ఇంకెన్నాళ్లు?

Mon,September 9, 2019 12:43 AM

నవయుగంబున నాజీవృత్తుల/ నగ్న నృత్య మింకెన్నాళ్ళు?
పోలీసు అండను దౌర్జన్యాలు/ పోషణ బొందేదెన్నాళ్ళు?
దమననీతిలో దౌర్జన్యాలకు/ దాగిలిమూతలు ఎన్నాళ్ళు?
కంచెయె చేనును మేయుచుండగా/ కాంచకుండుటింకెన్నాళ్ళు?
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకొని/ దొరలై వెలిగే దెన్నాళ్ళు?
బాధలు పెట్టి పలుకనీయని/ పావులభయ మింకెన్నాళ్ళు?
హింసపాపమని యెంచు దేశమున/ హిట్లరత్వమింకెన్నాళ్ళు?
పగటి దోపిడుల నాపగలేని/ ప్రభుత్వముండేదెన్నాళ్ళు?
ప్రజాదరణ గోల్పోయి దేశమును/ పాలనజేసే దెన్నాళ్ళు?
పగటి వేషములు యెన్ని వేసినా/ పాపము దాగే దెన్నాళ్ళు?
పాపపుకుండ బ్రద్దలు కాక/ భద్రంగుండే దెన్నాళ్ళు?
ప్రజా నాయకుల ప్రకటన/ తప్పను ప్రభుత్వపత్రాలెన్నాళ్ళు?
ప్రతిష్ఠ పేరిట తప్పుల దాచే/ పాడు పద్ధతింకెన్నాళ్ళు?
శాంతిభద్రతల పేర దుష్టతను/ సమర్థించుటింకెన్నాళ్ళు?
తత్వభేదమని మనలో మనకే/ తన్నులాటలింకెన్నాళ్ళు?
సంఘసేవకులపై దౌర్జన్యము/ సాగనిచ్చుటింకెన్నాళ్ళు?
విప్లవగాథలు వినుచు అందరు/ వేచియుందురింకెన్నాళ్ళు?
అగ్గికొండలో నగ్నిజ్వాలలు/ అణగియుండు నింకెన్నాళ్ళు?
ఫలితము లేక పావుల కొరకీ/ పాడు కష్టమింకెన్నాళ్ళు?
ప్రజాశక్తికి పరీక్ష సమయము/ ప్రతీక్ష మన కింకెన్నాళ్ళు?
దౌర్జన్యము నెదిరించక మనకీ/ దాసోహం ఇంకెన్నాళ్ళు?
పురుషులపై కాపురుషులు/ విజయం పొందుచుందురింకెన్నాళ్ళు?
సంక్రాంతి పురుషుడు దుష్టతపైన/ స్వారీ చేయ డింకెన్నాళ్ళు?
కలముపోటున కదపజాలని/ కావ్యగాన మింకెన్నాళ్ళు?
కాలోజికవి కైతలు వినియు/ కదలకుందురింకెన్నాళ్ళు?

- కాళోజీ

85
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles