాంటి కలప చాలా కాలం మన్నుతుంది. అలాగే కలప అడ్డుకోతలో కనిపించే వార్షిక వలయాలు దగ్గరగా ఉండే ఆ కలపకు దృఢత్వం ఎక్కువ ఉంటుంది.

కలప కొరతకు కారణాలు..

-పెరుగుతున్న జనాభా అవసరాలతో రోజురోజుకు అటవీ సంప ద తరిగి పోతుండటం.
-దేశీయ అడవుల ఉత్పాదక శక్తి చాలా తక్కువ (ప్రపంచ అటవీ ఉత్పాదకతో పోలిస్తే నాలుగో వంతు మాత్రమే ఉంది.)
-సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టకపోవడం.
-కొత్త సాంకేతిక పద్ధతులు చేపట్టకపోవడం.
-కొత్త సాంకేతిక పద్ధతులను అవలంబించడానికి తగిన ఆర్థిక స్థోమత లేకపోవడం.
-తరిగిపోయిన వాటి స్థానంలో కొత్తగా అడవులను
పెంచకపోవడం వంటివి ప్రధాన కారణాలు.

అడవులు పెరగాలంటే..

-కలపకు పనికివచ్చే చెట్లను బంజరు భూముల్లో పెంచాలి.
-సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, కొత్త సాంకేతిక పద్ధతుల ద్వారా అటవీ ఉత్పాదకత పెంచాలి.
-సహజ అటవీ సంపదను సంరక్షించుకోవాలి.
-సహజ అటవీ సంపదను వినియోగించుకుని, వాటి పునరుత్పత్తి అభివృద్ధికి కృషి చేయాలి.
-సామాజిక అడవుల పెంపకాన్ని చేపట్టాలి.
ప్రస్తుతం వ్యవసాయానికి అనుకూలంగా లేని భూముల్లో, పంట పొలాల గట్ల వెంట కలపనిచ్చే చెట్లను పెంచినట్లయితే కొంత వర కు సహజ అడవులపైన ఒత్తిడిని తగ్గించవచ్చు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చవచ్చు.

కలపకు అనువైన చెట్లు..

టేకు, ఎర్రచందనం, శ్రీగంధం, నల్లమద్ది, తెల్లమద్ది, జిట్రేగి, చింత, సూబాబుల్, సిల్వర్‌ఓక్, వెదురు, నీలగిరి, మలబార్‌వేప, డల్‌బర్జియం లాంటి చెట్లు మన రాష్ట్రంలో పెంచుకోవడానికి అనువైనవి.

సాగు పద్ధతులు

మంచి నాణ్యమైన కలపను పొందాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. పెంచే చెట్టు రకాన్ని అనుసరించి యాజమాన్య పద్ధతులు మారుతూ ఉంటాయి.

నాటే విధానం

వేసవిలో తవ్విన గుంతల్లో పశువుల ఎరువు ఒక గంప, 100 గ్రాములు లిండేన్ పొడి మందు, గుంత తవ్వగా వచ్చిన పై మట్టి తో కలిపి గుంత నింపాలి. వర్షాకాలంలో 1-2 వానలు పడ్డాక, ఈ గుంతల్లో నారు మడిలో పెంచుకున్న మెలకలను నాటుకోవాలి. పాలిథీన్ సంచి అడుగు భాగంలో కోసి వేసి, మట్టి ముద్ద దెబ్బతినకుండా గుంతలో నాటాలి. నాటిన తర్వాత మొక్కచు ట్టూ గట్టిగా అదిమి. వలయాకారంలో కట్టకట్టి నీరు పారించాలి.

అంతరకృషి

మొక్క నాటిన మొదటి ఏడాది వరకు నేల స్వభావాన్ని అనుసరిం చి, వర్షపాతాన్ని బట్టి 10-15 రోజులకోసారి నీరు కట్టాలి. చెట్టు మొదలులోగల కలుపు మొక్కలను నెల రోజుల్లోపు తీసి, నేల గుల్లబారేలా చేయాలి. చెట్టు త్వరగా ఎదుగడానికి, ఏటా ఒక్కో మొక్క కు 100 గ్రాముల డీఏపీని అందించి నీరు కట్టాలి. మొదటి 5 ఏండ్లు మొక్క ఎదగడానికి ప్రతీ ఆరు నెలలకు నత్రజని ఇచ్చే ఎరువులను వాడాలి. ఏటా 50గ్రాముల ఎరువులను పెంచుతూ పోవా లి. 5-10 ఏండ్ల చెట్టుకు కాంప్లెక్స్ ఎరువులను ఆ తరువాత 15-20 ఏండ్లకు అదనంగా 300-400 గ్రాముల పొటాష్‌ను వేయ డం ద్వారా నాణ్యత గల కలపను పొందవచ్చు. చెట్లను 2-2 మీట ర్ల దూరంలో నాటాలి. తర్వాత ప్రతి 5ఏండ్లకు చెట్ల సంఖ్య తగ్గి స్తూ పోవాలి. ప్రతీ చెట్టు విడి చెట్టును నరుకుతూ పలుచగా చేయా లి. దీనివల్ల మొదట మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల పక్క కొమ్మలు రాకుండా కాండం నిట్ట నిలువుగా పెరుగుతుంది. తర్వాత మొక్కల సంఖ్యను తగ్గించడం ద్వారా చెట్టు కాండం వృత్తం పెరిగి, నాణ్యత గల అధిక కలప దిగుబడిని పొందవచ్చు. నరికిన చెట్ల గుంజలను చిన్నచిన్న పనిముట్లకు, ఇతరత్రా వాడుకోవచ్చు. కలప చెట్లు నిటారుగా పెరగడానికి, మొదటి 2-3 ఏండ్లలో పక్క కొమ్మలు, కింది కొమ్మలను భూమి నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి.
Teak-Plantation1

దిగుబడి..

సాధారణంగా కలప గురించి పెంచే చెట్లను రకాన్ని బట్టి 15-30 ఏండ్లలోపు కొట్టి వేయవచ్చు. ప్రతిచెట్టు సుమారు 10-20 ఘ.అ. కలప దిగుబడినిస్తుంది. చెట్ల మధ్య దూరం 5X5 మీ. ఉంటే హెక్టారుకు 400చెట్ల చొప్పున, మొత్తం కలప దిగుబడి 400X 20=8000ఘ.అ. సరాసరి కలప ధర సగటున ఘ.అ.కు 1000 నుంచి 15000 వరకు అనుకుంటే మొత్తం ఆదాయం హెక్టారుకు 80,00,000 (రూ.80లక్షలు)మొక్కలు నాటిన 20 నుంచి 25 ఏండ్ల తర్వాత వస్తాయి. అంటే వార్షిక ఆదాయం రూ.3,20,000 ప్రతిహెక్టారు చెట్ల సాగుకు అయ్యే ఖర్చు సుమారుగా రూ.15వేలు (ఏడాదికి). 5ఏళ్లకు అయ్యే ఖర్చు రూ.75వేలు మాత్రమే.
అంటే నికర ఆదాయం 2లక్షల 45వేలు!
- గుండెల రాజు, మహబూబాబాద్
వ్యవసాయం, 72889 85757


అటవీ వృక్షాల పెంపకానికి ప్రభుత్వం పెద్దపీట

తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని, అటవీ వృక్షాల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణ హరితహారం పేరుతో ఇప్పటికే లక్షలాది మొక్కలను నాటేందుకు ప్రజలను, రైతులను ప్రోత్సహిస్తున్నది. ఉపాధి పథకంలో రాయితీపై అనేక రకాల మొక్కలను సరఫరా చేస్తున్నది. రాష్ట్రంలో అధికంగా అటవీ వృక్షాలకు డిమాండు ఉండటంతో రైతన్నలు ముందుకు రావాలి. మంచి ఆదాయం పొందేందుకు అటవీ వృక్షాల పెంపకానికి కృషి చేయాలి. మంచి యాజమాన్య పద్ధతుల్లో పెంపకానికి ముందుకు రావాలి.
-సూర్యనారాయణ, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారి, ఫోన్ నెం. 77308 74567

696
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles