గురువులకు అభివందనం

Thu,September 5, 2019 12:49 AM

ఉపాధ్యాయులు సంపాదన కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసమే కష్టపడుతారు. ‘టీచర్స్‌ డునాట్‌ వర్క్‌ ఫర్‌ ది ఇన్‌కం-దే వర్క్‌ ఫర్‌ ది ఔట్‌కం’ అని ఇంగ్లీషులో అంటారు. నిజమే.. అంకితభావంతో పనిచేసే గురువులెందరో ఉన్నారు. కేరళలోని అగస్త్యర్కూడం గ్రామ బడిలో పదహారేండ్లుగా ఉషాకుమారి అనే ఉపాధ్యాయిని పనిచేస్తున్నారు. అక్కడికి వెళ్లాలంటే కొంతదూరం కారడవిలో కాలినడకన, తరువాత పడవ ప్రయాణం చేసి పాఠశాలకు వెళ్లా లి. అలాంటి పాఠశాలలో పనిచేస్తూ ఉషాకుమారి ఆ ప్రాం త ప్రజల ప్రశంసలు అందుకున్నారు.

ఇదిలా ఉంటే.. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని జమదంగి బడికి వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటుకొని మరీ వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు దాసు అనే ఉపాధ్యాయు డు. ఈ ఉపాధ్యాయుడు గుర్రం స్వారీ నేర్చుకొని మరీ రోజు పాఠశాలకు వెళ్తుండటం విశేషం.
కేరళ రాష్ట్రంలోని మారుమూల, రవాణా సౌకర్యం కూడా లేని ఇడుములకుడి పాఠశాలలో కనీస వసతులు లేకున్నా... అక్కడికే మకాం మార్చి 28 తండాల నుంచి వచ్చే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు మురళీధర్‌ అనే ఉపాధ్యాయుడు. తన వేతనంతోనే బడిలో కనీస వస తులు సమకూర్చుతూ కాలే పిల్లల కడుపు నింపుతూ ఆద ర్శంగా నిలుస్తున్నాడు మురళీధర్‌. టీచర్‌ మురళీధర్‌ను ప్రధాని మోదీ సైతం ‘మన్‌కీ బాత్‌'లో ప్రశంసించారు.

ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ అదృశ్యశక్తిగా ఉం టుందంటారు. కానీ అందరి విజేతల విషయంలో అది నిజమైనా, కాకున్నా.. ప్రతి స్త్రీ, పురుషుల విజయం వెనుక మాత్రం కచ్చితంగా ఒక గురువు ఉంటాడనేది మాత్రం నిజం. 2017లో హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన చిన్నప్పటి గురువు మృత్యుంజయశర్మకు పాదాభివందనం చేసి తన గురుభక్తిని చాటుకున్నారు. అలాగే రాష్ట్ర మంత్రి అయిన గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి కూడా గురుపూర్ణిమ రోజు తనకు ఆంగ్లం బోధించిన సూర్యాపేటలోని సుబ్బయ్య సారు వాళ్లింటికి వెళ్లి గురుదక్షిణ ఇచ్చి, పాదాభివందనం చేసి మరీ గురుభక్తిని చాటుకున్నారు. తల్లిదండ్రులు తనువును ప్రసాదిస్తే ఆ తనువుకు విద్యాగం ధం అద్ది జీవితాలను అక్షరాలతో మొదలుపెట్టే లక్షణంగా తీర్చిదిద్దేది గురువులే. పాఠ్యాంశానికి హాస్యాన్ని మేళవించి అరటిపండు వల్సి నోట్లో పెట్టినట్లు, కళ్లకు కట్టినట్లు ఎదిగే మెదళ్లకు ఎక్కిస్తూ ప్రేరణ కలిగించి, స్ఫూర్తిని రగలించే గురువులందరికీ వందనం.
- మల్లు కపోతం రెడ్డి, న్యాయవాది

104
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles