బ్రహ్మపుత్రపై చైనా ప్రాజెక్టులు


Tue,November 5, 2019 01:42 AM

నదీజలాలను అతిగా వినియోగించడం, నది పర్యావరణ వ్యవస్థను దెబ్బతీయడం భారత్‌, బంగ్లాదేశ్‌లలోని రైతులు, మత్స్యకారుల జీవనోపాధికి నష్టం కలిగించడం మొదలైన అంశాలను చైనాతో చర్చించవలసిన అవసరం ఉన్నది. చైనా జల ప్రవాహాన్ని నియంత్రించడం వల్ల భారత్‌కు నష్టం వాటిల్లవచ్చు. భారత్‌ ఇప్పటికైనా ఈ అంశాలను చైనాతో లేవనెత్తాలె. బ్రహ్మపుత్ర నది ఎగువన నిర్మాణాలను పర్యవేక్షించే హక్కు మాకు ఉన్నదని స్పష్టం చేయాలి. ఆసియాలోని ఈ నదీ వ్యవస్థలపై ఆధారపడి ఉన్న 130 కోట్ల మంది ప్రజల జీవనోపాధి గురించిన విషయం ఇది.

గత ఏడు శతాబ్దాలుగా చైనా 87 వేల డ్యామ్‌లను నిర్మించింది. వీటిపై 352.26 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నది. బ్రెజి ల్‌, అమెరికా, కెనడా దేశాలు ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్‌ కన్నా ఇది ఎక్కువ. ఈ డ్యామ్‌ల నిర్మాణం వల్ల 2 కోట్ల 30 లక్షల మంది నిర్వాసితులయ్యారు. ఆసియాలోని పలుదేశాలకు నీటిని అందించే పరిశుద్ధమైన సుసంపన్నమైన జల వనరులకు నిలయం టిబెట్‌ పీఠభూమి. తమ ప్రధాన భూ భాగంలో పలు నదులపై ఆనకట్టను నిర్మించిన చైనా ఇప్పుడు టిబెట్‌లోని అంతర్జాతీయ నదులపై కన్నువేసింది. ఆసియాలోని పది దేశాల్లో ప్రవహించే పది అతిపెద్ద నదీ వ్యవస్థలకు పుట్టినిల్లయిన టిబెట్‌ను ఆసియా జల గోపురంగా అభివర్ణిస్తారు. చైనా, భారత్‌, వియెత్నాం, కాంబోడియా, లావోస్‌, థాయిలాండ్‌, బర్మా, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటా న్‌, పాకిస్థాన్‌ దేశాల్లో ఇక్కడ పుట్టిన నదులు ప్రవహిస్తున్నాయి. టిబెట్‌ను తన నియంత్రణలో పెట్టుకున్న చైనా ఈ నదులపై కూడా ఆధిపత్యం సం పాదించింది. ఇక్కడి నదీ జల వినియోగం ఇంకా పూర్తిగా జరుగలేదు. ఈ నదులపై జల విద్యుత్తు అవకాశాల్లో 0.6 శాతమే వినియోగమవుతున్నది. ఇప్పుడు చైనా తన ఇంధన అవసరాలను తీర్చుకోవడం కోసం పెద్ద ఎత్తున టిబెట్‌లోని నదులపై నిర్మాణాలను తలపెట్టింది. చైనా కంపెనీలు దాదాపు 28 ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయి. భౌగోళికంగా చూస్తే టిబెట్‌ పీఠభూమి భూకంపాలకు గురవుతుంటుంది. అయినా బ్రహ్మపుత్ర, యాంగ్జి, యెల్లో, సింధూ, మెకాంగ్‌, శాల్విన్‌ నదులపై డ్యామ్‌లను నిర్మించతలపెట్టింది. టిబెట్‌లో బ్రహ్మపుత్రను యార్లంగ్‌ ట్సాంగ్‌పో అంటారు. ఇది టిబెట్‌ భారత్‌, బంగ్లాదేశ్‌లలో 1800 మైళ్లు పశ్చిమం నుంచి తూర్పునకు ప్రవహిస్తుంది. కైలాస పర్వతం దగ్గరి చెమాయుంగ్‌డంగ్‌ హిమనదులలో ఇది జనించి ప్రవహిస్తుంది. ఇప్పటికే దీనిపై చైనా జంగ్‌మూ జలవిద్యుత్‌ కేంద్రం మొదలుకొని అనేక ప్రాజెక్టులను నిర్మించింది.

చైనా పన్నెండవ (2011- 15), పదమూడవ (2016- 20) పంచ వర్ష ప్రణాళికలలోని ఇంధన పథకాలను పరిశీలిస్తే టిబెట్‌ పీఠభూమిపై జలవిద్యుత్‌ ప్రాజెక్టులను ఎంత దృఢ నిశ్చయంతో చేపడుతున్నదో తెలుస్తుంది. 2020 నాటికి జల విద్యుత్‌ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుకోవాలని చైనా భావిస్తున్నది. అందువల్ల అంతర్జాతీయ నదులను కూడా ఉపయోగించుకుంటున్నది. పన్నెండవ ప్రణాళికలో భాగంగా 2013 జనవరి లో మూడు డ్యామ్‌ల నిర్మాణాన్ని ఆమోదించింది. దీంతో భారత్‌లో కలవరం తలెత్తింది. భారత్‌ ఆందోళనను తగ్గించడానికి చైనా వివరణ ఇచ్చిం ది. ప్రాజెక్టులను హేతుబద్ధంగా, శాస్త్రీయంగా చేపడుతామని హామీ ఇచ్చిం ది. నీళ్ళను విద్యుత్‌ వినియోగానికి ఉపయోగించుకొని మళ్ళా నదిలోకి వదిలివేయడమేనని, అందువల్ల నీటి లభ్యతలో తేడా ఉండదని వెల్లడించింది. కానీ జల విద్యుత్‌ కోసం పెద్ద ఎత్తున నీటిని నిలువ చేస్తూ వదల వలసి వస్తుంది. దీనివల్ల నీటి ప్రవాహ హెచ్చుతగ్గులతో నదీ పర్యావరణం దెబ్బ తింటుంది. భారీ ప్రాజెక్టుల వల్ల భూకంపాల ప్రమాదం కూడా తీవ్రంగా ఉంటుంది, పర్యావరణం దెబ్బతింటుంది. ఈ నదీ వ్యవస్థలు దెబ్బతింటే కోట్లాదిమంది జీవితాలు దెబ్బతింటాయి. చైనా తన ఆర్థికాభివృద్ధి కోసం టిబెట్‌ ఆత్మ వంటి నదీ వ్యవస్థను దెబ్బతీస్తున్నది.

బ్రహ్మపుత్ర మధ్య ప్రాంతంలో డాగు, జీయెజు, జియాచా అనే మూడు జల విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చైనా మొదలుపెట్టింది. 660 మెగావాట్ల డాగు డ్యామ్‌ను, 560 మెగావాట్ల జీయెజు డ్యామ్‌ను జంగ్‌ ము ఎగువన, జియాచా డ్యామ్‌ను జంగ్‌ము దిగువన కొన్ని కిలోమీటర్ల ఎడంతో నిర్మించింది. జంగ్‌ము జల విద్యుత్‌ కేంద్రంతో చైనా తన బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. బ్రహ్మపుత్రనది, ఉపనదుల మీద కలి పి మొత్తం పదకొండు జల విద్యుత్‌కేంద్రాలు నిర్మించతలపెట్టింది. హువానెంగ్‌, హువాడియన్‌, గువోడియన్‌, డాటాంగ్‌-అనే నాలుగు ప్రధాన విద్యుత్‌ ఉత్పత్తి సముదాయాలను చైనా ఇప్పటికే చేపట్టింది. హువానెంగ్‌ టిబెట్‌లో కెల్లా అతి పెద్ద జల విద్యుత్‌ కేంద్రం. చైనా ప్రభుత్వరంగ సంస్థ హువానెంగ్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థయైన హువానెంగ్‌ టిబెట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ‘టిబెట్‌ స్వయం ప్రతిపత్తి ప్రాంతం’తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సంస్థకు టిబెట్‌ ప్రభుత్వానికి కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం- 2020 నాటికి టిబెట్‌లో పది వేల మెగావాట్స్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. మొత్తం దేశవ్యాప్త విద్యుత్‌ ఉత్పత్తిలో టిబె ట్‌ వాటా 29 శాతం ఉంటుంది. హువానెంగ్‌ గ్రూప్‌ జీయెజు, జియాచ జల విద్యుత్‌ కేంద్రాలను నిర్మిస్తుంది. డాగు విద్యుత్‌ కేంద్రాన్ని హువాడియన్‌ గ్రూప్‌ నిర్మిస్తుంది. బాయు జల విద్యుత్‌ కేంద్రం కోసం సర్వే గత ఏడాది నవంబర్‌లో జరిగింది. 800 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రమిది. బ్రహ్మపుత్ర నదిపై వరదలు ఇతర సమస్యలు ఏవి వచ్చినా భారత్‌ చైనా ప్రభుత్వానికి ఆందోళనను వెలిబుచ్చుతున్నది. రెండుదేశాల మధ్య అవగాహనా ఒప్పందాలు కుదురుతున్నా యి. లేదా నిపుణుల స్థాయి వ్యవస్థలు ఏర్పాటవుతున్నాయి. అయితే వీటి అమలుపై ఎటువంటి నిర్బంధం లేదు. ఈ ఒప్పందాలను అమలుచేసే యంత్రాంగాలు ఉండవు.
varma
బ్రహ్మపుత్రపై తలపెట్టిన ఈ డ్యామ్‌ల నిర్మాణానికి సంబంధించి చైనా ఇప్పటివరకు భారత్‌కు ఎలాంటి సమాచారం అందించలేదు. ఈ నిర్మాణాల విషయంలో చైనా పారదర్శకతను పాటించడం లేదు. ఈ నిర్మాణాల వల్ల కోట్లాది మంది ప్రజల జీవనసరళిపై ప్రభావం పడుతుంది. హిమాలయ ప్రాంతంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పర్యావరణానికి కూడా ఈ నిర్మాణాలు ప్రమాదం కలిగిస్తాయి. నదీజలాలను అతిగా వినియోగించడం, నది పర్యావరణ వ్యవస్థను దెబ్బతీయడం భారత్‌, బంగ్లాదేశ్‌లలోని రైతులు, మత్స్యకారుల జీవనోపాధికి నష్టం కలిగించడం మొదలైన అంశాలను చైనాతో చర్చించవలసిన అవసరం ఉన్నది. చైనా జల ప్రవాహాన్ని నియంత్రించడం వల్ల భారత్‌కు నష్టం వాటిల్లవచ్చు. భారత్‌ ఇప్పటికైనా ఈ అంశాలను చైనాతో లేవనెత్తాలె. బ్రహ్మపుత్ర నది ఎగువన నిర్మాణాలను పర్యవేక్షించే హక్కు మాకు ఉన్నదని స్పష్టం చేయాలి. ఆసియాలోని ఈ నదీ వ్యవస్థలపై ఆధారపడి ఉన్న 130 కోట్ల మంది ప్రజల జీవనోపాధి గురించిన విషయం ఇది. టిబెట్‌లోని నదులను జల విద్యుత్తు ఇచ్చేవిగా మాత్రమే చూడకూడదు. అనేక దేశాల పర్యావరణంతో, ప్రజల సంక్షేమంతో ముడిపడిన అంశం ఇది.
(వ్యాసకర్త: డిబెట్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధకురాలు)
‘ది డిప్లొమాట్‌ సౌజన్యంతో...

343
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles