రైతులకు రెట్టింపు ఆదాయమార్గం


Thu,February 7, 2019 11:20 PM

మన దేశం ఎన్నో రంగాల్లో ముందుకుపోతుంటే, వ్యవసాయరంగం మాత్రం రోజురోజుకు కుదేలవుతున్నది. వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నది. ఈ దుస్థితికి ఎన్నో కారణాలున్నపటికీ, రైతు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో నష్టాల పాలవుతున్నాడన్నది మాత్రం జగమెరిగిన సత్యం. అర్థం కాని సప్లయి, డిమాండ్ చక్రం కింద గిట్టుబాటు ధరలేక అన్నదాత నలిగిపోతున్నాడు. ఏయే పంటలకు డిమాండ్ ఉన్నది, ఏయే పంటలకు మార్కె ట్లో అవకాశాలున్నాయో తెలువక, వేసిన పంటలనే తిరిగివేసి నష్టపోతున్నాడు. రైతులు ఈ సమస్యను అధిగమించాలంటే వినియోగదారుల మార్కెట్‌పై అవగాహన పెరుగాలి. వినియోగదారుల అభిరుచుల్లో, అలవాట్లలో మార్పులు తెలియాలి. మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా పంటలు వేసుకునే పరిస్థితికి రైతు ఎదుగాలి. అప్పుడే రైతుల కష్టానికి ఫలితం దక్కుతుంది. ఇక అసలు విషయానికొస్తే, పాత ఒక రోత, కొత్త ఒక వింత అన్న సామెత మాదిరిగా గత దశాబ్దల కాలంగా పట్టణాల్లో నివసించేవారి ఆహా రపుటలవాట్లలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సంప్రదాయ ఆహార పదార్థాలకు విరుద్ధంగా పిజ్జాలు, బర్గర్లు, చైనీస్ ఫుడ్, ఫ్రైడ్ రైస్ ఇలా.. రకరకాల పాశ్చాత్య ఆహార పదార్థాలకు అలవాటైన ప్రజలు ఇప్పుడు తిరిగి సంప్రదాయ ఆహార వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా, పాశ్చాత్య ఆహారపుటలవాట్లకు రుచి మరిగిన పట్టణ యువ త, మధ్య వయసు వారు, ఇప్పుడు కొర్రలు, అరికలు, ఊదలు, జొన్నలు వంటి చిరు ఆహారధాన్యాల వంటకాలపై ఆసక్తి చూపుతున్నారు. ఆరు నెలల కిందట బహిరంగ మార్కెట్లో కిలో రూ.30 నుంచి రూ.50 ఉన్న ఈ చిరుధాన్యాలు ఇప్పుడు సుమారు రూ.100 నుంచి రూ.150 మేర పలుకుతున్నాయి.

ఇప్పుడు ఈ చిరుధాన్యాలకు పట్టణాల్లో ఏ మేర డిమాండ్ పెరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. పాశ్చా త్య ఆహారపు పదార్థాల ద్వారా వివిధ అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా బీపీ, షుగర్, గుం డెపోటు వంటి రోగాలకు కారణమైన ఊబకాయం బారి నపడుతున్న పట్ట ణవాసులు ఇలాంటి జబ్బుల నుంచి బయటపడేందుకు చిరుధాన్యాల ఆహారం వైపు మొగ్గు చూపెడుతున్నారు. అలాగే, వాతావరణం, సాగు పద్ధతుల్లో వచ్చిన మార్పులు, ప్రజల జీవనశైలి, ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. రసాయనాలతో పండిన పంటలు సైతం ఆయుక్షీణం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రజలు తిరిగి సంప్రదాయ ఆహారమైన చిరుధాన్యాల ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మారిన ఈ పరిస్థితులను రైతులు అందిపుచ్చుకోవాలి. కొర్ర లు, అరికలు, ఊదలు వంటి డిమాండ్ ఉన్న చిరుధా న్యాల పంటలకు మొగ్గుచూపాలి. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వనరులతో పండే చిరుధాన్యాల పంటలకు ఆదరణ పెరుగుతున్నది. వరి, గోధుమ, ఇతర ఆహార పదార్థాల వాడకం తగ్గుతుంది. రైతులు మార్కెట్ పరిస్థితులు, వాస్తవాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని మార్కెట్ ఫలాల ను అందిపుచ్చుకోవాలి. తెలంగాణ రాష్ట్రం చిరుధాన్యాల పంటలకు అనుకూలమైన ప్రాంతంగా నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పంటల సాగు కేవలం తొంభై రోజుల్లో చేతికి వస్తుంది. ఒక ఎకరానికి సుమారుగా 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశమున్నది. క్వింటాలుకు సుమారు రూ.4 వేల ధర పలుకుతుంది. ఆ లెక్కన రూ.60 వేల వరకు ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉన్నది. ఇక పెట్టుబడి ఖర్చులు కూడా చాలా తక్కువ. ముఖ్యంగా రసాయనాలు, పురు గు మందుల వంటి ఖర్చు ఉండదు. నిపుణుల ప్రకారం సుమారుగా రూ.6 వేలు మాత్రమే ఒక ఎకరానికి ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడి, నీటి వనరులతో పండే ఈ పంట సాగు సిరులు కురిపించి రైతును రాజు చేస్తుందనటంలో సందేహం లేదు.

ముఖ్యంగా ఈ పంట సాగు ద్వారా రైతులు నష్టపోయే అవకాశమే లేదు. పశువుల మేత ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉన్నది. అన్నింటికంటే ముఖ్యమైనది డిమాండ్. ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారుల నుంచి ఈ చిరు ఆహార పదార్థాలకు విపరీతమైన డిమాండ్ ఉన్నది. తెలంగాణలోనే కాకుండా, తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ర్టాల్లో కూడా కొర్రలు, అరికలు, ఊదలు వంటి చిరుధాన్యాలకు మంచి మార్కె ట్ ఉన్నది. భవిష్యత్తులో వరి, గోధుమలకు ప్రత్యామ్నాయం గా చిరుధాన్యా ల వాడకం పెరిగే అవకాశం లేక పోలేదు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల ఆదాయ వృద్ధే ధ్యేయంగా ముందుకుపో తున్నది. కాబట్టి చిరుధాన్యాల పంటల సాగుపై కూడా రైతుల్లో అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా రైతు సమన్వయ సమితులు ప్రస్తుత పరిస్థితుల్లో చిరుధాన్యాలకు మార్కెట్‌లో ఉన్న అవకాశాలను వివరించాలి. చిరుధాన్యాల సాగు ఎలా చేసుకోవాలి, సాగు చేసిన పంటను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలన్న అంశాలపై రైతుల్లో సందేహాలను తీర్చాలి. ఇప్పటికే ఈ తరహా పంటలు పండిస్తున్న రైతులు దళారీల దోపిడీకి గురికాకుండా తగుచర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, కొర్రలు, అరికలు, ఊదలు వంటి డిమాండ్ ఉన్న చిరు ఆహార ధాన్యాలను మధ్యవర్తులు కేవలం రూ.30 నుంచి రూ.40కే రైతుల నుంచి కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో వినియోగదారులకు సుమారు రూ.100 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు.
rama-krishna
ముఖ్యంగా ప్రభుత్వమే, రైతుల భాగస్వామ్యంతో ఈ చిరుధాన్యాల శుద్ధి పరిశ్రమలు ఏర్పాటుచేయాలి. తద్వారా రైతే ఆ మేర మార్కెట్ ధరను లబ్ధి పొందే అవకాశం ఉన్నది. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వనరులతో పండే చిరుధాన్యాల పంటలకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ అవకాశాలను గనుక తెలంగాణ రైతులు అందిపుచ్చుకోగలిగితే రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది.

878
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles