గో రక్షణ వివాదం


Tue,February 12, 2019 01:22 AM

మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత బీజేపీ పాలనలో మాదిరిగానే, గో రక్షణ పేర అనుమానితులపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించడం దిగ్భ్రాంతికరం. ఇటీవల ఖాండ్వా జిల్లాలో ఆవును చంపారనే ఆనుమానంతో ముగ్గురిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించింది. ఇదేరీతిలో మాళ్వా జిల్లాలో ఆవులను తరలిస్తున్నారనే ఆరోపణపై ఇద్దరిపై ఇదే చట్టాన్ని ఉపయోగించింది. ఉత్తర భారతంలో ఇప్పటికే ఆవును చంపారనో లేక తరలిస్తున్నారనో అనేకమందిపై మూకదాడులు జరిగాయి. మధ్యప్రదేశ్‌లోనే గత బీజేపీ ప్రభుత్వం పదేండ్ల కాలంలో 22 మందిని ఈ నిరంకుశ చట్టం ప్రకారం అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాలలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు గో రక్షణ పేర అనుసరిస్తున్న విధానాలు బలహీన వర్గాలలో ఆందోళన కలిగిస్తున్నాయి. జాతీయ భద్రతా చట్టాన్ని దేశ భద్రత కోసం విద్రోహాలను కట్ట డి చేయడానికి ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం- వ్యక్తి నేరం చేయకున్నా, చేస్తాడనే అనుమానం ఉంటే చాలు, విచారణ జరుపకుండానే ఏడాది పాటు నిర్బంధంలో పెట్టవచ్చు. ఇటువంటి చట్టాన్ని గో రక్షణ కోసమని సాధారణ పౌరులపై ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధం. గో హత్య, తరలింపు అనుమానాలకు గురైనవారిని మూక దాడుల నుంచి కాపాడవలసింది పోయి, వారినే దండించడం సమర్థనీయం కాదు. భిన్న మత విశ్వాసాలు, ఆహార అలవాట్లున్న సమాజంలో బలహీనవర్గాలను భద్రతారాహిత్యానికి గురి చేయకూడదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం వ్యతిరేకించడానికి కూడా జంకుతున్నది. కేరళలో అయ్యప్ప ఆలయ వివాదంలోనూ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా నిలబడలేకపోయింది.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజస్థాన్ ప్రభుత్వం కూడా గో రక్షణను ఒక ప్రధాన అజెండాగా స్వీకరించాలని భావిస్తున్న ది. అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే గోరక్షణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చేర్చింది. తాము అధికారంలోకి వస్తే గోశాలల కు నిధులు పెంచుతామని, అత్యాధునిక వసతులు కల్పిస్తామని, వీధి ఆవుల సమస్యను పరిష్కరిస్తామని, స్థానిక జాతులను కాపాడుతామ ని హామీ ఇచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాలలో గో రక్షణ బాధ్యత చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉత్త రప్రదేశ్ అనుభవాలను గమనంలోకి తీసుకోవాలె. ప్రభుత్వ విధానాలు, మూకదాడుల మూలంగా, యూపీలో కబేళాలు మూతపడ్డా యి. ఆవులను ఆహారంగా తీసుకోవడం కాదుగదా, రవాణా చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఉన్నది. దీనివల్ల ఆవులు పంట చేన్లలో పడి మేయడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. ఒక పత్రికా కథనం ప్రకారం.. యూపీలోని సీతాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో వేలాది ప్రజలు సమావేశమై డబ్బు పోగుచేసుకొని అంతా కలిసి ట్రాక్టర్లలో వందలాది ఆవులను నేపాల్ సరిహద్దులోని అభయారణ్యంలో వదలాలని నిర్ణయించుకున్నారు. ఆవులను తరలించేవారిపై దాడులు జరుగకుండా గ్రామస్తులు మోటారు సైకిళ్లపై కాపలాగా వెళ్ళారు. ఈ తరలింపు జరుగుతుంటే, దారిన ఉండే గ్రామస్తులు ఆవులను తమ గ్రామాల్లో వదలకుండా బాటకు ఇరువైపులా కాపలా కాశారు. చివరికి ఆడవిలో వదులతున్నప్పుడు, సమీప గ్రామస్తులు వచ్చి గొడవ చేసి కొన్ని ఆవులను పట్టాలకు కట్టివేశారు. ఘర్షణ జరిగి ఇరువైపులా రైతులు గాయపడ్డారు. ముప్ఫైకి పైగా ఆవులు అప్పు డే వచ్చిన రైలు కింద పడిపోయాయి. ఇటీవలికాలంలో అడవి దాటి వస్తున్న భారతీయ ఆవులు నేపాల్ రైతులకు సమస్యగా మారిపోయాయి.

ఒకప్పుడు సంచారజాతులు పశు మాంసాన్ని ఆహారంగా స్వీకరించినప్పుడు, గోవుకు ప్రాధా న్యం ఎక్కువగా ఉండేది. వ్యవసాయ సమాజంలో మానవులు జంతువులను మచ్చిక చేసుకొని ఉపయోగించుకునేవారు. గోవు పాలకే కాదు, పెండకు ఉపయోగం ఉండేది. కానీ ఇప్పుడు వ్యవసాయంలో యాంత్రీకరణ జరిగి పశువుల పాత్ర లేకుండా పోయింది. దున్నడం మొదలుకొని, బంతి కుప్ప కొట్టడానికి కూడా యంత్రాలనే వాడుతున్నారు. పాల కోసం విదేశీ సంకర జాతులను ప్రోత్సహిస్తున్నారు. అందువల్ల గో పరిరక్షణ అనేది భావోద్వేగ అంశమే తప్ప, వాస్తవ జీవనంతో ముడిపడ్డది కాదు. ఆవులను కాపాడుకోవాలను కోవడంలో తప్పులేదు. ఆవులనే కాదు, సమస్త వృక్ష, జంతుజాలాన్ని, ప్రకృతిని కాపాడుకుందాం. ఇది అభివృద్ధి చెందిన జీవులుగా మన బాధ్యత. ఈ భూగోళంపై మానవాళి ఒంటరిగా బతుకలేదు. వైవిధ్యం ప్రకృతి ధర్మం. కానీ గో రక్షణ ఒక రాజకీయ అస్త్రంగా మన ముందుకువచ్చింది. మానవుల్లోని వైవిధ్యాన్ని గౌరవించలేని వారు గోరక్షణను ఉద్వేగభరిత అంశంగా మార్చారు. వారికి రాజకీయ అవసరాలకు ప్రజలను రెచ్చగొట్టడం తప్ప, గోరక్షణ విధాన రూపకల్పన పట్ల పట్టింపు లేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ, జీవకారుణ్య విధానాలను అమలుచేయవచ్చు. ప్రజలను ఈ మార్గంలో చైతన్యపరుచవచ్చు. కానీ మతవాద శక్తులతో విద్వేష రాజకీయాల్లో పోటీ పడటం ప్రమాదకరం. ఇది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కూడా ప్రయోజనకరం కాదు. దేశాన్ని పరిపాలించదలిచే రాజకీయపక్షానికి స్పష్టమైన సైద్ధాంతిక దృక్పథం ఉండాలె. దాన్ని అమలు చేసే ధైర్యం కూడా ఉండాలె.

415
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles