మోదీ ఎట్లా గుర్తుంటారు?


Sun,February 10, 2019 01:15 AM

ప్రతి ప్రధాని తనదైన ప్రత్యేక వారసత్వాన్ని వదిలివెళ్లారు. ఈ వారస త్వం వారు కోరుకున్నదే కావాలని లేదు. ఒక్కోసారి వారి వదిలివెళ్లిన వారసత్వ ఆనవాళ్లు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ శాస్త్రవిజ్ఞానం, లౌకికవాదం పట్ల అకుంఠితమైన అంకితభావం గల నాయకుడిగా గుర్తుండిపోతారు. కశ్మీర్ సంకటానికి, 1962లో చైనా చేతిలో ఓటమికి బాధ్యుడిగా చెబుతారు. లాల్‌బహదుర్ శాస్త్రి విషయానికి వస్తే 1965లో పాకిస్థాన్‌తో యుద్ధంలో గెలుపు జ్ఞాపకం వస్తుంది. జై జవా న్, జై కిసాన్ నినాదం గుర్తుకువస్తుంది. తాష్కెంట్‌లో ఆయన పొందిన అనుమానాస్పద మృతి మరో విషాదకర జ్ఞాపకం. ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదం ఇచ్చారు. పేదల అనుకూల విధానాలు అవలంబించినందుకు, అలీనోద్యమాన్ని ముందుకు నడిపించినందుకు గుర్తుండిపోతారు. ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూస్టార్ కూడా గుర్తుండిపోతాయి. రాజీవ్‌గాంధీ దేశంలో కంప్యూటర్లు ప్రవేశపెట్టినందుకు, టెలికం రంగంలో విప్లవాత్మకమార్పులు ప్రవేశపెట్టినందుకు గుర్తుండిపోతారు. బోఫోర్స్ కుంభకోణం కూడా ఆయనతో ముడిపడి ఉన్నది. పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సరళీకరణ శకారంభకునిగా నిలిచిపోయారు. బాబ్రీ మసీదు కూల్చివేతను నివారించడానికి చేయవలసింది చేయలేదనేది గుర్తుకొస్తుంది. పదమూడు పార్టీల సంకీర్ణాన్ని ఏర్పరిచిన నాయకుడిగా, పోఖ్రాన్‌లో అణు పరీక్ష జరిపినందుకు అటల్ బిహారీ వాజపేయి గుర్తుండిపోతారు. భారత్ వెలిగిపోతున్నది నినాదంతో పోటీచేసినా, బీజేపీకి ఘోర పరాజయం అందించారాయ న. విద్యాపరంగా అత్యంత అర్హత కలిగిన నాయకుల్లో ఒకరుగా మన్మోహన్‌సింగ్ నిలిచిపోతారు. ప్రధానిగా ఆయన హయాంలో దేశ స్థూల దేశీయోత్పత్తిలో డబుల్ డిజిట్ వృద్ధి కనిపించింది. యూపీఏ రెండవ పర్యాయం అధికారానికి వచ్చిన తర్వాత అవినీతిని అరికట్టలేని నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఏ విధంగా గుర్తుండిపోతారు? ప్రధాని మోదీ ఐదేండ్ల పాల నాకాలం చివరి దశలో, దేశ జనాభిప్రాయం రెండుగా చీలిపోయి ఉన్నది. ఆయన అభిమానులు దేశాన్ని ప్రపంచ పటంపై పెట్టారని (ఎందుకో చెప్పలేరు), ముస్లింలను వారి స్థానంలో పెట్టారని, హిందు అభిజాత్యాన్ని పునరుద్ధరించారని చెప్పుకుంటారు. అనేక విదేశీ పర్యటనలు చేపట్టడాన్ని మోదీ ప్రత్యర్థులు తప్పుపడుతారు. మత విద్వేషాలను అరికట్టలేదని విమర్శిస్తారు. పెద్ద నోట్ల రద్దు వల్ల జరిగిన ముప్పు, జీఎస్టీ అమలుచేసిన తీరు, దేశ ఆర్థికవ్యవస్థను దెబ్బతీశాయని చెబుతారు. ప్రజాస్వామిక వ్యవస్థలను బలహీనపరిచారని కూడా తప్పు పడుతారు. మోదీ వీరాభిమానులను, మంత్రులను, అధికార ప్రతినిధులను (మోదీని సమర్థించడమే వీరి పనికదా) పక్కకుపెట్టి ఆలోచిస్తే, నరేంద్ర మోదీ అధికారానికి రావడానికి ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిని అమలు చేశారని నమ్మేవారు దేశంలో చాలా కొద్దిమంది ఉంటారు. కోట్లాదిమంది యువతకు ఉద్యోగాలు, అవినీతి నిర్మూలన, భారత్‌ను ఉత్పత్తికేంద్రంగా మార్చడం, మహిళలకు భద్రత కల్పించడం, పెట్రోలు డీజీల్ ధరలు పెంచకపోవడం, అచ్చే దిన్ తేవడం మొదలైనవన్నీ అమలుకాని హామీలు. నరేంద్ర మోదీ పేరు చెబితే గుర్తుండేది- ఆయన అహం. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ తన 56 అంగుళాల ఛాతి గురించి చెప్పుకున్నప్పుడు, ప్రజలకు మొదటగా ఆయనకున్న అహం గురించి తెలియవచ్చింది. (గతంలో ఏ ప్రధాని కూడా తన దేహంలోని భాగం గురించి ఇట్లా గొప్పలు చెప్పుకోలేదు) ఇక సెల్ఫీలు, కెమెరాల ముందు ఫొటోల సర దా ఉండనే ఉన్నది. ఫొటోలలో తాను చక్కగా పడటానికి అంగరక్షకులనే నెట్టివేయడమే కాదు, ఏకం గా మార్క్ జుకర్‌బర్గ్‌ను పక్కకు గుంజేయడం సోష ల్ మీడియాలో ముంచెత్తింది. మోదీ ధరించిన పది లక్షల విలువైన సూట్‌పై ఆయన పేరు కూడా డిజైన్ చేసి ఉండటం టీవీ కెమెరాలో స్పష్టంగా కనిపించడంతో అతడికున్న స్వానురాగం ఎంతటిదో తెలిసివచ్చింది.

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అనే పథకాలకు ముందు ప్రధాన్ మంత్రి అనే మాట తగిలిం చి ఉండాల్సిందే! ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధాన్ మంత్రి జనధన్ యోజన, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన ఇట్లా అనేకం ఆయన పేరు మీదుగా ఉన్నాయి. కాలం గడిచే కొద్దీ ప్రభుత్వ కార్యాలయాలలో, క్యాలెండర్లపై, పెట్రోలు పంపుల దగ్గర, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టేషన్లు ఇట్లా ఎక్కడిబడితే అక్కడ.. ఆయన ఫొటో లు దర్శనమివ్వడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్వకాలంలో పాలకులు రాజకీయ కారణాల మూలంగా నాణాలపైన, స్తంభాలపైన తమ ముఖాలను చెక్కించుకునేవారు. 2014-19 కాలం లో బీజేపీ ప్రభుత్వం మోదీకి చేసిన ప్రచారం ఇటీవలి కాలంలో ఏ ప్రభుత్వం తమ నాయకుడికి చేయలేదు. ఇతరులను ఏ మాత్రం పట్టించుకోకుం డా, తనగురించి మాత్రమే ప్రమాదకరమైన రీతిలో పట్టించుకునే వారిని ఆధునిక మనోవిజ్ఞానవేత్తలు అహంకారిగా పేర్కొంటారు. ఇక్కడ అహం అంటే- అహంకారం, స్వీయ ఆపేక్ష, అవాంఛనీయమైన స్వీయ ప్రాధాన్యం. ఈ అహంభావం మద్యం కలిగించే మత్తు వంటిది. రెండూ వ్యసనాలే. ఈ వ్యాధి పీడితుడిని వాస్తవానికి దూరం చేస్తాయి. హెరాల్డ్ జెనీన్ చెప్పిన ప్రకారం- ఈ అహంభావం ఉన్నవారికి- అది తీవ్రంగా మారుతుంది. తమలో ఏమి జరుగుతున్నదో తెలువదు. అహంకారాన్ని తమ శక్తి గా, ఆత్మవిశ్వాసంగా పొరబడతారు అడ్డు అదుపులేని అహం దేశ నాయకుడికి ప్రమాదకరం. ఈ అహం అతడిలోని నిజమైన పాలనాదక్షతను లేకుండా చేస్తాయి. ఈ అహంభావ నాయకులు ఇతరులతో కలిసి పనిచేయలేరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించలేరు. విజ్ఞుల నుంచి వాస్తవా లు సేకరించరు కనుక, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు.

తమలో అంతా తామే నిండిపోయి ఉంటారు కను క, ఇతరుల భావోద్వేగాలతో మమేకం కాలేరు. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా భావించి నాశనం చేయాలనుకుంటారు. అహంకారులైన నాయకులు తమ తప్పులకు విచారపడరు, తమ లోపాలను అంగీకరించరు. తమకు సమర్థత, నిజాయితీ లేదనే విషయం బయటపడుతుందనే ఆందోనకు గురవుతుంటారు. స్వీయాపేక్ష, ఈర్ష్యాద్వేషాల తో కూడిన మానసిక వికారానికి గురవుతారు. ఇటువంటి నాయకత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. దేశానికి తీవ్ర నష్టం వాటిల్లజేస్తుంది. మోదీ పాలన 2019తో ముగిసినా, కొనసాగినా (ఇటువంటి అహంభావి పాలన మరో ఐదేండ్లు కొనసాగితే భారత్ ఎట్లా మనగలుగుతుందో ఆశ్చర్యమే)- ఆయన విధానాలు, చర్యలు, నిర్ణయాలు, సంబంధాలను రాజనీతి శాస్త్రవేత్తలు, చరిత్రకారు లు, మనోవిజ్ఞానవేత్తలు విశ్లేషిస్తారు. ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతారు. ఎంతోమంది నిపుణులు వద్దని చెబుతున్నా ఈ ప్రధాని పెద్దనోట్లను రద్దుచేయడం ద్వారా దేశానికి ఎందుకింత హాని చేశారు? ఉడికీ ఉడకని వంటకం వంటి జీఎస్టీని ఎందుకు అమలు చేశారు? ఆయన భజన బృందానికి మాత్రమే ఎం దుకు పరిమితమయ్యారు? సంకీర్ణ భాగస్వాములు ఎందుకు ఆయనను వీడిపోతున్నారు. ఈయన హయాంలో మిత్ర దేశాలు ఎందుకు దూరమయ్యా యి? ఎన్ని హెచ్చరికలు వచ్చినా పట్టించుకోకుండా, తన అహాన్నే నమ్ముకోవడం వల్లనా?

rohit-kumar
అన్ని తెలిసిన బలమైన నాయకుడు అనే భావ నే ఉత్త మాట. గత నాలుగేండ్లలో ఈ విషయం స్పష్టమైంది. 21 శతాబ్దం ఎంతో క్లిష్టమైనది. ఈ దశ లో చక్కగా పాలించాలంటే- ఇతరుల మాట విన డం, నేర్చుకోవడం, సహకరించుకోవడం, అందరి అభిప్రాయాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి లక్షణాలున్న నాయకులై ఉండాలె. స్వార్థం, స్వానురక్తి, డంబాచారం గల నాయకుల యి ఉండకూడదు.
వ్యాసకర్త: పాజిటివ్ సైకాలజీ, సైకోమెట్రిక్స్ నేపథ్యం గల విద్యావేత్త
(ది వైర్ సౌజన్యంతో..)

1111
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles