నెహ్రూ వ్యక్తిత్వహననం

Sat,March 16, 2019 01:35 AM

నిజానికి సర్దార్ పటేల్ స్వాతంత్య్రోమ జీవితమంతా కాంగ్రెస్‌తోనే ముడిపడి ఉన్నది. గాంధీ హత్య తర్వాత అర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించడంలో ఆయన ప్రమేయం ఉన్నది. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌కు ఈ హత్యతో సంబంధం లేకున్నా, ఇటువంటి సంస్థల భావజాలం హత్యకు దారితీసిందనే అభిప్రాయం ఆయనది. దేశ విభజనకు నెహ్రూ ఒక్కరే బాధ్యులు అనడం కూడా తప్పుడు అవగాహన. ఇందులో నెహ్రూ కన్నా పటేల్ పాత్ర ప్రధానమైనది.

బీజేపీ పెద్దలు మరోసారి తొలి ప్రధాని నెహ్రూపై నోరుపారేసుకున్నారు. జైషే మహ్మద్ అధిప తి మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించే ఐక్య రాజ్య సమితి తీర్మానానికి చైనా అడ్డుపడిన వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మోదీ భయపడిపోతున్నారంటూ రాహుల్‌గాంధీ అవహేళ న చేశారు. దీనికి స్పందనగా బీజేపీ ప్రతినిధి, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నెహ్రూపై విరుచుకు పడ్డారు. కశ్మీర్, చైనా సమస్యల పాపమంతా నెహ్రూదే అనే రీతిలో విరుచుకుపడ్డారు. ఒక్క కశ్మీర్ విషయంలోనో, చైనా విషయంలోనో కాదు, అనేక సమస్యలకు, నేటి దేశ దుస్థితికి నాటి నెహ్రూ విధానాలే కారణమన్నట్టుగా ప్రచారం సాగుతున్నది.

నెహ్రూకు బదులుగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రధాని అయితే దేశం మరోవిధంగా ఉండేదని, నిజానికి ఆయనకే ఎక్కువ ప్రాబల్యం ఉన్నప్పటికీ, గాంధీ మూలంగా వెనుకకు తగ్గారని కూడా ఇటీవలికాలంలో బీజేపీ బృందం ప్రచా రం సాగిస్తున్నది. ఇందులో కొన్ని అసత్యాలైతే, మరికొన్ని అర్ధసత్యాలు, అసందర్భంగా ఉటంకించే అంశాలు. ఇది చాలదన్నట్టు కొన్ని శక్తులు నెహ్రూపై వ్యక్తిగతంగా, ఆయన కుటుంబంపై అనేక దిగజారుడు రాతలను ప్రచారంలో పెడుతున్నాయి. ఈ అభ్యంతరకర ప్రచారాలకు నేరుగా బీజేపీ బృందంతో సంబంధం లేకపోవచ్చు. కానీ రాతలు స్థూలంగా వీరు నెహ్రూ వ్యక్తిత్వాన్ని కించపరుచాలనే బీజేపీ పథకంతో ఏకీభావం కలిగి ఉన్నాయి. రెండు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.

స్వాతంత్య్రానంతర చరిత్రలో ఏనాడూ లేని విధంగా ఒకవైపు మోదీని విమర్శించడమే దేశద్రోహమనే రీతిలో భయానక పరిస్థితిని కల్పించే ప్రయత్నం సాగుతున్నది. మరోవైపు స్వాతంత్య్రోద్యమ అగ్రతార, నవభారతానికి అన్ని రం గాల్లో పునాదివేసిన దార్శనికుడు నెహ్రూపై మాత్రం అత్యంత నీచపు రాతలు ప్రచారంలో పెట్టడం తీవ్రమైన విషయం. మొఘల్ ఆస్థానంలోని ఒక ముస్లిం ఉద్యోగి నెహ్రూ కుటుంబానికి మూల పురుషుడని, ఆఫ్ఘన్ వారసత్వం గల కుటుంబమనీ, లేదా వివాహేతర సంబంధాల నుంచి వీరి కుటుంబీకులు జన్మించారని, ఇందిరాగాంధీ ముస్లింను వివాహమాడారని, వీరం తా రహస్యంగా ఖాన్ వంశస్థులని- ఇట్లా రకరకాల అబద్ధపు రాతలు సోషల్‌మీడియాలో ప్రచారంలో పెట్టడం దేశభక్తి అనిపించుకోదు. నిజానికి ఎవరు ఏ కుటుంబం నుంచి లేదా ఏ మతం నుంచి అయినా రావచ్చు, భారత సమా జం అందరిని సమానంగా అక్కున చేర్చుకుంటుంది.

కానీ ఈ అబద్ధపు రాతల వెనుక గల ఆంతర్యం తెలువనిదేమీ కాదు. నెహ్రూ కుటుంబానికి ఈ దేశం పట్ల విధేయత లేదని, దేశానికి రహస్యంగా ద్రోహం చేస్తున్నదని ప్రచారం చేయడమే అబద్ధపు రాతలను ప్రోత్సహించేవారి లక్ష్యం. నెహ్రూకాలం నాటి కాంగ్రెస్ పార్టీకి, నేటి రాహుల్‌గాంధీ నేతృత్వంలోని పార్టీకి పేరులో తప్ప పోలికే లేదు. జన్యుపరంగా రాహుల్‌గాంధీ నెహ్రూ వారసుడు కావచ్చు. కానీ నెహ్రూ వారసత్వం అంటే రాహుల్‌గాంధీ కాదు. అది విస్తృతార్థంలో దేశ లౌకిక, ప్రజాస్వామిక స్వరూపం. ఈ దేశనిర్మాణంలో అనేకమంది స్వాతంత్య్రోద్యమ ప్రముఖులు పాలుపంచుకున్నారు. కానీ నెహ్రూకు ఈ దేశం బ్రిటన్, ఫ్రాన్స్ తదితర యురోపియన్ దేశాలకు దీటుగా ఒక లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యంగా విలసిల్లాలనే స్పష్టమైన దార్శనిక త ఉన్నది. ఇవాళ అంతరిక్షం మొదలుకొని అణుశక్తి వరకు అన్నిరంగాల్లో దేశం ఈ స్థాయిలో ఉన్నదీ అంటే నెహ్రూ వేసిన బాటే. ఈ అబద్ధాల ప్రచారకర్తల లక్ష్యం ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థలను, స్వావలంబనను నాశనం చేయాలనేదే. ఆధునిక విలువలకు ప్రతీకగా ఉన్న నెహ్రూను కించపరిచేది అందుకే.

నెహ్రూకు బదులుగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను నెత్తికి ఎత్తుకోవడం కూడా ఈ పన్నాగంలో భాగమే. నిజానికి సర్దార్ పటేల్ స్వాతంత్య్రోమ జీవితమంతా కాంగ్రెస్‌తోనే ముడిపడి ఉన్నది. గాంధీ హత్య తర్వాత అర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించడంలో ఆయన ప్రమేయం ఉన్నది. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌కు ఈ హత్యతో సంబంధం లేకున్నా, ఇటువంటి సంస్థల భావజాలం హత్యకు దారితీసిందనే అభిప్రాయం ఆయనది. దేశ విభజనకు నెహ్రూ ఒక్కరే బాధ్యులు అనడం కూడా తప్పుడు అవగాహన. ఇందులో నెహ్రూ కన్నా పటేల్ పాత్ర ప్రధానమైనది. కాంగ్రెస్‌లో లెఫ్టిస్టులు, రైటిస్టు లు- భిన్న భావజాలాల వారున్నారు.

అయితే వీరెవరిదీ కరడుగట్టిన భావజాలం కాదు. భిన్నభావాలను సమన్వయం చేసుకొని ఆధునిక భారతానికి పునాదులు వేసిన మహనీయులు వారు. నెహ్రూ, పటేల్, కృష్ణమీనన్ వంటివారు స్వాతంత్య్రానంతర క్లిష్టపరిస్థితుల్లో-వందలాది సంస్థానాలను- మౌంట్ బాటెన్‌ను ముందుపెట్టుకొని- ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు తావివ్వకుండా అత్యంత చతురతతో విలీనం చేశారు. సరిహద్దులో ఉన్న ముస్లిం మెజార్టీ గల కశ్మీర్ ప్రాంతాన్ని దేశంలో విలీనం చేయడమే కాదు, ఆ తర్వాత కాలంలో కశ్మీరీయులను తమ పాలనద్వారా మెప్పించడం నాటి నాయకుల ఘనత. పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాల్లోనూ ఏనాడూ మనదేశం అభాసుపాలు కాలేదు. ఆ చిన్నదేశం ముందు మనం ఏనాడూ చిన్నపోలేదు. కానీ నాటి తరాన్ని కించపరుచడంలోనే నేటి నాయకుల అల్పత్వం, అసమర్థత కనబడుతున్నది.

304
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles