ఉన్నత విద్యలో సంస్కరణలు


Thu,February 7, 2019 11:21 PM

స్వాతంత్య్రానంతరం ఉన్నత విద్యా సంస్థలు స్థాపించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాష్ర్టాల విద్యార్థులకు అనువుగా ఉండటానికి ఇంగ్లీషు మాధ్యమంలో ఉన్నత విద్యారంగ కోర్సులు అందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిష్ఠాకరమైన ఐఐటీ, ఐఐఎం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి సంస్థలు, విశ్వవిద్యాలయాలు తమ కోర్సులను ఇంగ్లీషు మాధ్యమంలో మాత్రమే అందిస్తాయి. దేశమంతా ఉన్నత విద్యారంగ కోర్సులు అందుబాటులో ఉన్నా దాదాపు 80 శాతం విద్యార్థులకు అవి గగనకుసుమాలే! ఈ సమస్య తీర్చాలంటే ప్రాథమిక దశ నుంచి పటిష్ఠమైన భాషా బోధనా పద్ధతులు అవలంబించాలి. ఉన్నత విద్యారంగంలోని కోర్సులు రెండు రకాలు: జనరల్ డిగ్రీలు. ఇదివరకు ఈ కోర్సులు చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అయితే సాం కేతికత పెరుగుదల వల్ల ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సులకు ఆదరణ పెరిగింది. అందువల్ల జనరల్ డిగ్రీ కోర్సులకు ఆదరణ తగ్గింది. ప్రొఫెషనల్ కోర్సుల ఖర్చు భరించలేనివారు, అందులో ప్రవేశం దొరుకని వారు మాత్రం ఈ జనరల్ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే వీరికి డిగ్రీ పూర్తయిన వెంటనే ఉపాధి, ఉద్యోగాలు అత్యవసరం కాబట్టి ఈ కోర్సులను బలోపేతం చేయాలి. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో ప్రవేశం దొరుకనివారు, తర్వాత ఎం బీఏ, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేయాలనుకునేవారూ జనరల్ డిగ్రీ కోర్సుల్లో చేరుతారు. అంటే చేరినప్పుడు వారికి ఈ కోర్సే చేయాలన్న ఉత్సాహం తక్కువగా ఉంటుంది. వీరి మానసిక స్థితిలో ఇంకో కోణం కూడా పరిశీలించదగ్గది. విద్యార్థులంతా 10వ తరగతి పూర్తిచేసి ఇంటర్ లో చేరేటప్పటికీ వారి వయస్సు 15,16 ఏండ్లుంటుంది. జూనియర్ కాలేజీలో చేరేటప్పటికి మానసిక పరిణతి లేకపోయినా తాము పెద్దవారిమైపోయామనీ, తామేం చేసినా విమర్శించకూడదనీ, తమ ఆలోచనలే సరైనవన్న భావన ఉంటుంది.

పైగా డిగ్రీలో చేరేటప్పుడు న్యూనతాభావాలు ఉన్నవారు మానసికంగా ఇలా అస్థిరంగా ఉండి, తిరుగుబాటు ధోరణిలో ప్రవర్తిస్తారు. వీరి వ్యక్తిగత, మానసిక, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుంటేనే డిగ్రీలో వారికి విద్యాపరంగా న్యాయం చేయగలుగుతుంది వ్యవస్థ. అందుకే ఈ కోర్సులతో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాల మీద ఉన్నత విద్యారంగం దృష్టిపెట్టాలి. వివిధ కోర్సుల ఉద్దేశం, ఆవశ్యకత: డిగ్రీలో చేరే విద్యార్థులు తమ ఇంటర్మీడియెట్‌లో తీసుకున్న గ్రూపునకు సంబంధించిన కోర్సులో చేరుతారే కానీ వారికి ఆ డిగ్రీలో ఉన్న సబ్జెక్టు ఆవశ్యకత గానీ, మానవులకు ఆ అంశాల అవసరం గురించి కానీ ఏ రకమైన అవగాహన ఉండదు. అవి వారిలో కలిగించటానికి కొంత సమయం వెచ్చించి వారు చదువబోయే సబ్జెక్టు చాలా గొప్పదన్న భావన కలిగిస్తే కానీ విద్యార్థులకు ఆయా అంశాల్లో ఉత్సాహం కలుగదు. పాశ్చాత్య దేశాల్లోని విశ్వవిద్యాలయాలన్నింటిలో డిగ్రీ కోర్సు కంటే ముందు ప్రిపరేషన్ కోర్సు ఉంటుం ది. ఈ రకమైన కోర్సులు మన విశ్వవిద్యాలయాల్లో లేవు కాబట్టి, కనీసం మొదటితరం వారమంతా విద్యార్థులకు వారివారి ఐచ్ఛికాంశాల (ఆప్షనల్ సబ్జెక్టు) గురించిన సమాచారం, వాటి ఆవశ్యకత వివరించాలి. వీలై తే ఒక చిన్న పుస్తకంలో వీటిని పొందుపరిచి వారికివ్వాలి. ఆయా రంగా ల్లో నిష్ణాతులతో కొన్ని అతిథి ప్రసంగాలు (గెస్ట్ లెక్చర్స్) కూడా ఇప్పిస్తే చాలా మంచిది. బోధనా పద్ధతులు: విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యలో లెక్చర్ పద్ధతి తక్కువగా ఉంటుంది. ఆయారంగాల్లో నిష్ణాతులను పిలిచి మాట్లాడించినప్పుడు మాత్రమే ఇటువంటి పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన వారు, రంగంలోకి ప్రవేశిస్తున్నవారికి చెప్పవలసిన విషయాలు చాలా ఉంటాయి. కానీ రోజువారీ బోధనా పద్ధ తి ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య తార్కికమైన వాదనలతో జరుగా లి.

క్రమశిక్షణ పాటిస్తూ విద్యార్థులంతా తరగతిలో జరుగుతున్న యాక్టివిటీల్లో పాల్గొనాలి. ఉపాధ్యాయులు వారిని రకరకాల ప్రాక్టికల్ యాక్టివిటీలతో ఉత్సాహపరుచాలి. దీనికి వారికి ప్రత్యేక శిక్షణతో పాటు వారివారి రంగాల్లో విదేశీ విద్యాలయాల్లో ఉపాధ్యాయుల లెక్చర్ల వీడియోలు చూపించాలి. ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలైన హార్వర్డ్, యేల్, స్టాన్‌ఫర్డ్, మిచిగన్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి విద్యాలయాల్లో బోధనా పద్ధతులు ఎలా ఉంటాయో వారికి అవగాహన కలిగించాలి. విద్యారంగం ఎన్ని వసతులు, హంగులు కల్పించినా, ఏ కోర్సయినా విజయవంతమవ్వాలంటే క్లాసులో ఏ జరుగుతున్నదన్నది మాత్రమే ముఖ్యం. దానికి ఉపాధ్యాయుల నిబద్ధత, విద్యార్థుల ఉత్సుకత మాత్ర మే దోహదం చేస్తాయి. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలు పెరుగాలంటే నెలకోసారి విద్యాసంస్థల్లోని అందరు లెక్చరర్లకు ఒక విద్వత్పరిషత్ (ఎకడమిక్) సమావే శం ఏర్పాటుచేసి ఒక 5 మంది వారివారి రంగాల్లో జరుగుతున్న మార్పు లు, అభివృద్ధి పరిశోధన గురించి మిగితావారికి లెక్చర్ల రూపంలో తెలియపరుచాలి. దానివల్ల వారందరూ వారి రంగాల్లో నిష్ణాతులవ్వడం, బోధనా నిపుణతలు పెంచుకోవడం జరుగుతుంది. ఇది చాలా సహాయపడుతుంది. కోర్సుల్లోని పాఠ్యాంశాలు: ప్రతి సబ్జెక్టులోని పాఠ్యాంశాలు ప్రతి రెం డేండ్లకు పరిశీలించి అవసరమైనవి అప్‌గ్రేడ్ చేయాలి. త్వరగా మారుతున్న కాలం, పెరుగుతున్న అవసరాలు, పెంపొందుతున్న సాంకేతికతకు అనుగుణంగా పాఠ్యాంశాలను సంస్కరించాలి. లేకపోతే వారు చదివి నేర్చుకున్న అంశాలకు, బయట ఉద్యోగ రంగంలో కావలసిన సమాచారానికి ఏ సంబంధం లేక వారి జ్ఞానం ఉపయోగపడదు. ఉద్యోగం సం పాదించటం కూడా ఎంతో కష్టమవుతుంది ఈ పట్టభద్రులకు.

పరీక్షా విధానం: మన దేశంలో ఇంకా పరీక్షా విధానం సంతరించుకున్న నైపుణ్యాలు పరీక్షించకుండా కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించేటట్టుగా ఉంది. అంతకంటే పుస్తకాల్లోని కాన్సెప్టు, టర్మ్‌లు, టర్మినాలజీని వివరించమనీ, విశ్లేషించమనీ పరీక్ష, పరిశీలన, విశ్లేషణ, విమర్శనా నైపుణాలు పరీక్షించేటట్టు పరీక్షా పత్రాన్ని రూపొందించాలి. ఆ విశ్లేషణలో వారి భావనాత్మకత, సృజనాత్మకతా వెలికి రావాలి. ఈ రకంగా బోధనా, పరీ క్షా విధానాలంటే విద్యార్థులకు స్వయంగా ఆలోచించడం, రాయడం అలవాటవుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. మారిన కాలానికి అనుగుణంగా కోర్సులు: విశ్వవిద్యాలయాలన్నీ ప్రతి కోర్సు ఏ రకంగా విద్యార్థులకు ఉపయోగిస్తాయా అన్న విషయమే కాకుండా, మారిన కాలానికి, పెరుగుతున్న అవసరాలకు సమాజానికి ఉపయోగకరంగా విద్యార్థులు తయారయ్యేటట్టు కోర్సులను మార్పు చేయాల్సి ఉన్నది. కొత్త కోర్సులకు రూపకల్పన చేయాల్సి ఉన్నది. ఉదాహరణకు బీఏలో డిగ్రీ అవగానే ఉపాధ్యాయ వృత్తి తీసుకునే వారికి బీఏ సబ్జెక్టులో ఇంగ్లీషు భాష కూడా ఉండవచ్చు కదా! బీఏలో అన్ని కాలేజీల్లో ఇంగ్లీషు లిటరేచర్ ఉంటుంది కానీ లాంగ్వేజీ ఉండదు. అలాగే ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చే బీఎడ్ కోర్సు కూడా. అసలు వస్తు, విష య సంబంధమైన సామాన్య, విజ్ఞానశాస్ర్తాలు, నైపుణ్యాలు సంతరించుకోవలసిన భాష కలిపి ఒక డిగ్రీలో ఎందుకు పెట్టాలి? రెండురకాల సబ్జెక్టులకు భాషా బోధనా పద్ధతులు వేర్వేరుగానే కాదు, వ్యతిరేకంగా కూడా ఉంటాయి. ఇన్నేండ్ల నుంచి విద్యార్థులకు భాషా నైపుణ్యాలు పట్టుబడకపోవటానికి కారణం ఇంగ్లీషును కూడా సైన్స్ లాగా, సోషల్ స్టడీస్ లాగా బోధించటమే! ఇంగ్లీషు భాష విషయంలో లాగానే మిగితా కోర్సు లు కూఆడ ఉండే అవకాశం పుష్కలంగా ఉన్నది. ఇన్ని యూనివర్సిటీల్లో శిల్పశాస్త్రం మీద ఒక్క కోర్సు కూడా లేదు!
Kanakadurga
ఇక ఈ పట్టాలు పుచ్చుకునేవారిని మార్కెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దాలంటే మార్గాలు చాలా ఉన్నాయి. చివరి సెమిస్టర్‌లో వారివారి సబ్జెక్టులు, ఇష్టాలకు తగినట్టుగా 6నెలల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయవ చ్చు. ఆ విద్యార్థులు ఆఫీసుల్లో, బ్యాంకుల్లో, పరిశ్రమల్లో, విద్యాలయా ల్లో ఏ సంస్థలోనైనా పనిచేస్తే వారికి కొంత అనుభవం, ఉద్యోగం సంపాదించుకునే నైపుణ్యాలు కలుగుతాయి. ఇంకా చేయగలిగిన వారికి డిగ్రీ తర్వాత ఏడాది పాటు ఉండే డిప్లొమా కోర్సులు ఆయా యూనివర్సిటీ లు అందించవచ్చు.ఆఫీసు అసిస్టెంట్, బ్యాంక్ ఉద్యోగం, రైటింగ్, ప్రూఫ్ రీడింగ్, మీడియా ఉద్యోగాలు మొదలైన వాటిలో ఈ డిప్లొమాలు అంది స్తే విద్యార్థులకు చాలా ఉపయోగం. పాశ్చాత్య దేశాల్లో విశ్వవిద్యాలయా ల్లో అందించే కోర్సుల పట్టిక చూస్తే మన దేశం విద్యారంగంలో ఎంత వెనుకబడి ఉన్నదో తెలుస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించిన యువత ఉద్యోగార్హతలు లేకుండా ఉన్నారంటే, 14 ఏండ్లు నేర్చుకున్న ఇంగ్లీషు భాషలో కూడా నైపుణ్యాలు లేవంటే ఎవరిది తప్పు. ఫిజిక్స్‌లో 98 శాతం, లెక్కల్లో 100 శాతం తెచ్చుకోగలిగిన విద్యార్థులు ఇంగ్లీషులో ఫెయిల్ అవుతున్నారంటే లోటు వారిలో ఉందా? విద్యావ్యవస్థలో ఉందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలోని సమస్యలను పరిష్కరిస్తే తప్ప ఈ దేశంలో మానవ వనరులు పెరుగవు. యాభై లక్షల జనాభా ఉన్న దేశాల నుంచి నోబెల్ బహుమతి పొందేవారు ఉంటారు గానీ 125 కోట్ల జనాభా ఉన్న భారతదేశం మానవ వనరులను పెంపొందించుకోకుండా ఉంటే ఇంకొన్ని శతాబ్దాలు వెనుకబడే ఉంటుంది.

894
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles