ప్లాస్టిక్- పరమ చెత్త

Thu,July 11, 2019 12:13 AM

ఆస్ట్రేలియా నుంచి ఎనిమిది కంటెయినర్లలో వచ్చిన ప్లాస్టిక్ వృథా సామాగ్రిని తిప్పి పంపనున్న ట్టు ఇండోనేషియా ప్రకటించడంతో మూడవ ప్రపంచ దేశాలను చెత్తకుప్పలుగా మారుస్తున్న ఆధిపత్య దేశాల పోకడను తిప్పికొట్టినట్టయింది. ఇండోనేషియా అధికారులు ఆ కంటెయినర్లను తెరిచి అందులోని పునరుపయోగం సాధ్యం కాని బూట్లు, ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలను, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసి చూపించి, ఈ 210 టన్నుల చెత్తనంతా తిప్పిపంపుతున్న స్పష్టంగా చెప్పారు. ఈ పదార్థాలు రిసైకిల్ చేయడానికి సాధ్యం కానివని వారు తెలిపారు. గత వారమే ఫ్రాన్స్ తదితర యూరప్ దేశాలకు 49 కంటెయినర్లను వెనుకకు పంపించింది. ఈ మధ్య ఆగ్నేయాసియా దేశాలు పెద్ద దేశాలు పంపుతున్న ప్లాస్టిక్ చెత్తనంతా తిప్పి పంపుతున్నాయి. మలేసియా మే నెలలో ఆస్ట్రేలియా తదితర దేశాలకు 450 టన్నుల ప్లాస్టిక్ చెత్తను ఆస్ట్రేలియాకు తిప్పి పంపింది. ఫిలిపీన్స్ గత నెలలో కెనడా నుంచి వచ్చిన 69 కంటెయినర్ల పునర్వినియోగ సాధ్యం కాని ప్లాసిక్‌ను తీసుకోవడానికి నిరాకరించింది. ఈ ప్లాస్టిక్ చెత్త పర్యావరణానికి, జలచరాలకు, స్థానిక ప్రజలకు హానికరంగా మారింది. నదులన్నీ చెత్తతో నిండిపోతున్నాయి. సముద్రాలలో చెత్త వేయడం వల్ల జలచరా పొట్టలు ప్లాస్టిక్ వస్తువులతో నిండి హాని చేస్తున్నాయి. ఈ ప్లాస్టిక్‌లో హానికర పదార్థాలు ఉండటంతో ఈ చెత్తను కుమ్మరిస్తున్న గ్రామాలలో ప్రజలు రోగాల పాలవుతున్నారు. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా దేశాలు యూరప్ దేశాలకు చెత్తకుప్పలుగా మారిన నేపథ్యంలో స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్లాస్టిక్ వృథా పదార్థాలను చైనా ఎక్కువగా దిగుమతి చేసుకునేది.

ప్రపంచ జనాభాలో 36 శాతం ఉన్న భారత్, చైనాలో 27 శాతం వివిధ రకాల చెత్త తయారవుతున్నది. అమెరికాతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, ప్లాస్టిక్, ఇతర చెత్త విషయంలో భారత్ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలె. ఈ వేస్ట్ భవిష్యత్తులో పెద్ద సమస్యగా ముందుకురానున్నది. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు కానీ, భారత్ వంటి వర్ధమాన దేశాలు కానీ తమ జీవన సరళిని, అభివృద్ధి విధానాలను మార్చుకోనంత కాలం ఇటువంటి సమస్యలు పరిష్కారం కావు.


ప్లాస్టిక్ చెత్త పెద్ద సమస్యగా మారడంతో చైనా వీటి దిగుమతిని ఇటీవల నిలిపివేసింది. దీంతో పెద్ద దేశాలు ఆ భారీ చెత్త అంతా ఆగ్నేయాసియా దేశాలకు తరలిస్తుండటంతో అక్కడి దేశాలకు ఇదొక పెద్ద సమస్యగా మారింది. అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలు భారీ ఎత్తు న ప్లాస్టిక్ చెత్తను వర్ధమాన దేశాలకు తరలిస్తుండటం పెద్ద సమస్యగా మారింది. దీనిని అరికట్టడానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో దాదాపు రెండువారాల పాటు చర్చ సాగింది. జీవులకు, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ చెత్తను, హానికర పదార్థాలను అరికట్టడానికి చివరికి గత మే నెల పదవ తేదీన ఒప్పందం కుదిరింది. ఇత ర దేశాలకు హానికర రసాయనాలు ఇతర పదార్థాలు తరలించకుండా అరికట్టడానికి గతంలోనే బేసల్ ఒడంబడిక అంటూ ఒకటి ఉన్నది. ఇప్పుడు ప్లాస్టిక్ చెత్తను కూడా ఈ బేసల్ ఒడంబడిక పరిధిలోకి చేర్చారు. ఈ ఒప్పందం ప్రకా రం ఇతర దేశాలకు ప్లాస్టిక్ చెత్తను తరలించే దేశాలకు అవి ఎక్కడకు చేరుతున్నాయో గమనించవలసిన బాధ్యత కూడా ఉంటుంది. ఈ ఒప్పందానికి దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ అంగీకారం తెలిపాయి. ఒక్క అమెరికా మాత్రం వ్యతిరేకిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కువ చెత్త యురోపియన్ దేశాల్లో తయారవుతున్నది. ఒక దేశంగా విడిగా చూస్తే అమెరికాలో ఎక్కువ చెత్త ఉత్పత్తి అవుతున్నది. ఈ పెద్ద దేశాలు బయటపడేసే ప్లాస్టిక్ చెత్తను వర్ధమాన దేశాల ప్రైవేటు సంస్థలు కొనుక్కుంటాయి. ఇక్కడి ప్రభుత్వాలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తాయి. ఈ ప్లాస్టిక్ చెత్తలో కొంత పునరుపయోగానికి పనికివస్తుంది. కానీ దానితో పాటు దాదాపు 90 శాతం పనికిరానిదీ, హానికరమైందీ ఉంటుంది. మే నెలలో ఐక్యరాజ్యసమితి ఒప్పందం ప్రకారం ఏదైనా దేశంలోని ప్రైవేటు సంస్థకు చెత్త తరలించాలన్నా అక్కడి ప్రభుత్వం అంగీకారం ఉండాలె.

ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కనుక ప్రభుత్వం అంగీకరించదు. ఈ ఒప్పందం కుదిరినప్పటికీ, ఆయా దేశాలపై ఒత్తిడి తెచ్చి చెత్తను తరలించాలని అమెరికా భావిస్తున్నది. మలేషియాకు బ్రిటన్, అమెరికా, జపాన్, చైనా, కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, జర్మనీ, నార్వే, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి వేలాది టన్నుల చెత్త వచ్చి పడుతున్నది. దీనిని తిప్పి పంపుతామని ఇప్పుడు మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద దేశాల నుంచి చెత్త వచ్చి చేరుతున్న దేశాలలో భారత్ కూడా ఉన్నది. ఇప్పుడు ప్రజలలో అవగాహన పెరుగడంతో పెద్ద దేశాలకు చెత్త తరలించ డం పెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలో అమెరికా జనాభా నాలుగు శాతమే ఉంటే అక్కడ పన్నెండు శాతం చెత్త తయారువుతున్నది. ప్రపంచ జనాభాలో 36 శాతం ఉన్న భారత్, చైనాలో 27 శాతం వివిధ రకాల చెత్త తయారవుతున్నది. అమెరికాతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, ప్లాస్టి క్, ఇతర చెత్త విషయంలో భారత్ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలె. ఈ వేస్ట్ భవిష్యత్తులో పెద్ద సమస్యగా ముందుకురానున్నది. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు కానీ, భారత్ వంటి వర్ధమాన దేశాలు కానీ తమ జీవన సరళిని, అభివృద్ధి విధానాలను మార్చుకోనంత కాలం ఇటువంటి సమస్యలు పరిష్కారం కావు. ఒక మంచి నీళ్లు లేదా ఇతర పానీయం గల సీసాను ఒకసారి ఉపయోగించి పడేయడం అవసరమా? అటువంటి ఒకేసారి ఉపయోగించే పదార్థాలను అనుమతించడం ఎందుకు? నిరాడంబర జీవన విధానాన్ని అలవరచుకోవడాన్ని అన్నిదేశాలు ప్రోత్సహించాలె.

238
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles