విజ్ఞాన గుడి

Tue,June 11, 2019 01:13 AM

అక్షర బీజం ఇక్కడే
పురుడోసుకునేది
ఓనమాల బుడతలు
ఇక్కడే
బుడిబుడి
అడుగులు వేసేది
గుణింతాల గువ్వపిల్లలు
ఇక్కడే
కిచ్ కిచ్‌మంటూ తచ్చాడేది
అంకెల నెలవంకలు
సంఖ్యల తారాజువ్వలు
ఇక్కడే
మిణుకు మిణుకుమంటూ
తణుకులీనేవి
పదాల పదనిసలు
వాక్యాల సరిగమలు
ఇక్కడే
సంగీత కచేరి చేసేవి
నీతి కథల కాంతులు
ఆటపాటల కేరింతలు
ఇక్కడే
ఉల్లాస వేడుక జరిపేవి
పాలబుగ్గల చిరునవ్వులు
పసితనపు సిరిమువ్వలు
ఇక్కడే
అపురూప సవ్వడి చేసేవి
బాల్యపు తొలి కిరణం
ప్రభవించేది ఇక్కడే..
జీవిత పాఠాల
తొలకరులు కురిసేది ఇక్కడే...
మూర్తిమత్వం మొలక
మొగ్గ తొడిగేది ఇక్కడే...
అందుకే!
పిల్లల్లారా రండి...
అమ్మఒడి లాంటి
చదువులమ్మ గుడిలో
అభ్యసనారాధన చేద్దాం
రారండి
చిన్ని తారల్లారా రండి
విశారదా మాతకు
విజ్ఞాన హారతులు
పడుదాం రారండి
- కోడిగూటి తిరుపతి, 95739 29493
( నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా..)

119
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles