సామాజికభద్రతపై చిన్నచూపు

Sat,July 13, 2019 12:34 AM

బడ్జెట్ ప్రసంగంలో సామాజిక సంక్షేమం అనే మాట ప్రస్తావించింది కూడా స్వచ్ఛందసంస్థలు క్యాపిటల్ మార్కెట్ నుంచి నిధులను తెచ్చుకోవడానికే. బడ్జెట్ తీరు తెన్నులను గమనిస్తే గత ప్రభుత్వాల మాదిరిగానే సామాజిక భద్రతా కేటాయింపులు చేసినట్టు కనబడుతుంది. కానీ సమగ్ర సామాజిక భద్రత అనే దృక్కోణం మాత్రం లోపించింది.


సమాజంలోని అధిక సంఖ్యాకులకు సామాజిక భద్రత కల్పించడం రాజ్యానికి ఉన్న బాధ్యత అనేది సర్వత్రా అంగీకరించిన విషయం. ఇటువంటి భద్రత కల్పించడం వల్ల పేదరికం తగ్గుతుంది. బలహీనవర్గాలు అనారోగ్యం తదితర సమస్యలను ఎదుర్కోగలుగుతాయి. నిరుద్యోగం, అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సమస్యలు బలహీనవర్గాలను వేధిస్తుంటాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఈ సామాజిక భద్రత ఒకటి. కేంద్ర బడ్జెట్‌లోనూ సాధారణంగా సామాజిక భద్రత ప్రాధాన్యం పొందుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి తమ బడ్జెట్ ప్రసంగంలో ఏయే వర్గాలను ఏ రూపేణ ఆదుకుంటున్నదీ వెల్లడించడం ఆనవాయితీ. సాధారణంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత అది రాజ్య విధానానికి అనుగుణంగా ఉన్నదా అనే ది పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. కానీ కేంద్ర బడ్జెట్ గత బడ్జెట్‌లకు భిన్నంగా ఉండటం దురదృష్టకరం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోని, ప్రభుత్వ బాధ్యతను గుర్తించని ఇటువంటి బడ్జెట్ ను గతంలో ఎప్పుడూ చూడలేదు. పేదరికం గురించిన ప్రస్తావన ఒకేసారి అదీ నల్లధనం గురించి చెప్పినప్పుడు చోటుచేసుకున్నది. ఉపాధి కల్పనకు అనుగుణమైన పన్ను విధానం, నైపుణ్య శిక్షణ, సంప్రదాయ పరిశ్రమల పునరుజ్జీవం వంటి అంశాల వివరణ సందర్భంగా ఉద్యోగాల గురించిన ప్రస్తావన వచ్చింది. ప్రస్తుత నిరుద్యోగ పరిస్థితి, విస్తృతంగా ఉన్న గ్రామీణ సంక్షోభం, సామాజికభద్రత ప్రాధాన్యం మొదలైన అంశాలను బడ్జెట్‌లో స్పష్టంగా గుర్తించలేదు. ఉదాహరణకు- మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి కల్పన హామీ పథకం గురించిన ప్రస్తావనే లేదు. పిల్లలు ఎదుర్కొంటున్న పోషకాహార సమస్యల గురించిన ప్రస్తావన కూడా లేదు.

సమాజాన్ని పీడిస్తున్న తీవ్ర సమస్యల పరిష్కారానికి తగిన బడ్జెట్ కేటాయింపులు అవసరం. తల్లులకు, పిల్లలకు, కౌమార వయసు బాలికలకు ఉద్దేశించిన పథకాలు ఉండాల్సిందే. కానీ ఆరోగ్యానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి ప్రస్తావనలు ఉన్నాయి. బడ్జెట్ ప్రభుత్వ ప్రాధాన్యాలను వెల్లడిస్తుంది. మరి ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అని చెప్పుకుంటున్నప్పుడు అందులో విస్తృతమైన సామాజికభద్రతకు సంబంధించిన స్పష్టమైన అజెండా ఉండాల్సింది. సామాజిక భద్రతా పథకాలుగా కొన్నింటిని చెప్పుకుంటున్నప్పటికీ, వాటికి తగిన కేటాయింపులు లేవు. ఉదాహరణకు- జాతీయ సామాజిక తోడ్పాటు పథకం (ఎన్‌ఎస్‌ఏపీ) అనేది పలు కార్యక్రమాల సముదాయం. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మొదలైన వారికి పింఛను మొదలైనవి ఇందులోఉంటాయి. కానీ వీటికి 2018-19 బడ్జెట్‌లో 9,975 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ బడ్జెట్‌లో కేటాయింపు గతంలో కన్నా తక్కువగా ఉన్నది. అయితే ఒక్కోసారి కేటాయింపులను పెంచిన ఉదంతాలూ ఉన్నాయనేది గుర్తించాల్సిందే. ఉదాహరణకు- జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన హామీ పథకం విషయంలో ఇదే జరిగింది. 2019 జనవరిలో ఈ పథకానికి అదనంగా 6, 084 కోట్లను కేటాయించారు. 2018-19 బడ్జెట్‌లో 55 వేల కోట్లు కేటాయించినప్పటికీ ఈ పథకానికి ఉన్న ఒత్తిడి వల్ల అదనపు కేటాయింపులు చేయవలసి వచ్చింది. గత బడ్జెట్‌తో పోలిస్తే సామాజిక భద్రతా పథకాలకు కొద్ది పాటి పెంపుదల మాత్రమే ఉన్నది. ద్రవ్యోల్బణాన్ని దృష్టి లో పెట్టుకొని సర్దుబాటు చేసినట్టుగా కనిపిస్తున్నది. సమగ్ర, నమ్మదగిన సామాజిక భద్రతా చర్యలు ఏవీ బడ్జెట్‌లో కనిపించడం లేదు.
Narayanan
గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పలు పథకాల్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యా యి. వాటికి పరిష్కారాలు తాజా బడ్జెట్‌లో ఉండాల్సింది. అలాగే లోటుపాట్లను సవరించాల్సింది. ఉదాహరణకు-వృద్ధులు, వితంతు పింఛను అత్యల్పంగా రెండు వందల రూపాయలు ఉన్నది. 2006 నుంచి దీన్ని మార్చనే లేదు. సమగ్ర శిశు వికాస సేవ పథకానికి కేటాయింపు కూడా తక్కువగా ఉన్నది. అంగన్‌వాడి వర్కర్లు తదితరులకు వేతనాలకు సరిపో యే విధంగా సమకూర్చారు. కానీ ఈ పథకం అమలుకు కావలసిన మౌలి క వసతులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రధాన్ మంత్రి మాతృత్వ వందన యోజన పథకం పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. గర్భిణీలు, బాలింతలకు ఉద్దేశించిన ఈ పథకానికి 2,500 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది గత ఏడాది కన్నా నాలుగు శాతం ఎక్కువ. జాతీయ ఆహారభద్రతా చట్టం ప్రకారం ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారు. దీనికీ మొదటి సంతానానికే ఇవ్వడం వంటి అనేక షరతులు విధించారు. సమాజంలోని ఈ కీలక వర్గానికి తగిన భద్రత లభించడం లేదు. ప్రభుత్వం ఈ రంగం నుంచి నిష్క్రమిస్తున్న పోకడ కనిపిస్తున్నది. ఆరోగ్యరంగానికి నిధుల కొరత ఏర్పడుతున్నది. స్థూల దేశీయోత్పత్తి ఆరోగ్యరంగానికి కేటాయింపు 2.5 శాతం ఉండాలె. కానీ ఆ మేర కేటాయింపులు లేవనే విమర్శలూ ఉన్నాయి. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కోసం భారీగా నిధులు పెరిగాయి. అయితే ఇవి పేదలకు ప్రైవేటురంగం అందించిన సేవలకు ప్రతిగా నిధులు ఇవ్వడానికి ఉద్దేశించినవి. మరికొన్ని పథకాలకు కూడా నిధులు కేటాయించారు. కానీ అవేవీ సామాజికభద్రతకు సంబంధించిన సమగ్ర దృక్పథాన్ని వెల్లడించ డం లేదు. సమగ్ర సామాజిక భద్రతను కేంద్ర పాలకులు నిర్ల క్ష్యం చేశారనేది స్పష్టం. బడ్జెట్ ప్రసంగంలో సామాజిక సంక్షేమం అనే మాట ప్రస్తావించింది కూడా స్వచ్ఛంద సంస్థలు క్యాపిటల్ మార్కెట్ నుంచి నిధులను తెచ్చుకోవడానికే. బడ్జెట్ తీరు తెన్నులను గమనిస్తే గత ప్రభుత్వాల మాదిరిగానే సామాజికభద్రతా కేటాయింపులు చేసినట్టు కనబడుతుంది. కానీ సమగ్ర సామాజికభద్రత అనే దృక్కోణం మాత్రం లోపించింది.
(ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చిలో పరిశోధకురాలు)
(సౌజన్యం: ఐడియాస్ ఫర్ ఇండియా)

272
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles