బాలల హక్కులను పరిరక్షిద్దాం


Wed,November 20, 2019 12:42 AM

దేశ భవిష్యత్తు బలంగా తయారుకావడం బాలల నైపుణ్యాభివృద్ధిపైన ఆధారపడి ఉంటుంది. బాలల మానసిక ఆరోగ్యం కాపాడాలె. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలె. ఒత్తిడి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. జీవన నైపుణ్యాలపై అవగాహన పెంచాలె. తద్వారా బాల్యదశ నుంచే జీవిత విలువను గుర్తింప చేయవచ్చు. మానసిక వికాసం, విద్యావికాసం, విలువలను పెంపొందించే దిశలో కృషి చేయాలి.

Dr-Atla-Srinivas-Reddy
ముద్దులొలికే చిన్నారి. అప్పటివరకు ఆనందంగా ఆడుకొని అలసిన చిన్నారి, కొద్దిసేపటికే అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రలోకి వెళ్లింది. కామంతో కళ్లు మూసుకుపోయిన రాక్ష స ప్రబుద్ధుడు ఆ పసికూనపై కన్నేశాడు. తల్లిపొత్తిళ్ల నుంచి వేరుచేసి మరీ చిదిమేశాడు. ఆ తల్లికి శాశ్వతంగా కడుపుకోత మిగిల్చాడు. సభ్య సమాజంలో తలదించుకునే ఘటనతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఇంత దారు ణం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. చిన్నారులపై లైంగిక దాడుల సంఘటనలు, పిల్లల శరీర భాగాలతో వికృతచేష్టలతో సమాజంలోని చీడ పురుగుల సంఘటనలు కోకొల్లలుగా పెరిగిపోతున్నాయి. సమాజం ఎటు వెళ్తున్నదో అర్థం కాని పరిస్థితులలో మనం ఉన్నాం. బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత ఎవరిది?

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం (యూనివర్సల్ చిల్డ్రన్స్ డే) నవంబర్ 20వ తేదీన జరుపుకుంటారు. నేటి బాలలే రేపటి నవ సమాజ నిర్మాతలు అనే ఆలోచనతో ఐక్యరాజ్యసమితి 1959 లో బాలల హక్కుల ప్రకటనను నవంబర్ 20వ తేదీన ఆమోదించింది. బాలల హక్కులు, మనుగడ, గుర్తింపు, ఆహారం, పోషకాహారం, ఆరో గ్యం, అభివృద్ధి, విద్య, వినోదం, కుటుంబం, సుపరిచితమైన పర్యావర ణం, బాలల పట్ల నిర్లక్ష్యం, బాలల రక్షణ, బాలల అక్రమ రవాణా, లైంగి క దాడులు మొదలైనవి దృష్టిలో ఉంచుకుని బాలల హక్కుల ప్రకటన చేయడం జరిగింది. ఐక్యరాజ్యసమితి 1989లో బాలల హక్కులపై చట్టబద్ధమైన ఒక అంతర్జాతీయ ఒప్పందం తీసుకువచ్చింది. ఇందులో బాలలకు పౌర, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, రాజకీయహక్కుల వంటి మానవహక్కులను అన్నింటిని చేర్చారు. వీటి అమలును కమిటీ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ పర్యవేక్షిస్తుంది. నాలుగు అంశాలలో వీటిని వివరించ డం జరిగింది.

1. జీవించే హక్కు: పిల్లలకు ఉండే జీవించే హక్కు కిందికి కనీస అవసరాలైన పోషణ, తల దాచుకోవడానికి గూడు, కనీస జీవనస్థాయి, వైద్య సేవ ల అందుబాటు 2. అభివృద్ధి హక్కు: పిల్లలు విద్య, ఆటలు, విరామం, సాంస్కృతిక కార్యక్రమాలు, సమాచారం తెలుసుకునే హక్కు, స్వేచ్ఛగా ఆలోచించే హక్కు, అభీష్టానికి అనుగుణంగా నడుచుకునే హక్కు 3. రక్ష ణ హక్కు: పిల్లలను అన్నిరకాల దుర్వినియోగాలు, నిర్లక్ష్యం, దోపిడీల నుంచి రక్షణ కల్పిస్తుంది. శరణార్థులుగా వచ్చిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ, నేర విచారణ వ్యవస్థలో పిల్లలకు రక్షణ, ఉద్యోగాల్లో భద్రత, దోపిడీ, వేధింపులకు గురైన బాలలకు రక్షణ, పునరావాస కల్పన చేయాలి. 4. పాల్గొనే హక్కు: పిల్లలు తమ సొంత జీవితాలను ప్రభావితంచేసే అంశాలపై భావాలను, ఉద్దేశాలను వ్యక్తీకరించే స్వేచ్ఛను, సంఘాలలో చేరడానికి, శాంతియుతంగా సమావేశం కావడం హక్కులుగా కల్పించబడినాయి.

ప్రభుత్వా లు పిల్లల గోడు పట్టించుకోనపుడు ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడిక (యూఎన్‌సీఆర్‌సీ)పిల్లలకు సహాయంగా నిలుస్తుంది.బాలల హక్కుల కన్వెన్సన్ అంతర్జాతీయ మానవహక్కుల శాసనంలో ఒక మైలురాయిని దాటింది. ఈ కన్వెన్సన్ ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల పరిరక్షణ, పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం విస్తృతమైన చర్యలను చేపడుతుంది. భారత ప్రభుత్వం బాలలను కాపాడటం, బాలల ఎదుగుదలకు ప్రోత్సహించడం, పిల్లల హక్కులు రక్షించడానికి 2007లో మార్చి నెలలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వంటి రాజ్యాంగసంస్థను ఏర్పాటు చేసింది. బాలల హక్కుల సంఘాలు, ప్రభుత్వ విభాగాలు, డ్వాక్రా గ్రూపులు, యువజన సంఘాలు, స్వచ్ఛందసంస్థలు అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగిస్తాయి.

బాలల హక్కుల ప్రకారం పిల్లలకు సంరక్షణ, చట్టపరమైన రక్షణ అవస రం. పిల్లలను వ్యక్తులుగా గుర్తించాలి. వారిని అర్థం చేసుకోవడానికి, వారి అవసరాలను అంచనా వేయాలె. మానవ హక్కులన్నీ పిల్లలకు కూడా వర్తింపచేయాలె. పిల్లలు సమాజంలో ప్రత్యేక గౌరవం పొందడానికి, వారి భద్రతను కాపాడానికి, బాలల హక్కుల చట్టాల పట్ల చైతన్యం కలిగించా లె. పిల్లలలో సృజనాత్మకతను వెలికి తీయడం, జీవితం పట్ల భరోసాను కల్పించడం, సామాజికంగా ఎదుగుదలకు తోడ్పడటం, బాలల హక్కుల రక్షణ అమలుతీరును సమీక్షించుకోవడం, పిల్లలకు 18 సంవత్సరాలు నిండేంతవరకు తల్లిదండ్రుల బాధ్యతపై చైతన్యం కలిగించడం, లైంగిక దాడులు, పిల్లల అక్రమ రవాణకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యతను గుర్తించేట్లుగా చైతన్యం కలిగించడం, బాలలపై హింసాకాండను తగ్గించడం వంటి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని బాలల హక్కుల దినోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల పరిరక్షణలో కొంతమేరకు పురోగతి సాధించారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం పిల్లల హక్కులను గుర్తించడంలో కొంతమేరకు వెనుకబడి ఉన్నది. పోక్సో చట్టం, నిర్భయ చట్టం, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం, బాల కార్మిక నిర్మూలన చట్టం మొద లైన చట్టాలు ఉన్నాయి. అయినా వాటి అమలు పూర్తిస్థాయిలో విజయవంతంగా జరుగడం లేదు. కన్వెన్షన్ నియమాలు, నిబంధనలను అమలుచేయడానికి, పిల్లల కోసం తగిన ప్రపంచాన్ని సృష్టించేందుకు దోహదం చేసేందుకు అన్ని స్థాయిల్లోనూ పిల్లల సంక్షేమ కోసం ప్రయత్నాలను తీవ్రతరం చేయాలి. శారీరక శిక్షలు పిల్లల మనస్సులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కసి, భయాందోళనలకు దారితీస్తాయి. శారీరక శిక్షలనేవి క్రమశిక్షణనేర్పడానికి వాడే మార్గం కానే కాదు.

దేశ భవిష్యత్తు బలంగా తయారుకావడం బాలల నైపుణ్యాభివృద్ధిపైన ఆధారపడి ఉంటుంది. బాలల మానసిక ఆరోగ్యం కాపాడాలె. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలె. ఒత్తిడి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. జీవన నైపుణ్యాలపై అవగాహన పెంచాలె. తద్వారా బాల్యదశ నుంచే జీవిత విలువను గుర్తింపచేయవచ్చు. మానసిక వికాసం, విద్యావికాసం, విలువలను పెంపొందించే దిశలో కృషి చేయాలి. బాలల హక్కు ల పరిరక్షణకు, బాలల మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా కృషి చేయాలె.
(వ్యాసకర్త: ఉపాధ్యాయుడు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సెలర్ )
(నేడు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం)

454
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles