వాయు కాలుష్యం


Sat,October 5, 2019 01:02 AM

కాలం గడుస్తున్నా కేంద్రం తలపెట్టిన వాయుశుద్ధి కార్యక్రమం ద్వారా ఆచరణాత్మక ఫలితాలు ఆశించిన మేర కనిపించటం లేదు. ప్రభుత్వాలు కూడా నగరాల్లోని, లేదా నగరాలకు సమీపంలో ఉన్న వాయు కాలుష్య కారక పరిశ్రమలను దూర ప్రాంతాలకు తరలించాలి. పచ్చదనాన్ని పెంచటం కోసం నిరంతర కార్యాచరణతో ప్రభుత్వాలు ముందుకుపోవాలి. వ్యక్తిగత స్థాయిలోనూ కాలుష్య నియంత్రణ కోసం ప్రజలంతా కంకణబద్ధులై ఉండాలి.

దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని కాలుష్యభూతం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. వార్షిక వాయు కాలుష్య తాజా నివేదిక కూడా రాబోయేరోజుల్లో ఢిల్లీ నగరాన్ని మరింత కాలుష్యం ఆవహిస్తుందని హెచ్చరించింది. అక్టోబర్ 27 దీపావళి పండుగ వస్తుండటంతో ఢిల్లీ నగరం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి కాకుండా చర్యలు చేపట్టాలని ఆ నివేదిక సూచించింది. ఢిల్లీ నగరాన్ని వాహన కాలుష్యానికి తోడు పొరుగు రాష్ర్టాలైన పంజాబ్, హర్యానా నుంచి వీచే కాలుష్య గాలులతో మరింత ప్రమా దం పొంచి ఉన్నదని వార్షిక వాయుకాలుష్య నివేదిక తెలుపడం గమనించదగినది. కొన్నేండ్లుగా ఢిల్లీ నగరానికి పంజాబ్, హర్యానా పంట పొలాల నుంచి వస్తున్న పొగ మబ్బులు తీవ్ర సమస్యగా మారాయి.

ఏటా ఈ రాష్ర్టాల్లో పంటల కోతలు అయిపోయిన తర్వాత దంట్లను రైతులు తగులబెడుతుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి తగులబెడుతుండటంతో పొగమబ్బులు సరిహద్దు ప్రాంతమైన ఢిల్లీ నగరానికి చేరి ఊపిరాడకుండా చేస్తున్నయి. గతేడాది దీపావళి రోజున మున్నెన్నడూ లేనివిధంగా కాలుష్య మేఘాలు దట్టంగా ఢిల్లీ నగరాన్ని కమ్మివేశాయి. దీనికి తోడు వాహన కాలు ష్యం ఉండనే ఉన్నది. దీంతో ఒకానొక దశలో ఢిల్లీ నగరంలో గాలి పీల్చుకోవటమే కష్టంగా మారిపోయింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది అంటే కాలుష్య తీవ్రతను ఊహించవచ్చు. దేశ రాజధానిగా ఢిల్లీ ఎదుర్కొంటున్న కాలుష్య సమస్య నానాటికీ తీవ్రరూపం దాలుస్తుండటంతో పాలకులకు సవాలుగా మారింది.

ఢిల్లీ సర్కారు వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు సరి-బేసీ నెంబర్ల వాహనాల వంతుల వారీ వినియోగాన్ని అమలుచేసింది. అంతేకాకుండా వాహన కాలుష్య నియంత్రణకు కాలం చెల్లిన పాత వాహనాలను కట్టడిచేసింది. వేల కోట్ల రూపాయ లు వెచ్చించి కాలుష్య నియంత్రణ చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. ముఖ్యంగా పొరుగు రాష్ర్టాల్లో కాలుస్తున్న వ్యవసాయ చెత్తనుంచి వస్తున్న పొగను నియంత్రించటానికి ప్రత్యేక చర్యలు అవసరం. ఈ విషయంలో రైతులను చైతన్యప ర్చటం ఒకటే సరిపోదు. తమ పంటపొలాల్లోని గోధుమ, వరి నుంచి వచ్చే దంట్లను తగులబెట్టకుండా, వాటితో ఇతర వస్తువుల తయారీకి ప్రోత్సహించాలి. మిగిలిపోయిన వరి, గోధుమ గడ్డి మూలాలను యంత్రాలతో చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎరువుగా తయారుచేయవ చ్చు.

ముఖ్యంగా ఈ గడ్డిరెల్లును పరుపులు, తివాచీల తయారీలో ఉపయోగించవచ్చు. ఈ దిశగా రైతులను ప్రోత్సహించటమే కాదు, ప్రభుత్వాలు కూడా ఉప ఉత్పత్తులను తయారుచేయటానికి అవసరమైన సాంకేతిక, యంత్ర సాయా న్ని రైతులకు అందించాలి. ఆ దిశగా అవసరమైన పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగాలి. దీన్ని ప్రత్యేక కార్యాచరణగా ఎంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలి. అప్పుడే చెత్త దగ్ధంతో ఎదురవుతున్న వాయుకాలుష్యపు సమస్య పరిష్కారం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వాయుకాలుష్యమయమైన 20 నగరాల్లో 14 భారత్‌లో నే ఉన్నాయి. ప్రమాదకరస్థాయిలో వాయుకాలుష్యం ఉన్న నగరాల్లో ఢిల్లీ, కాన్పూర్, ఫరీదాబాద్, వారణాసి, ముజఫర్‌నగర్ మొదటి వరుసలో ఉన్నా యి.

ప్రాణం నిలబెట్టే గాలి ఉసురుతీసే రాక్షసిగా మారటం పెద్ద విషాదం. ఇవ్వాళ ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద పర్యావరణ సంక్షోభం వాయుకాలుష్యం. 180 దేశాల పర్యావరణ సూచిలో భార త్‌ది 177వ స్థానం. నగరాలన్నీ గ్యాస్ చాంబర్‌లుగా మారిపోయాయి. ఫలితంగా ఆరోగ్య సమస్యలు పెచ్చుమీరుతున్నాయి. అస్తమా, కాలేయ క్యాన్సర్, గుండె జబ్బులు, చర్మవ్యాధులు, శ్వాస కోశ సంబంధ వ్యాధులు మానవాళిని పీడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది పసిపిల్లల అకాల మరణానికి ఈ విష వాయువులే కారణం. 2017లో దేశవ్యాప్తంగా సంభవించి న ప్రతి 8 మరణాల్లో ఒకటి వాయు కాలుష్యంతోనే జరిగింది. దేశంలో పదిలక్షల మంది పసికందులు వాయుకాలుష్యంతో చనిపోతున్నారు. ఈ క్రమంలో కాలుష్య నివారణకు చేపట్టిన చర్యల లో చైనా, స్వీడన్ ఆదర్శంగా ఉన్నాయి. బీజింగ్‌లో ఒక వ్యక్తి ఒక కారుకు మించి కొనటానికి వీలు లేదు.

ఒక్క బీజింగ్ నగరంలోనే పొగను ఎగజిమ్మే పాత కాలపు మూడు లక్షల వాహనాలను రోడ్ల పై తిరుగకుండా చర్యలు తీసుకున్నారు. స్వీడన్‌లో ఒక్క శాతం చెత్త కూడా వృథా కాకుండా పునర్‌వినియోగం చేసి కాలుష్యాన్ని కట్టడిచేశారు. మనదేశంలో కాలుష్య నియంత్రణకు 1981లోనే చట్టం తీసుకొచ్చినప్పటికీ దాని అమలు అటకెక్కింది. కనీస చర్యలు చేపట్టకపోవటం కారణంగానే నగరాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కాయి. ఈ సమస్య తీవ్రతను గుర్తిం చిన కేంద్రం దేశంలోని ప్రధాన నగరాలన్నింటా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు నడుం బిగించటం ఆహ్వానించదగిన పరిణా మం. 300 కోట్ల ఖర్చుతో జాతీయ వాయుశుద్ధి కార్యక్రమం(ఎన్‌కాప్) చేపట్టేందుకు కార్యాచరణను ప్రారంభించింది. కాలం గడుస్తున్నా కేంద్రం తలపెట్టిన వాయుశుద్ధి కార్యక్రమం ద్వారా ఆచరణాత్మక ఫలితాలు ఆశించిన మేర కనిపించటం లేదు. ప్రభుత్వాలు కూడా నగరాల్లోని, లేదా నగరాలకు సమీపంలో ఉన్న వాయు కాలుష్య కారక పరిశ్రమలను దూర ప్రాంతాలకు తరలించాలి. పచ్చదనాన్ని పెంచటం కోసం నిరంతర కార్యాచరణతో ప్రభుత్వాలు ముందుకుపోవాలి. వ్యక్తిగత స్థాయిలోనూ కాలుష్య నియంత్రణ కోసం ప్రజలంతా కంకణబద్ధులై ఉండాలి.

232
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles