పదవుల త్యాగమే ఊపిరిగా..


Sun,September 9, 2018 12:04 AM

ఈ పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మరోసారి ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒక్క తప్పటడుగు జీవిత గమనాన్ని మార్చుతుందంటారు. అలాగే తెలంగాణ ప్రజలు ప్రస్తుతం తీసుకునే నిర్ణయం భవిష్యత్తు తెలంగాణ దిశ దశను మార్చుతుందన్న విషయం మాత్రం స్పష్టం.

తెలంగాణలో సాంస్కృతిక విధ్వంసం యథేచ్ఛ గా సాగుతున్న తరుణం. మన యాస, భాషలను మనమే అసహ్యించుకునేలా చేసిన ఆంధ్రోళ్ల చాతుర్యం. మన చరిత్రను మన కళ్లముందే మట్టిలో కలిపేస్తున్న సందర్భం. మన కవులు, కళాకారులకు తీరని అవమానం. మన పండుగలు, పబ్బాలపై అం తులేని వివక్ష. వాళ్ల పొలాలకు మన గోదావరి, కృష్ణా జలాలు. అక్కడ మూడు పంటలు, ఇక్కడ ఆకలి కేక లు. వాళ్ల ఫ్యాక్టరీలకు మన వనరులు. వాళ్లవి కొలువులు మనవి బానిస బతుకులు. ఇదిగో ఇలాంటి సందర్భంలోనే చీకట్లో చిరుదివ్వెలా తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించింది. నాడు చేసిన ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటమే దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడేందుకు కారణమైంది. అంతే తప్పా పాలకుల దయాదాక్షిణ్యాలతో వచ్చింది కాదు తెలంగాణ. ఎవరు అవునన్నా, కాదన్న.. ఆ సుదీర్ఘ మహోద్యామనికి సారథ్యం వహించింది గులాబీ అధినేత కేసీఆరే. ఆయన పిలుపు మేరకే తెలంగాణ సమాజం సాహోసపేతంగా సమరాంగణంలో దూకింది. సంఘటితశక్తిగా నిలిచింది. చరిత్ర ఎరుగని ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిచింది. గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నది. దేశమే దిగివచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించాల్సిన అనివార్యతను అగత్యాన్ని ఉద్యమమే సృష్టించింది.

ఈ క్రమంలో టీఆర్‌ఎస్ ఎన్నడూ వెనుకడుగు వేయలే. పద్నాలుగేండ్లు ప్రజా ఉద్యమాన్ని ఎన్నో ప్రయాసలకోర్చి నడిపించింది. మొక్కహోని దీక్షతో ఉద్యమాన్ని నడిపించి, గమ్యాన్ని ముద్దాడింది. ఈ క్రమంలో ఎదురైనా ఎన్నో ఒడిదు డుకులకు, తన పదవులను తృణప్రాణంగా త్యాగం చేసింది. నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగింది. ఉద్యమాల గడ్డపై ఒకటి రెండు సార్లు కాదు.. అవసరమైన ప్రతి సందర్భంలోనూ పదవులను త్యాగం చేసింది. తెలంగాణవాదం ఉందని, స్వరాష్ట్రం కావాలనే బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉందని ప్రపంచానికి చాటిచెప్పిన ఖ్యాతి టీఆర్‌ఎస్‌కే దక్కుతుంది. దశాబ్దాలుగా జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయ డం, నాలుగు కోట్ల ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చే లక్ష్యంతో కేసీఆర్ 2001లో టీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. అలా ఒక్క నాయకుడితో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆ తదుపరి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెచప్పులా మారింది. తెలంగాణ ప్రాంత సమస్య కోసం ఎన్నోసార్లు తమ పదవులను తృణపాయంగా వదులుకొని దేశ చరిత్రలో రికార్డు సృష్టించడమే కాదు, స్వరాష్ర్టాన్ని సాధించిన ఘనత గులాబీ పార్టీ సొంతం. దేశ చరిత్రను తిరిగేసి చూస్తే పదవులను త్యాగం చేసిన వారి జాబితాను వేళ్లపై లెక్కించవచ్చు. కానీ స్వరాష్ట్ర సాధన కోసం పలుమార్లు పదవులను త్యాగం చేసిన ఘనత మాత్రం టీఆర్‌ఎస్‌కే చెందుతుంది. పార్టీ ఆవిర్భావంతోనే పదవుల త్యాగంతో ఆరంభంమైన చరిత్ర టీఆర్‌ఎస్ పార్టీది.

ఆరంభంలోనే తన పదవి రాజీనామా చేసిన కేసీఆర్.. ఉద్యమ ప్రస్థానంలో స్వరాష్ట్ర ఆకాంక్షను ఒకవైపు ఆకాశం అంత ఎత్తుకు ఎత్తే ప్రయ త్నం చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో.. అవసరాలు సందర్భాలను బట్టి పదవులనూ త్యాగం చేశారు. టీఆర్‌ఎస్ ప్రస్థానాన్ని ఒక్కసారిగా లోతుగా చూస్తే.. పదువుల త్యాగాలే మనకు కనిపిస్తాయి.. 2001 మే 17న తెలంగాణ సింహగర్జన సభను కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో నిర్వహించారు. లక్షలాది జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. అప్పటివరకు ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సభ జరిగిం ది. ఈ సభ నుంచి తెలంగాణ ఉద్యమం రగులుకోగా, 2001 ఆగస్టు 18న టీఆర్‌ఎస్‌ను రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ క్రమంలో 2001 సెప్టెంబర్ 22న జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట నుంచి శాసనభ్యుడిగా తిరిగి కేసీఆర్ ఎన్నికయ్యారు. ఆ తదుపరి తెలంగాణ ప్రజల అకాంక్ష కోసం పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. ఇందులో భాగంగా 2003 జనవరి 6న పరేడ్ మైదానంలో తెలంగాణ గర్జన పేరిట నిర్వహించిన సభ రాష్ట్రంలో అన్నివర్గాలను ఆకర్షించింది. ఆ తదుపరి ఢిల్లీ పాలకుల దృష్టికి తేవడానికి 2003 మార్చి 27న కేసీఆర్ ఆధ్వర్యం లో ఢిల్లీకి కారు ర్యాలీ నిర్వహించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి ఎన్నికల్లో పోటీచేసి.. 2004 మేలో కేంద్ర మంత్రివర్గంలో చేరా రు. ఇదే క్రమంలో రాష్ట్రంలోనూ 2004 జూన్ 23న పలువురు రాష్ట్ర మంత్రివర్గంలో చేరారు. 2004లో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలికిన కేసీఆర్, తనదైన స్థాయిలో చక్రం తిప్పి, అదే ఏడాది జూన్ 7న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించేలా చేశారు. 2005 జనవరిలో కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు కూడా టీఆర్‌ఎస్ విజయమే. ఆ తదుపరి కేంద్ర వైఖరి మారుతూ వచ్చింది.
Prakashrao
ఈ క్రమంలో కేంద్ర పదవులు, రాష్ట్ర పదవులు చేసే అవకాశాలున్నా.. తెలంగాణవాదాన్ని కించపరిచేలా కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేసిన మాటలు ఒకవైపు.. తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న నిర్ల క్ష్యవైఖరి మరోవైపు వీటిని నిరసిస్తూ కేసీఆర్ 2006 అగస్టు 22 కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. అక్కడితో ఆగకుండా 2006 సెప్టెంబర్ 12న కరీంనగర్ లోక్‌సభకు రాజీనామా చేశారు. దీనికిముందే 2005 జూలై 3న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసగా, టీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు రాష్ట్ర మంత్రులు తమ పదవులను వీడారు. ఆ తదుపరి 2006లో కరీంనగర్ లోకసభకు ఉప ఎన్నికలు జరుపగా.. కేసీఆర్ తిరిగి బరిలో నిలిచారు. తెలంగాణవాదం లేదని పేర్కొంటూ టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ తన పార్టీ యంత్రాంగాన్ని మొత్తం వినియోగించింది. గల్లీగల్లికి మంత్రిని తిప్పింది. ఓటు విషయంలో అనేక విష సంస్కృతికి బీజం పోసింది. అయినా.. ప్రజలు కేసీఆర్‌కు రెండు లక్షల పైచిలుకు మెజార్టీ ఇచ్చి పట్టం కట్టారు. తెలంగాణవాదం ఉందని, స్వరాష్ట్ర సాధన కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందన్న సంకేతాన్ని ఇచ్చా రు. ఆ తదుపరి మళ్లి ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. దీంతో.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమాన్ని విస్తృతం చేసేందుకు మరోసారి టీఆర్‌ఎస్ త్యాగాలు చేసింది. 2008 మార్చి 3న కేసీఆర్‌తో పాటు నలుగురు లోక్‌సభ సభ్యులు కూడా రాజీనామా చేశారు. అలాగే 2008 మార్చి 4న 16 మంది శానసభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. అయినా సర్కారు దిగి రాకపోవడంతో తన ప్రాణాన్ని పణంగా పెట్టేందుకు కేసీఆర్ సిద్ధపడ్డారు. ఇందులో భాగంగానే 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు బయలు దేరుతున్న సమయంలో అనాటి సీమాంధ్ర సర్కారు కుట్రపూరితంగా అరెస్ట్ చేసి, ఖమ్మం తరలించింది.

కానీ వెనక్కి తగ్గని కేసీఆర్ దీక్ష కొనసాగించారు. కేసీఆర్ అరెస్ట్‌ను జీర్ణించుకోలేని నాలుగుకోట్ల కోట్ల ప్రజలు, కుల, మత, వర్గాలకతీతంగా రోడ్డెక్కారు. మా తెలంగాణ మాగ్గావాలె.. అంటూ ఉద్యమించారు. ప్రజల ప్రత్యేక ఆకాంక్షను ప్రత్యక్షంగా చూసిన కేంద్రం, 2009 డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నాం.. అంటూ ప్రకటించింది. దోపిడీకి అలవాటుపడ్డ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా రాజీనామాలు చేసి, ప్రత్యేక రాష్ర్టాన్ని అడ్డుకున్నారు. ఈ సమయంలో మరోసారి టీఆర్‌ఎస్ త్యాగానికి సిద్ధపడింది. 2010 ఫిబ్రవరి 10న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారు. అలాగే జేఏసీ పిలుపు మేరకు 2011 జూలై 4న 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు రాజీనామాలు సమర్పించారు. అనేకసార్లు రాజీనామాలు చేసి పదవులను తృణ ప్రాయంగా వదలివేసిన ఘనత టీఆర్‌ఎస్‌దే. ఇలా కష్టపడి సాధించుకున్న తెలంగాణను గడిచిన నాలుగేళ్లలో ప్రగతి విషయంలో అధినేత కేసీఆర్ పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. వినూత్న అలోచనలకు జీవం పోశారు. నాలుగేండ్ల మూడు నెలల ఐదు రోజులకే ప్రభుత్వాన్ని రద్దుచేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. లోతుగా అధ్యయనం చేసి చూస్తే.. ముందుస్తు ఎన్నికలకు రావడానికి దోహదపడిన కారణాలు.. ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్న విధానాలే కారణమన్న విషయం స్పష్టమవుతున్నది. అందుకే ఇంకా చాలా నెలల పాటు అధికారంలో ఉండి పదవుల్లో కొనసాగే అవకాశం ఉన్నా తెలంగాణకు బలమైన పునాదులు వేసేందుకు మరోసారి పదవులను త్యాగం చేసిన విషయం కళ్లముందే కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మరోసారి ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒక్క తప్పటడుగు జీవిత గమనాన్ని మార్చుతుందంటారు. అలాగే తెలంగాణ ప్రజలు ప్రస్తుతం తీసుకునే నిర్ణయం భవిష్యత్తు తెలంగాణ దిశ దశను మార్చుతుందన్న విషయం మాత్రం స్పష్టం.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి, కరీంనగర్)

527
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles