సమాఖ్య స్ఫూర్తి ఏది?

Wed,July 17, 2019 12:45 AM

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు విస్తృత అధికారాలను కట్టబెట్టే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, అభ్యంతరాల మధ్య దిగువసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ఎగువసభలో ఆమోదం పొందాల్సి ఉన్నది. ఈ బిల్లుతో జాతీయ దర్యాప్తు సంస్థ మరింత బలోపేతం, విస్తృతం కానున్నది. గతంలో ఎన్‌ఐఏ పరిధిలో కేవలం ఉగ్రవాద కార్యకలాపాలు, విధ్యంసక హత్యాకాండల కేసులు మాత్రమే ఉండేవి. ప్రస్తుత సవరణ బిల్లుతో సైబర్‌నేరాలు, నకిలీ నోట్లు, దొంగనోట్ల చెలామణి, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా కేసులు కూడా ఎన్‌ఐఏ పరిధిలోకి వస్తాయి. అలాగే విదేశాల్లో భారతీయులపై, వారి ఆస్తులపై జరిగే దాడుల విషయంలోనూ ఎన్‌ఐఏ దర్యాప్తు చేపడుతుంది. భారత ప్రజలకు ఇంటా, బయ టా రక్షణ కల్పిస్తూ సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టే లక్ష్యంతో ఎన్‌ఐఏకు విస్తృతాధికారాలను కేంద్రం కట్టబెట్టింది. బిల్లు ఆమోదం పొందే క్రమంలో ప్రతిపక్ష సభ్యులు అనేక అనుమానాలు, భయాలు వ్యక్తం చేయటం గమనార్హం. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అయితే దేశాన్ని పోలీస్ రాజ్యం చేసే దిశగా ఈ చట్టాన్ని తెస్తున్నారని తీవ్రంగా విమర్శించింది. కాగా దేశంలో నానాటికీ పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదాన్ని అణచటం కోసమే జాతీయ దర్యాప్తు సంస్థను బలోపే తం చేస్తున్నామని, ప్రజల సంరక్షణ కోసమే పరిధిని విస్తృతపరుస్తున్నామని అధికారపక్షం చెప్పుకొచ్చింది.

ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టాలంటే విస్తృతాధికారాలు గల ప్రత్యేక దర్యాప్తు సంస్థ అనివార్యమన్న వాతావరణంలో కాంగ్రెస్ హయాంలో 2009లో ఎన్‌ఐఏ ఏర్పాటైంది. అయితే అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ రాష్ర్టాల హక్కులను హరించే ప్రయత్నంలో భాగంగానే ఎన్‌ఐఏకు కాంగ్రెస్ రూపకల్పన చేసిందని విమర్శించారు. శాంతిభద్రతలు రాష్ర్టాలకు సంబంధించిన అంశమని, దాంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థల పేరుతో కాంగ్రెస్ రాష్ర్టాల హక్కులను హరించివేయటానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.


దేశంలో నెలకొన్న ఒక ప్రత్యేక పరిస్థితిలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఉనికిలోకి వచ్చింది. 2008లో ఉగ్రవాదులు ముంబయి ముట్టడి తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర భయాం దోళనలు నెలకొన్నాయి. ముంబయి ఉగ్రవాద దాడిలో 166 మంది బలయ్యారు. ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టాలంటే విస్తృతాధికారాలు గల ప్రత్యేక దర్యాప్తు సంస్థ అనివార్యమన్న వాతావరణంలో కాంగ్రెస్ హయాంలో 2009 లో ఎన్‌ఐఏ ఏర్పాటైంది. అయితే అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ రాష్ర్టాల హక్కులను హరించే ప్రయత్నంలో భాగంగానే ఎన్‌ఐఏకు కాంగ్రెస్ రూపకల్పన చేసిందని విమర్శించారు. శాంతిభద్రతలు రాష్ర్టాలకు సంబంధించిన అంశమని, దాంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థల పేరుతో కాంగ్రెస్ రాష్ర్టాల హక్కులను హరించివేయటానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. మరో అడుగు ముందుకేసి దేశంలో రైట్‌వింగ్ టెర్రరిస్టుల పేరుతో బీజేపీ మద్దతుదారులపై దాడుల కోసం ఎన్‌ఐఏను వాడుకునే ప్రమాదం ఉన్నదని మోదీ నాడు తీవ్రంగా వ్యతిరే కించారు. అయితే కాలం మారింది, పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు కేంద్రం లో అధికారంలో ఉన్న మోదీ అదే ఎన్‌ఐఏకు కోరలు పెంచుతున్నారు. ప్రజల రక్షణ కోసమే ఇదంతా అని చెప్పుకొస్తున్నారు. అయితే, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో సహా మమతా బెనర్జీ తదితర నేతలు కూడా బీజేపీ చర్యను రాష్ర్టాల హక్కులను హరించడంగా నిరసిస్తూ, ఇలాంటి చట్టాలన్నీ సమాఖ్యస్ఫూర్తికి గొడ్డలిపెట్టు లాంటివని వ్యతిరేకించటం గమనార్హం.

జాతీయ దర్యాప్తు సంస్థ బిల్లు ఆమోదం చర్చలో భాగంగా పార్లమెంటులో కేంద్ర హోం మం త్రి పోటా లాంటి చట్టాలను కాంగ్రెస్ రద్దుచేయటం మూలంగానే దేశంలో ఉగ్రవాదం పెరిగిపోయిందని, ఆ తప్పును సరిదిద్దుకునేందుకే కాంగ్రెస్ ఎన్‌ఐఏను ఏర్పాటు చేసిందని బీజేపీ వాదించింది. ఇప్పుడు ఎన్‌ఐఏతో దాన్ని తుదముట్టిస్తామని అంటున్నది. అంటే బీజేపీ వాదన ప్రకా రం.. కేవలం చట్టాలతోనే శాంతిభద్రతలు నెలకొంటాయనీ, నేరాలు అంతమవుతాయని అంటున్నారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అలాంటి ఘటనలు జరుగకుండా నిరోధించటానికి కఠిన చట్టం అవసరమనే డిమాండ్ ముందుకువచ్చింది. ఫలితంగా మహిళలపై హింసాత్మక దాడులను అరికట్టడానికి నిర్భయ చట్టాన్ని తెచ్చారు. కానీ మహిళలపై హింసాత్మక హంతక, లైంగికదాడులు నిలిచిపోలేదన్నది గుర్తించాలి. కఠినమైన చట్టాలతోనే నేరాలు తగ్గుముఖం పడుతాయని అనుకోవటం పొరపాటు. నేరాలకు, హింసాత్మక కార్యకలాపాలకు మూలమైన సామాజిక రుగ్మతలను పరిష్కరించినప్పుడే అలాంటివి రూపుమాసిపోతాయి. బ్రిటిష్ వారు భారతీయుల హక్కులను అణిచివేసేందుకు అనేక చట్టాలను తెచ్చారు. ఇప్పటికీ ఆ క్రిమినల్ చట్టాలున్నాయి. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు పౌరహక్కులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు వాటిని కాలరాసేట్లుగా చట్టాలు చేయటం సరికాదని కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ పేర్కొనటం సముచితం. ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా పరిణమించిన ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరించవలసిందే. అయితే రాష్ర్టాలు కూడా ఎంతోకాలంగా ఈ చట్టం పట్ల అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ఎన్‌ఐఏను ఎట్లాగూ సవరిస్తున్న ఈ సందర్భంలో సమాఖ్య స్ఫూర్తితో రాష్ర్టాలను కూడా సంప్రదిస్తే బాగుండేది.

267
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles