సద్విమర్శ తప్పుకాదు


Thu,October 10, 2019 12:46 AM

ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కులను కాపాడటంలో మన దేశంలో న్యాయవ్యవస్థ ఎంతో కీలకపాత్రను పోషిస్తున్నది. మన దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో న్యాయస్థానాలు పోషించిన పాత్ర విస్మరించలేనిది. తాజా ఉదంతంలో కూడా పట్నా ఉన్నత న్యాయస్థానం స్వతహాగా చొరవ చూపి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవాలె. రాజద్రోహం చట్టమే వలసవాదుల పాలన నాటి కాలం చెల్లిన చట్టమని, దీనిని రద్దుచేయాలని ఎంతో కాలంగా ఒక బలమైన వాదన ఉన్నది. ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో న్యాయస్థానాలు ఈ చట్ట రాజ్యాంగబద్ధతను సమీక్షించాలె.


దేశంలో విద్వేషదాడులను అరికట్టాలంటూ ప్రధానిని కోరుతూ లేఖ రాసిన ప్రముఖులపైనే రాజద్రోహం కేసు నమోదు చేయడం దిగ్భ్రాంతికరం. దేశ ప్రధానికి లేదా బాధ్యతాయుత స్థానాలలో ఉన్నవారికి చైతన్యవంతులైన ప్రజలు తమ అభిప్రాయాలను లేదా అసమ్మతిని వ్యక్తం చేస్తూ లేఖ రాయడం ఇవాళ కొత్త కాదు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇటువంటి భిన్నాభిప్రాయాలను పాలకులు ఆహ్వానిస్తారు కూడా. కానీ ఈ మాత్రం అభిప్రాయ వ్యక్తీకరణే రాజద్రోహమంటూ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై కేసు దాఖలు కావడం ప్రజాస్వామ్యంలో ఆవాంఛనీయ పోకడ. కొన్నినెలల కిందట రామచంద్రగుహ, మణిరత్నం, అపర్ణ సేన్‌, శ్యామ్‌ బెనగల్‌, శుభా ముద్గల్‌, అనురాగ్‌ కశ్యప్‌, సౌమిత్ర చటర్జీ వంటి ప్రముఖులు అల్పసంఖ్యాక ప్రజలపై, బలహీనవర్గాలపై సాగుతున్న విద్వేషదాడుల పట్ల తమ ఆందోళన వెలిబుచ్చుతూ ప్రధానికి లేఖ రాశారు. అసమ్మతిని వెలిబుచ్చే అవకాశం లేకపోతే ప్రజాస్వామ్యమేలేదని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ప్రముఖులు ఈ లేఖ ద్వారా తమ ఆందోళనను ప్రధాని దృష్టికి తెచ్చారే తప్ప మరే దురుద్దేశం వారికి లేదనేది స్పష్టం. వారు దేశ ప్రధానికి లేఖ రాశారే తప్ప విదేశీయులకు కాదు. దేశ ప్రధానికి ప్రముఖులు రాసిన లేఖపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ రెండునెలల కిందట ఒక న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. దీని ఆధారంగా చీఫ్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆగస్టు 20న ఇచ్చిన ఆదేశం మేరకు బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ నెల మూడవ తేదీన కేసు నమోదయింది.

ప్రధానికి లేఖ రాసిన 49 మంది ప్రముఖుల పై రాజద్రోహం, శాంతికి భగ్నం కలిగించే ఉద్దేశంతో మత భావనలను గాయపరుచడం, అవమానించడం మొదలైన ఆరోపణలు చేస్తూ ప్రాథమిక దర్యాప్తు నివేదిక దాఖలైంది. లేఖ రాసిన ప్రముఖులు దేశ ప్రతిష్ఠకు చెరుపు తెస్తున్నారనీ, మెప్పించే రీతిలో సాగుతున్న ప్రధాని పాలనను లోకువ చేస్తున్నారని, వేర్పాటువాద పోకడలకు మద్దతు ఇస్తున్నారని ఈ ఫిర్యాదుదా రు పిటిషన్‌లో ఆరోపించడమే సమంజసంగా లేదు. కాగా దీనిపై చీఫ్‌ జుడీషియ్‌ మెజిస్ట్రేట్‌ అనుకూలంగా స్పందించడం మరింత ఆందోళనకరం. ఈ విమర్శను సహృదయంతో అర్థం చేసుకోకుండా సమాజంలో సామరస్యం నెలకొనాలని కోరుతున్న వారిపైనే శాంతికి భంగం కలిగిస్తున్నారని నిందలు వేసి వేధించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. కొన్నేండ్లుగా మతవిద్వేషాలు పెరుగుతున్నవనేది తెలిసిందే. అల్పసంఖ్యాకవర్గాలపై మూకదాడులు సాగుతున్నాయి. బలహీనవర్గాలపై కూడా దాడులు చేసి హతమార్చిన దుర్ఘటనలు ఉన్నా, వీరిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకొని శిక్షించిన ఉదంతాలు లేవు. ఈ దాడుల మూలంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రపంచంలో ఉన్న పేరు ప్రతిష్ఠలు దెబ్బతింటున్నాయి. ఈ దాడులను అరికట్టాలని కోరినవారిపైనే దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆరోపించడమేమిటి? 49 మంది ప్రముఖులపై రాజద్రోహం కేసు పెట్టడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ప్రధానికి లేఖ రాసిన 49 మందికి మద్దతుగా ఈ నెల ఏడవ తేదీన మరో 180 మంది ప్రముఖులు మరో లేఖ రాశారు. నసీరుద్దీన్‌ షా, రొమిలా థాపర్‌ తదితరులు మద్దతు లేఖ రాసిన వారిలో ఉన్నారు. తాజాగా మరికొన్ని వం దల మంది ప్రముఖులు సౌహార్ద్రత ప్రకటించారు. లేఖలోని అభిప్రాయాలకు మద్దతు ప్రకటించి న ప్రముఖుల సంఖ్య పదమూడు వందలు దాటింది. మేం రోజూ గళం విప్పుతూనే ఉంటాం అని వారు ప్రకటించారు. కాంగ్రెస్‌, డీఎంకే, వామపక్షాలు కూడా ప్రముఖులకు మద్దతు ప్రకటించాయి.

రాజద్రోహం కేసు పెట్టడానికి సుప్రీంకోర్టు అనేక పరిమితులు నిర్దేశించింది. అల్పమైన అంశాలపై ఇటువంటి కేసులు పెట్టడం సరికాదు. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడం కూడా అంత అల్పమైన విషయం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యలే స్పష్టం చేశాయి. పౌరులు వాక్‌స్వాతంత్య్రాన్ని హరించడానికి చట్టాలను ఉపయోగించుకోకూడదు. ఎవరో వ్యక్తి చేసిన ఫిర్యాదు అంటూ బీజేపీ పెద్దలు వ్యాఖ్యానించి చేతులు దులుపుకోవడం బాధ్యతారాహిత్యమే. జాతీయ రాజకీయ పక్షంగా అందులోనూ అధికార పక్షంగా ఇటువంటి పోకడలను అరికట్టవలసిన బాధ్యత బీజేపీ నాయకుల మీద ఉన్నది. ప్రధాని మోదీ కూడా తనకు రాసిన లేఖపై జరిగిన రాద్ధాంతం కనుక దీనిపై వెంటనే స్పం దించాలె. ఈ విషయంలో ముజఫర్‌పూర్‌ న్యాయస్థానం చీఫ్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ నిర్ణయం విమర్శలకు తావిస్తున్నది. ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కులను కాపాడటంలో మన దేశంలో న్యాయవ్యవస్థ ఎంతో కీలకపాత్రను పోషిస్తున్నది. మన దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో న్యాయస్థానాలు పోషించిన పాత్ర విస్మరించలేనిది. తాజా ఉదంతంలో కూడా పట్నా ఉన్నత న్యాయస్థానం స్వతహాగా చొరవ చూపి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవాలె. రాజద్రోహం చట్టమే వలసవాదుల పాలన నాటి కాలం చెల్లిన చట్టమని, దీనిని రద్దుచేయాలని ఎంతో కాలంగా ఒక బలమైన వాదన ఉన్నది. ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో న్యాయస్థానాలు ఈ చట్ట రాజ్యాంగబద్ధతను సమీక్షించాలె.

250
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles