స్వేచ్ఛ కావాలి

Fri,May 3, 2019 01:27 AM

అదొక యుద్ధభూమి
భానుడిలా భగభగ మండుతూ
నిప్పు లాంటి నిజాలను అక్షర రూపంలో
ప్రజాక్షేత్రానికి చేర్చి
అజ్ఞానాంధకారాన్ని తొలిగించే
నాలుగో స్తంభం
నిత్యం చాయ్ కప్పుకు తోడై
విశ్వం గుట్టును ముంగిట సాక్షాత్కరిస్తుంది
రాజ్యాంగం ప్రసాదించిన
భావప్రకటనా స్వేచ్ఛను తనలో ఒంపుకొని
ప్రజల గొంతుకై నినదిస్తుంది
వరదలొచ్చినా.. ప్రమాదం జరిగినా..
హత్య జరిగినా.. మేమున్నామంటూ..
ప్రమాదపుటంచుల్లో నిత్యం సైనికుల్లా
పాత్రికేయులు చేసే పోరుకు
అక్షర సాక్ష్యమై నిలుస్తుంది
మాఫియా, అవినీతిపై
అలుపెరుగని పోరాటం చేస్తుంది
రాజకీయ పరిణామాలను
నిలువుటద్దమై చూపిస్తుంది
అర్ధరాత్రి ఆడపిల్ల నడిచే
స్వేచ్ఛ కావాలన్నాడు గాంధీజీ
నిజాన్ని నిర్భయంగా రాసే
ప్రజాగొంతుక పత్రిక
తమ ప్రాణాలను సైతం లెక్క చేయక
వృత్తిలో కలం యోధులై పోరాడుతున్న
జర్నలిస్టులకు జేజేలు..

- గుండు కరుణాకర్, 98668 99046
(నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా...)

138
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles