జీవనరీతుల్ని లీనం చేసుకున్న పాట


Mon,November 4, 2019 12:50 AM

వెంకన్ననే బైరాగి, ఒక సంచారి, ఒక తత్వవేత్త. పాటలు ఊరకరావు. అనేక తత్వాలు కలిసి, అనేక దేశాల జీవన రీతుల్ని లీనం చేసుకొని, తనకేమీ పట్టనట్టు జనప్రవాహాల మీద పారబోసుకుంటూ వెడతాడు. అతను సమస్త దేహంతోనూ, దేహాత్మతోనూ బతుకును పట్టుకుని పాటల్ని సీతాకోక చిలుకల్లా అంత టా ఎగరేసుకుంటూ పోతాడు. అతనికొక కచ్చితమైన తాత్వికత వుంది. జీవనదర్శనముంది. అతనికి మార్గనిర్దేశం చేసే ఒక వామపక్ష భావజాల తాత్వికత వుంది.

GoretiVenkanna
ప్రపంచంలో ఉన్న గొప్ప ప్రజా వాగ్గేయకారులు స్ఫురణలో కొచ్చినప్పుడు గోరటి వెంకన్న గుర్తుకొస్తాడు. నిన్న మొన్నటి దాకా ప్రపంచ సాహిత్యంలో పాటకి మొదటిస్థానం యివ్వటానికి మేధావులు, విమర్శకులు వెనుకాడారు. కానీ అమెరికన్ ప్రజావాగ్గేయకారుడు బాబ్ డిలాన్‌కి నోబెల్ అవార్డు వచ్చాక ఆ రేఖ చెరిగిపోయింది. అన్ని దేశాలు తమవైన వాగ్గేయకారుల ను సృష్టించుకున్నాయి. ప్రజా జీవన లోతుల్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని, వెతల్ని, హింసల్ని, పీడనల్ని ఈ వాగ్గేయకారులు అద్భుతంగా పట్టుకున్నారు. వాటిని గానం చేసి స్థిరస్థాయిని కల్పించా రు. వివక్షల్ని, అన్యాయాల్ని, దోపిడీలను బెరుకు లేకుండా రాజ్యానికి భయపడకుండా గొంతెత్తి చాటారు. తమ తమ దుఃఖపులోతుల్నుండి ఒక విశ్వగీతాన్ని, ఒక విశ్వగానాన్ని సృజించా రు. ఎరిక్ క్లాప్‌టన్‌ను విన్నా, ట్రేసీ చాప్‌మన్‌ను విన్నా సర్వమానవుల ఉనికికి సంబంధించిన సారమేదో, వేదనేదో ప్రతిధ్వనిస్తుంది.

వేల ఏండ్ల దేశ సంచారుల, బైరాగుల, భక్తికవుల సారమంతా వారసత్వమంతా వెంకన్న పుణికిపుచ్చుకున్నాడు. ఒక ఆశ సాం ప్రదాయపు జీవలక్షణాన్ని, తాజాదనాన్ని తత్కాలపు మేలిమి గుణాల్ని అందుకున్నాడు. పాటలను దృశ్యకావ్యంగా, అద్భుతం గా మలచినవాళ్లు జనజీవన వాగ్గేయకారులు. అన్ని సాహిత్య ప్రక్రియలు అందులో లీనమై, కరిగిపోయి పాటగా ప్రత్యక్షమవుతాయి. పాట నివేదిస్తుంది. నీచే మాట్లాడిస్తుంది. దేహాన్ని ఖడ్గం గా మారుస్తుంది. ఏకవ్యక్తి నిర్మితమైన పాట ఈ దశలో బహుముఖమై, జాజ్వల్యమానమై బహు సోయగాల్తో విరాజిల్లుతుంది అద్భుతమైన గేయరూపక కావ్యంగా. జీవితంలో ఏ అంశం, ఏ పార్శ్వం తప్పించుకోదు. బహు కోణాలతో వజ్రంలా కాంతి వెదజల్లుతుంది. ఈ పాటల్ని వాళ్లు వేదికమీద ప్రదర్శించేటప్పుడు బహు భంగిమల్తో, బహు అర్థాల్తో లోలోపలికి తొలుచుకుపోతాయి.

ఆ పాట నాదం జీవితాంతం అలా లోలోపల వెలుగుతూనే వుంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వెంకన్న ఈ ఉచ్ఛస్థాయినందుకున్నా డు. పాటకి ఒక శాశ్వతత్వాన్ని అద్భుతమైన అందాన్ని లాలిత్యా న్ని మృదుత్వాన్ని, ఒక గొప్ప మెలకువను ప్రసాదించాడు. జీవితమంత సునిశితంగా, లోతుగా, గంభీరంగా, ధైర్యంగా అన్ని రంగుల మేలిమి కలయికను వెంకన్న పాట అందుకున్నది. అన్ని ప్రక్రియల్లోనూ అతనంతే ఒక విరాట్ స్వరూపంతో సర్వాన్ని శ్వాసించి, తన ప్రాణంలో ముంచి బయటికి తీసి మనముందు ప్రదర్శిస్తాడు. బతుకుని సుదీర్ఘమైన పాటగామలుచుకుంటూ పోతున్నాడు. ఇంతకుముందు రెండు పాటల పుస్తకాలు రేలపూతలు,అలసెంద్రవంకలకు ముందుమాటలు రాశాను. అయినా ఈ కొత్త పాటల సంపుటికి నాలుగు మాటలు ముందుమాటలు గాదు. ఎంకన్న పాటల్ని విశ్లేషించటానికి పెన్నా శివరామకృష్ణలాంటివాళ్ళున్నారు. ఒక గొప్ప వాగ్గేయకారుడికి మనమిచ్చే బహుమానం ఏమిటంటే ఆయన్ని, ఆయన పాటల్ని కౌగిలించటం కౌగిలింతలో కరిగిపోవటం.

లీనం గాకుండా జీవితంలో, జన జీవితంలో పాటెట్టా రాస్తా డు. పాటనెట్టా ఊహిస్తాడు. వరుసలు వరుసలుగా ఎలా కడతా డు. కరిగిపోవటం, లీనం కావటం కవి ప్రథమ లక్షణం. తర్వాత ఆ ద్రవస్థితిని, పాటగా, కవితగా ఘనీభవింపజేస్తాడు. పాట మళ్లీ పాఠకుల, శ్రోతల, గాయకులలో కరిగి, కరిగి పాట ప్రవాహమై పోతుంది. గొప్ప చలనాన్ని, గొప్ప మార్దవాన్ని, గొప్ప ఐక్యతని అది సాధిస్తుంది.వెంకన్ననే బైరాగి, ఒక సంచారి, ఒక తత్వవేత్త. పాటలు ఊరకరావు. అనేక తత్వాలు కలిసి, అనేక దేశాల జీవన రీతుల్ని లీనం చేసుకొని, తనకేమీ పట్టనట్టు జనప్రవాహాల మీద పారబోసుకుంటూ వెడతాడు. అతను సమస్త దేహంతోనూ, దేహాత్మతోనూ బతుకును పట్టుకుని పాటల్ని సీతాకోక చిలుకల్లా అంత టా ఎగరేసుకుంటూ పోతాడు. అతనికొక కచ్చితమైన తాత్వికత వుంది. జీవనదర్శనముంది. అతనికి మార్గనిర్దేశం చేసే ఒక వామపక్ష భావజాల తాత్వికత వుంది. జీవితాన్ని దాని సమస్తం తో అన్ని కోణాల్తో, పార్శ్వాల్తో పట్టుకుంటానికి వెంకన్న ప్రయ త్నం చేసినట్టు మరే కవి చేయలేదనుకుంటా. ప్రకృతంత, జీవితమంత పాటని కట్టాలని అతని తపన. ఆకలా, దాహమా చిం తలా, వంతలా అని కృష్ణశాస్త్రి పాడుకున్నట్టు వెంకన్న మనమధ్య పాడుకుంటూ తిరుగుతున్నాడు. అతను చెప్పేదాకా జీవితమింత అందమైందా, అనుభూతి ప్రాయమైందా అని మనకు తెలియదు. అతని పాటల్లోంచి మనం కొత్తగా జన్మిస్తాం. కొత్తగా ప్రపంచాన్ని చూస్తాం.

వెంకన్న వామపక్ష పక్షపాతయినా బహు ప్రజాస్వామికవాది. ఒక డెమొక్రటైజింగ్ ప్రాసెస్ అతనిలో వుంది. మన రాజ్యం ఏర్పడినాక గూడా రాజ్యంమీద కవి విజిలెన్స్ అవసరం. దీర్ఘకాలిక యుద్ధమంటే మనమనుకున్న స్వర్గం ఏర్పడ్డాక గూడ ఒక dissent పాత్ర కవి పోషించవలసిందే. ఆ ప్రాసెస్ ఏదో కవి వెం కన్నలో, కవిత్వంలో స్పష్టంగా కన్పడుతుంది.ఏకునాదం మోత, రేలపూతలు, దగ్గరనుంచి ఇప్పుడొస్తు న్న వల్లంకితాళం దాకా సజీవ దృష్టాంతాలు. Life Sketch es జీవన దృశ్యపరిమళాలు, శారీరక శ్రమల లోతుల సొంపు సోయగాలు. ప్రతి అంశంలోనూ అందాన్ని, శోభని చూడగల సౌందర్యవా ది. సౌందర్యవాది తాత్వికుడయితే వెంకన్నలా వుంటాడు.
అందాల తనువెల్ల వంపుకున్న అడవి అలరించి తలపించె ఆకుపచ్చని కడలి.. షెల్లీ అనుకుంటా సముద్రాన్ని వాటర్ మెడో అన్నాడు. అలవోకగా అద్భుతమైన ఇమేజెస్ పడుతూ వుంటాయి. వెంకన్న సారం నిలుపుకున్న, వడకట్టిన సిద్ధుడుగా పరిణామం చెందుతూ వస్తున్నాడు. ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే issues మీద రాసినా, దాన్నొక తాత్విక స్థాయికి తీసుకెళ్లే నేర్పు, ఇతర విషయాలతో లింకు చేసి మాట్లాడే నేర్పు, దాన్నొక కవితగా మలిచే గాఢత, మగ్నత వెంకన్నలో పుష్కలంగా వుందని ఈ సంపుటి రుజువు చేస్తుంది. బతుకు గొప్పదనాన్ని మనముందు వారబోసుకుం టూ వెడుతున్న వెంకన్నకు అభినందనలు.
- కె.శివారెడ్డి
(రేపు గోరటి వెంకన్న రచనలు ఆవిష్కరణ సందర్భంగా
రచయిత రాసిన ముందుమాట సంక్షిప్తంగా..)

90
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles