రాష్ట్ర పండుగగా గాంధీ జయంతి


Wed,October 2, 2019 03:31 AM

gandhi
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గాంధీ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని శాఖలు బుధవారం గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఖర్చును ఆయాశాఖల బడ్జెట్ నుంచి వెచ్చించాలని ఆదేశించింది. ఈ మేరకు జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దక్షిణాఫ్రికాకు ప్రయాణమైన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ ఆ దేశంలో ఆ తరువాత భారత దేశంలో అనేక అనుభవాల రాపిడికి గురై మహాత్మాగాంధీగా పరిణతి చెందారు.


సామాన్యుడు అసామాన్యుడిగా రూపుదిద్దుకున్న క్రమం వెనుక కఠోర శ్రమ ఉన్నది. గాంధీ అనుక్షణం ఆత్మ పరిశీలన చేసుకునేవారు. తనను తాను సంస్కరించుకునేవారు. జీవితకాలం సాగిన ఈ మేధోమథనం, క్రమశిక్షణాయుత ప్రయోగాల ద్వారా గాంధేయవాదం ఒక అహింసాయుత ఆయుధంగా అందివచ్చింది. గాంధీ నూటాయాభయవ జయంతి సందర్భంగా నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించిన గాంధీ ఆత్మకథ సత్యశోధన నుంచి కొన్ని భాగాలు.

దొంగతనం-ప్రాయశ్చిత్తం

MahatmaGandhii
నాకు 13 ఏండ్ల వయస్సులో (అంతకంటే తక్కువ ఉండవచ్చు) మొద ట సిగరెట్ల కోసం డబ్బులు దొంగిలించాను. తర్వాత 15వ ఏట పెద్ద దొంగత నం చేశాను. మాంసం భక్షించే మా అన్న చేతికి ఉండే బంగారు మురుగు నుం చి కొంచెం దొంగిలించాము. మా అన్న ఇరవై రూపాయలు అప్పుబడ్డాడు. ఈ అప్పు ఎలా తీర్చడమా అని మేమిద్దరం ఆలోచించాం. అతని చేతికి బంగారు మురుగు ఉంది. దానిలో ఒక తులం ముక్క తీయించడం తేలిక అని నిర్ణయించాం. ఆ పని చేశాం. అప్పు తీర్చాం. కాని ఈ చర్యను నేను సహించలేకపోయాను. ఇక దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాను. అయి తే నా మనస్సు శాంతించలేదు. తండ్రిగారికి చెప్పవలెనని అనిపించింది. కాని ఆయన ముందు నోరు విప్పి ఈ విషయం చెప్పేందుకు సాహసం కలుగలేదు. వారు కొడతారనే భయం కలుగలేదు. తన బిడ్డలనెవ్వరినీ మా తండ్రి కొట్టరు. బంగారు మురుగు విషయం చెబితే మనస్తాపంతో క్రుంగిపోతారనే భయం నన్ను పట్టుకుంది. ఏది ఏమైనా దోషం అంగీకరిస్తేనే బుద్ధి కలుగుతుందని విశ్వాసం కలిగింది. తండ్రికి మనస్తాపం కలిగించినా ఫరవాలేదని భావించాను.

చివరికి ఒక చీటి మీద చేసిన తప్పంతా రాసి క్షమించమని ప్రార్థించాలి అను నిర్ణయానికి వచ్చాను.ఒక కాగితం మీద జరిగినదంతా రాశాను. వెళ్ళి మా తండ్రిగారికి ఇచ్చాను. ఇంతటి తప్పు చేసినందుకు తగిన విధంగా శిక్షించమని, ఇక ముందు దొంగతనం చేయనని శపథం చేశాను. ఇదంతా రాసిన చీటీ వారి చేతికి ఇస్తున్నప్పుడు వణికిపోయాను. మా తండ్రి భగందర రోగంతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నారు. ఆయన బల్లమీద పడుకుని ఉన్నారు. చీటీ వారి చేతికి ఇచ్చి ఎదురుగా నిలబడ్డాను.
వారు చీటీ అంతా చదివారు. వారి కండ్ల నుంచి ముత్యాలవలె కన్నీరు కారసాగింది. ఆ కన్నీటితో చీటీ తడిసిపోయింది. ఒక్క నిమిషం సేపు కండ్లు మూసుకుని ఏమో యోచించారు. తర్వాత చీటీని చింపివేశారు. మొదట చీటీ చదివేందుకు ఆయన పడకమీద నుంచి లేచారు. ఆ తర్వాత తిరిగి పడుకున్నా రు. నాకు కూడా ఏడుపు వచ్చింది. తండ్రికి కలిగిన వేదనను గ్రహించాను. చిత్రకారుడనైతే ఈరోజు కూడా ఆ దృశ్యాన్ని చిత్రించగలను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కండ్లకు కట్టినట్లు కనబడుతున్నది. వారి ప్రేమాశ్రువులు నా హృదయా న్ని కడిగివేశాయి. అనుభవించిన వారికే ఆ ప్రేమ బోధపడుతుంది.

మతంతో పరిచయం

MahatmaGandhii1
ఇతర మతాల యెడల సమభావం కలిగిందంటే నాకు దేవుని మీద పూర్తిగా శ్రద్ధ ఏర్పడిందని అనుకోకూడదు. ఇదే సమయంలో మా తండ్రిగారి దగ్గర గల గ్రంథ సముదాయంలో మనుస్మృతి అను గ్రంథం కనబడింది. అందు లిఖించబడిన విషయాలు నాకు శ్రద్ధ కలిగించలేదు. కొద్ది నాస్తికత్వం కలిగించాయి. మా రెండో పినతండ్రి కుమారుని తెలివితేటల మీద నాకు విశ్వాసం కలిగింది. నా సందేహాల్ని అతనికి తెలియజేశాను. అతడు నా సందేహ నివృత్తి చేయలేకపోయాడు. పెద్దవాడనైన తర్వాత సందేహ నివృత్తి నీవే చేసుకోగలుగుతావు, చిన్నపిల్లలు ఇటువంటి ప్రశ్నలు వేయకూడదు అని అతడన్నాడు. మనస్సుకు శాంతి లభించలేదు. మనుస్మృతి అందలి ఖాద్యాఖాద్య ప్రకరణం, తదితర ప్రకరణాలలో ప్రచలిత విధానాలకు విరుద్ధమైన కొన్ని విషయాలు రాసి ఉన్నాను. ఈ విషయమై కలిగిన సందేహానికి సమాధానం కూడా అదే పద్ధతిలో లభించింది. పెద్దవాడనైన తరువాత చదివి తెలుసుకుంటానని మనస్సుకు నచ్చచెప్పుకున్నాను.

మనుస్మృతి చదివిన ఆ సమయంలో నాకు అహింసా బోధ కలుగలేదు. మనుస్మృతిలో మాంసాహారానికి సమర్థత లభించింది. పాములు, నల్లులు మొదలుగాగల వాటిని చంపడం నీతిబాహ్యం కాదని తోచింది. ఆ రోజుల్లో ధర్మమని భావించి నల్లుల్ని చంపాను. ఆ విషయం ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నది. ఒక్క విషయం మాత్రం గాఢంగా నా హృదయంలో నాటుకున్నది. ఈ ప్రపంచం నీతి మీద నిలబడి ఉన్నది. నీతి అనేది సత్యంతో కూడివుంది. కనుక సత్యాన్వేషణ జరిపితీరాలి అను భావం నాలో గట్టిపడింది. రోజురోజుకి సత్యం యొక్క మహత్తు నా దృష్టిలో పెరిగిపోసాగింది. సత్యాన్ని గురించిన వ్యాఖ్య నా దృష్టిలో విస్తరించింది. ఇప్పటికీ విస్తరిస్తూ ఉంది.

కక్షిదారులు అనుచరులుగా మారారు

వకీలు వృత్తి సాగిస్తున్నప్పుడు కక్షిదారు దగ్గరగానీ, వకీలు దగ్గరగానీ నా అజ్ఞానాన్ని దాచేవాణ్ణి కాదు. నాకు బోధపడనప్పుడు మరో వకీలు దగ్గరకు వెళ్లమని కక్షిదారుకు నేనే సలహా ఇచ్చేవాణ్ణి. అతడు నన్నే పని చేయమంటే మరో అనుభవజ్ఞుడైన వకీలు సలహా విశ్వసించేవారు. పెద్ద వకీలు దగ్గరకు వెళ్ళి సలహా తీసుకునేందుకు అయ్యే వ్యయం కూడా వారే సంతోషంగా భరించేవారు. అట్టివారి ప్రేమ, విశ్వాసాలు నా ప్రజాసేవకు బాగా ఉపకరించాయి.గత ప్రకరణంలోదక్షిణాఫ్రికాలో నా వకీలు వృత్తి లక్ష్యం ప్రజాసేవయేనని తెలియజేశాను. ప్రజా సేవ చేయడానికి కూడా ప్రజల విశ్వాసం పొందడం చాలా అవసరం. డబ్బు తీసుకొని నేను వకీలు పని చేసినా ఉదార హృదయంతో ప్రజలు నా పనిని సేవా కార్యంగానే భావించారు. జైళ్ళకు వెళ్లవలసి వచ్చినప్పుడు చాలామంది వ్యక్తులు ఆ విషయం ఏమిటో తెలుసుకోకుండానే నా మీద గల ప్రేమ విశ్వాసాల కారణంగా అందుకు సిద్ధపడ్డారు. ఈ విషయాలు రాస్తున్నప్పుడు వకీలు వృత్తి సంబంధించిన ఎన్నో మధురస్మృతులు నా కలాన్ని ఆవహిస్తున్నాయి. చాలామంది కక్షిదారులు నాకు మిత్రులుగా మారిపోయారు. ప్రజాసేవలో నాకు నిజమైన అనుచరులుగా మారి నా కఠోర జీవితాన్ని సరళం చేశారు.

మట్టితో, నీటితో ప్రయోగాలు

నా జీవితంలో నిరాడంబరత పెరిగిన కొద్దీ, రోగాలకు మందు పుచ్చుకోవడమంటే అయిష్టత కూడా పెరిగింది. డర్బనులో వకీలుగా పనిచేస్తున్నప్పుడు డాక్టర్ ప్రాణజీవనదాసు మెహతా నన్ను చూసేందుకు వచ్చేవారు. అప్పుడు నాకు నీరసంగా ఉండేది. అప్పుడప్పుడు వాపు కూడా వస్తూ ఉండేది. ఆయన చికిత్స చేయగా ఆ నలత తగ్గిపోయింది. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చేవరకు చెప్పుకోతగ్గ జబ్బు చేసినట్లు నాకు గుర్తు లేదు.

పర్వతమంత తప్పు

అహమదాబాదు సభ ముగించుకొని నేను నడియాద్ వెళ్లాను. పర్వతమంత తప్పు అని నేను అక్కడ అన్నమాట ఎంతో ప్రచారంలోకి వచ్చింది. అట్టిమాట అది వరకు నేను ఎప్పుడూ అనలేదు. అహమదాబాదులోనే నా తప్పు నాకు స్పష్టంగా కనబడింది. నడియాద్ వెళ్లి అక్కడి పరిస్థితిని గురించి యోచించాను. ఖేడా జిల్లాకు చెంది న చాలామందిని అరెస్టు చేశారని విన్నాను. అక్క డి సభలో ప్రసంగిస్తూ ఖేడా జిల్లా వాసులను, తదితరుల్ని సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొ ని చట్టాల్ని ధిక్కరించమని నేను కోరాను. ఆ కోరికలో తొందరపాటు కలదని నా మనస్సుకు తోచి పైమాట అనేశాను.ఆ తప్పు పర్వతమంతగా నాకు కనిపించింది. ఆ విషయం బహిరంగంగా ప్రకటించే సరికి నన్ను చాలామంది ఎగతాళి చేశారు. అయినా తప్పును ఒప్పుకున్నాను కనుక నాకు పశ్చాత్తాపం కలుగలేదు. ఇతరులు చేసిన ఏనుగంత తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. నీవు చేసిన తప్పును పర్వతమంతగా భావించు. అప్పుడే తప్పులెన్నువారు తమ తప్పులు తెలుసుకుంటారు అను మాట చెల్లుబాటు అవుతుంది. ప్రతి సత్యాగ్రహి ఈ లక్షణాన్ని అలవరుచుకోవాలని నా అభిప్రాయం.

అసలు నాకు పర్వతమంతగా కనిపించిన ఆ తప్పేమిటో కొద్దిగా చెబుతా ను. చట్టాన్ని పూర్తిగా అమలుపరిచినట్టి వ్యక్తులు చట్టాన్ని సవినయంగా ఉల్లంఘించారు. భయం వల్లనే అలా చేస్తారని గ్రహించాలి. ఉల్లంఘించితే శిక్షపడుతుందనేది ఆ భయం. నీతికి అవినీతికి సంబంధించని చట్టాల విషయంలోనే ఇలా జరుగుతుంది. చట్టం ఉన్నా లేకపోయినా మంచివాడు ఎన్నడూ దొంగతనం చేయడు. కాని రాత్రిళ్ళు సైకిలు మీద వెళుతూ లైటు వెలుగుతున్నదా లేదా అని ఎవ్వడూ చూడడు. సామాన్యంగా చట్టవిరుద్ధమైన ఆ చర్యను గమనించడు. గమనించమని కోరినా మంచివాళ్ళు కూడా అందుకు సిద్ధపడరు. కాని అలా చేస్తే శిక్ష పడుతుందని భయం కలిగినప్పుడు మాత్రం అతడు లైటు వెలిగించడానికి సిద్ధపడతాడు. ఈ విధంగా జరిగే నియమపాలనను, స్వేచ్ఛగా జరిగే నియమపాలన అని అనడానికి వీలులేదు. నిజమైన సత్యాగ్రహి చట్టాల్ని స్వేచ్ఛగా పాటిస్తాడు. ఈ విషయం తెలుసుకొని సమాజం లో చట్టాల్ని పాటించునట్టి వారే చట్టాల యొక్క నీతిని, అవినీతిని గురించి నిర్ణయించుటకు అర్హు లు. అట్టివారికే చట్టాన్ని ఆయా పరిస్థితుల్లో, ఆయా పరిధికి గురించి నిర్ణయించుటకు అర్హులు. అట్టివారికే చట్టాన్ని ఆయా పరిస్థితుల్లో, ఆయా పరిధికి లోబడి వ్యతిరేకించే అర్హత ఉంటుంది. అట్టి అర్హత ఉన్నదా లేదా అని గమనించకుండా నేను చట్టాన్ని ఉల్లంఘించమని వారికి చెప్పాను. నా ఈ తప్పు నాకు పర్వతమంతగా కనబడింది.

ఉల్లిపాయల దొంగ

MahatmaGandhii3
తప్పుగా జప్తుచేయబడిన ఒక పొలంలో ఉల్లిగడ్డల పంట ఉన్నది. భయపడిన జనానికి ధైర్యం కలిగించాలనే భావంతో నేను మోహన్‌లాల్ పాండ్యాగారి నాయకత్వాన ఉల్లిగడ్డల్ని పెకిలించమని చెప్పాను. నా దృష్టిలో అది చట్టాన్ని వ్యతిరేకించడం కాదు. చెల్లించవలసిన కొద్ది పన్ను కోసం పంటనంతటినీ జప్తు చేస్తున్నారు. అది మరీ నీతి బాహ్యమైన చర్య. బహిరంగం గా చేస్తున్న దోపిడీయే. అందువల్ల ఇటువంటి జప్తుల్ని ఎండగట్టడం అవసరమని చెప్పాను. ఈ విధంగా చేసినందుకు జైలుకు పంపుతారు సిద్ధపడాలి అని కూడా చెప్పాను. మోహన్‌లాల్ పాండ్యా అందుకు సిద్ధపడ్డా రు. కష్టాలు పడకుండా వ్యతిరేకతను ఎదుర్కోకుండా సత్యాగ్రహం విజయం సాధించడం ఆయనకు ఇష్టం లేదు. పొలంలో ఉన్న ఉల్లిగడ్డల్ని పెకిలించేందుకు సిద్ధపడ్డాడు. ఏడెనిమిది మంది ఆయనకు సాయం చేశా రు.

ప్రభుత్వం వారిని పట్టుకోకుండా ఎలా ఊరుకుంటుంది? పాండ్యాను, ఆయన అనుచరులను ప్రభు త్వం నిర్బంధంలోకి తీసుకున్నది. దానితో ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. జైళ్లకు వెళ్లడానికి జనం సిద్ధపడినప్పుడు రాజదండనకు ఎవ్వరూ భయపడరు. ఆ కేసు విచారణను చూసేందుకు జనం విరుచుకుపడ్డా రు. పాండ్యాకు, వారి అనుచరులకు కొద్దిగా కారాగార శిక్ష విధించబడింది. కోర్టువారిచ్చిన తీర్పు తప్పుల తడక. అసలు ఉల్లిగడ్డల పెకిలింపు దొంగతనం కింద కు రాదు. అయినా అప్పీలు చేయాలని తలంపు ఎవ్వరికీ కలుగలేదు. జైలుకు వెళ్తున్న వారిని సాగనంపుట కు ఉల్లిపాయల దొంగ అను గౌరవం ప్రజల పక్షాన పాండ్యా పొందారు.

ఖిలాఫత్‌కు బదులు గో సంరక్షణా?

MahatmaGandhii2
ఢిల్లీలో ఖిలాఫత్ గురించి యోచించుటకు రాజీకి అంగీకరించాలా లేదా అని నిర్ణయించుట కు హిందూ ముస్లింలు కలిసి ఏర్పాటు చేసిన సమావేశం అది. నవంబర్ మాసంలో ఆ సభ ఏర్పాటు చేయబడినట్లు నాకు గుర్తు. ఆ సమావేశంలో ఖిలాఫత్ విషయం మీదనే గాక గో సంరక్షణను గురించి చర్చ జరుగుతుందని, అందుకు ఇది మంచి తరుణమని అందు వ్రాశారు. నాకు ఆ వాక్యం గుచ్చుకుంది. సమావేశంలో పాల్గొనుటకు ప్రయత్నిస్తానని వ్రాసి ఖిలాఫత్ సమస్యకు గో సంరక్షణ సమస్య ముడివేయడం బేరసారా లు సాగించడం మంచిది కాదని, ప్రతి విషయం మీద దాని గుణదోషాలను బట్టి చర్చించాలని వ్రాశాను. తర్వాత సభ జరిగింది. నేను వెళ్లి అందు పాల్గొన్నాను. జనం బాగా వచ్చారు. అయి తే ఇతర సమావేశాల వలె ఇది హడావుడిగా జరగలేదు. శ్రద్ధానంద కూడా సభలో పాల్గొన్నారు.

నేను యోచించిన విషయాన్ని గురించి వారితో కూడా మాట్లాడాను. నా మాట వారికి నచ్చి, ఆ విషయం సమావేశంలో చెప్పమని ఆయన ఆ పని నాకే అప్పగించారు. డాక్టర్ హకీం సాహెబ్‌తో కూడా మాట్లాడాను. ఇవి రెండు వేరువేరు విషయాలు. వాటి గుణదోషాలను బట్టి యోచించాలి అని నా భావం. ఖిలాఫత్ వ్యవహారం నిజమైతే, గవర్నమెంటు సరిగ్గా వ్యవహరించక అన్యాయం చేస్తే హిందువులు మహమ్మదీయులను సమర్థించాలి, సహకరించాలి. అయితే దానితో గో సంరక్షణను జోడించకూడదు. హిందువులు అలా కోర డం మంచిది కాదు. ఖిలాఫత్ కోసం ముస్లింలు గోవధను ఆపుతామంటే అది సరికాదు. ఒకే గడ్డ మీద ఇరుగుపొరుగున ఉండటం వల్ల గో సంరక్షణకు ముస్లింలు పూనుకొంటే అది వారికి గౌరవం. ఈ విధంగా యోచించాలని నా భావం. ఈ సభ లో ఖిలాఫత్‌ను గురించే చర్చించాలని నా అభిప్రాయం అని స్పష్టంగా ప్రకటించాను. సమావేశంలో అంతా అందుకు అంగీకరించారు. గో సంరక్షణను గురించి సమావేశంలో చర్చ జరగలేదు. అయితే మౌలానా అబ్దుల్ బారా సాహబ్ ఖిలాపత్‌కు హిందువులు సహకరించినా సహకరించకపోయినా మహమ్మదీయులు గో సంరక్షణకు పూనుకోవాలి అని అన్నాడు. ముస్లింలు గోవధను నిజంగా ఆపేస్తారని అనిపించింది.

ఓ బాపూ! జాతిపితా!

ఓ బాపూ! జాతిపితా! ఓ మహాత్మా!
నీజీవితము ఆసాంతము సత్యంతో ప్రయోగాలు
నీతి నిజాయితి మనుగడ నమూనాగ నీ నడవడి.

నీ ఉద్యమాల ఫలితాలు; సత్యహింసల ధ్వజాలు
మనవతా మహాయాత్ర మార్గములో మైలురాళ్లు.

వెలుగుల పైకెత్తి బట్టి నిలిచి వున్న స్తంభాలు
బాపూ! నీ జీవితమే సత్యంతో ప్రయోగాలు.

నీ అడుగు జాడల్లో చైతన్య స్రవంతులు
నీ వాడిన మాటల్లో దుఃఖితులకు ఓదార్పులు.

సోమరులకు హెచ్చరికలు శ్రామికులకు ప్రోత్సాహం
పొరపాటున జారిపడెడు పామరులకు చేయూతలు.

బాపూ నీ వ్యవహారం మానవతకు మణిహారం
బాపూ నీ జీవితచక్రం సత్యంతో ప్రయోగాలు.
పేదవాని బాధనెవడు తనబాధగ గుర్తించునో
వాడేపో వైష్ణవుడని నాడేనాడో పాడినాడు
నరసీ భక్త కవీంద్రుడు తప్పకుండ ఆనాడే
నీవంటి వానినెవనో చూచే వుంటాడు అతడు.

మానవ మాంగల్యానికి నిర్మల జీవనమే సాధనమని
ఆ నడవడి ప్రతి వ్యక్తికి సాధ్యమని
తలచి, చెప్పి, చేసి, చూపి,
ముప్పేటల ఒకే రీతి/ సత్యాహింసల నీతి
బానిసత్వం బాసి బ్రతుకగ
పెత్తనాలను రూపుమాపగ
రక్తము చిందని విప్లవ/ మార్గము ఏర్పరచినావు

భూగోళము యావత్తు
విసిగిన ప్రతి బందీకి
నీ నడవడి ఒరవడైంది
నడచి జయము సాధింపగ
భయదాసులు అగు బడుగుల
పెత్తందారుల ఎదుట దిగులుతో క్రుంగెడి నలుసుల
భయం బాపి, దిగులు దులిపి, నిలిపి, పోరాడజేసి
కనివిని ఎరుగని నేర్పుతో, విజయము సాధించినావు.

- కాళోజీ

862
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles