ప్రామాణికత వైపుగా పయనం


Sun,July 21, 2019 01:43 AM

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికీ, అమెరికన్ విప్లవానికి; అట్లనే తెలంగాణ మాండలిక వికాసానికీ, అమెరికన్ ఇం గ్లిష్ మాండలిక వికాసానికి కొన్ని చారిత్రక సారూప్యాలున్నయి. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత అమెరికన్ ఇంగ్లిష్ మాండలికం విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ మాండలికం తెలుగు వారందరికీ ఆమోదయోగ్యంగా పరిణమిస్తున్నది. భారత మాజంలోని వర్ణవ్యవస్థ గతిశీలతను వివరించడానికి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎం.ఎన్. శ్రీనివాస్ సంస్కృతీకరణ అనే పరికల్పన చేసిండు. భాషా విషయకంగా తెలంగాణ మాండలికం ఏ విధంగా తెలుగు వారందరికీ ఆమోదయోగ్యంగా మారిందో అర్థం చేసుకోవడానికి సంస్కృతీకరణ అనే భావన ఉపకరిస్తుంది. అమెరికా ఒకప్పుడు బ్రిటిష్ వలస ప్రాంతం. అనేక యుద్ధాల వల్ల ఆర్థికంగా నష్టపోయిన ఇంగ్లండ్ వనరుల సమీకరణ కోసం అమెరికాలో ని బిటి కాలనీలపై పన్నుల భారం పెంచుతూ స్టాంప్ యాక్ట్- 1765 చట్టాన్ని చేసింది. అప్పటికే ఇంగ్లండ్ ఆధిపత్యంపై విసిగివేసారిన పదమూడు బ్రిటిష్ కాలనీల వాసులు ఆ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగినరు. జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో ఏకమై 1775లో ఇంగ్లండ్‌పై తిరుగుబాటు చేసినరు. 1776, జూలై 4న స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నరు. 1783లో అమెరికా స్వాతంత్య్రాన్ని ఇంగ్లండ్ అధికారికంగా గుర్తించడంతో అమెరికన్ విప్లవం ముగిసింది. ఎన్నో అనుమానాల మధ్య 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తొలినుంచి తెలంగాణ ప్రజలు అవమానాలకు, వివక్షకు గురవుతూ వచ్చినరు. నీళ్లు, నిధులు, నియామకాల్లో దగాపడ్డరు. విడిపోతేనే ప్రగతితో కూడిన మనుగడ అని భావించినరు. తెలంగాణ రాష్ట్రం కోరుతూ 1969 నుంచి 1972 వరకు ఉద్యమించినరు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001లో టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించినరు.


రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది. అణగదొక్కిబడిన తెలంగాణ భాషా సంస్కృతులు, ఆటపాటలు పునరుజ్జీవం పొందినయి. స్వయంగా సీఎం కేసీఆర్ తెలంగాణ నుడికారం పట్ల అపారమైన అధికారం, అంతులేని మమకారం ఉన్నవారు. వారి సాహి త్య అభినివేశం వాక్పటిమతో తెలంగాణ మాండలిక గౌరవం ఇనుమడించింది.


వారి సారథ్యంలో యావత్ తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాల నేపథ్యంలో 2014లో తెలంగాణ కల సాకారమైంది. తొలితరం అమెరికా దేశనిర్మాతలైన జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ మొదలైన వారు బ్రిటిష్ వారికి భిన్నంగా ఒక్క పాలనతోనే కాదు, భాషలోనూ సమూలమైన మార్పులు తేవాలని కోరుకున్నరు. అట్లనే తెలంగాణ రాష్ట్ర నిర్మాతలైన ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ, కేసీఆర్ మొదలైనవారు సీమాంధ్ర వలస పాలనకు భిన్నంగా పాలనలోనూ, భాషలోనూ సమూలమైన మార్పులను అభిలషించినరు. స్వాతంత్య్రానంతరం చేపట్టిన పాలనాపరమైన సంస్కరణల వల్ల అమెరికా నేడు ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా అవతరించింది. ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ వ్యక్తిగత స్వేచ్ఛా వికాసాలకు దోహదం చేశారు. ఉపాధి అవకాశాలతో విశ్వవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలకూ, శ్రమజీవులకూ అమెరికా ఒక భూతల స్వర్గంగా గుర్తింపు పొందింది. అమెరికన్ల శ్రమసంస్కృ తిని, సమయపాలనను, ఇంగ్లిష్ మాండలికాన్ని అన్యదేశాలు గుర్తించడమే కాకుండా, అనుకరించడాన్ని కూడా మనం గమనించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తన అవసరాలకు అనుగుణంగా పాలనతో ఉమ్మడి రాష్ర్టానికి భిన్నంగా ఎన్నో మార్పులకు నాంది పలికింది. రైతుల సంక్షేమానికి రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టింది. పాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాల ఏర్పాటు చేశారు. విద్యుత్తు కోసం పవర్ ప్రాజెక్టులు, పరిశ్రమల ప్రోత్సాహాకానికి టీఎస్‌ఐ పాస్, ఫార్మా సిటీల వంటివి రూపకల్పన చేశారు. కాలం చెల్లిన రెవిన్యూ, మున్సిపల్, పంచాయతీరా జ్ చట్టాల స్థానంలో సమకాలీన అవసరాలకూ, అభివృద్ధికి చేయూతని చ్చే విధంగా నూతన చట్టాల రూపకల్పన జరిగింది. నేడు తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. సగటు తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ర్టాలన్నింటిలో అగ్రభాగాన నిలిచింది.

దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తు న్నది. స్థిరాస్తిరంగ వృద్ధిలో దేశంలో అగ్రగామిగా నిలిచింది. స్వరాష్ట్రం ఏర్పడి న తర్వాత తెలంగాణ రాజకీయంగా స్థిరమై, శాంతి భద్రతలతో సుసంపన్నమై సర్వతోముఖాభివృద్ధిని సాధించింది. ఫలితంగా తెలంగా ణ మాండలిక భాషాగౌరవం పెరిగింది. అయితే తెలంగాణ మాండలికం ప్రామాణిక భాషారూపంగా సంతరించుకోవడానికి మరింత కృషి జరుగవలసి ఉన్నది. సంస్కృతీకరణ పరికల్పన ఈ దిశలో ఎంతోకొంత ఉపకరిస్తుంది. భారత సమాజంలోని వర్ణవ్యవస్థ గతిశీలతకు సం బంధించి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎమ్‌ం.ఎన్. శ్రీనివాస్ సంస్కృతీకరణ అనే భావనను ప్రతిపాదించిండు. ఒక సమాజంలో ఉన్నతవర్గం అనగా విద్యాధికులు, రాజకీయ నాయకులు, మేధావులు, ఉద్యోగులు, సినిమా, ప్రింట్, విజువల్ మీడియా రంగాల కు చెందినవారు, పాఠ్యపుస్తక,సృజనాత్మక రచయిత లు మొదలైనవారు ఉపయోగించే భాషకు ప్రామాణికత ఆపాదించబడుతుంది. మిగిలినవారు సాధ్యమైనంతవరకు దాన్ని అనుకరించే ప్రయత్నం చేస్తరు. అటువంటి భాషను మాట్లాడలేనివాళ్లు ఒక్కొక్కసారి తమ ప్రమేయం లేకుండనే ఆత్మన్యూనతకు గురవ్వడం జరుగుతుంది. సమైక్యాంధ్రలో ప్రింట్, విజువల్ మీడియారంగం, సినిమా రంగం, పాఠ్య పుస్తకరచన మొదలైనవి కోస్తాంధ్ర వర్గం గుత్తాధిపత్యంలో ఉన్నందువల్ల వాళ్లు మాట్లాడే, రాసే భాషే ప్రామాణికంగా చలామణి అయ్యిం ది. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర మాండలిక భాషలకు సముచితమైన స్థానం, గుర్తింపు లేకుండాపోయింది. అంతేకాకుండా వీరి భాషను ప్రింట్, విజువల్, సినిమా మాధ్యమాల్లో కించపరిచే విధంగా అనాగరికులు, తక్కువస్థాయి వారు మాట్లాడే భాషగా అపహాస్యం, అవహేళన చేయడం జరిగింది. పర్యవసానంగా వారు తెలిసో, తెలువకనో కోస్తాంధ్ర మాండలికాన్ని అనుకరించే ప్రయత్నం చేయడమో లేదా న్యూనతకు గురవ్వడమో జరిగింది. ఈ పరిణామం వల్ల తెలంగాణ ప్రజలకు కొంత మేలు జరిగింది. మౌలికంగా తెలంగాణ సమాజం కాస్మోపొలిటన్.

తెలుగుతో పాటుగా ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, గిరిజన భాషల వ్యవహర్తలు ఉన్నరు. దేశంలో ఒకటి కన్నా ఎక్కువ భాషలు మాట్లాడే ప్రజల శాతం తెలంగాణలో అధికం. ఆంధ్రుల భాషను అనుకరణ చేయడం ఇష్టం లేని తెలంగాణ మేధావులు, విద్యాధికులు, రాజకీయవేత్తలు, ఉద్యోగులు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సంపాదించినరు. రాష్ట్రసాధన ఉద్య మ సమయంలో తెలంగాణ స్వరం జాతీయస్థాయిలో, పార్లమెంట్‌లో ప్రముఖంగా వినిపించడానికి ఇది కూడా ఒక కారణం. నిజానికి ఫలానా భాషా మాండలికం ప్రామాణికం అనేది అపోహ మాత్రమే. భాషాశాస్త్ర దృష్ట్యా దీనికి ఎటువంటి సహేతుకమైన ఆధారాల్లేవు. ఏ భాషా మాండలికం స్వతహాగా ప్రామాణికం కాదు. భాషా వ్యవహర్తల ఆర్థిక, రాజకీ య, సామాజిక, సాంస్కృతిక స్థాయిని బట్టి, పాఠ్యపుస్తక రచనాప్రయో గం బట్టి, కళారూపాల జనాదరణను బట్టి, ప్రింట్, విజువల్, సినిమా రంగాల్లో దాని విస్తృతిని బట్టి ప్రామాణికత ఆపాదించబడుతుంది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది. అణగదొక్కిబడిన తెలంగాణ భాషా సంస్కృతులు, ఆటపాటలు పునరు జ్జీవం పొందినయి. స్వయంగా సీఎం కేసీఆర్ తెలంగాణ నుడికారం పట్ల అపారమైన అధికారం, అంతులేని మమకారం ఉన్నవారు. వారి సాహి త్య అభినివేశం వాక్పటిమతో తెలంగాణ మాండలిక గౌరవం ఇనుమడించింది. పత్రికలు, ఛానళ్లు, సినిమారంగం, ఉన్నత వర్గం ఇష్టం ఉన్నా లేకపోయినా తెలంగాణ మాండలికాన్ని గుర్తించి ఎంతో కొంత గౌరవప్రదంగా ఉపయోగించవలసిన దశకు చేరుకున్నం. అందువల్ల సహజంగానే తెలంగాణ భాషా మాండలికం నేడు ఇతరులను అనుకరించడం మాని, ఇతరులే దీన్ని అనుసరించే పరిణామ దశకు చేరుకున్నది. అయితే క్రియారూపాలు, పదజాలం వంటి అంశాల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల మధ్య స్వల్ఫ భేదాలున్నాయి.
g-madhusudana-reddy
వైవిధ్యమే జీవభాషకు సొగసు. ఈ వైవిధ్యాన్ని కాపాడుకోవడం, కొనసాగించడం మనందరి బాధ్యత. సృజనాత్మక రచయితలు ఈ విషయంలో అగ్రభాగాన నిలవాలె. అదే సమయంలో ఈ వైవిధ్యాలను సమన్వయం చేస్తూ, కలుపుకొని పోతూ అందరి ఆమోదంతో పాఠ్యపుస్తక రచన కోసం, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల కోసం అర్ధ సౌలభ్యం లోపించకుండా సమాచార వినిమయం కోసం ఒక ప్రామాణిక తెలంగాణ భాషను రూపొందిచుకొని, విస్తృత ప్రయోగం చేయవలసిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖలో డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు)

323
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles