పండిత్‌జీ పటేల్ వేరుకాదు

Sat,August 17, 2019 12:17 AM

2019 ఆగస్టు4 ఆదివారం అర్ధరాత్రి నుంచి కశ్మీరులో ఏం జరుగుతున్నదో స్వతంత్ర భారత్‌లో ఎవరికీ తెలియకపోవచ్చు. ఈ దేశంలో అసలు సమాచారం అందకుండా అడుకట్టలు వేయవచ్చు. కాని, అమెరికాలో, బ్రిటన్‌లో, రష్యాలో, ఫ్రాన్సులో, చైనాలో ప్రపంచమంతట ఈ సంగతులన్నీ వెంట వెంటనే తెలుస్తున్నాయి. పటేల్ వయసులో జవహర్ లాల్ కంటే పధ్నాలుగేండ్లు పెద్దవాడు. తన తరువాత జవహర్ తన భాష మాట్లాడుతాడని గాంధీజీ అన్నారు. తన కంటే పదకొండు ఏండ్లు చిన్నవాడైన జవహర్ లాల్ తన కన్న పదకొండు వందల రెట్లు గొప్పవాడని రాజాజీ అన్నారు. ఇవన్నీ ఈనాటి దేశభక్తులు,నెహ్రూను విమర్శించే వాళ్లు వినవలసిన మాటలు.

Prabhakar-Raooo
మోదీజీ రెండవ అంకంలో నవభారత నిర్మాణం నినాదానికి అనుగుణంగా, కశ్మీర్‌ను భూతల స్వర్గంగా మార్చే ఉద్దేశంతో జమ్ముకశ్మీరు రాష్ర్టానికి జబర్దస్త్ తాళాలు వేసి అనేక ఆంక్షలతో, కనీవినీ ఎరుగని రీతిలో సాయుధ బలగాల మోహరింపుతో పక్కా బందోబస్తు చేశారు. మనుషులు బయటికి వచ్చే అవకాశం లేదు గనుక రాజధాని శ్రీనగర్‌తో సహా రాష్ట్రమంతట, అన్నిప్రాంతాల్లో, పట్టణాలలో, ఊరూర అన్నీ బంద్. నిర్మానుష్యం. శ్మశాన వాతావరణం. ప్రమాదకర, అత్యంత క్లిష్ట పరిస్థితిలో విధించే కర్‌ఫ్యూను విధించలేదు అధికారికంగా కానీ, కర్‌ఫ్యూతాత వచ్చినట్లుంది. పన్నెండురోజుల నుం చి జమ్ముకశ్మీరులో, విశేషించి కశ్మీరులో ప్రతి ఇల్లు ఒక బందీఖానగా మారింది. చిన్నా పెద్దా అన్న భేదం, తారతమ్యం లేకుండా కశ్మీరులో ప్రతి వ్యక్తి ఒక ఖైదీ. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులకు, ఇంకెందరో నేతలకు ఈ పన్నెండు రోజుల నుంచి గృహ నిర్బంధం. ఆంక్షలు, నిర్బంధాల వాతావరణంలో, భయభ్రాంతుల నడుమ బక్రీదు వచ్చింది, పోయింది. కశ్మీరు ప్రజల మంచి కోసమే, కశ్మీరును ఒక స్వర్గసీమగా మార్చడానికే ఇదంతా అవసరమైందని అంటున్నారు మన ఏలికలు. ఒక ఘనకార్యం చేయడానికి ఇదంతా జరుగక తప్పదని చెపుతున్నారు. 2019 ఆగస్టు 4 నడిరాత్రి నుంచి (ఆగస్టు 5వ తేదీన ఇండియన్ పార్లమెంటు 370, 35ఏ ఆర్టికల్స్ రద్దుకు, తద్వారా గత 70 ఏండ్ల నుంచి జమ్ముకశ్మీరు రాష్ర్టానికి సంతరించిన ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకు ఆమోదముద్ర వేయడానికి కొన్నిగంటల ముందు నుంచి) జమ్ముకశ్మీరులో, ముఖ్యంగా కశ్మీరులో ఏం జరుగుతున్నదో ఈ దేశంలో సామాన్య ప్రజాకోటికి తెలియడం లేదు. కశ్మీరులో అంతా సవ్యంగా, ప్రశాంతంగా ఉం దని అనుకోవడానికి భారత జాతీయ భద్రతా సలహాదారు శ్రీనగర్‌లో ఓ నలుగురి మధ్య నిల్చుని బిర్యానీ తింటున్న ఒక ఫోటోను మీడియా లో ప్రచారంలోకి తెచ్చారు. కశ్మీరులో ఎవరూ ఇబ్బందులపాలు కావడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది.

2019 ఆగస్టు4 ఆదివారం అర్ధరాత్రి నుంచి కశ్మీరులో ఏం జరుగుతున్నదో స్వతంత్ర భారత్‌లో ఎవరికీ తెలియకపోవచ్చు. ఈ దేశంలో అస లు సమాచారం అందకుండా అడుకట్టలు వేయవచ్చు. కాని, అమెరికా లో, బ్రిటన్‌లో, రష్యాలో, ఫ్రాన్సులో, చైనాలో ప్రపంచమంతట ఈ సంగతులన్నీ వెంట వెంటనే తెలుస్తున్నాయి. 370, 35ఏ ఆర్టికల్స్‌ను రద్దుచేసి, జమ్ముకశ్మీరు ప్రాంతాలను ఒక కేంద్రపాలిత రాష్ట్రంగా, లడక్‌ను మరో కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ మోదీజీ ప్రభుత్వం చేసిన నిర్ణయంపట్ల కశ్మీరులో ఆగస్టు 4నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైందని, భద్ర తాబలగాలపై పలు చోట్లపెద్ద ఎత్తున కశ్మీరీలు ముందుకు వచ్చి రాళ్లు రువ్వారని, భద్రతా బలగాల తుపాకి కాల్పులలో అనేకులు గాయపడ్డారని రాయిటర్ తదితర వార్తా సంస్థలు పంపిన వార్తలు పాశ్చాత్యదేశాల్లో బహుళ ప్రచారం పొందుతున్నాయి. కశ్మీరులో మానవహక్కులకు విఘాతం కలుగుతున్నదని, ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలుపరిచి కశ్మీరు సమస్యను పరిష్కరించాలని బ్రిటిష్ పార్లమెంటులో లేబర్ పార్టీ నాయకుడు జెరెమి కార్బిన్ ప్రకటించారు. 72 ఏండ్ల కిందట టోరీస్ పార్టీ అధినేత, అప్పటి ప్రధాని సర్ విన్‌స్టన్ చర్చిల్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ లేబర్ పార్టీ భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని బలపరచడం చారిత్రక సత్యం. అమెరికాలో గూడ ఇటువంటి ప్రకటనలు వెలువడుతున్నాయి. మోదీ ప్రభుత్వం కశ్మీరు విషయంలో తీసుకున్న నిర్ణయాలతో కశ్మీరు అంతర్గత సమస్యగా మిగలకుండా అంతర్జాతీయ సమస్యగా మారే ప్రమాదం కన్పిస్తున్నది.

370, 35ఏ ఆర్టికల్స్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలో మోదీ ప్రభుత్వం ఆగస్టు 5 నిర్ణయాలు చేయడం సమంజసం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కశ్మీర్ ప్రజలు మరి కొంతకాలం ఆంక్షలను, నిర్బంధాలను, అసౌకర్యాలను ఎదుర్కోక తప్పదని, ఇది (కశ్మీరు) క్లిష్ట, సున్నిత సమస్య గనుక సాధారణ పరిస్థితి నెలకొనడానికి ప్రభుత్వానికి కొంత సమయం పడుతుందని ఇటీవల సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తన విచారణలో ఉన్న క్లిష్ట సమస్యను మరింత క్లిష్టం ఎందుకు చేశారని సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. రేపు ఇదే మోడస్ ఆపరాండీతో అయోధ్యలో అసాధారణరీతిలో సాయుధ బలగాల మోహరింపు జరుగుతుంది. పలు ఆంక్షలు అమలులోకి వస్తా యి, అయోధ్యలో హఠాత్తుగ రామాలయ నిర్మాణం జరుగుతుంది. అయోధ్య వివాదం గూడ సుప్రీంకోర్టులో నలుగుతున్నది. తన విచారణలో ఉన్న అంశంపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకున్నదని సుప్రీంకోర్టు రేపుగూడ ప్రశ్నించకపోవచ్చు!

కశ్మీరు సమస్యను క్లిష్ట సమస్యగా మార్చింది ఎవరు? 72 ఏండ్ల కిందట బ్రిటిష్ ఇండియాకు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగి స్వాతం త్య్రం సిద్ధించినప్పుడు స్వదేశీ సంస్థానాల విలీనం సమస్య ఎదురైంది. భారత్‌లో లేక పాకిస్థాన్‌లో విలీనం కావడానికి సంస్థానాధిపతి, సంస్థాన ప్రజలు సమ్మతించాలని బ్రిటిష్ పాలకులు షరతు పెట్టారు. హైదరాబాద్ సంస్థానాధిపతి నిజామ్ భారత్‌లో విలీనానికి అంగీకరించలేదు. హైదరాబాద్ సంస్థానం ప్రజలు భారత్‌లో విలీనం జరుగాలన్నారు. జమ్ముకశ్మీరు సంస్థానాధిపతి హరిసింగ్ మొదట భారత్‌లో విలీనానికి అంగీకరించలేదు, కశ్మీరు ప్రజల అభిప్రాయాలకు నాడు ప్రాతినిధ్యం వహిస్తున్నది కశ్మీరు నేషనల్ కాన్ఫరెన్సు పార్టీ అధినేత షేర్ కశ్మీర్‌గా ప్రసిద్ధి చెం దిన షేఖ్ అబ్దుల్లా. పాక్ మూకలు దాడులు చేసి రాజధాని శ్రీనగర్ వరకు వచ్చిన పిదప (కశ్మీర్ కొంత భూభాగాన్ని ఆక్రమించి) కశ్మీరు మహారాజు హరిసింగ్ భారత్‌లో విలీనానికి అంగీకరించాడు.

హరిసింగ్‌ను, షేఖ్ అబ్దుల్లాను భారత్‌లో విలీనానికి ఎంతో కృషి చేసి అంగీకరింపజేసింది ప్రథమ ప్రధాని నెహ్రూ. స్వయం ప్రతిపత్తి కల్పించి కశ్మీరు ప్రజల హక్కులకు, అస్తిత్వానికి (కశ్మీరియత్‌కు) రక్షణ కల్పిస్తామని నెహ్రూ హామీ ఇచ్చినందువల్లనే షేఖ్ అబ్దుల్లా విలీనానికి అంగీకరించాడన్నది చరిత్ర. కశ్మీర్ ప్రజల ప్రయోజనాలకు భంగకరంగా షేఖ్ అబ్దుల్లా దారి తప్పుతున్నాడని తెలిసినప్పుడు షేఖ్ అబ్దుల్లాను పదవి నుంచి తొలిగించి, తనకు అత్యంత సన్నిహితుడైన ఆయనను (అబ్దుల్లాను) పదకొండు ఏండ్లు జైలులో నిర్బంధించడానికి జవహర్ లాల్ వెనుకాడలేదు. మతోన్మాదశక్తులు అడుగుపెట్టి ప్రాబల్యం వహిస్తే కశ్మీరు సమస్య క్లిష్టమవుతుందని నెహ్రూ 70 ఏండ్ల కిందటనే హెచ్చరించాడు. అటు పాక్ మతోన్మాదులకు, ఇటు భారత్ మతోన్మాదులకు కలహ భూమిగా, రణరంగంగా (విశేషించి గత ఐదేండ్ల నుంచి) మారినందువల్లనే కశ్మీర్ సమ స్య ఇంత తీవ్ర స్వరూపం ధరించింది.

ఒక్క సైనికుడి అవసరం లేకుండానే, ప్రత్యేక పోలీసు దళాలను అబద్ధమాడుతూ మోహరించకుండానె ఎవరినీ అరెస్టు చేయకుండానే ప్రజాస్వామ్య పంథాలో అయిదు వందలకు మించిన సంస్థానాలను భారత్‌లో విలీనం చేసిన పటేల్ పాత్ర ఓనమాలు తెలియనివారు పటేల్‌ను భుజాలమీద ఎత్తుకుని పటేల్ తమ వాడని ఆత్మవంచన చేసుకుంటున్నారు. జవహర్ లాల్‌ను విలన్‌గా చిత్రిస్తున్నారు. కశ్మీర్ విషయంలో నెహ్రూకు తనకు మధ్య విభేదాలు లేవని పటేల్ 1947 అక్టోబర్ 8 నాడు జవహర్ లాల్‌కు రాసిన ఒక లేఖలో ఈ మాటలతో స్పష్టం చేసారు.. Nor am I aware of any difference between you and me on matters of policy relating to Kashmir. Still it is most unfortunate that persons down below should think that there is gulf between us. It is also distressing to me... జవహర్ లాల్‌ను బూతు మాటలతో దూషిస్తూ దిగజారుతున్న వారు పటేల్ ఆత్మను క్షోభింపచేస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ వంటివి వాటికి సంపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తి కావాలంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్ వంటి వి కూడా ప్రత్యేకస్థాయి కావాలంటున్నాయి. ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యే క ప్రతిపత్తి పొందిన జమ్ముకశ్మీరు 70 ఏండ్ల స్థాయిని కేవలం ఆరు గంట ల్లో కోల్పోయి కేంద్రపాలన కిందికి రావడం ఒక దుష్టపరిణామం.

పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారని ఇంతకు ముందు అద్వానీ, చంద్రబాబు యుగళ రోదనం విన్పించారు. మరో పెద్ద మనిషి మొన్న అదే మాట అన్నాడట. ఓటింగ్ సమయాన పార్లమెంట్ తలుపులు మూయడం పార్లమెంటరీ సంప్రదాయమే. కానీ కశ్మీరుకు తాళం వేసి పార్లమెంట్‌లో ఓటింగ్ జరుపడం మాత్రం పార్లమెంటరీ సంప్రదాయం కాదు. అటల్ బిహారీ వాజపాయ్ అందంగా పలికిన కశ్మీరియత్, జమ్‌హూరియత్, ఇన్సానియత్ పక్కన వైషియత్, హైవానియత్ వచ్చి చేరాయి! అయ్యో, రామ! స్వాతంత్య్రానంతరం జవహర్‌లాల్ తన మంత్రివర్గంలో చేరడానికి వల్లభ్‌భాయ్‌పటేల్‌ను ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తూ 1947 ఆగస్టు 3న పటేల్ రాసిన లేఖలోని వాక్యాలు.. Our attachment and affection for each other and our comradeship for an unbroken period of nearly 30 years admit of no formalities. My services will be at your disposal, I hope, for the rest of my life and you will have unquestioned loyalty and devotion from me in the cause for which no man in India sacrificed as much as you have done..అంటూ జవహర్ లాల్‌కు తాను జీవితాంతం విధేయుడినని ఈ మాటల్లో పటేల్ స్పష్టం చేశారు. పటేల్ వయసులో జవహర్ లాల్ కంటే పధ్నాలుగేండ్లు పెద్దవాడు. తన తరువాత జవహర్ తన భాష మాట్లాడుతాడని గాంధీజీ అన్నారు. తన కంటే పదకొండు ఏండ్లు చిన్నవాడైన జవహర్ లాల్ తన కన్న పదకొండు వందల రెట్లు గొప్పవాడని రాజాజీ అన్నారు. ఇవన్నీ ఈనాటి దేశభక్తులు, నెహ్రూను విమర్శించే వాళ్లు వినవలసిన మాటలు.

293
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles