బాధ్యతారాహిత్యం

Tue,July 9, 2019 01:31 AM

అమెరికా ఇరాన్‌పై ఆంక్షల ఒత్తిడి పెంచుతుంటే యూరప్ దేశాలు ప్రేక్షకపాత్ర వహించడం బాధ్యతా రాహిత్యమే. ఇది పరోక్షంగా అమెరికాకు మద్దతు పలుకడమే. బ్రిటన్ మరో అడుగు ముందుకు అమెరికాను మెప్పించడానికి వేసి ఇరాన్‌కు చెందిన చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడం ఆ దేశ ప్రతిష్ఠనే దిగజారుస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుందుడుకు విధానాలను అంతర్జాతీయ సమాజం అడ్డుకోలేకపోతే గల్ఫ్ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి తలెత్తవచ్చు. అమెరికా ఆంక్షలను పట్టించుకోకుండా తమకు మద్దతుగా నిలువాలని యూరప్ దేశాలకు విజ్ఞప్తి చేసిన ఇరాన్, ఆ దేశాల నుంచి ఆశించిన మద్దతు రాకపోవడంతో ఇక తాము కూడా అణు ఒప్పందాన్ని లాంఛనంగా ఉల్లంఘిస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఇటీవలే మూడు వందల కిలోల శుద్ధ యురేనియం పరిమితిని అతిక్రమించినట్టు వెల్లడించింది. తాజాగా సోమవారం 3.67 శుద్ధి పరిమితిని కూడా ఉల్లంఘించినట్టు తెలిపింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి అణ్వస్త్ర తయారీకి పూనుకోవడం ఇరాన్ ఉద్దేశం కాదు. కానీ అమెరికా ఆంక్షల నుంచి తమకు రక్షణగా నిలువకపోతే తాము ఉల్లంఘించడానికి వెనుకాడబోమని సంకేతాలు ఇచ్చింది. తాము నామమాత్రంగా ఉల్లంఘించినప్పటికీ చర్చలకు తలుపులు తెరిచిపెట్టామని ఇరాన్ స్పష్టం చేసిం ది. యూరప్ దేశాలకు కూడా సయోధ్య కుదుర్చాలని కోరింది. ఒకవైపు యూరప్ దేశాలు తటస్థంగా ఉంటే, మరోవైపు ఇరాన్ ఉల్లంఘించినట్టు ప్రకటించగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశాడు.

పన్నెండేండ్ల పాటు ఎంతో సంక్లిష్టమైన చర్చలు సాగిన తరువాత ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్‌తో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా భాగస్వాములే. ఒప్పందం పర్యవేక్షణకు కఠినమైన షరతులకు ఇరాన్ అంగీకరించింది. ఇరాన్ ఒప్పందానికి అనుగుణంగా పరిమితులకు కట్టుబడి ఉంటున్నట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షకులు ధ్రువీకరిస్తూనే ఉన్నారు. అమెరికా ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకున్నప్పుడు దానిని కాపాడవలసిన బాధ్యత యూరప్ దేశాలపై ఉంటుంది.


ట్రంప్ వ్యవహారసరళి చూస్తుంటే, ఇరాన్‌పై ఆంక్షలు పెంచుకుంటూ పోయి క్రమంగా యుద్ధపరిస్థితులు కల్పించాలని భావిస్తున్నట్టున్నది. ఇరాన్ దేశంపైనే కాకుండా ఆ దేశంలోని ప్రముఖులపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ ఆధ్యాత్మిక నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ, విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ మొదలైన వారిపై ఆంక్షలు విధించడం అంటే చర్చల కు తలుపులు మూయడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమేనీకి ప్రపంచవ్యాప్తంగా అనుయాయులున్నారు. అమెరికాతో చర్చలకు అనుకూలంగా ఉన్నారు. జరీఫ్ కూడా పేరొందిన దౌత్యవేత్త. అమెరికాతో చర్చలు జరిపి సంక్షోభాన్ని నివారించగల సమర్థుడు. ఇరాన్ తో చర్చలకు సిద్ధమంటూ పైకి చెబుతున్న ట్రంప్ చేతల్లో మాత్రం ఇరాన్‌పై ఒత్తిడి తెస్తూ, అవమానిస్తూ, రెచ్చగొట్టే చర్యలు చేపడుతున్నారు. అసలే ఉద్రిక్తతలు పెరుగుతూ ఉంటే బ్రిటన్ తన వంతుగా రెచ్చగొడుతున్నది. గురువారం నాడు అమెరికా నావికాదళం ఇరాన్ చమురు ట్యాంకర్‌ను జిబ్రాల్టర్ జలసంధి దగ్గర స్వాధీనం చేసుకున్నది. ఈ నౌక ఇరాన్ నుంచి సిరియాకు చమురు తీసుకపోతున్నది. సిరియాపై యురోపియన్ యూనియన్ ఆంక్ష లు ఉన్న మాట నిజమే. కానీ అణు ఒప్పందాన్ని నిజాయితీగా అమలు చేస్తున్నప్పటికీ ఇరాన్ తో సంబంధాలు కొనసాగించడానికి అమెరికా ఒత్తిడి వల్ల యూరప్ దేశాలు వెనుకాడుతున్నా యి. అటువంటప్పుడు ఇరాన్‌ను తన బతుకేదో బతుకనియ్యాలె కానీ నౌకలను స్వాధీనం చేసుకోవడం ఎందుకు? అమెరికా సూచన మేరకే ఇరాన్ చమురు ట్యాంకర్‌ను బ్రిటన్ స్వాధీనం చేసుకుందని స్పెయిన్ వెల్లడించింది. గతంలో ఇరాక్‌పై దిగినప్పుడు అమెరికాకు బ్రిటన్ మద్దతు ఇచ్చింది.

ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యమైన తమ దేశం అమెరికా తోకగా మారడం పట్ల బ్రిటిష్ ప్రజలకు ఆగ్రహం కలిగింది. ఆ తదుపరి ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు అదే రీతిలో బ్రిటన్ అమెరికా ఉపగ్రహంగా మాదిరిగా వ్యవహరిస్తున్నది. పశ్చిమాసియాలో ఇప్పటికే ఇజ్రాయెల్ అణ్వస్త్రశక్తిగా మారింది. పలు అరబ్బు దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. లిబియా, ఇరాక్ దేశాలపై దాడులపై నాటో దళాలు దాడులు చేసి ఎంత విధ్వంసం సృష్టించాయో తెలిసిందే. సిరియాలో కూడా అమెరికా తలదూర్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తన ఉనికికి ప్రమాదం జరుగుతుందని భయపడటం సహజం. అణ్వస్త్ర తయారీ కార్యక్రమాన్ని నిలిపివేయడానికి సిద్ధపడినప్పుడు, ఇరాన్‌కు రక్షణలు కల్పించడం అంతర్జాతీయ సమాజం బాధ్యత. పన్నెండేండ్ల పాటు ఎంతో సంక్లిష్టమైన చర్చలు సాగిన తరువాత ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్‌తో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా భాగస్వాములే. ఒప్పందం పర్యవేక్షణకు కఠినమైన షరతులకు ఇరాన్ అంగీకరించింది. ఇరాన్ ఒప్పందానికి అనుగుణంగా పరిమితులకు కట్టుబడి ఉంటున్నట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షకులు ధ్రువీకరిస్తూనే ఉన్నారు. అమెరికా ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకున్నప్పుడు దానిని కాపాడవలసిన బాధ్యత యూరప్ దేశాలపై ఉంటుంది. కనీసం అమెరికా ఆంక్షలను పట్టించుకోకుండా ఇరాన్‌తో సంబంధాలను కొనసాగించాల్సింది. యూరప్ దేశాలు సహకరిస్తే అమెరికా ఆంక్షలు నిర్వీర్యమైపోతాయి. కానీ యూరప్ దేశాలు ఒప్పందాన్ని కాపాడటానికి ఏమాత్రం చొరవ చూపడం లేదు. దీంతో యూరప్ దేశాలకు ఇరాన్ అరువై రోజుల గడువు ఇచ్చింది. ఈలోగా యూరప్ దేశాలు విజ్ఞతతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలె.

172
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles