మర మనుషులు


Sun,November 3, 2019 07:11 AM

మనుషులుగా అంతరించేవారే కాదు, మహోన్నత మానవులుగా వ్యవహరించేవారూ చాలామంది ఉన్నారు. చిరుగుపాతల బట్టలతో ఒక మహారణ్యాన్ని పెంచిన అమ్మల గురించి వింటున్నాం. జీవితాన్ని ధారపోసి కరువు కాటకాల పీఠభూమిలో జలసిరులు కురిపించిన సామాజిక శాస్త్రవేత్తలనూ చూస్తున్నాం. విలువైన, నాణ్యమైన, మానవీయమైన జీవిత పార్శాలను దర్శింపజేసే మహర్షులను ఎందరినో చూస్తు న్నాం. ఉన్మాదపు అంచుల్లోకి జారిపోతున్న తరానికి మహామానవత్వాన్ని పరిచయం చేయాలి. సాటి మనిషి భావోద్వేగాలను అర్థం చేసుకునేలా తెలియజెప్పాలి. సాయం చేయడంలో ఉన్న ఆనందం నేర్పా లి. ఇవ్వడంలో ఉన్న తృప్తిని ఆస్వాదించేలా చేయాలి.

Kattashekarreddy
ఒక బిడ్డ తల్లిని చంపుతున్నది. ఒక తల్లి బిడ్డను చంపుతున్నది. ఒక తనయుడు తండ్రిని, తండ్రి తనయుడిని బలి తీసుకుంటున్నారు. మనిషి మనిషిని చంపుతున్నాడు. మనిషిలో మానవత్వం ఆవిరైపోతున్నదా? మనిషి సమూహం నుంచి వేరుపడిపోతున్నాడా? మనిషి సమాజంతో సం బంధం లేకుండా జీవించడానికి బానిసవుతున్నాడా? అంతులేని దాహం. ఏదో తెలియని వెంపర్లాట. ఎందుకో తెలియని పరుగు. ఎంతకీ తీరని తృష్ణ. తీరాచూస్తే ఎండమావి. అది దాహం తీర్చదు. ఆర్తిని తీర్చదు. మనతో ఏడ్వదు. మనతో నవ్వదు. మనతో దానికి పనిలేదు. తప్పు మనదే. ఎండమావుల వెంట పరుగు ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు ఉంది. ఈ ఎండమావి ఒక డిజిటల్ ప్రపంచం. కాగితపు పువ్వు. టీవీలు, ఫోన్లు, సిమ్ లు, డేటా, డిజిటల్ సాధనా లు వరదలా ముంచెత్తుతున్నాయి.

ఇప్పుడంతా డేటా మయం. స్వేచ్ఛామయం. అది మనిషి పనులను తేలిక పర్చడం కోసం సృష్టించబడింది. ఉన్నచోటు నుంచి ప్రపంచాన్ని చూడవచ్చు. చూడటానికి పరిమితుల్లేవు. ఉచ్ఛనీచాలు లేవు. ఉచితానుచితాలు లేవు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వదిలేసి మనిషి ఈ అభౌతిక ప్రపంచంలోకి జారిపోతున్నాడు. డిజిటల్ ప్రపంచం మనిషికి మరింత శక్తినిస్తుందని అందరూ భావించారు. మనిషి శక్తిని పీల్చివేస్తున్నదని ఎవరూ అనుకోలేదు. అదొక ఊబిలా గా మారుతుందని ఎవరూ కనిపెట్టలేదు. అక్కడ అడుగేస్తే ఎక్కడ ఆగుతుందో తెలియదు. మనుషులు ప్రకృతితో, మనుషులతో, సమూహంతో జీవించడం అస్తమించిన రోజున ఈ ప్రపంచానికి ప్రళయం. ప్రకృతితో, మనుషులతో, సమూహంతో డిస్‌కనెక్టు అయినవాళ్లే ఉన్మాదులుగా మారుతున్నరు. వాళ్లకు ప్రాణాల విలు వ తెలియడం లేదు. మానవత్వపు స్పర్శ తెలియడం లేదు. మనుషుల విలువా తెలియడం లేదు. బాధ తెలియడం లేదు. భావోద్వేగాలుండటం లేదు.

కరడుగట్టిన హృదయం. డిజిటలీకృతమైన మెదడు. ఎవరిని ఎందుకు ఎంత దారుణంగా బలి తీసుకుంటన్నా మో యోచించరు. అమానుషత్వం పోతపోసిన బొమ్మలు వాళ్లు. ఒకడు మతోన్మాదంతో గడ్డకట్టుకపోతాడు. మరొకడు జాతి ఉన్మాదంతో సకల భావోద్వేగాలను స్తంభింపజేస్తాడు. ఇంకొకడు ప్రేమోన్మాదంతో భవబంధాలను ఘనీభవింపజేస్తాడు. మరొకడు ఆస్తులకోసమో, ఆధిపత్యం కోసమో శిలగా మారిపోతాడు. అందరి రక్తం ఒకటే అనిగానీ, అందరి దుఃఖం ఒకటే అని గానీ, అందరి భావోద్వేగాలు ఒకటే అని గానీ గుర్తించరు. గాలిలో కలిసిపోయే ప్రాణవాయువులు వేసే ఆఖరి కేకలు ఈ ఉన్మాదుల చెవికెక్కవు. మొన్నా మధ్య ఒక మిత్రుడు ఒక నాలుగు కోతుల బొమ్మ పంపా రు. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అన్న కోతులకు ఇప్పుడు ఫోను విడువని, ఎవరితో మాట్లాడని కోతి చేరిందన్నది ఆ బొమ్మ సారాంశం. మనిషి ఇప్పుడు మనుషులతో జీవించడం మాని యంత్రాలతో జీవిస్తున్నాడని చెప్పడం ఆ బొమ్మ సారాంశం. మద్యపానం కంటే సిగరెట్టు స్మోకింగ్ కంటే దారుణం గా ఈ యంత్రాల వ్యసనం పెరిగిపోతున్నది. మాట్లాడే మనిషిని, నవ్వే మనిషిని, ఏడ్చే మనిషిని, మన బాధలో బాధను చూసే మనిషిని వదిలేసి మనతో ఎటువంటి భావోద్వేగాలు పలుకని యంత్రాలతో మనిషి మనుగడ సాగిస్తున్నాడు.

మనుషులు మనుషులను ప్రేమించాలి. బిడ్డకు కష్టం కలుగకుం డా చూసేందుకు తల్లిపడే ఆరాటం చూడాలి. పిల్లలు తనలాగా పూటపూటకు వెతుక్కోకూడదని తండ్రి పడే తపన చూడాలి. పక్కవాడి కాలికి ముల్లు గుచ్చుకుంటే అయ్యో అని స్పందించే సున్నిత త్వం కాపాడుకోవాలి. ప్రకృతిని ప్రేమించాలి. చెట్లపై కోతి కొమ్మచ్చులాడాలి. పచ్చని మైదానాల వెంట పరుగులు తీయాలి. చెరువులు, వాగుల జల సవ్వడులు వింటూ మనసు ప్రకృతి సంగీతాన్ని ఆవాహన చేసుకోవాలి. సముద్రాన్ని చూసి మనుసును విశాలం చేసుకోవాలి. పొలాల మధ్య తిండిగింజల ఆవిర్భావాన్ని చూసి మనుగడ కోసం మనిషి చేసే యజ్ఞం అర్థం చేసుకోవాలి. బతుకడం ఎంత కష్టమో, బతుకు కోసం మనిషి ఎంతగా పోరాడాలో నలుగురిలో తిరిగి తెలుసుకోవాలి. పుస్తకాలు నెత్తిన పెట్టుకొని వాగులు వంకలు దాటి పొలాల గట్ల వెంట పరుగెత్తి పాఠాలు నేర్చుకున్నవా రు మనకు జీవితాన్ని ఇచ్చారని గుర్తుంచుకోవాలి. మనిషి జీవితా న్ని ఎంత కాచి వడపోస్తే ఇవ్వాళ ఈ బతుకు వచ్చిందన్నది ఈ తరాలకు తెలియజెప్పాలి. ఇంజిన్‌లో బొగ్గు జల్లుతూ వందల కిలోమీటర్లు బొగ్గు బస్సులో ప్రయాణం చేసి వచ్చిన తాత గురించి తెలియాలి.

బియ్యం మూట నెత్తిన పెట్టుకుని ముప్ఫై నలభై కిలోమీట ర్లు నడిచి పట్నం వచ్చి పిల్లలకు వండిపెట్టిన నాన్నల గురించి తెలియాలి. తాము కడుపు మాడ్చుకుని పిల్లల కడుపు నింపే శ్రమజీవులైన తల్లిదండ్రులను గురించి తెలియాలి. కరువుకాటకాలతో అలమటిస్తూ పొట్ట చేతబట్టుకుని వందల మైళ్లు కూలికి వెళ్లి నాలుగు గింజలు సంపాదించుకువచ్చి బిడ్డలకు పెట్టిన అమ్మతనాన్ని పరిచ యం చేయాలి. తమలాగా పిల్లలు కష్టపడవద్దని, వారు ఉన్నతంగా జీవించాలని రెడీమేడ్ జీవితాన్ని పిల్లలకందిస్తున్నారు. జీవితం కష్టసాధ్యమని, జీవితం సాధనలోనే రాటుదేలుతుందని, జీవితం ఎన్నో పతనోన్నతాల సారమని, జీవితం కష్టదుఃఖాలు, శ్రమసౌందర్యాల ఫలమని తెలియకుండా పిల్లలను పెంచుతున్నారు. పిల్లల కు ఏ లోటూ రాకుండా చూస్తున్నామనుకుంటున్నారు, కానీ వారికి అన్నీ ఇచ్చి తాము వారి జీవితాల నుంచి పక్కకు తప్పుకుంటున్నామని చాలామంది గుర్తించడం లేదు. అందుకే టీవీ రిమోట్‌ల కోసం కూడా హత్యలు జరుగుతున్నాయి. సంపాదన కోసం వెచ్చిం చే సమయం కంటే పిల్లలను సాదడం కోసం వెచ్చించే సమయం అమూల్యమైనదని తెలుసుకోవడం లేదు.

పిల్లలను పక్కన పడుకోబెట్టుకుని కథలు చెప్పే తాతలు అమ్మమ్మలు నానమ్మలు తెరమరుగవుతున్నారు. తరాల అంతరం పేరు తో పిల్లలను వారికి దూరంగా పెంచుతున్నారు. అమ్మ, అమ్మమ్మ చెప్పిన కథలు ఎన్ని ఉండేవని. జీవన పరిణామంలో నడిచొచ్చిన బాధలగాథలన్నీ కాచివడపోసి చెప్పేవారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం. ఎలా పెరిగాం. పెళ్లిల్లు ఎలా జరిగాయి. పశుపోషణ వ్యవసాయంగా ఎలా మారింది. అడవి నరికి పొలాలు ఎలా చేశారు. వాగులు వంకల ఒడ్డున జీవితం ఎలా వికసించింది. ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి వ్యాధులు జీవితాలను ఎలా ఛిన్నాభిన్నం చేసేవి... భారతం, భాగవతం, రామాయణం... తోలుబొమ్మలాటలు, బుర్రకథలు, బాగోతాలు.. ఇవన్నీ పల్లె నేర్పేది. ఇప్పుడు పట్నం జీవితం అయిపోయింది. పిల్లల జీవితాలకు అందించాల్సిన సౌరభాలు పల్లెలోనే ఆగిపోయాయి. వెనుదిరిగి చూసేసరికి పల్లెలు కూడా పట్నాలవుతున్నాయి.

రాత్రి పడుకునే వేళ మంచాలు వేసు కొని ముచ్చట్లు పెట్టుకుంటూ నిద్రలోకి జారుకునే సమూహాలను ఇప్పుడు టీవీ ఇళ్లలోకి బెడ్‌రూంలలోకి తోసేసింది. మనుషుల మధ్య కర్ఫ్యూ విధించింది. అక్కడ కూడా మానవ సంబంధాల నడుమ కృత్రిమత్వమే పాదుకుంటున్నది. టెక్నాలజీ వచ్చి సర్వం నాశనం చేసిందని చెప్పడం ఉద్దేశం కాదు. కానీ భస్మాసురుడి కోర్కె లు నెరవేర్చేటప్పుడు పరిమితులు విధించకపోతే ఆయన ఎన్ని పోకడలు పోయాడో పురాణం చెబుతుంది. కోర్కెలు తీర్చిన శివుడికే భస్మాసురుడి నుంచి ముప్పు తప్పలేదు. చివరికి శివుడు శ్రీమహావిష్ణువును ఆశ్రయించి జగన్మోహిని వేషం వేయించి, ఆ భస్మాసురుడిని అంతం చేయాల్సి వచ్చింది. టెక్నాలజీ అంతే. అతి సర్వ త్రా వర్జయేత్ అన్న సూక్తి టెక్నాలజీకీ వర్తిస్తుంది. ఈ విషవలయం లో పడిపోయేవాళ్లు, ఈ పాకురాళ్లపై జారిపడేవాళ్లు కొద్ది శాతమే ఉండవచ్చు. సిగరెట్లు తాగేవాళ్లూ కొద్ది శాతమే. మద్యం బానిసలూ కొద్దిమందే. వాటిని తయారుచేసి అమ్మడానికి అనుమతిస్తున్నది మనమే, అవి ప్రమాదకరమైనవని హెచ్చరికలు చేస్తున్నదీ మనమే.

సాంకేతిక విప్లవం జీవన ప్రమాణాల్లో గొప్ప మార్పు తెచ్చింది. చాలా చాలా సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచం చిన్నదైపోయింది. మంచిగా వాడుకుంటే అది గొప్ప జీవితాన్ని ఇస్తున్నది. టెక్నాలజీని మనం వాడుకున్నంతకాలం ఇబ్బంది లేదు. టెక్నాలజీ మనలను వాడుకోవడం మొదలైతేనే మనం ఆగమైపోతాం. ఈ తేడాను సమాజం ఈతరానికి నేర్పకపోతే ముందు ముం దు మరిన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ మధ్య ఓ మిత్రుడు చెప్పాడు. రెండు రోజులపాటు నీకు అందుబాటులో ఉండను అని. ఏం ఎందుకూ అంటే ఎక్కడో నగరానికి దూరంగా అడవి మధ్యకు వెళుతున్నాను. అక్కడ గత కొన్ని పుట్టిన రోజుల నుంచి రెండేసి చెట్లు నాటుతూ వచ్చాను. మా పిల్లల పుట్టిన రోజులకూ అదే పనిచేశాం. అదిప్పుడు ఒక వనమైంది. పండ్ల చెట్లు, వేప, రావి చెట్లు పెంచాను.

అక్కడికి ఫోన్లు తీసుకెళ్లడం లేదు. రెండు రోజులూ పిల్లలూ, సంసారం తప్ప మరో ధ్యాస పెట్టుకోదల్చుకోలేదు ఆయన సమాధానమిచ్చారు. మనుషులుగా అంతరించేవారే కాదు, మహోన్నత మానవులుగా వ్యవహరించేవారూ చాలామంది ఉన్నారు. చిరుగుపాతల బట్టలతో ఒక మహారణ్యాన్ని పెంచిన అమ్మల గురించి వింటున్నాం. జీవితాన్ని ధారపోసి కరువు కాటకాల పీఠభూమిలో జలసిరులు కురిపించిన సామాజిక శాస్త్రవేత్తలనూ చూస్తున్నాం. విలువైన, నాణ్యమైన, మానవీయమైన జీవిత పార్శాలను దర్శింపజేసే మహర్షులను ఎందరినో చూస్తు న్నాం. ఉన్మాదపు అంచుల్లోకి జారిపోతున్న తరానికి మహామానవత్వాన్ని పరిచయం చేయాలి. సాటి మనిషి భావోద్వేగాలను అర్థం చేసుకునేలా తెలియజెప్పాలి. సాయం చేయడంలో ఉన్న ఆనందం నేర్పా లి. ఇవ్వడంలో ఉన్న తృప్తిని ఆస్వాదించేలా చేయాలి. ఆ పని కుటుంబమే చేయాలి. తల్లిదండ్రులు, సమాజమే పిల్లలకు దిక్సూచిగా మారాలి.

1764
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles