ప్రయోగాల బాటలో..

Wed,September 11, 2019 01:06 AM

చంద్రయాన్ -2 ప్రయోగం చిట్టచివరి ఘట్టం వరకు విజయవంతంగా సాగి, ల్యాండర్ చంద్రు డిపై పదిలంగా దిగే దశలో మాత్రం నియంత్రణ కోల్పోవడం వల్ల నిరుత్సాహపడవలసిందేమీ లేదు. ఈ మొత్తం కార్యక్రమాన్ని అకుంఠిత దీక్షతో సాగించిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు చంద్రయాన్-2 ద్వారా, మన రోవర్‌ను చంద్రుడి పదిలంగా దించి అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నిలబెట్టాలని భావించారు. కానీ అంతిమ ఘట్టంలో ఎదురైన వైఫల్యం వారిని కల తపరుచడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ దేశ ప్రజలు మాత్రం ఏ మాత్రం చలించకపోగా, శాస్త్రవేత్తలకే ధైర్యం చెప్పారు. దేశ ప్రజల్లో ఇంత నిబ్బరం, ఇంతటి పరిణతి ఎట్లా సాధ్యమైంది? ఈ దేశానికి రోదసీ ప్రయోగాలు కొత్తకాదు. ఆర్యభట్ట మొదలుకొని గత యాభై ఏండ్లుగా అంతరిక్ష ప్రయోగాలు సాగుతూనే ఉన్నాయి. వాటిని కొన్నితరాల దేశప్రజలు గర్వంగా తిలకిస్తూనే ఉన్నారు. దేశ ప్రజలు ఈ చంద్రయాన్-2ను తమ అంతరిక్ష పరిశోధనా యానంలో మరో ముందడుగుగా భావించారు. ఈ ఒక్క తప్పటడుగు వారికి కలత పెట్టలేదు. స్థూలంగా దేశ ప్రజలు ఈ అంతరిక్ష ప్రయోగాలను శాస్త్ర విజ్ఞాన అన్వేషణలో భాగంగా చూస్తున్నారే తప్ప మరే దురభిమానం వారిలో లేదు. సోవియెట్ యూనియన్ సహకారంతో 1969 ఆగస్టులో తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించడం ఇప్పటికీ మన దేశ ప్రజలకు ఒక మధురానుభూతి. సోవియెట్ సహకారంతోనే అంతరిక్షంలో అడుగులు పెట్టిన భారతీయ తొలి వ్యోమగామి రాకేశ్ శర్మ అక్కడి నుంచి ప్రధాని ఇందిరాగాంధీతో మాట్లాడటాన్ని దేశ ప్రజలు టీవీలలో చూసి ఉప్పొంగిపోయారు.

శాస్త్రవేత్తలను బాధపెట్టడం, ఓదార్చడం కాదు నాయకులు చేయవలసింది.
విజ్ఞానవేత్తలను వారి కార్యక్రమాల్లో తదేకంగా నిమగ్నం కానివ్వాలె. శాస్త్ర పరిశోధనల్లో విఫలం కావడం అనేదే తప్పుడు ఆలోచన. వైఫల్యాలు అంటే విజయాలకు దారితీసే ప్రయోగాలు. విజయాలను, వైఫల్యాలను నిర్వికారంగా స్వీకరిస్తూ, ఏ ఒత్తిడి లేకుండా ప్రయోగాలు సాగించే స్వేచ్ఛా ప్రపంచాన్ని మన శాస్త్రవేత్తలకు ఇవ్వాలె. సైన్యం, శాస్త్రవేత్తలు రాజకీయాలకు అతీతమనేది మన ప్రజాస్వామిక వ్యవస్థ లక్షణం.


దేశం ఐదు దశాబ్దాలలో సాగించిన అంతరిక్ష పరిశోధనా ప్రయాణంలో ప్రతి ఒక్కటీ ఒక మైలురాయి. చంద్రయాన్-2 ప్రయోగం పూర్తిగా విఫలం కాలేదు. ఆర్బిటర్‌ను చంద్రుడి సమీప కక్ష్యలో ప్రవేశపెట్టడంలో విజయవంతమయ్యాం. ఆర్బిటర్ నుంచి లాండర్ విడివడి చంద్రుడికి అత్యం త సమీపంగా దాదాపు రెండు కిలోమీటర్ల వర కు చేరుకోగలిగింది. చివరిదశలో ల్యాండర్ నియంత్రణ కోల్పోయింది. కానీ ఆర్బిటర్ విజయవంతంగా చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నది. నిర్దేశిత లక్ష్యానికి మించి ఈ ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ దాదాపు ఏడేండ్లు పరిభ్రమిస్తూనే ఉంటుంది. చంద్రతలాన్ని అత్యంత సునిశితంగా ఫోటోలు తీసి పంపుతుంది. ఈ ఆర్బిటర్ పంపించే పటాల ద్వారా చంద్రుడి పరిణామం, అక్కడి నేల స్వభావం తెలుసుకోవ చ్చు. చంద్రుడిపై ఏయే ఖనిజాలున్నాయనేది తెలుస్తుంది. అక్కడ నీటి జాడలను అన్వేషించ డం అన్నిటి కన్నా ముఖ్యమైనది. భారత్ భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని నిర్మించుకోవాలనే ఆలోచనలో ఉన్నది. ఈ విషయంలో అన్ని దేశాలూ ఆసక్తి చూపుతున్నాయి. ఆర్బిటర్ పంపించే సమాచారం మన దేశానికే కాదు, అమెరికాతో సహా ఇతర దేశాలకు ఎంతో విలువైనది. భవిష్యత్ పరిశోధనలకు పునాది వేస్తుంది. అమెరికా, రష్యా వంటి బడా దేశాలే అంతరిక్ష ప్రయోగాలలో అనేకసార్లు విఫలమయ్యాయి. ఇప్పటివరకు చంద్రుడిని కేంద్రంగా చేసుకొని సాగించిన 109 ప్రయోగాలలో 61 మాత్రమే విజయవంతమయ్యాయి. మిగతావి విఫలమైనా తదుపరి ప్రయోగాలు విజయవంతం కావడానికి బాటవేశాయి. ఇటీవలే ఇజ్రాయెల్ పంపించిన ల్యాండర్ కూడా పదిలంగా దిగడంలో విఫలమైంది. చంద్రయాన్-2 మన దేశం స్వయంగా చేపట్టిన మొద టి యత్నం మాత్రమే.

మన దేశం ఇంకా సాగించవలసిన ప్రయాణం ఎంతో ఉన్నది. గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా త్వరలో మన వ్యోమగాములను రష్యాలో శిక్షణ ఇప్పించవలసి ఉన్నది. మన శాస్త్రవేత్తలు అంగారకుడిపై పరిభ్రమించే మరో ప్రయోగం మంగళ్‌యాన్-2 చేపడుతున్నారు. శుక్రుడిపై పరిశోధల కోసం శుక్రయాన్ ప్రయోగం కోసం రంగం సిద్ధమవుతున్నది. సూర్యుడి కాంతి వలయంపై ప్రయోగాల కోసం ఆదిత్య ఎల్1 ప్రయోగం చేపట్టబోతున్నాం. అంతరిక్షంలో శాశ్వత పరిశోధనా కేంద్రం నిర్మించుకునే ఆలోచన కూడా ఉన్నది. కొంచెం వెనుకా ముందయినా, అడపాదడపా తప్పటడుగులు పడ్డా, ఈ లక్ష్యాలన్నీ భారతీయ శాస్త్రవేత్తలు సాధిస్తారనడంలో సందేహం లేదు. అయితే శాస్త్రవేత్తల, సాంకేతిక నిపుణుల విజయాలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే వికృత పోకడ ఇటీవల ఎక్కువైంది. రాజకీయాలు ప్రవేశించి, ఈ ప్రయోగాలను జాత్యభిమానంతో ముడిపెట్టడం వల్ల శాస్త్రవేత్తలపై తీవ్ర ఒత్తిడి పడుతున్నది. దీంతో శాస్త్రవేత్తలు వైఫల్యాలు ఎదురైనప్పుడు, ఎన్నడూ లేనివిధంగా కంటతడి పెట్టి బావురుమంటున్నా రు. శాస్త్రవేత్తలను బాధపెట్టడం, ఓదార్చడం కాదు నాయకులు చేయవలసింది. విజ్ఞానవేత్తలను వారి కార్యక్రమాల్లో తదేకంగా నిమగ్నం కానివ్వాలె. శాస్త్ర పరిశోధనల్లో విఫలం కావడం అనేదే తప్పుడు ఆలోచన. వైఫల్యాలు అంటే విజయాలకు దారితీసే ప్రయోగాలు. విజయాలను, వైఫల్యాలను నిర్వికారంగా స్వీకరిస్తూ, ఏ ఒత్తిడి లేకుండా ప్రయోగాలు సాగించే స్వేచ్ఛా ప్రపంచాన్ని మన శాస్త్రవేత్తలకు ఇవ్వాలె. సైన్యం, శాస్త్రవేత్తలు రాజకీయాలకు అతీతమనేది మన ప్రజాస్వామిక వ్యవస్థ లక్షణం.

210
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles