ఫలించని పర్యటన


Sun,November 3, 2019 01:05 AM

మన దేశంలోని ప్రజలే అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే, ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు కూడా దేశ సమగ్రతను కాపాడటం కోసం సర్వవిధాల సహకరించటంతో పాటు అన్నిరకాలుగా అక్కరకొస్తారు. ప్రజల దగ్గర ప్రభుత్వాల దాపరిక ధోరణి అనవసరం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. అందుకనే ప్రజలను ప్రభుత్వాలు తోసిరాజంటే సహించటం కష్టం.

Ravulapati-Sitaramarao
కశ్మీర్ సమస్య మానుతున్న గాయాన్ని గోకి పుండుగా మార్చుకున్నట్లుగా మరింత జటిలం చేసుకుంటున్నామా అనిపిస్తున్న ది. మొదట్లో ఆర్టికల్ 370ని సవరణ చేసి, కశ్మీర్ రాష్ర్టాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి, శాశ్వత పరిష్కారం సాధిద్దామనుకున్నది కేంద్ర ప్రభుత్వం. ఇది ఒకవిధంగా అనుకూలమైన మార్పుగానే తోచింది. కర్ఫ్యూ విధించి, ముఖ్య నాయకులను బంధిం చి, మీడియాను, సోషల్‌మీడియాను నియంత్రించి ఒకవిధమైన శాంతిని నెలకొల్పే పనిలో మోదీ ప్రభుత్వం పని చేస్తున్నదని అందరూ భావించారు. ఆ సమయంలోనే ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ మరికొందరు నాయకులను కశ్మీర్‌లో కాలిడటానికి ఒప్పుకోలేదు. కొందరు కోర్టు తో సహా జోక్యం చేసుకొని వారిని కశ్మీర్ రాష్ర్టాన్ని సందర్శించవచ్చని సలహా ఇచ్చినా ప్రభుత్వం ఒప్పుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో 20 మందికిపైగా ఉన్న యురోపియన్ పార్లమెంట్ సభ్యులను ఆహ్వానం ద్వారా రప్పించటం వల్ల సాధారణ పరిస్థితిని కల్పించటానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదన్న భావన కూడా కలిగింది. అలాంటి కొన్ని గౌరవప్రదమైన గ్రూపులు కశ్మీర్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో సందర్శిస్తే ఉద్రి క్త పరిస్థితులు తొలిగిపోవటంతో పాటు జమ్ముకశ్మీర్ ప్రాంతా ల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడి, భూతలస్వర్గంగా భావించే ఆ ప్రాంతాన్ని పర్యాటకులు యథావిధిగా పర్యటించవచ్చని అందరూ అనుకున్నారు.

ఇప్పుడిప్పుడే ఈ యురోపియన్ పార్లమెంట్ సభ్యులు ఎవరనేది తెలుస్తున్నది. 23 మంది మాత్రమే వచ్చారు. నలుగురు రావడానికి ఇష్టపడలేదు. మన ప్రభు త్వం కూడా ఈ ఇరువై మూడు మంది వ్యక్తిగత హోదాలోనే వచ్చారని చెప్పింది. వారందరూ వివిధ పార్టీలకు చెందినవారు. ఫ్రాన్స్ నేషనల్ ర్యాలీ, ఏఎఫ్‌డీ జర్మనీ, యూకే, బ్రెగ్జిట్, ఇటలీకి చెందిన ఫార్జా ఇటాలియా, పోలండ్ దేశపు లాండ్ జస్టీస్ దేశాల పార్టీల వారు. వాళ్లంతా ముస్లిం భావజాలానికి వ్యతిరేకులు. ఇమ్మిగ్రేషన్‌ను వ్యతిరేకించే విధానాలు అనుసరించేవారు. నిజానికి ఈ దేశాల్లో వారి ఉనికి చాలా తక్కువ. చాలా తక్కువ ఓట్లు ఆ దేశాల్లో కలిగినవారు. అందులో ఒక రు బహిరంగంగానే తాను సాధారణ పౌరులను కలుసుకోవడానికి ప్రయత్నించానని, కానీ అధికారులు ఒప్పుకోలేదని చెప్పారు. క్రిస్ డేవిస్ అనే ఈ బ్రిటిష్ దేశస్తు డు ఈ పర్యటన పి.ఆర్. స్టంట్‌గా చెప్పడం మన దేశ విదేశాంగ విధానానికి ఇబ్బంది కలిగించే మాటే!

శ్రీనగర్‌లో సామాన్యులను కూడా కలువనివ్వలేదని వీరు చ్పెపడం వల్ల వారి పర్యటన మనకు అనుకూల వాతావారణాన్ని కలిగించకపోగా, చేటే చేసింది అని చెప్పకతప్పదు. ఒక ముఖ్యమైన విశేషం మన దేశానికి సానుకూలంగా ఉన్న ది వారు నిర్దందంగా కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమ ని చెప్పటం. అదేవిధంగా ఉగ్రవాదాన్ని అణిచివేయటంలో భారతదేశానికి తోడుగా ఉంటామని వారు చెప్పటం కూడా మన దేశ ప్రభుత్వానికి కలిసివచ్చే విషయం. అయితే అందు లో ఒక ఎంపీ మీ దేశ ఎంపీలను కశ్మీర్ సందర్శించటానికి ఎందుకు అనుమతించటం లేదని అడుగటం మాత్రం కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించే ధోరణిలోనే ఉన్నది. సాధారణ పరిస్థితులను కల్పించడానికి ఇలాంటి ప్రశ్నలు దోహదపడవేమో!

ఈ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించిన ప్రభుత్వం వారు చెబుతున్న మాటలు వినడం కూడా మంచిదేమో! ప్రభు త్వం ఈ ప్రతినిధులు మీడియాతో మాట్లాడటాన్ని ఒప్పుకుంది కానీ మన పార్లమెంట్ మెంబర్లు కానీ ఇతరులు గాని మీడియాతో రాజకీయ వ్యాఖ్యానా లు కశ్మీర్‌లో చేయటాన్ని అంగీకరించలే దు. ఫరూఖ్ అబ్దుల్లా సీనియర్ పార్లమెంటేరియన్. కశ్మీర్ రాష్ర్టానికి ఒకప్పటి ముఖ్యమంత్రి, ఒకప్పటి కేంద్ర క్యాబినె ట్ మంత్రి. అలాంటి వాడికే భావస్వేచ్ఛ కలిగించకపోవటం దురదృష్టకరం. చాలామంది జైళ్లలో మగ్గుతుండటం కూడా సమంజసం కాదు. యాభైవేల మందికి పైగా భద్రత కోసం కశ్మీర్ ప్రాంతంలో రక్షణాధికారులుగా పంపబడినా, సమాచార స్వేచ్ఛ గానీ విహార స్వేచ్ఛ గానీ కశ్మీర్‌లో లేకపోవడం ప్రజాస్వామ్య విలువలను కాపాడలేకపోవటమే!
ఏ విధంగా కశ్మీరు ప్రాంతంలో సాధారణ పరిస్థితులను తీసుకొని రావాలన్నదే ప్రాముఖ్యం కలిగిన అంశంగా కేం ద్రం భావించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడమే ముఖ్యం! అంతేగాని మనవాళ్లకు లేని స్వేచ్ఛ ఇతర దేశస్తులకు, డెలిగేషన్లకు కల్పించటం ఎంతవరకు సమర్థనీయం అన్నది కూడా ఆలోచించకతప్పదు.

మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక నిర్ణయాలను, రాజకీ య నిర్ణయాలను ప్రజలు బహుళ సంఖ్యలో సమర్థించటం వల్లనే మరొకసారి బీజేపీ ఆయన నాయకత్వంలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వ పగ్గాలు చేపట్టగలిగింది. ప్రజలు అన్నివేళలా అన్ని అంశాలను సమర్థించకపోవచ్చు. దానిని ప్రభుత్వం తప్పుగా భావించకూడడు. ఏ ప్రభుత్వమైనా ప్రజాభిప్రాయాన్ని మన్నించినప్పుడే వారి ప్రణాళికలు ప్రజలకు అర్థమై, ప్రజల సహకారాన్ని మరింతగా పొందడానికి అవకాశం లభిస్తుంది. ఈ చిన్న వెసులుబాటును కొన్ని ప్రభుత్వాలు అధికారం చేతుల్లో ఉండటం వల్లనో మరే కార ణం చేతనో ఉపయోగించకపోవటం ప్రజలకే కాదు వారికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది.

ప్రజాభిప్రాయం కూడా యురోపియన్ పార్లమెంట్ మెం బర్ల కశ్మీరు సందర్శనకు వ్యతిరేకంగా వస్తుండటం ప్రభు త్వం గమనంలోకి తీసుకోవాలి. వాళ్లు రావడం ఆల్ ఫైన్ సర్టిఫికెట్ ప్రభుత్వానికి ఇవ్వటానికా అనటం కొన్ని పత్రిక ల్లో వచ్చింది. వ్యాపారంలో నష్టాలకూ కర్ఫ్యూ లాంటి చర్య లు దోహదపడుతున్నాయని వ్యాపార బృందాలు ఆ యురోపియన్ పార్లమెంట్ మెంబర్స్‌తో అంటున్నప్పుడు స్థానిక అధికారులు అడ్డుతగిలి మరో విషయానికి సంభాషణను మరల్చే ప్రయత్నం చేశారని ఎకానిమిక్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో వెల్లడించింది. ఈ ప్రతినిధుల పర్యటనను ప్రభుత్వం అంతగా హైలెట్ చేయలేకపోయిందనే అనుకోవాలి.

మన దేశంలోని ప్రజలే అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే, ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు కూడా దేశ సమగ్రతను కాపాడటం కోసం సర్వవిధాల సహకరించటంతో పాటు అన్నిరకాలుగా అక్కరకొస్తారు. ప్రజల దగ్గర ప్రభుత్వాల దాపరిక ధోరణి అనవసరం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. అందుకనే ప్రజలను ప్రభుత్వాలు తోసిరాజంటే సహించటం కష్టం. ప్రజలు ప్రభుత్వాలను పటిష్ఠంగా నిలబెట్టగలరు. అవసరం అనుకుంటే పడేయగలరు కూడా!
(వ్యాసకర్త: మాజీ ఐపీఎస్ అధికారి)

303
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles