రాలుతున్న రాబందు రెక్కలు


Tue,January 14, 2020 01:15 AM

అమెరికా పట్ల ప్రపంచమంతా అలుముకున్న అసంతృప్తి ఆగ్రహం తమపై కాదని తమ ప్రభు త్వం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విధానాలపైనేనని అమెరికా ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రపంచీకరణ సంపద కేంద్రీకృతం చేసిందని సంక్షోభాలను వికేంద్రీకరణ చేసిందని గమనించారు. వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ ఉద్యమ ప్రకంపనలు కొనసాగిస్తున్నారు. అలాగే యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు జరుపుతున్నారు. ఈ విధంగా ఇంటా, బయటా సంక్షోభం కారుమబ్బులు అమెరికాను కమ్ముకుంటున్నాయి. తానే రారాజు అనుకున్న ఏక ధృవ ప్రపంచకోటకు బీటలు పడుతున్నాయి.

ఇరాన్‌ సైన్యాధిపతి జనరల్‌ సులేమానీని అమెరికా బాంబుల వర్షం కురిపించి హతమార్చింది. ఇరాక్‌ను జనహనన ఆయుధాలను తయారుచేస్తున్నారనే నెపంతో యుద్ధానికి పాల్పడి జన జీవనాన్ని అతలాకుతలం చేసిన అమెరికా ఇప్పుడు అదే ముందస్తు ఆత్మరక్షణ పేరుతో ఇరాన్‌ను కూడా సామ్రాజ్యవాద విస్తరణ కుతంత్రాల తో సంక్షోభంలోకి నెట్టివేసే ప్రయత్నాలకు తెగ బడుతున్నది. పాలన వైఫ ల్యం, అస్థిరతకు లోనైన దేశాల ఉద్ధారకుడిగా చెప్పుకొంటూ, అస్థిరతలను సృష్టించి సైనిక చర్యలతో ఉన్మాదాన్ని కొనసాగిస్తున్నది. అమెరికా అనుకూల షా రాజవంశ పాలనలో ఇరాన్‌ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు లోనయ్యింది.

సామాజిక న్యాయం, మత విలువల పునరుద్ధరణ కోసం జరిగి న 1979 ఇస్లామిక్‌ విప్లవ విజయంలో యువసైనికుడిగా సులేమానీ దేశభక్తియుత సాహసోపేత చర్యలతో ప్రజలకు చేరువయ్యాడు. విప్లవ సారథి అయతుల్లా రహుల్లా ఖోమేనికి విధేయత విశ్వసనీయత గల సహచరుడి గా ఉన్నాడు. ఇరాన్‌ పునర్నిర్మాణం, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో క్రియాశీలకపాత్ర పోషించాడు. తనదైన విదేశాంగ విధానాలతో అంతర్జాతీయ సమాజంలో ఇరాన్‌కు ప్రత్యేకతను సంతరింపచేశాడు. రష్యా, సిరియా, ఇరాక్‌ చైనాలతో సమన్వయంతో నడుస్తూ పశ్చిమాసి యా ప్రజలకు ఆరాధ్యనాయకుడిగా మారాడు. ఈ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని కోల్పోతున్న అమెరికాకు జనరల్‌ సులేమానీ కంటగింపుగా తయా రు కావటం గమనార్హం.

చమురు వనరులు సమృద్ధిగా ఉన్న ఇరాన్‌ పై ఆధిపత్యం కోసం అమెరికా దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్నది. అమెరికా కుతంత్రాలను ఇరాన్‌ అప్రతిహతంగా తిప్పికొడుతున్నది. రష్యాతో సైనిక ,వ్యాపార సంబంధాలను పటిష్టం చేసుకున్నది. ఇటీవల చమురు కొనుగోలులో చైనా అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా మారింది. ఇరాన్‌ చమురు క్షేత్రాల అభివృద్ధికి చైనా 280 బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. వీటి రక్షణ బాధ్యతలను తీసుకున్నది. బలమైన రక్షణ ఆర్థికవ్యవస్థను నిర్మించుకుని ప్రజారంజక పాలన కొనసాగిస్తున్న ఇరాన్‌ అమెరికా విస్తరణవాద, ఇస్లామిక్‌ ఉగ్రవాద బాధిత దేశాలైన సిరియా, కువైట్‌, ఇరాక్‌, లెబనాన్‌, యెమెన్‌, పాలస్తీనాలకు సహాయ సహకారాలను అందిస్తున్నది.

ఇలాంటి ఇరాన్‌ వైఖరిపై అగ్రరాజ్యం అక్కసుతో,అణ్వస్ర్తాలను తయారుచేస్తున్నారని నెపంతో అనేక ఆర్థిక ఆంక్షలను విధించి వేధిస్తున్నది. అణు కార్యక్రమాలను నిలిపివేసే వరకు ఆర్థిక ఆంక్షలను కొనసాగిస్తామని అమెరికా అంటున్నది. ఈ నేపథ్యంలో 2015లో యూఎన్‌ భద్రతా సమితి సభ్యదేశాలు, యురోపియ న్‌ యూనియన్‌ల మధ్య ‘ఇరాన్‌ అణు ఒప్పందం’ కుదిరింది. అంతర్జాతీ య అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో యురేనియం,ఫ్లూటోనియం ప్రాసెసింగ్‌ను తగ్గించింది. IAEA అనుమతించిన పరిమితులలో అణుఇంధనాన్ని తయారుచేసుకుంటున్నది. హఠాత్తుగా ఈ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. మళ్లీ ఆర్థిక ఆంక్షలు విధించింది. పశ్చిమాసియాలో ప్రాబల్యం విస్తరించుకుంటున్న ఇరాన్‌పై యుద్ధోన్మాద చర్యలకు, ఆంక్షల కు తెగబడింది.

దీనికి జవాబుగా ఇరాన్‌ తన అధీనంలోని హార్ముజ్‌ జలసంది ద్వారా ప్రయాణిస్తున్న సౌదీ, అమెరికా వ్యాపార నౌకలపై దాడులు చేసింది. తనపై ఆంక్షలు తొలిగించకపోతే జలసంధిని మూసివేసి గల్ఫ్‌ నుంచి అమెరికా, పశ్చిమ దేశాలకు చమురు రవాణాను అడ్డుకుంటామ ని హెచ్చరించింది. తన గగనతలంలో ప్రవేశించిన డ్రోన్లను కూల్చివేసింది. దీనికి ప్రతిగా అమెరికా ఇరాన్‌ క్షిపణి రక్షణ వ్యవస్థను దెబ్బతీయడానికి సైబర్‌ దాడులకు పాల్పడింది. ఈ ఉద్రిక్తతల పరంపరలో చివరకు తనకు తాలిబన్‌, ఇస్లామిక్‌ స్టేట్‌ పై యుద్ధంలో సహకరించిన ఇరాన్‌ సైనిక జనరల్‌ ఖాసివ్‌ు సులేమానీని అమెరికా పొట్టనబెట్టుకోవటం ఆశ్చర్యం. ఇరాన్‌ చెక్కుచెదరని సాహసంతో ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిప ణులతో దాడులు చేసింది. అమెరికాను ఉగ్రవాద దేశంగా ప్రకటించి ట్రంప్‌ తలకు వెలకట్టింది.

రాజకీయ సంక్షోభం పాలనా వైఫల్యాలు సంభవించినప్పుడు ప్రజల దృష్టి ని మరల్చడానికి తనకు విధేయంగా లేని దేశాలపై దాడులకు దిగడం అమెరికాకు అలవాటైంది. తీవ్ర జాతీయవాదం విద్వేష రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌ మరింత తెంపరి తనానికి పాల్పడుతున్నాడు. మరోవైపు ప్రపంచ సంపదలో 15శాతం వాటాను కైవసం చేసుకొని ఆర్థిక ప్రబలశక్తిగా ఎదుగుతున్న చైనా.. అమెరికాను కలవరపెడుతున్నది. కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, అంతరిక్షరంగాలలో చైనా వేగంగా దూసుకెళుతున్నది. ప్రపంచ పోలీస్‌గా వ్యవహరిస్తున్న అమెరికాకు చైనా పురోగతి కంటగింపుగా మారింది. చైనాతో వ్యాపారయుద్ధం కొనసాగిస్తూనే చైనాకు చమురు రవాణాకు కీలక దేశంగా ఉన్న ఇరాన్‌పై కట్టు కథలతో కూలదోయడానికి కుట్రలు చేస్తున్నది.

ఆసియన్‌ కూటమి, చైనా సారథ్యం లో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందం ఫలితంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ సారథిగా ఆసియా ఖండం ఎదిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికాతో సైనిక పరంగా ఆర్థికపరంగా పోటీపడి వెనుకబడ్డ రష్యా ఇటీవలి కాలంలో మళ్లీ పుంజుకున్నది. నాటో కూటమి లో సైనిక పరంగా రెండవ పెద్ద దేశంగా ఉన్న టర్కీ అమెరికాపై ధిక్కారస్వరం వినిపించింది. సిరియాలోని కుర్దుల ప్రాంతాన్ని ఆక్రమించుకుని అక్కడ అమెరికా సైనిక స్థావరాన్ని తొలిగించాలని ఆదేశించింది. కుర్దులు, టర్కీ మధ్య ఘర్షణ నివారించడానికి రష్యా రాజకీయ దౌత్యం నెరిపింది. అమెరికా బెదిరింపు లు ఖాతరు చెయ్యకుండా టర్కీ రష్యా నుంచి యస్‌-400 క్షిపణులను, యుద్ధవిమానాలను కొనుగోలు చేసింది.18 ఏండ్ల తాలిబన్‌ యుద్ధంలో అమెరికా విజయం సాధించలేక అవమానకరరీతిలో వారితో చర్చలను జరుపుతున్నది.

అమెరికా చుట్టూ ఉన్న లాటిన్‌ అమెరికా దేశాలలో అమెరికా అనుకూల ప్రభుత్వాలు కూలిపోయి సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అమెరికా పెట్టుబడులకు అనేక దేశాల్లో ద్వారాలు మూసుకపోతున్నాయి. విదేశీ వాణిజ్యంలో భారీ లోటును ఎదుర్కొంటున్నది. అమెరికా పట్ల ప్రపంచమంతా అలుముకున్న అసంతృప్తి ఆగ్రహం తమపై కాదని తమ ప్రభు త్వం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విధానాలపైనేనని అమెరికా ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రపంచీకరణ సంపద కేంద్రీకృతం చేసిందని సంక్షోభాలను వికేంద్రీకరణ చేసిందని గమనించారు. వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ ఉద్యమ ప్రకంపనలు కొనసాగిస్తున్నారు. అలాగే యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు జరుపుతున్నారు. ఈ విధంగా ఇంటా, బయటా సంక్షోభం కారుమబ్బులు అమెరికాను కమ్ముకుంటున్నాయి. తానే రారా జు అనుకున్న ఏక ధృవ ప్రపంచకోటకు బీటలు పడుతున్నాయి.

నిరాశలో అమెరికా నిస్పృహతో యుద్ధ పిపాసిగా మారుతున్నది. ఈ క్రమంలోనే ఇరాన్‌తో జరిగే యుద్ధ ప్రభావాన్ని బేరీజు వేసుకున్న అమెరికా కాంగ్రెస్‌ అధ్యక్షుడికి ఉండే యుద్ధ అధికారాలను కుదించడం ఒక చిన్న ఆశాజనక పరిణా మం. పశ్చిమాసియాలో అమెరికా చేపడుతున్న కవ్వింపు చర్యల తో మన చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే చమురు ధరలు పెరిగాయి. ఈ ధోరణులు భారత ఉత్పత్తి, ఎగుమతి రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధ భూమిగా, అలీన విధానాన్ని అందించిన దేశంగా భారత్‌ జాత్యాహంకార, సామ్రాజ్యవాద విస్తరణ దేశాల పట్ల దూరాన్ని పాటించాలి. శాంతియుత సహజీవన ప్రపంచనిర్మాణంలో భాగస్వామి కావాలి. ప్రపంచ శాంతికి కృషిచేయాలి.
asnala-srinivas
అస్నాల శ్రీనివాస్‌

726
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles