తెలంగాణ తెహజీబ్‌ను కాపాడుకుందాం

Sat,August 10, 2019 01:05 AM

టీవీఎస్ మూడవ రాష్ట్ర మహాసభ
హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి టీవీఎస్ మూడవ రాష్ట్ర మహాసభ ప్రాంభమవుతుంది. దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరుగు సభలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఢిల్లీ యూనివర్సిటీ అచార్యులు ప్రొఫెసర్ నీరా చందోక్ మతతత్వ రాజకీయాలు-ప్రజాస్వామ్య శక్తుల పాత్ర అనే అంశంపై ప్రారంభోపన్యాసం చేస్తారు. మాడభూషి శ్రీధర్ సమాఖ్య స్ఫూర్తి-ఎదురవుతున్న సవాళ్లు అనే అంశంపై, పరాంకుశం వేణుగోపాల స్వామి తెలంగాణ సామాజిక ఐక్యత-సవాళ్లు-పరిష్కారాలు అనే అంశంపై ప్రసంగిస్తారు. గౌరవ అతిథులుగా డాక్టర్ నందిని సిధారెడ్డి, అయాచితం శ్రీధర్, ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, దేవి ప్రసాదరావు, ఓ.నర్సింహారెడ్డి, కె. సీతారామారావు తదితరులు హాజరవుతారు. అందరికీ ఆహ్వానం.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పరాయి పెత్తందారులు అనేకరీతుల్లో ఇక్కడి సమాజాన్ని, ఆర్థికవ్యవస్థను, పరిపాలనను ఛిన్నాభిన్నం చేయడానికి ఎత్తుగడలు పన్నిన విష యం తెలిసిందే. ఆరు దశాబ్దాలకు పైగా పరాయి పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణ సమాజం అతివేగంగా కోలుకోవాలంటే రాజకీయ, సామాజికాది శక్తులన్నీ ఏకతాటిపై నడువాలె. తమ భవిష్యత్తు పట్ల స్పష్టత కలిగి ఉండాలె. తెలంగాణ అవతరించిన తర్వాత కూడా మన సమాజానికి అండగా ఉంటూ, మార్గదర్శకంగా వ్యవహరించే ఒక సంస్థ అవసరం ఏర్పడ్డది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పాటు పోరాడిన ఉద్యమకారులు ఏర్పాటుచేసిందే తెలంగాణ వికాస సమితి (టీవీఎస్). తెలంగాణ వికాస సమితి ఏర్పడిన వెంటనే అతివేగంగా కార్యరంగంలోకి దిగి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుండి పోరాడింది. తెలంగాణను అస్థిరత్వం పాలు చేయతలపెట్టిన పరాయిశక్తులను ఎండగడుతూ ప్రజలను జాగృతం చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రా ఆధిపత్యశక్తులు పెట్టించిన నిబంధనల మూలంగా అనేక సమస్యలు తలెత్తా యి. గవర్నర్‌కు అధికారాలు, ఏపీ హైదరాబాద్‌ను పదేండ్ల పాటు రాజధానిగా వాడుకోవడం, తొమ్మిదవ, పదవ షెడ్యూలు విభజన మొదలైన అంశాలను ఆసరాగా చేసుకొని శాశ్వతంగా ఇక్కడే తిష్టవేసి, విభజనను ఆచరణలో నిర్వీర్యం చేయాలనే కుట్ర సాగింది.

ఇటువంటి కీలక సందర్భంలో తెలంగాణ పరిరక్షణ కోసం టీవీఎస్ చొరవచూపింది. తెలంగాణ కు న్యాయంగా దక్కవలసిన నీటి వాటాను ఎత్తగొట్టడానికి పరాయి పాలకులకు అనుకూలంగా ఉండేశక్తులు అవరోధాలు సృష్టించాలని యత్నించాయి. టీవీఎస్ ఈ కుతంత్రాలను పసిగడుతూ వాటికి వ్యతిరేకంగా పోరాడింది. తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచి, జయశంకర్ సార్ చెప్పినట్టు ఉద్యమ రాజకీయశక్తుల ఐక్యతకు కట్టుబడ్డది.
రాష్ర్టావతరణ జరిగిన వెంటనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీచేసి కేంద్రం తన పక్షపాతాన్ని చాటుకున్నది. ఏపీ పాలకవర్గ కుయుక్తులే ఇందుకు కారణం. టీవీఎస్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. అక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని బయటి ప్రపంచానికి చాటింది. విభజన చట్టంలోని నిబంధనల విషయంలోనూ తెలంగాణ అస్తిత్వానికి భంగకరంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వ తీరు పై టీవీఎస్ పోరాడింది. ఏపీ పాలకవర్గం తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమించింది. తెలంగాణ రాష్ట్రంలో తలదూరిస్తే ప్రజలు ఆగ్రహిస్తారనే హెచ్చరికను ఆంధ్ర పాలకులకు అందించడంలో టీవీఎస్ విజయవంతమైంది. తెలంగాణలోని ఆంధ్రా పాలకుల పెంపుడు సంఘాలు, మేధావులు ప్రజలను తప్పుదోవపట్టించి, ఆంధ్రా పాలనకు బాట వేయాలనే కుయుక్తులు చేసినప్పుడు తిప్పికొట్టింది.

తెలంగాణ సమాజ సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన చర్చలను, కార్యాచరణను తెలంగాణ వికాస సమితి చేపట్టింది. మహబూబ్‌నగర్ జిల్లావాసుల వలసలను అధ్యయనం చేసి సూచనలు చేసింది. చెంచుల జీవనపరిస్థితులు, వారి సాంస్కృతిక పరిరక్షణ, వికాసంపై అధ్యయనం సాగించింది. విద్యా రంగంలో సంస్కరణలకు సంబంధించి చర్చాగోష్ఠిని నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చా కార్యక్రమాలను నిర్వహించింది. సింగరేణి ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ లోపభూయిష్టంగా ఉండటంతో దానిని రద్దుచేయించి, స్థానికులకు అవకాశం కల్పించే కొత్త జీవో విడుదల చేయించడంలో టీవీఎస్ సఫలమైంది. హుస్నాబాద్ ప్రాంతంలోని మహాసముద్రం గండిని పూడ్చటానికి ఆంధ్ర పాలకులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే టీవీఎస్ ఈ సమస్యను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. టీవీఎస్ ప్రయత్నాలు ఫలించి, రాష్ట్ర ప్రభుత్వం సహజసిద్ధ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. వ్యవసాయ విధానంపై సమగ్ర చర్చ నిర్వహించాం. జిల్లాల సమస్యలను అనేకం చేపట్టి ఎక్కడిక్కడ పరిష్కారం కోసం టీవీఎస్ ఎంతో నిర్మాణాత్మక కృషి సాగించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కొంత మంది చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టి, కవులు రచయితలను ప్రాజెక్టు సందర్శనలకు తీసుకుపోయింది. దళితులు, గిరిజనులు ఇతర బలహీనవర్గాల సంక్షేమానికి కృషిసాగించింది.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో మతవా ద శక్తుల ప్రాబల్యం ప్రమాదకరమని గుర్తించి టీవీఎస్ ముందునుంచే ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. తిరోగమన శక్తులు డిమానిటైజేషన్ బ్లాక్‌మనీని నిర్మూలించేందుకనే తప్పుడు ప్రచారం ఉధృతంగా సాగిస్తూ, ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నప్పుడు టీవీఎస్ చొరవ తీసుకొని డిమానిటైజేషన్ ప్రమాదాన్ని వివరించేవిధంగా 2016 నవంబర్‌లో చర్చాగోష్ఠిని నిర్వహించింది. 2017 అక్టోబర్‌లో లౌకిక విలువలపై దాడులు- బుద్ధిజీవుల కర్తవ్యంపై సదస్సును నిర్వహించాం. మోదీ నాయకత్వంలో ని బీజేపీ రెండవసారి కేంద్రంలో అధికారానికి వచ్చిన నేపథ్యంలో మతవాద పోకడలను అడ్డుకోవాలని తీర్మానించింది. ఇందుకు అనుగుణంగానే మతవాదానికి వ్యతిరేకంగా ఆగస్టు పదవ తేదీన ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు, సామాజిక వికాసానికి, లౌకికవాద సం స్కృతీపరిరక్షణకు తెలంగాణ వికాస సమితి చేస్తున్న కృషిలో భాగస్వాము లు కావలసిందిగా కవులు, రచయితలతో సహా చైతన్యవంతులకు టీవీఎస్ పిలుపునిస్తున్నది.
- తెలంగాణ వికాస సమితి

237
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles