170 ఏండ్ల నాటి కరీంనగర్

Mon,August 5, 2019 01:04 AM

మన గురించి మన పూర్వీకుల గురించి తెలుసుకోవడం. అందులో మనను ఐడెంటిఫై చేసుకోవడం ఓ అద్భుతమైన అనుభూతి. వేల ఏండ్ల నాటి అంశాలు ఉన్నది ఉన్నట్టు పట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు గాని.. కనీసం వంద, రెండు వందల ఏండ్లనాటి పురాతన పుస్తకాల్లో ఉన్న చరిత్రనైనా వెలికితీసి భావితరాలకు అందించడం మాత్రం అవసరమే.

వేములవాడ: హవేలీ పరగణా జాగీరు పరిధిలోని ఈ గ్రామం అగ్రహారంగా ఉండేది. 2909 జనాభా కాగా అందు లో 642 మంది బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారే. వేములవాడ జాగీరు కిందికి వచ్చే గ్రామమే అయినా అగ్రహా రం కావటం వల్ల జాగీర్దారుకు ఏ హక్కూ ఉండేది కాదు. ఈ గ్రామంలో పాలన , పన్నుల వసూలు అధికారం బ్రాహ్మణులచేతిలో ఉండేది. వందల ఏండ్ల కిందటే గ్రామంలో రాజేశ్వర ఆలయ నిర్వహణ నిమిత్తం ఆనాటి రాజులు బ్రాహ్మణులకు గ్రామాన్ని దానంగా ఇచ్చారు.

madrasjournalofl
కరీంనగర్ ఉత్తర తెలంగాణలో చారిత్రకంగా రాజకీయం గా, ఆర్థికంగా సామాజికంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన జిల్లా. ఎందరెందరో మేధావులు నాయకులను అందించిన జిల్లా. చరిత్రలో తొలి శాతవాహన రాజ్యం ఏర్పడిన జిల్లా. జైన, బౌద్ధ, వీరశైవ, వైదిక, శాక్తేయ తదితర మతాలన్నీ విలసిల్లిన జిల్లా. తొలి తెలుగు పద్యం అందించిన జిల్లా. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న కరీంనగర్ 1850 ప్రాంతంలో ఎలా ఉండేదో ఆనాడు హైదరాబాద్ రాజ్యంలో ఉద్యోగరీత్యా కొంతకాలం నివసించిన ఒక బ్రిటిష్ సర్జన్ ది మద్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచ ర్ అండ్ సైన్స్‌లో వివరించారు. కరీంనగర్ జిల్లా 1850 ప్రాంతంలో హైదరాబాద్ రాజ్యం లో ఎలగందుల్ సర్కార్‌గా ఉండేది. ముఖ్యపట్టణం కూడా ఎలగందలే. ఇవాల్టి కరీంనగర్ ఆనాడు ఒక మామూలు గ్రామం. అయితే అక్కడ పెద్ద ధాన్యం మార్కెట్ ఉండేది. భౌ గోళికంగా చూస్తే ఎలగందుల సర్కార్‌కు ఉత్తరాన గోదావరి నది, ఈశాన్యంలో రామగిరి, వాయువ్యంలో నాందేడ్, దక్షి ణ భాగంలో ములంగూరు, మెదక్ జిల్లాలుండేవి. తూర్పున విజయగిరి-వెలిచాల్ పరగణాలుండేవి. ఉత్తర దక్షిణాలుగా 69 మైళ్లు, తూర్పు పడమరలుగా 48 మైళ్ల మేర ఎలగందుల భూ భాగం విస్తరించి ఉండేది.

ఇదీ స్వరూపం..: ఎలగందుల సర్కార్ పరిధిలో 19 పరగణాలు, తాలూకాలుండేవి. ఇవి కట్కూరు, నిజామాబాద్ హవే లీ, రాచెర్ల, విజయగిరి-వెలిచాల, నందగిరి-నమిలకొండ, కోరుట్ల, శనిగరం, దీకొండ, పొలాస, అంతగిరి, వేంపల్లి, నామపల్లి, కోరెం, మానకొండూరు, వెల్తె, వేములవాడ, వెల్లా ల, నుస్తులాపురం, అర్షకోట. వీటి పరిధిలో మొత్తం గ్రామాల సంఖ్య 981కాగా అదనంగా మరో 51 జాగీరు పల్లెలుండేవి.జలవనరుల విషయానికి వస్తే ఆనాటి గణాంకాల ప్రకారం ఎలగందుల పరిధిలో 665 భారీ చెరువులలోపాటు మొత్తం 3120 చెరువులుండేవి. ఇవిగాక 13,086 బావులు, 5493 మోట బావులు అదనం. నిరంతరం ప్రవహించే నదులు వాగు ల ద్వారా నిండే ఆరు భారీ చెరువులు.. రాచర్ల, ఎల్లారెడ్డిపేట, ఆవునూరు, ఎమలకుర్తి, శనిగరం, వేములవాడ చెరువుల కిం ద పెద్ద ఎత్తున సేద్యం జరిగేది. ఇందులో హరిదాస్ జాగీరు పరిధిలోకి వచ్చే ఎల్లారెడ్డిపేట, శనిగరం చెరువుల కిందనే సుమారు 3 వేల బిగాల భూమి సాగు జరిగేది. ఇలా కాల్వలు, చెరువులు, మోటబావులు, బావుల కింద సుమారు 84 మైళ్ల భూ భాగంలో సేద్యం జరిగేది.

నాటి పట్టణాలు..ప్రత్యేకతలు: ముఖ్య పట్టణమైన ఎలగందులలో 4,376 జనాభా ఉండేది. గ్రామ సమీపంలో పెద్దకో ట చుట్టూ భారీ కందకం ఉండేది. కోటకు నాలుగువైపులా ఎత్తై న బురుజులతో పాటు 8 ఫిరంగులుండేవి. కోటలో ఒక ఖిలాదారు 28 మంది ఉద్యోగులుండేవారు. జాగీరు కిందికి వచ్చే ఈ ప్రాంత రెవెన్యూ ఆదాయం సుమారు రూ.3705. ఇక్కడ వారాంతపు సంత జరిగేది. తర్వాత సర్కారు పరిధిలో రెండో ప్రధాన పట్టణం జగిత్యాల. ఇది పొలాస పరిధిలోని జాగీరు పట్టణం. తొలుత దీవెకొండ, పొలాస పరగణాలు రెండింటికి కస్బాగా ఉండేది. కారణాంతరాల వల్ల దీవెకొండ గ్రామం శిథిలమై పోగా పొలాస అగ్రహారంగా మారింది. దీనితో దీన్ని జాగీరు కిందికి తెచ్చారు. 516 ఇండ్లు 2812 మంది జనాభా తో చూడముచ్చటైన పట్టణంగా జగిత్యాలకు పేరుండేది. విశాలమైన వీధులు, పెద్ద ప్రాంగణాల మధ్య ఇండ్లు కట్టుకోవడం ఇక్కడి ప్రత్యేకత. నేత, కాలిజోళ్ల పరిశ్రమకు కూడా జగిత్యాల పేరుపడింది. ఇక్కడ 112 నేత మగ్గాల మీద ఏటా రూ. 10, 141 విలువైన 1141 చీరెలు నేసేవారు. పట్టణానికి ఈశాన్యం లో మైలుదూరంలో చిన్న కోట ఉండేది. 90 ఏండ్ల క్రితం (1770) దుర్రా సాహెబ్ అనే రాజోద్యోగి ఒక ఫ్రెంచ్ ఇంజినీ ర్ సహాయంతో దీన్ని నిర్మించాడని ప్రచారంలో ఉన్నది. గంభీరావుపేట్: ఇది రాచర్ల పరగణా కింది కస్బాగ్రామం. వ్యవసాయానికి పెట్టింది పేరు. ఇక్కడ 505 ఇండ్లలో నివసిం చే 2405 మంది జనాభా మొత్తానికి మొత్తం వ్యవసాయదారులే. పరగణా ముఖ్య గ్రామం రాచర్లలో గతంలో మహమ్మా రి ప్రబలి గ్రామం పూర్తిగా ఖాళీ అయింది. వ్యవసాయ భూములు అడవులుగా మారిపోయాయి.

కోరుట్ల: ఇది కోరుట్ల పరగణాలోని కస్బా గ్రామం. పెద్దవా గు ఒడ్డున ఉన్న ఈ గ్రామం చుట్టూ భారీ ప్రహరి ఉండేది. 42 4 ఇండ్లు 2157 జనాభా కలిగిన కోరుట్ల కాగితం పరిశ్రమకు పేరుపడింది. ఆ కాలంలో ఇక్కడ 12 కాగితపు మిల్లులుండేవి. రూ.2,239 విలువైన 864 రీముల కాగితం ఉత్పత్తి అయ్యేవి. ఇక్కడ తయారయ్యే కాగితం జాల్నాకు ఎగుమతి చేసేవారు. అలాగే ముతక రకం బట్టలు కూడా ఇక్కడ తయ్యారయ్యేవి. ఇక్కడ 31 మగ్గాలు పనిచేసేవి.
సిరిసిల్ల: ఇది హవేలీ పరగణాకు చెందిన పెద్ద గ్రామం. 464 ఇండ్లు 2,267 జనాభాతో వ్యవసాయం చేనేత ప్రధాన వృత్తులుగా ఉండేవి. ఇక్కడ కంబళ్లు కూడా తయారయ్యేవి. చూడచక్కని వీధులు, ఒక పెద్ద బజారు, చిన్న శిథిలమైన గడీ ఉండేవి.
కరీంనగర్: హవేలీ పరగణాలో ఇది కస్బా గ్రామం. ఎలగందుల్‌కు 6 మైళ్ల దూరంలో ఉండేది. సద్దర్ నాయిబ్ ఇక్కడే నివసించేవాడు. 202 ఇండ్లు వెయ్యి జనాభా కలిగిన ఈ గ్రామం ఆనాడు సర్కార్‌లోనే అతి పెద్ద ధాన్యం మార్కెట్‌గా ఉండేది. వరిధాన్యం ఇక్కడ అమ్మకానికి వస్తుండేది.

మెట్‌పల్లి: వెల్లాల పరగణాలోని కస్బా గ్రామమిది. 861 ఇండ్లు 3,096 జనాభాతో పరిశుభ్రమైన వీధులు, పెద్దపెద్ద మైదానాలకు పేరుపడింది. ఒకప్పుడు కాగితపు పరిశ్రమకు పేరెన్నిక గన్నా కారణాంతరాల వల్ల దాని జాడ కూడా లేకుం డాపోయింది.
జమ్మికుంట: విజయగిరి-వెలిచాల పరగణా ప్రధాన నగరంగా ఉండేది. 225 ఇండ్లు 1,112 జనాభా కలిగిన ఈ గ్రామానికి సమీపంలో ఉన్న వీణవంక కంబళ్ల నేతకు ప్రసిద్ధి.
అగ్రహారాలు..: ఈ సర్కారులో వేములవాడ, ధర్మపురి, పొలాస, ధర్మారం అగ్రహారాలుగా ఉండేవి.

వేములవాడ: హవేలీ పరగణా జాగీరు పరిధిలోని ఈ గ్రామం అగ్రహారంగా ఉండేది. 2909 జనాభా కాగా అందు లో 642 మంది బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారే. వేములవాడ జాగీరు కిందికి వచ్చే గ్రామమే అయినా అగ్రహా రం కావటం వల్ల జాగీర్దారుకు ఏ హక్కూ ఉండేది కాదు. ఈ గ్రామంలో పాలన , పన్నుల వసూలు అధికారం బ్రాహ్మణులచేతిలో ఉండేది. వందల ఏండ్ల కిందటే గ్రామంలో రాజేశ్వర ఆలయ నిర్వహణ నిమిత్తం ఆనాటి రాజులు బ్రాహ్మణులకు గ్రామాన్ని దానంగా ఇచ్చారు. తర్వాత ఏ రాజు వచ్చినా వీరి హక్కును గౌరవిస్తూ కొత్త ఫర్మానాలు ఇస్తూ వచ్చారు. కాగా 1810లో ఈ గ్రామం భీకర అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. అనేక ఇండ్లు భస్మీపటలమయ్యాయి.. ఆ ప్రమాదంలోనాటి రాజులు ఇచ్చిన హక్కుపత్రాలు కూడా దగ్ధమయ్యాయి. దీని తో అనేక సమస్యలు తలెత్తాయి. దీనితో గ్రామంలోని బ్రాహ్మణులంతా దివాన్ మునీర్ ఉల్ ముఖ్‌కు మొరపెట్టుకున్నారు. ఆయన స్పందించి ఉజ్జాయింపుగా అంచనాలు వేసి కొత్త రికార్డులను తయారుచేయించారు. ఈ మేరకు ఒక ఫర్మానా ఇచ్చా డు. హైదరాబాద్ రాజ్యం ఎల్‌గందల్ సర్కార్‌లోని హవేలీ పరగణా కిందికి వచ్చే వేములవాడ గ్రామ పరిధి కిందికి వచ్చే స్థిర, చరాస్తులతో పాటు ఇక్కడ జరిగే వ్యాపార, వాణిజ్య కలాపాలపై వచ్చే పన్నులు, తోటలు, వృక్షాలు, కల్లు అమ్మకాలు సుంకాల మీద వచ్చే పూర్తి ఆదాయంతోపాటు, దేవాలయం మీదవచ్చే ఆదాయాన్ని కలిపి మొత్తం ఫస్లీ 1225 నుంచి ఆలయంలో పూజాదికాలు నిర్వహణ కోసం ఈ గ్రామంలో నివసించే మొత్తం బ్రాహ్మణ కుటుంబాల వారికి, వారి వారసుల కు, శాశ్వతంగా ఇవ్వడం జరుగుతున్నది. దేశ్‌ముఖ్‌లు, సర్దేశ్‌పాండేలు, దేశ్‌పాండేలు, రెవెన్యూ అధికారులు, గణకులు, రైతులు, కూలీలు తదితరులకు ఈ విషయం తెలియచేయడమైనది.

ఈ ఆదేశం ప్రకారం 1230 సౌబన్ 15వ రోజు నుంచి మొత్తం ఆస్తులు, పన్నుల వసూలు అధికారాలు గ్రామంలో నివసించే 200 బ్రాహ్మణ కుటుంబాలకు అప్పగించారు. ఈ ఆదాయ వ్యవహారాలు పర్యవేక్షించడానికి బ్రాహ్మణ కుటుంబాల వారు సోమయాజులు అనే పెద్దను ఎన్నుకొన్నారు. ఆయనకు సహకరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆలయంలో బ్రాహ్మణులు అనుసరించే విధులను బట్టి ఆదాయంలో ఆయా కుటుంబాలకు ఆదాయంలో ఎంత వాటా ఇవ్వాలో సర్వసభ్య సమావేశంలో నిర్ణయంచేశారు. ఇది వంశపారంపర్యంగా వర్తించేలా నిర్ణయం తీసుకోవటం తో పాటు, ఏ కారణం వల్లనైనా ఏదైనా కుటుంబం గ్రామం వదిలిపెట్టి వెళ్లిపోయినా ఏదైనా కుటుంబం కొత్తగా చేరుకున్నా ఆయా సందర్భాల్లో వాటాలను మార్చే అధికారం సోమయాజులు కుటుంబానికి అప్పగించారు. ఆలయం మహావైభవంగా కొనసాగుతూ ఉండటంతో ఆదాయం బాగా లభించేది. ఖర్చు లు పోనూ మిగిలిన సొమ్మును కూడా ఆలయ నిర్వహణలో భాగస్వాములైన కుటుంబాలకు పంచేవారు. కాగా గ్రామంలో ఇతరులు ఎవరూ ఎలాంటి పన్నులు వసూలు చేయరాదనే దివాన్ ఆదేశాలున్నప్పటికీ జాగీరు గ్రామపరిధిలోకి చొరబడి లేని హక్కులు చూపిస్తూ జమీందారు ఏడాదికి 700 రూపాయల రుసుము వసూలు చేసుకునేవాడు. మరోవైపు నాయిబ్ లు కూడా అపుడపుడూ ఏదో కారణం చెబుతూ పన్నులు, రుసుములు వసూలు చేసేవారు. ఆనాడు వేములవాడ ఆలయానికి సొంతంగా 2397 బీగాల భూమి (ఒక బీగాకు 6,40 0 చదరపు గజాలు) ఉండేవి.

విద్యారంగం...: స్కూళ్లు 52, విద్యార్థులు 1352 మంది. అక్షరాలు చదువడం, లెక్కలు చేయడం వచ్చినవాళ్లంతా విద్యావంతులైనట్టే లెక్క. వ్యాపారుల పిల్లలు, గ్రామ పట్వారీ, పటేల్ కుటుంబాల పిల్లలే ఎక్కువగా బళ్లకు పోయేవారు. వ్యాపారులకు లెక్కల పరిజానం, గ్రామ పాలకుల కొలువులు అనువంశికం కావటం వల్ల వారికికూడా అక్షరజానం,భూమి కొలతల పరిజానం అవసరం కాబట్టి బళ్లకు తప్పనిసరిగా పోయేవారు.
పోలీసు వ్యవస్థ: ఆనాటి పోలీసు వ్యవస్థ రెండు విధాలుగా ఉండేది. ఒకటి గ్రామ పాలకులు, రైతులు నిర్వహిస్తే రెండోది ప్రభుత్వం నిర్వహించేది. మొదటి రకంలో జమీందార్‌ల వద్ద ఉండే తలారీలు, గ్రామ సేవకులు ప్రజలను పంట పొలాల రక్షణను చూసేవారు. శిక్షలు నిర్బంధాలు స్థానికంగానే ఉండే వి. ఇక రెండోది ప్రభుత్వ పోలీసు వ్యవస్థ. వీరు నాయిబ్‌ల కింద పనిచేసే వారు. గ్రామాల్లో పెద్ద నేరాలకు పాల్పడేవారి ని నిర్బంధంలోకి తీసుకుని తాలూక్‌దార్ ముందు హాజరుపరిచేవారు. ఆయన విధించే శిక్షను బట్టి నిర్బంధంలోకి తీసుకోవడం లేదా జరిమానాలు వేయడం జరిగేది.

పరిశ్రమలు: వ్యాపారరంగంలో ఎలగందుల ముందంజ లో ఉండేది. ఇక్కడ ప్రధానంగా కాటన్, సిల్క్ వస్ర్తాలు, కంబ ళ్లు, కాగితం, ఇనుము పెద్ద ఎత్తున ఉత్పత్తయ్యేవి. ఏ గ్రామానికి అవసరమయ్యే వస్ర్తాల ఉత్పత్తి అదే గ్రామంలో జరిగేది. మొత్తం 3808 మగ్గాలు పనిచేసేవి. ఇందులో 396 మగ్గాలమీద కంబళ్లు, 19 మగ్గాల మీద సిల్క్ వస్ర్తాలు నేసేవారు. వీటన్నింటి మీద ఏటా రూ.2,25,500 ఆదాయం లభించేది. వస్ర్తాల ఉత్పత్తి అమ్మకాలు మొత్తం షావుకార్ల చేతిలోనే ఉండే వి. వీరే నేతకార్మికులకు అడ్వాన్సు చెల్లించి వస్ర్తాలు నేయించి వివిధ మార్కెట్లలో మంచి ధరలకు విక్రయించేవారు. కాగితం ఉత్పిత్తి కూడా బాగా జరిగేది. కాగితం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. గ్రామాల్లో ఇనుప ఉత్పత్తులు జరిగేవి.
రహదారులు:ఎలగందుల-శనిగరం-హైదరాబాద్, ఎములకుర్తి-మెట్‌పల్లి-జగిత్యాల్-ధర్మపురి, ఎలగందల్-ధర్మపురి, ఎలగందల్-వేములవాడ-గంభీరావుపేట్, సిరిసిల్ల- సిద్దిపేట -హైదరాబాద్ రహదారులు పెద్దవి. ఈ రహదారులన్నీ ఏడా ది పొడవునా వాగులు వరదల వంటి ఏ ఆటంకాలు లేకుండా ప్రయాణాలకు అనువుగా ఉండేవి. అదనంగా జల రవాణా కూడా బాగా జరిగేది. చిన్న పడవల మీద నదుల మీద మైళ్ల కొద్ది ప్రయాణాలుండేవి. వాగులు ఉప్పొంగినపుడు దాటించేందుకు పుంగీలు, పుట్టీలుండేవి. వేంపల్లి పరగణాలోని గూమిరాల్, దొనెకండ్, బాల్కొండ, బోనపల్లి, హర్సకోట పరగణా లో రంగసాగర్, కుమ్నూర్, దొంతాపురం వద్ద నదుల మీద ఏడాదిపొడవునా పడవలు నడిచేవి. వీటిమీద మనిషికి ఒక అణా, పశువులకు 2 అణాలు, ఎడ్లబండ్లు, కలప రవాణాకు 3 అణాలు చార్జి ఉండేది.

సర్కారు ప్రధాన ఆదాయ వనరు భూమి పన్నే. దీనికి అదనంగాప్రవేశ పన్ను, ఎక్సైజ్ పన్ను (కల్లాల్), మగ్గాలు దుకాణాల మీదవేసే వ్యాపార పన్ను (మోత్పూరా) ఉండేవి. భూమి పన్నులో ఖల్సా భూముల మీద జమీందారులు నాయిబ్‌లకు చెల్లించే పన్నులు ప్రధానమైనవి. వీటికింద ఏటా సుమారు రూ.2,74,559 వచ్చేవి. ఇక కల్లాల్ రూ49,853, మోతు ర్ఫా రూ 8,580 ఆదాయం వచ్చేది.
- ఎస్జీవీ శ్రీనివాసరావు, 9182777803

131
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles