‘పచ్చదనం’ క్షేత్ర నివేదిక


Thu,October 3, 2019 02:37 AM

‘పచ్చదనం-పరిశుభ్రత’ 30 రోజుల కార్యక్రమం సెప్టెంబర్‌ 6న మొదలై 20 రోజులు గడిచిన తర్వాత, దాని అమలు తీరును ప్రత్యక్షంగా గమనించేందుకు ఐదు మండలాలు తిరిగిన ఈ రచయితకు ప్రధానంగా మూడు విషయాలు దృష్టికి వచ్చాయి. ఒకటి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులలో ఈ స్పృహ గత నాలుగు హరితహారాల కన్న చాలా ఎక్కువగా పెరుగటం. రెండు, ఈ కార్యక్రమంలోని అన్ని అంశాలు శ్రద్ధగా అమలవుతుండటం. మూడు, 30 రోజుల తర్వాత భవిష్యత్తులోనూ ఇది బాగా కొనసాగగలదనే ఆశాభావం ఏర్పడటం. అయితే అటువంటి కొనసాగుదలకు కొన్ని షరతులున్నాయి.


హరితహారం మొదటి నాలుగు విడతలు ఏ కారణం వల్లనైతేనేమి పాక్షిక ఫలితాలను మాత్రమే ఇచ్చినట్లు ఈ అయిదు గ్రామీణ మండలాల సందర్శనలో అర్థమైంది. ఈ స్థితికి కారణాలను విశ్లేషించిన మీదట కావచ్చు ఇప్పుడు పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాన్ని కొత్త రూపంలో డిజైన్‌ చేసి వ్యవస్థీకరించారు ముఖ్యమంత్రి. దానివల్ల లోపాలు తొలిగిపోయాయి. పని విజయవంతంగా సాగుతున్నది. ఈ క్రమంలో అందరూ భాగస్వాములై అందరి చైతన్యాలు పెరుగుతున్నాయి.


క్షేత్ర సందర్శన సందర్భంగా తిరిగిన అయిదు మండలా లు వరంగల్‌ (గ్రామీణ) జిల్లాలోని ఆత్మకూరు, శాయంపేట, గీసుకొండ, నెక్కొండ, రాయపర్తి. గమనించదలిచిన అంశాలు ప్రధానంగా కొన్నున్నాయి. అవి, పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పేర్కొ న్న వేర్వేరు అంశాలు వాస్తవరూపంలో ఏ విధంగా అమలవుతున్నాయి? ఇది మొదటిది. వాటి అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజ లు ఏమేరకు పాల్గొంటున్నారు? ఇది రెండవది. అమలును అధికారులు, ప్రజాప్రతినిధులు ఏవిధంగా పర్యవేక్షిస్తున్నారు? ఇది మూడవది. ప్రజలకు చైతన్యాన్ని పెంచి, వారి ప్రస్తుత భాగస్వామ్యం కొరకు, ఆ భాగస్వామ్యం మునుముందు కొనసాగేందుకు ప్రజాప్రతినిధులు, అధికారు లు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇది నాల్గవది. హరితహారం గత నాలుగు విడుతలతో పోల్చితే ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల చైతన్యాలు, భాగస్వామ్యాలు ఏ విధంగా పెరిగాయి? ఇది అయిదవది. అధికారపక్షం కాకుండా ఇతర పార్టీలకు చెందిన వారు సర్పంచ్‌లుగానో, వార్డు సభ్యులుగానో ఉన్నప్పుడు వారి పాత్ర ఏవిధంగా ఉంది? ఇది ఆరవది.

ఈ ఆరు అంశాలను ఇప్పుడు ఒకటొకటిగా చూద్దాం. కార్యక్రమ అంశా లు అన్నింటికి అన్నీ గ్రామాలలో అమలవుతున్నాయి. కొన్నిటి అమలు ఇప్పటికే పూర్తికాగా కొన్ని అమలు దశలో సాగుతున్నాయి. అమలు ప్రధాన గ్రామంలోనే గాక ఎస్సీ, ఎస్టీ కాలనీలలోనూ జరుగుతున్నది. ఆ పనులు కొద్ది మినహాయింపులతో ప్రస్తుత 30 రోజుల తొలిదశ ముగిసే సరికి పూర్తికాగల సూచనలున్నాయి. కొద్ది మినహాయింపులు అంటున్నవేమిటి? ఉదాహరణకు ఎస్సీ కాలనీల వంటి కొన్నిచోట్ల మరికొన్ని ఇతరచోట్ల మురుగునీరు, వాన నీరుపోయేందుకు సైడ్‌ కాల్వలు, ఇళ్ల ముందు గుంతల నిర్మాణం. ఆ పనులను అధికారులు గుర్తిస్తున్నారు. పనులు 30 రోజుల తర్వాత కాలంలో జరుగవచ్చు. అందుకు నిధుల కొరత లేదన్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. మరొక ఉదాహరణ ఎరుకల వారు పందుల కోసం బురద నీటి గుంటలు తప్పవంటున్నారు. దానిని ఏమి చేయాలనేది సమాధానం తేలికగా దొరకని ప్రశ్న. స్మశాన వాటికలకు స్థలాలు గుర్తించటం చాలావరకు జరిగింది. కొద్దిచోట్ల 30 రోజుల తర్వాత కాలానికి వాయిదాపడే అవకాశం ఉంది. అదేవిధంగా డంప్‌యార్డులు, గ్రామస్థాయి నర్సరీలు. కార్యక్రమాల అమలులో కొన్ని నెమ్మదించటానికి ఒక కారణం అక్కడక్కడ వ్యాపారులు సహకరించకపోవటం. దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపారాల వ్యర్థాలను రోడ్లపైన, కాల్వల్లో పడవేయటం ఇందుకు ఒక ఉదాహరణ. ఆ విషయంలో మొండికి వేసిన వారికి నచ్చచెప్పటం, నోటీసులు ఇవ్వటం, జరిమానాల విధింపు, సంక్షేమ పథకాల నిలిపివేత హెచ్చరికలు, కోర్టు కేసుల హెచ్చరికల వంటి మార్గాలలో దారికి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి పద్ధతి కొద్దిమంది పౌరుల విషయంలోనూ అవసరమవుతున్నది. అక్కడక్కడ జరిమానాలు నిజంగానే వసూలు చేశారు. గ్రామాలలోనైతే చెత్త తీసుకుపోయేందుకు ఇళ్లకు బుట్టలివ్వటం, చెత్త కుండీల ఏర్పాటు, దానిని తరలించే ట్రాక్టర్ల ఏర్పాటు వంటి చర్యలు అమలు దిశలో సాగుతున్నాయి. ‘పవర్‌ వీక్‌' పేరు గల విద్యుత్‌ పనులు చాలా బాగా జరుగుతున్నాయి.

కార్యక్రమాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం వేర్వేరు విధాలుగా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనటం పూర్తిస్థాయిలో, నిరంతరమైన విధంగా ఉంది. వారి భాగస్వామ్యాన్ని ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమగ్రమైన రూపంలో, కచ్చితమైన పద్ధతులలో, వ్యవస్థీకృతమైన విధంగా నిర్దేశించటం ఇందుకు ముఖ్యకారణమనాలి. గ్రామ పంచాయతీ నుంచి మండలం, డివిజన్‌, జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర రాజధాని వరకు అంచెలు అంచెలుగా నిరంతర పర్యవేక్షణలు సాగుతుండటం, అందుకోసం వాట్సప్‌ మొదలైన సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుండటం, అంద రూ ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తుండటం వల్ల అన్నీ అవిశ్రాంతంగా సాగుతున్నాయి. కాని అధికార వ్యవస్థలో భాగం కాదు గనుక ప్రజల పరిస్థితి భిన్నంగా ఉంది. పచ్చదనం-పరిశుభ్రతలోని మంచిని గుర్తించటం వరకు సాధారణ ప్రజలలో ఎటువంటి కొరత కన్పించలేదు. కాని వారి భాగస్వామ్యాలలో తేడాలున్నాయి. గతంలో హరితహారాలు జరిగినప్పుడు దాని మంచిని గుర్తించటం కొంత తక్కువస్థాయిలో ఉండే ది. ఇప్పుడు లాగా పెరిగిందన్నది స్పష్టం. అదేవిధంగా, ఇది పూర్తిగా ప్రభుత్వం చేయవలసిన పని అనే వాదనలు లోగడ వినిపించేవి. ఇప్పుడు తమ బాధ్యత కూడా ఉందని గుర్తిస్తున్నారు. అయితే గ్రామీణులంతా ఎవరి పనులలో వారు ఉంటారు గనుక, ‘మా ఇంటి ముందు మేము చేశాం, మొక్కలు పెంచటం, పరిశుభ్రతలు చేస్తాము. కాని ఊరిలోకి వెళ్లి శ్రమదానం, ఉమ్మడి పనులు చేయలేం’ అనేవారు అత్యధికంగా కన్పించారు. శ్రమదానంలో మహిళా గ్రూపులు, యువజనులు, విద్యార్థి బృందాలు పాల్గొనటం ఉంది గాని ఇంకా తక్కువే. వారిని, సీనియర్‌ సిటిజన్లను, ఉద్యోగ విరమణ చేసిన వారిని మోటివేట్‌ చేసే పద్ధతులు కనుగొనటం అవసరం. ఈ బృందాలను కదిలించగలిగితే, పనిపాటలు చేసుకునే సాధారణ ప్రజల భాగస్వామ్యపు కొరత తీరుతుంది.

కార్యక్రమాల అమలును అధికారులు, ప్రజాప్రతినిధులు టెక్నాలజీని ఉపయోగిస్తూ అంచెలు అంచెలుగా పర్యవేక్షించటం గురించి పైన చెప్పుకున్నాం. అదిగాక వారు తమ పరిధిలోని గ్రామాలలో, వార్డులలో రోజంతా తిరుగుతుండటం కన్పించింది. సమస్యలను గుర్తించి వెంటనే ఎప్పటికప్పుడు సిబ్బందికి ఆదేశాలివ్వటం, పనులను గుర్తించి అవసరమైన నిర్మాణాలకు పథకం వేయటం, పచ్చదనం-పరిశుభ్రత అవసరాన్ని చాటింపులు, సమావేశాలు, గ్రామసభలు, వాడలలో తమ పర్యటన సందర్భంగా చెప్పిన వారికే మళ్లీ మళ్లీ చెప్తూ కూడా కాలినడకన తిరగటం, ప్రజల సూచనలను నోట్‌ చేసుకోవటం చేస్తున్నారు. పనుల కోసం నిధుల కొరత ఉండబోదనే భావన అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఏర్పడటం ఇందుకు ఊతమిస్తున్నట్లు కనిపించింది. అదే భావనను వారు ప్రజలకు కూడా కలిగిస్తున్నారు. పైగా అవేవీ భారీ ఖర్చుల పనులు కాదు. అందువల్లనే కావచ్చు, ఎవరు ఏ పనులు కోరినా, అందు కు నిధులు లేవనే మాటను వారు ప్రజలతో అనటం ఎక్కడా వినిపించలేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల మాటతీరు, వ్యవహరణాశైలిలో, అంతకుముందు ఇరువై రోజులుగా పనులు జరుగుతూ వస్తున్న తీరుతో ప్రజలకు వారిపట్ల మంచి విశ్వాసం ఏర్పడినట్లు కన్పించింది. రెండవ దశ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు నీటి పొదుపు ప్రచారాన్ని, చర్యలను అందులో భాగం చేయాలన్నది ఒకే గ్రామస్తుడి నుంచి వచ్చిన సూచన.

ప్రజల చైతన్యాలు, భాగస్వామ్యాల పెరుగుదలకు ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్న దాని గురించి ఇప్పటికే కొంత చెప్పుకున్నాం. పదే పదే చేసిన సూచనలను ఏ కారణం వల్లనైతేనేమి అనుసరించని వారి విషయంలో కొంత ఒత్తిడి తప్పదని అధికారులు, ప్రజాప్రతినిధులకు అర్థమైంది. అటువంటి వారిపై హెచ్చరికలు, నోటీసులు, జరిమానాలు, సంక్షేమ లాభాలపై ప్రభావం ఉండగలదన్న సూచనలు పనిచేస్తున్నాయి. కొందరి విషయంలో ఆ తరహా భయం అవసరమేమో కూడా. కొన్ని సందర్భాలలో చైతన్యానికి, తప్పనిసరి పరిస్థితులకు, భయానికి ఏదో ఒక రూపంలో పరస్పర సంబంధం ఉంటుంది కావచ్చు. మొత్తం మీద ఒకవైపు అధికారులు, ప్రజాప్రతినిధులు, మరొకవైపు ప్రజల చైతన్యాలు, భాగస్వామ్యాలు, కేసీఆర్‌ చేసిన వ్యవస్థీకృత ఏర్పాట్లు, ఒత్తిడులు ఇదే పద్ధతిలో ఈ 30 రోజుల అనంతరం కూడా కొనసాగితే, ఇదే కార్యాచరణలు, చైతన్యాలు స్థిర రూపం తీసుకునే అవకాశం ఉందనిపిస్తున్నది. భవిష్యత్తు కోసం ఇది అవసరమనే గుర్తింపు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఆలోచించగల పౌరులకు ఇప్పటికే ఏర్పడినట్లు తోస్తున్నది.
ashok
హరితహారం మొదటి నాలుగు విడతలు ఏ కారణం వల్లనైతేనేమి పాక్షిక ఫలితాలను మాత్రమే ఇచ్చినట్లు ఈ అయిదు గ్రామీణ మండలాల సందర్శనలో అర్థమైంది. ఈ స్థితికి కారణాలను విశ్లేషించిన మీదట కావచ్చు ఇప్పుడు పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాన్ని కొత్త రూపంలో డిజైన్‌ చేసి వ్యవస్థీకరించారు ముఖ్యమంత్రి. దానివల్ల లోపాలు తొలిగిపోయా యి. పని విజయవంతంగా సాగుతున్నది. ఈ క్రమంలో అందరూ భాగస్వాములై అందరి చైతన్యాలు పెరుగుతున్నాయి. పోతే, ప్రతిపక్షాల సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇది ఊరికంతా మంచి చేసే కార్యక్రమమన్న గుర్తింపుతో పూర్తి పట్టుదలతో పనిచేస్తుండటం సంతృప్తిని కలిగించే విషయం. ఈ విషయంలో అధికారపక్షం ప్రజాప్రతినిధులకు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం లోపంగాని, పరస్పర అసంతృప్తిగాని ఏ గ్రామంలో కూడా కన్పించలేదు. గతం కన్నా పెరిగిన సాధారణ ప్రజల చైతన్యాన్ని, తమకు వీలైన మేర గల భాగస్వామ్యాన్ని ఆధారం చేసుకుంటూ, వాటిని ఇంకా పెంచేందుకు కొత్త పద్ధతులు కనుగొంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇదే పట్టుదలతో పనిచేస్తే తెలంగాణ గ్రామీణం అద్భుతంగా మారగలదు.

377
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles