సమ్మెపై వాస్తవాలు, వక్రీకరణలు


Tue,October 15, 2019 12:28 AM

ఏదైనా ఒక సమస్య లేదా సంక్షోభం తలెత్తినప్పుడు ఆయా రాజకీయపార్టీలు, వ్యక్తులు, సంస్థలు రాగద్వేషాలకు అతీతంగా, వాస్తవాల ఆధారంగా ఆలోచించి ప్రతిస్పందించాలి. దాని ఆధారంగానే సమస్యకు చక్కని, శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ, దేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొన్నది. ప్రతిపక్షంలో ఉన్న వారు ప్రతీ విషయంలో ప్రభుత్వానిదే తప్పు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని సమర్థించే వారు సైతం వాస్తవాలను బేరీజు వేసుకోకుండా మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వం విధానమేమిటో కూడా తెలుసుకోకుండానే, సమస్యకు అసలు మూలమెక్కడో, దానికి అంతం ఎక్కడో తెలియకుండానే తీర్పులు ఇచ్చేస్తున్నారు. దీనివల్లనే సమస్య తీవ్రతపెరిగి, భావోద్వేగాలు కూడాఎక్కువవుతున్నాయి. విపరీత పరిణామాలకు ఈ అసంబద్ధ వైఖరే కారణమవుతున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు కొన్ని డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. కొందరు ఆర్టీసీని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. పేద ప్రజలకు తక్కువ చార్జీలతో, సురక్షితమైన ప్రయాణ సౌకర్యం అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించిన విషయం ఎవరూ కాదనలేని వాస్తవం. నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నది. మూడేండ్ల కిందటే (2016 జూన్ 17న) ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎన్నడూలేని విధంగా ఎం.డి. నుంచి డిపో మేనేజర్ల వరకు అందరు ఉద్యోగులను, అన్ని యూనియన్ల నాయకులను పిలిచి, హైదరాబాద్ మారియట్ హోటల్లో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.


ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను రాజకీయంగా వాడుకోవాలని కొన్ని రాజకీయపార్టీలు కుయుక్తులు పన్నుతున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ విషయంలో ఇలా డిమాండ్ చేస్తున్న రాజకీయపక్షాలవారు, వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో విలీనం చేశారా? అనే విషయం ప్రజలు ఆలోచించాలి.


ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకున్నది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 3,303.35 కోట్ల రూపాయల ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి అందించింది. 850 కోట్ల రూపాయల మేర ఆర్టీసీ రుణాలు సేకరించుకోవడానికి ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. గడిచిన ఐదేండ్లలో రికార్డుస్థాయిలో ఆర్టీసీలో కొత్తగా 2,101 బస్సులను కొనుగోలు చేసింది. 4,760 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించింది. రాష్ట్రం ఏర్పడిన వెంట నే ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఒక శాతం ఎక్కువగా 44శాతం ఫిట్‌మెంట్ తో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచింది. గత ఏడాది ఆర్టీసీ కార్మికులకు మరో 16 శాతం ఫిట్‌మెంట్‌తో మధ్యంతర భృతి(ఐఆర్) కూడా ఇచ్చింది. ఆర్టీసీని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, సరికొత్త వ్యూహాలను అమలుచేస్తున్నది. అయినప్పటికీ కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. దీనిపై రాష్ట్ర మంత్రివర్గం నాలుగు గంటలపాటు విస్తృతంగా చర్చించింది. కార్మికుల డిమాండ్లను సానుభూతితో పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించి, చర్చల ప్రక్రియ ప్రారంభించింది. అటు కార్మికశాఖ కూడా కార్మికులతో చర్చలకు రంగం సిద్ధం చేసింది. కార్మికుల డిమాండ్లన్నింటినీ పరిశీలించిన తర్వాత కమిటీ ఇచ్చిన నివేదికను అనుసరించి, తగు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ అంతా జరుగడానికి కొద్దిరోజుల సమ యం పడుతుంది. ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను సానుభూతితో పరిశీలించి, పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతామని ప్రకటించటం దురదృష్టకరం.

ఆర్టీసీ విలీనం టీఆర్‌ఎస్ పార్టీ విధానం కాదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప, మిగతా డిమాండ్లు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. విలీనం ప్రభుత్వ విధానం కాదు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో కాని, ఎన్నికల ప్రచారంలో గానీ ఈ విషయం చెప్పలేదు. ఎన్నికల్లో ఇవ్వని హామీని అమలుచేయమని కోరడం, దానికోసం సమ్మె చేయడం న్యాయం కాదు. ఎన్నటికీ పరిష్కారం కాని ఒక సమస్యను ముందేసుకుని ఆందోళనలు చేయడం, అశాంతికి, అలజడికి ఉపయోపడుతుందే కానీ, ఆర్టీసీ సంస్థ మంచికి ఏ మాత్రం ఉపయోగపడదు.


ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది. బతుకమ్మ, దసరా పండుగ సీజన్లో సమ్మె వల్ల ఆర్టీసీ తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చలేకపోయింది. దీనివల్ల ప్రజల కు ఇబ్బందులు కలిగాయి. సంస్థకు కూడా నష్టం వాటిల్లింది. సమ్మెకు దిగి, ఆర్టీసీని మరింత నష్టపరుచడం, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కల్పించడం ఏ మాత్రం భావ్యం కాదని ప్రభుత్వం అనేకసార్లు విజ్ఞప్తి చేసింది. ప్రజల అవసరాలను అర్థం చేసుకోకుండా, ప్రభుత్వ చిత్తశుద్ధిని గుర్తించకుండా, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా పండుగ సమయంలో సమ్మెకు దిగడం అనైతికం. డిమాండ్లను పరిశీలించి, పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకొచ్చినా సమ్మెకు దిగడం సమంజసం కాదు. సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం అంత తేలిక కాదు. సాధ్యమయ్యే పనికాదు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం విలీనం చేసింది కదా? అనే ప్రశ్న వస్తున్నది. అక్కడ విలీన ప్రకటన చేశారే తప్ప.. దాని పర్యవసానాలు ఇంకా పూర్తిగా అనుభవంలోకి రాలేదు. కొంతకాలం గడిస్తే తప్ప అక్కడ విలీనం ఎలా జరిగింది? మంచి జరిగిందా.. చెడు జరిగిందా? అనేది తేలుతుంది. విలీనం అంత తేలికే అయితే, అంత మంచిదే అయితే కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు పాలిస్తున్న ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు ఎందు కు విలీనం చేయలేదో ఆలోచించుకోవాలి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను రాజకీయంగా వాడుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు కుయుక్తులు పన్నుతున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ విషయంలో ఇలా డిమాండ్ చేస్తున్న రాజకీయపక్షాల వారు, వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో విలీనం చేశారా? అనే విషయం ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీజేపీ అధికారంలో ఉన్న జార్ఖండ్, మణిపూర్ వంటి రాష్ర్టాల్లో అస్సలు ఆర్టీసీ లేనే లేదు.

బీజేపీ, కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. దేశాన్ని ఏండ్లకు ఏండ్లు పాలించిన ఈ రెండుపార్టీలు ఒక్క రాష్ట్రంలో కూడా నెరవేర్చని డిమాండ్లను తెలంగాణలో అమలుచేయాలని కోరడం వెనుక రాజకీయ దురుద్దేశమే తప్ప మరొకటి లేదు. కార్మికులు కూడా ఈ సమయంలో సంయమనంతో ఆలోచించాలి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ శకం నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలో ఏకంగా పెట్టుబడుల ఉపసంహరణ శాఖనే ఏర్పాటు చేశారు. 2019-20 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం వల్ల రూ.1.05 లక్షల కోట్లు సమకూర్చుకుంటామని ప్రకటించింది. రైల్వేలలో ప్రైవేటీకరణను అమలు చేస్తున్నది. ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించింది. అనేక సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నది. ప్రభుత్వాల ధోరణి ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్న తరుణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ మనుగడ కాపాడటానికే త్రికరణశుద్ధితో ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించేది లేదని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. పూర్తి క్రమశిక్షణతో, మరింత సమర్థవంతంగా ప్రజలకు రవాణా సౌకర్యం అందించే అత్యుత్తమ సంస్థగా ఆర్టీసీని మరింత బలపడేలా చేస్తామనే ముఖ్యమంత్రి ప్రకటనలో ప్రభుత్వ ధృఢ సంకల్పం ప్రస్ఫుటమవుతున్నది. ఆర్టీసీ ఆస్తుల విలువ 50వేల కోట్ల రూపాయలని మరో అబద్ధాన్ని కొంద రు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి ఆర్టీసీ ఆస్తు ల విలువ రూ.4416 కోట్లు మాత్రమే. ఈ ఐదేండ్లల్లో వాటి విలువ కొంత పెరిగివుండవచ్చు.
h-bala-raju
కానీ ప్రతిపక్షాలు తమ నోటికి వచ్చినట్టు అంకెలు చెప్తూ 50 వేల కోట్లని, లక్ష కోట్లని అసంబద్ధ ప్రకటనలు చేయడం పూర్తిగా బాధ్యతా రాహిత్యం. ఆర్టీసీ ఆస్తులు అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనే ప్రచారం కూడా పూర్తిగా అబద్ధం. లక్షలాదిమంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడి తమ చదువులు కొనసాగిస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు, వివిధవర్గాలవారు తక్కువ రేట్ల తో ప్రయాణం సాగిస్తున్నారు. నేటికీ మారుమూల ప్రాంతాలకు పోవడాని కి ఆర్టీసీ బస్సులే దిక్కు. తక్కువ ధరలతో, ఎలాంటి ప్రమాదాలు లేకుండా ప్రయాణించడం ఆర్టీసీ బస్సులతోనే సాధ్యం. రోజుకు కోటి మంది ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ బస్సు ఆగిపోవద్దు. అందుకే.. కార్మికులు సమ్మె చేస్తున్నందున, ప్రజల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నది. సకల జనుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడానికి, నేటి సమ్మెకు తేడా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజా డిమాండు. ప్రజాస్వామ్య డిమాండు. అన్ని రాజకీయపార్టీలు అంగీకరించిన విషయం. అన్నిపార్టీలు తమ మ్యానిఫెస్టోలో చెప్పిన విషయం. చెప్పిన విషయం అమ లుచేయండని అడుగడానికి ఆనాడు సమ్మె జరిగింది. కానీ ఆర్టీసీ విలీనం టీఆర్‌ఎస్ పార్టీ విధానం కాదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప, మిగతా డిమాండ్లు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో కాని, ఎన్నికల ప్రచారంలో గానీ ఈ విషయం చెప్పలేదు. ఎన్నికల్లో ఇవ్వని హామీని అమలుచేయమని కోరడం, దానికోసం సమ్మె చేయడం న్యాయం కాదు. ఎన్నటికీ పరిష్కారం కాని ఒక సమస్యను ముందేసుకుని ఆందోళనలు చేయడం, అశాంతికి, అలజడికి ఉపయోపడుతుందే కానీ, ఆర్టీసీ సంస్థ మంచికి ఏ మాత్రం ఉపయోగపడదు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)

534
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles