సత్ప్రవర్తన నేర్పాలె


Wed,December 4, 2019 12:28 AM

చిన్నతనం నుంచి పిల్లలకు విచ్చలవిడితనం ఇచ్చి పెద్దయ్యాక వీడు రాక్షసుడిలా మారాడేంటి! అంటే ఫాయిదా ఉండదు. తల్లిదండ్రులు, గురువులు ఆదర్శంగా ఉంటూ పిల్లలకు నీతిని బోధిస్తే వారు ఆచరిస్తారు. కానీ, నేటి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎలా ఉంటున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. టీచర్లు విద్యార్థుల పట్ల నిజమైన గురువుల్లా వ్యవహరిస్తున్నారా లేదా అనేది మననం చేసుకోవాలి. ఎదురుగా ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రశ్నించని జనం (సమాజం), మీడియా ఆ తర్వాత ఎన్ని వ్యాఖ్యానాలు,ఎన్ని వార్తలు రాసినా ఉపయోగం శూన్యం.

L-Vikram
దిశ హత్యోదంతంలో నిందితులను బహిరంగంగా ఉరితీయాల్సిందే.. ఆమె మాదిరిగా చిత్రహింసలు పెట్టి చంపాల్సిందే.. ఇందుకు మృగాళ్లను జనానికి అప్పగించాల్సిందే.. ఎందుకంటే వారు చేసింది క్షమించరాని నేరం. ఆఫ్ఘనిస్థాన్‌లో ఇలాంటి తప్పుచేసినవాడిని నాలుగురోజుల్లో బహిరంగంగా చంపారు.. వరంగల్‌లో యాసిడ్‌దాడి నిందితులను చంపినట్టు ఎన్‌కౌంటర్ చేయాలి. మాకు అప్పగించండి మేమే శిక్షిస్తాం.. ఇవి ప్రధానంగా ఇటీవల షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద ప్రజల నుంచి వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. గాయం ఒకచోట ఉంటే మందు మరోచోట రాస్తే ఫలితం ఉండదు.

అందుకే కీలెరిగి వాత పెట్టమంటారు పెద్దలు. పుట్టుక తో ఎవ్వరూ నేరస్థులు కారు. ప్రతి వ్యక్తిలో మంచి మనస్సుతో పాటు అం తర్లీనంగా రాక్షసబుద్ధీ ఉంటుంది. రాక్షసబుద్ధిని అణిచినప్పుడు మంచి మనిషి బయటపడుతాడు. కానీ, నేటి పరిస్థితులు చిన్నప్పటి నుంచే రాక్షసబుద్ధిని వృద్ధి చేస్తూ.. మనిషిని తొక్కిపడేస్తున్నాయి. సమాజాన్ని మార్చే ది ముగ్గురే ముగ్గురు అంటారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం. ఆ ముగ్గు రు తల్లిదండ్రులు, గురువు. పిల్లలు మొదట తల్లిని చూసి, ఆ తర్వాత తం డ్రి నుంచి నేర్చుకుంటారు. గురువులు, సమాజం నుంచి ఇతర జ్ఞానం సముపార్జిస్తారు. నేటి తల్లిదండ్రులు ఎలా ఉన్నారు.

కొందరైతే ఆడపిల్ల మాకొద్దని గర్భంలోనే చంపేస్తున్నారు. వంశోద్ధారకుడు కావాలని అర్రులు చాస్తున్నారు. పుట్టాక ఒక్కగాకొక్క కొడుకని అతిగారభం చేస్తున్నారు. అడక్కుండానే సర్వం తెచ్చిపెడుతున్నారు. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు గాడి తప్పుతున్నారు. పాతికేళ్ల కిందట ఓ బాలిక తొమ్మిదో తరగతిలోనే ప్రేమ వివాహం చేసుకున్నది. ఆమె కుమార్తె తాజాగా ఇంటర్‌లోనే మైనర్.. ప్రేమ వివాహానికి సిద్ధపడింది. ఆ తల్లి బిడ్డను ఏమని నిలదీయగలదు. పిల్లలు కూడా తల్లిదండ్రులను మించిపోతున్నారు. మరికొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను మనిషిగా తీర్చిదిద్దడం లేదు. ఇంగితం, సంస్కృతి, సంప్రదాయాలు, ఇతరుల పట్ల ఎలా మెలగాలో కనీసం నేర్ప డం లేదు. కనీసం ఆటలు ఆడించడం లేదు. సెల్‌లో పిల్లగాడు వీడియో గేమ్స్ ఆడుతుంటే అన్నం పెడుతున్న పరిస్థితి. వాస్తవానికి ఇల్లే విద్యాలయం.

ఇంటి వాతావరణం సద్భావన, సదాచారం నేర్పాలి. కానీ, నాలుగేండ్లు నిండకముందే ర్యాంకుల రేసులోకి తోసేస్తున్నారు. దూకుడు స్వభావం, ఉరకలెత్తే ఉత్సా హం ఉండే టీనేజీ పిల్లలను తల్లిదండ్రులెవరూ తమ దగ్గర పెట్టుకొని మంచి, చెడులు నేర్పడం లేదు. వారిని చదువు కార్ఖానాలో తోసేస్తున్నారు. డబ్బులు వెదజల్లుతున్నారు. కార్పొరేట్ విద్యనందిస్తున్నామని గొప్పలు పోతున్నారు. అందరు తల్లిదండ్రులు ఇలాగే ఉన్నారని కాదు, అధిక శాతం ఇదే బాపతి. విద్యాలయాల్లో టీచర్లు కూడా పిల్లలను మనుషులుగా తీర్చిదిద్దడం లేదు. ర్యాంకుల కోసం రన్న్ అంటూ ఉరకలెత్తిస్తున్నారు. అజ్ఞానపు చీకటిని పారదోలి విజ్ఞాన వెలుగు పంచే గురువులు నేడు కనిపించడం లేదు. సమాజమైనా చెడును ఇది చెడు.. ఇది మంచి అని నేర్పుతుందా అంటే అదీ లేదు. ఎవరి గోలా వారిదే..

టీనేజ్ పిల్లలకు సెల్‌ఫోన్లే సర్వస్వమయ్యాయి. ఏ వస్తువైనా మంచికి ఉపయోగిస్తే మేలు చేస్తుంది. కానీ చెడుకు వాడితే.. దాని ఫలితంగా తీవ్రస్థాయిలో ఉంటుంది. ఒంటరిగా ఉండే టీనేజ్ పిల్లల్లో సెల్‌ఫోన్ చెడు వ్యసనాలను నూరిపోస్తున్నది. హాస్టల్ గోడలు దూకి వెళ్లి ఎంజాయ్ చేయాలని మనస్సు ప్రేరేపిస్తున్నది. ఆ దూకుడు స్వభావాన్ని అడ్డుకొనేది ఆ ప్రహరీ లా? రాత్రి పన్నెండుగొట్టంగా బర్త్‌డే పార్టీలు చేసుకోవాలని ఉసిగొల్పుతుంది. ఆపేదెవరు? అడ్డుకొనేదెవరు? స్నేహితుల గుంపుతో కలిసి పార్టీ లు. మద్యం మత్తులో విక్షణ కోల్పోయి ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. పబ్ జీ వంటి వీడియోగేమ్‌లు పిల్లల్లో నేర ప్రవృత్తిని ప్రేరేపిస్తాయి. మనిషిలోని సున్నితత్వాన్ని చంపేస్తాయి. అప్పుడు మనిషిలోని మంచి చనిపోయి రాక్షసుడు పుట్టుకొస్తాడు.

దిశ ఘటన నేపథ్యంలో కొందరు అమ్మాయిలు కరాటే నేర్చుకోవాలి. చెల్లికి ఫోన్‌చేసే బదులు 100 డయల్‌చేయవలసిందని ఒకరైతే, మహిళల రక్షణకు యాప్ రూపొందిస్తున్నాయి. బేఫికర్ అంటారు మరొకరు. ఇవన్నీ రోగమొచ్చిన తర్వాత చేయాల్సిన చికిత్సలు. చికిత్స కంటే ముందు రోగం రాకుండా నివారించడం ముఖ్యం. ఇంట్లో, బయట ఎలా ఉండాలో పిల్లలకు నేర్పకుండా పై మెరుగులు దిద్దితే ఫలితం ఉండదు. కలుపు మొక్కల కొసలను కత్తిరిస్తే వచ్చే ప్రయోజనం కన్నా కూకటివేళ్లతో పెకిలిస్తే దాని ఫలి తం రెట్టింపుగా ఉంటుంది. మూడు, నాలుగు దశాబ్దాల కిందట పుట్టినవారిలో ఇలాంటి నేరప్రవృత్తి తక్కువగా కనిస్తున్నది. వారంతా తల్లిదండ్రుల చెంతనే పెరుగడంతో పెద్దలంటే భయం, భక్తి ఎంతోకొంత కనిపిస్తున్నాయి. పుస్తకాలు చదివే, నీతి కథ లు వినే అలవాటు వారిలో కొంత వినయం, విజ్ఞానం నేర్పాయి. రాత్రి ఎనిమిదైతే ఇంట్లో నుంచి కాలు బయటపెట్టేవారు కాదు. తప్పనిసరై తే తప్ప.

అదికూడా తల్లిదండ్రుల తోడుగా. కానీ నేడు ఆ పరిస్థితి ఉన్నదా! అర్ధరాత్రి వేళ చెడు తిరుగుళ్లు. కొన్నివర్గాలవారు నిశాచరులయ్యారు. ఉదయమంతా పడుకొని రాత్రి నిద్రలేస్తారు.పబ్బులో చిందులు. ఇటీవల మీడియాలో నిత్యం కనిపిస్తున్న ప్రధాన నేరవార్తలకు టీనేజర్లే ప్రధాన కారణమవుతున్నారు. ప్రధానంగా యువకులు అదుపుతప్పి తెగిన గాలిపటాల్లా ఎటుపడితే అటుపోతున్నారు. మొక్కై వంగనిది మానై వంగు నా.. అంటారు. చిన్నతనం నుంచి పిల్లలకు విచ్చలవిడితనం ఇచ్చి పెద్దయ్యాక వీడు రాక్షసుడిలా మారాడేంటి! అంటే ఫాయిదా ఉండదు. తల్లిదండ్రులు, గురువులు ఆదర్శంగా ఉంటూ పిల్లలకు నీతిని బోధిస్తే వారు ఆచరిస్తారు. కానీ, నేటి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎలా ఉంటున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. టీచర్లు విద్యార్థుల పట్ల నిజమైన గురువుల్లా వ్యవహరిస్తున్నారా లేదా అనేది మననం చేసుకోవాలి. ఎదురుగా ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రశ్నించని జనం (సమాజం), మీడియా ఆ తర్వాత ఎన్ని వ్యాఖ్యానాలు, ఎన్ని వార్తలు రాసినా ఉపయోగం శూన్యం. ప్రతివ్యక్తి సద్భావన, సదాచారంతో మెలిగితేనే సమాజం వర్ధిల్లుతుంది. సత్భావన, సత్ప్రవర్తన లేని వ్యక్తులు న్న సమాజంలో అడుగొక్క పోలీసును పెట్టినా నేరాలను అరికట్టలేం!

548
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles