అసహన పాలన


Wed,December 4, 2019 12:32 AM

నాటి మిశ్రమ ఆర్థికవ్యవస్థను, నేటి స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన పారిశ్రామికసంస్థల సారథుల అభిప్రాయాలను తేలిగ్గా కొట్టిపారేయలేము. రాహుల్ బజాజ్ అభిప్రాయాలతో వేదిక మీద ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా విభేదిస్తూనే, అటువంటి సమస్య ఏదైనా ఉంటే కలిసి పరిష్కరిద్దామని అన్నారు. కేంద్రం ఇదే వైఖరిని అనుసరించి పారిశ్రామికవేత్తలలోని భయాలను తొలిగించడంతో పాటు దేశాన్ని ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కించాలె. రాజకీయ, సామాజిక, ఆర్థికరంగాల్లో నెలకొన్న అసహన వైఖరిని విడనాడినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.

దేశంలో భయానక వాతావరణం ఏర్పడ్డదనీ, ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించడానికి భయపడుతున్నారని ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ ఇటీవల ఒక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం సంచలనం సృష్టించింది. ఇటీవల ఒక కార్యక్రమంలో వేదిక మీద ఉన్న కేం ద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి బజాజ్ ఈ ప్రశ్న వేశారు. ఇదే వేదిక మీద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా ఉన్నారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి 4.5 శాతానికి దిగజారిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరిం త ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. గత ఆరున్నరేండ్లలో వృద్ధి కనిష్ట స్థాయికి చేరింది. ప్రభు త్వం విమర్శలను స్వీకరిస్తుందనే నమ్మకం సన్నగిల్లిందని కూడా బజాజ్ అన్నారు.

ప్రభుత్వం భయానక, అనిశ్చిత పరిస్థితిని సృష్టించిందని ఆయన ఆరోపించారు. యూపీఏ-2 పాలనలో ఎవరినైనా తప్పుపట్టే పరిస్థితి ఉండేది. మీరు మంచి పని చేస్తున్నారు. కానీ మేం బహిరంగంగా విమర్శించాలనుకుంటున్నాం. కానీ మీరు స్వీకరిస్తారనే నమ్మకం లేదు. నా అభిప్రాయం తప్పు కావచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఈ విధంగా భావిస్తున్నారు అని రాహుల్ బజాజ్ ఎంతో హుందా గా, నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాహుల్ బజాజ్ ఏదో ఒక మాటతో సరిపెట్టుకోలేదు. ఆయన చేసిన వ్యాఖ్య వివరమైనదీ, విస్తృతమైనది. గాంధీ హంతకుడు గాడ్సే విషయమై బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యను కూడా బజాజ్ ప్రస్తావించారు.

రాహుల్ బజాజ్ వ్యాఖ్యలతో మరో పారిశ్రామికవేత్త ఏకీభవించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విటర్‌లో మద్దతు ఇచ్చి ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. 2016లో మోదీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దుకు పాల్పడినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నదని, అయినా భారత పారిశ్రామికరంగం మౌనంగా ఉన్నది. ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడానికి భయపడుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉందని, ఇందుకు సామాజిక అనిశ్చితి కారణమని ఇటీవలే ఒక కార్యక్రమం లో అన్నారు. తమకు అనుకూలంగా లేని పారిశ్రామికవేత్తలను మోదీ ప్రభుత్వం కేంద్ర సంస్థ ల ద్వారా వేధిస్తున్నదనే ఆరోపణలున్నాయి. కేఫ్ కాఫీడే యజమాని సిద్ధార్థ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన లేఖను ఇందుకు ఉదహరిస్తున్నారు.

రాహుల్ బజాజ్ వ్యాఖ్యల పట్ల అమిత్ షా సంయమనంతో స్పందించినప్పటికీ, బీజేపీ పెద్దలు ఆ తర్వాత తమ అసహనాన్ని బయటపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ-రాహుల్ బజాజ్ ఆరోపణలు జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తాయని అన్నారు. కేంద్ర నగరాభివృద్ధి మంత్రి హర్‌దీప్ పూరీ బజాజ్ వ్యాఖ్యలను దుర్భాషలాడటంగా చిత్రీకరించారు. బీజేపీ ఐటీ సెల్ రాహుల్ బజాజ్‌ను కాంగ్రెస్ మిత్రుడిగా చూపుతూ అసలు చర్చను పక్కకునెట్టే ప్రయత్నం చేసింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలైనా బజాజ్ కుటుంబానికి నెహ్రూతో సాన్నిహిత్యం ఉండేది. నాటి భారతీయ పారిశ్రామికవేత్తలు గాంధీ, నెహ్రూలకు దగ్గరగా ఉండేవారు. వారికి నాటి కాంగ్రెస్ పార్టీ విలువలతో ఏకీభావం ఉండేది. అయినంత మాత్రాన పార్టీకి కట్టిపడేయ కూడదు.

స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి భారత్‌లో నెలకొన్న పరిస్థితి మిగతా దేశాలతో పోలిస్తే భిన్నమైనది. నెహ్రూ నాయకత్వంలో మన దేశం సోషలిస్టు ఆర్థిక నమూనా వైపు మొగ్గు చూపినప్పటికీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పేర పారిశ్రామిక సంస్థలకు కూడా ప్రోత్సాహమిచ్చింది. పారిశ్రామిక సంస్థలు ఉత్పత్తిరంగంలో ఎంత ఎదిగినా సామాజిక సంక్షేమానికి ఆటంకంగా కనిపించకపోయేవి. ఇప్పటి మాదిరిగా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం పేట్రేగిపోతూ, వ్యాపారాల పేర భారీ ఎత్తున ప్రకృతి విధ్వంసానికి పాల్పడటం, రాత్రికిరాత్రే భారీ పారిశ్రామిక సామ్రాజ్యాలుగా మారడం జరిగేది కాదు. పారిశ్రామికవేత్తలు కూడా కొన్ని విలువలను పాటించాలనే అభిప్రాయం ఉండేది. పాలకులకు, పారిశ్రామికవేత్తలకు మధ్య సత్సంబంధాలు ఉండేవి. టాటా వంటి పారిశ్రామిక వేత్త లు తమ వాటాదార్ల ప్రయోజనాలకు ధర్మకర్తలుగా భావించుకునేవారు.

తమ వ్యాపార నిర్వహణను కూడా సమాజ ప్రయోజనాలను తీర్చడంగానే పరిగణించేవారు. లైసెన్స్ రాజ్ అంటూ ఎద్దే వా చేసిన కాలంలో పారిశ్రామికవేత్తలు అనుభవించిన భద్రత కూడా ఈ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ లో ఎందుకు కరువైందనేది ఆలోచించవలసిన విషయం. రాహుల్ బజాజ్ వంటి పారిశ్రామిక వేత్తలకు నిర్మొహమాటంగా మాట్లాడేవారిగా పేరున్నది. నాటి మిశ్రమ ఆర్థికవ్యవస్థను, నేటి స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన పారిశ్రామికసంస్థల సారథుల అభిప్రాయాలను తేలిగ్గా కొట్టి పారేయలేము. రాహుల్ బజాజ్ అభిప్రాయాలతో వేదిక మీద ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా విభేదిస్తూనే, అటువంటి సమస్య ఏదైనా ఉంటే కలిసి పరిష్కరిద్దామని అన్నారు. కేంద్రం ఇదే వైఖరిని అనుసరించి పారిశ్రామిక వేత్తలలోని భయాలను తొలిగించడంతో పాటు దేశాన్ని ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కించాలె. రాజకీయ, సామాజిక, ఆర్థికరంగాల్లో నెలకొన్న అసహన వైఖరిని విడనాడినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.

213
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles