ఎన్నార్సీ వివాదం


Thu,October 3, 2019 02:38 AM

ఏ దేశంలో ఏప్రాంతంలో నైనా దేశీయుల గణన కచ్చితమైన రీతిలో ఉండటం భద్రతరీత్యా అనివార్యం. కానీ అస్సాం అనుభవం భద్రతకు బదులు భయాందోళనలు రేకెత్తిస్తున్నది. అస్సాం లో ఏకంగా 40లక్షల మందిని విదేశీయులుగా తేల్చి, వారి భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభంగా పరిణమించవచ్చన్న భయాలు కలుగుతున్నాయి. ఇంత సంఖ్యలో విదేశీయులు అంటే, ప్రపంచంలోని శరణార్థుల జనాభాలో పదో వంతు.


జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నది. సరిహ ద్దురాష్ర్టాల్లో అనిశ్చితి, అభద్రత ఏర్పడుతున్నది. అస్సాం ఎన్నార్సీ వివాదం అటుండగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పశ్చిమబెంగాల్‌ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా ఉన్నాయి. కోల్‌కతాలో జనజాగరణ్‌ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌షా పశ్చిమబెంగాల్‌లో ఎన్నార్సీని తప్పకుండా అమలుచేస్తామని ప్రకటించటమే కాదు, దేశంలోకి అక్రమంగా చొరబడిన వారందరినీ వెళ్లగొడతామని ప్రకటించారు. దేశభద్రత దృష్ట్యా ఎవరేమన్నా ఎన్నార్సీ అన్ని రాష్ర్టా ల్లో అమలుచేసి తీరుతామనటం గమనార్హం. అయితే అమిత్‌షా ప్రకటనను విచ్ఛిన్న రాజకీయంగా మమతాబెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఈ ఖండన మండనలు అటుంచితే ఈ సందర్భంగా అమిత్‌ షా వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. చొరబాటుదారులను వెళ్లగొట్టే ముందు శరణార్థులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులందరికీ భారత పౌరసత్వం కల్పించటానికి పౌరసత్వ (సవరణ) బిల్లును ఆమోదిస్తామని ప్రకటించటం బీజేపీ అనుసరించాలనుకుంటున్న వ్యూహాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. పౌర జాబితా రూపకల్పనకు అనుసరిస్తున్న విధానం ఏదైనా ఉంటే, అది కుల మతాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలకు అనువర్తింపచేసేదిగా ఉండాలి. కానీ కొన్ని మత సమూహాలకు మినహాయింపు ఇస్తున్నట్లుగా, నేరుగా కేంద్ర హోంమంత్రి ప్రకటించటం గర్హనీ యం. దీనిద్వారా బీజేపీ కొన్నివర్గాలను లక్ష్యం గా చేసుకుని ప్రవర్తిస్తున్నట్లుగా వ్యవహరించటమే తీవ్ర అభ్యంతరకరం.

భారతీయులను, విదేశీయులను వేరుచేసేందుకు చేపట్టిన కార్యక్రమమే ఎన్నార్సీ. మొదట 1950లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వాతంత్య్రానంతరం తూర్పుపాకిస్థాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌) నుంచి పెద్దమొత్తంలో ఈశాన్యరాష్ర్టాల్లోకి వలసలు కొనసాగిన దాఖలాలున్నాయి. మిగతా రాష్ర్టాల స్థితి ఎలా ఉన్నా, ఈశాన్యరాష్ట్రమైన అస్సాంలో వలసదారుల సమస్య ముందు కు వచ్చింది. ఎనభైయవ దశకంలో అస్సాంలో వలసలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున విద్యార్థి ఉద్యమం పెళ్లుబుకింది. వలసదారులను రాష్ట్రం నుంచి పంపించేయాలనే డిమాండ్‌తో ఆల్‌ అస్సాం స్టూడెంట్‌ యూనియన్‌ నేతృత్వంలో ఆందోళన చేపట్టిన విద్యార్థి నేతలు ఏకంగా అధికారంలోకే వచ్చారు. ఆ నేపథ్యంలోంచే 1951 ఎన్నార్సీ రికార్డులను అప్‌డేట్‌ చేస్తామని 2005 లో అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. దానికి ప్రాతిపదికగా 1951నాటి జాబితాలో పేరు ఉన్నవారిని,1971 మార్చి 24కు ముందు (ఇండో-పాక్‌ యుద్ధం మొదలవటా నికి ఒక రోజు ముందు) ఓటర్‌ జాబితాలో నమోదైన వారిని ప్రామాణికంగా తీసుకున్నారు. జాబితాలో పేర్లు నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు, వివాదాల నేపథ్యంలో ఎన్నార్సీలో రెండు దఫాలుగా సవరణ తర్వాత తుది జాబితా గత ఆగస్టు నెలలో ముసాయిదాగా ప్రకటించారు. మూడున్నరేండ్ల ఎన్నార్సీ ప్రక్రియలో 41లక్షల మందిని విదేశీయులుగా తేల్చారు. ఈ క్రమంలో 16 రకాల ధృవపత్రాలను కలిగి ఉన్నవారిని పౌరులుగా గుర్తిస్తామన్న అధికారులు, ఓటర్‌లిస్టు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఉన్నవారిని కూడా జాబితాలో చేర్చలేదు. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగులనూ, సైనిక జవానులను విదేశీయుల జాబితాలో చేర్చటంతో అస్సాంలో చేపట్టిన ఎన్నార్సీ ప్రక్రియపై అనేక అనుమాలు రేకెత్తడమే కాదు, అది అభాసుపాలైంది. ఇప్పుడు ఏకంగా దేశవ్యాప్తంగా ఎన్నార్సీ చేపడుతామనటం కూడా అనేక అనుమానాలు వ్యక్తమవడం సహజం.

ఏ దేశంలో ఏప్రాంతంలో నైనా దేశీయుల గణన కచ్చితమైన రీతిలో ఉండటం భద్రతరీత్యా అనివార్యం. కానీ అస్సాం అనుభవం భద్రతకు బదులు భయాందోళనలు రేకెత్తిస్తున్నది. అస్సాం లో ఏకంగా 40లక్షల మందిని విదేశీయులుగా తేల్చి, వారి భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభంగా పరిణమించవచ్చన్న భయాలు కలుగుతున్నాయి. ఇంత సంఖ్యలో విదేశీయులు అంటే, ప్రపంచంలోని శరణార్థుల జనాభాలో పదో వంతు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మిగిలిన మయన్మార్‌ రోహింగ్యాల సంఖ్య పది లక్షలు మాత్రమే. అంటే ప్రపంచంలోనే అతి ఎక్కువ కాందీశీకులున్న ప్రాంతంగా అస్సాం మారిపోయింది. ఆ నలభై లక్షల మందిని ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పటం లేదు. ఎన్నార్సీలో పేరులేని వారందర్నీ నిర్బంధగృహాల్లోకి తరలించటానికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదే నిజమైతే పెద్ద విషాదమే. ఇలాంటి సంక్లిష్టతల్లోంచే తీవ్ర మానవ సంక్షోభాలు తలెత్తినట్లు చరిత్ర చెబుతున్నది. ఇన్నాళ్లుగా మతం, మెజారిటీ సామాజిక సున్నితాంశాలు కేంద్రంగా రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు విదేశీయుల పేరిట మరో ఆయుధాన్ని ఓట్ల వేటలో వినియోగించటానికి సమాయత్తమవుతున్నదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓట్ల కోసమే ప్రతిపక్షాలు విదేశీయులను వెనకేసుకొస్తున్నాయన్న బీజేపీ నేతల వాదనలు, గత అనుభవాల దృష్ట్యా పస లేనివి. ఇదిలా ఉంటే తాజాగా పశ్చిమబెంగాల్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేస్తామనటం దేశాన్నంతా అభద్రతా అనిశ్చితిలోకి నెట్టడమే.

209
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles