‘సాయం’లేని స్వయంసమృద్ధి ఎట్లా?

Mon,July 8, 2019 11:31 PM

బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి 1.39 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో 75 వేల కోట్ల రూపాయలు ఎన్నికల సమయంలో ఇచ్చిన పెట్టుబడి సహాయం కిందికే సరిపోతాయి. ఈ పథకం కింద దేశంలోని 12.6 కోట్ల చిన్న, సన్నకారు రైతులకు ఏడాది కి ఆరు వేల రూపాయలు ఇవ్వనున్నారు. అలాగే 60 ఏండ్లు పైబడిన రైతులకు నెలకు రూ. మూడు వేల చొప్పున ఇచ్చే ప్రధాన మంత్రి పెన్షన్ యోజన కింద రూ. 900కోట్లు కేటాయించడం ముదావహం. మత్స్య సంపద పెంపునకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రూ. 3737 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతంలో రైతులకు, మత్స్యకారులకు అదనపు ఆదాయానికి ఉద్దేశించిన పథకమిది. దేశవ్యాప్తంగా వచ్చే ఐదేండ్లలో పదివేల రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటు, 75 వేల మంది గ్రామీణ ప్రాంతీయులకు వ్యవసాయ వ్యాపా ర సామర్థ్యాలు, శిక్షణ, కో ఆపరేటివ్స్ ద్వారా పాల వ్యాపారానికి ప్రోత్సా హం మేలైనవే. అయితే ఇప్పటికే డైరీ రంగంలో రాజ్యమేలుతున్న ప్రైవేటు వ్యాపారులను తట్టుకునేలా కోఆపరేటివ్స్‌కు శిక్షణ ఇవ్వాలి. వెదురు, తేనె, ఖాదీ పరిశ్రమల లో విలువల జోడింపు, వ్యాపారానికి ప్రోత్సాహానికి మద్దతు ధరల అమలు కోసం రూ. 3000 కోట్లతో మార్కె ట్ జోక్యపు నిధిని ప్రకటించడం ఆహ్వానించదగినది. దేశంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు సహజమే. ఈ నేపథ్యంలో పీఎం ఫసల్ బీమా యోజనకు రూ. 14,000 కోట్ల కేటాయించడం మంచిదే. దేశంలోని ప్రతి సాగు పంటను కిందికి తేవాలి. సంస్థాగత రుణాలు తీసుకునే రైతులు పంట రుణాలు సకాలంలో చెల్లిస్తే ఇచ్చే వడ్డీ మాఫీ కోసం రూ. 18000 కోట్లు కేటాయింపు కొంత రైతులకు ఉపయోగపడుతాయి. హరితవిప్లవం కింద18 పథకాలను ఒకే గొడుగు కిందికి తెచ్చి, మరిన్ని రాష్ర్టాలలో హరితవిప్లవ ఫలితాలు తీసుకుని వచ్చేందుకు రూ. 12,560 కోట్లు కేటాయించారు.

కేంద్రం 2019-20గాను ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ వ్యవసాయంపై వివక్ష ప్రదర్శించింది. రైతుల ఆదాయాల రెట్టింపు, గ్రామీణ ప్రాంతాల బలోపేతం కోసం ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక కేటాయింపులు చేస్తుందని ఆశించాం. రైతులకు ఉపయోగపడేలా మార్కెట్ సంస్కరణలు, మద్దతు ధరల అమలుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుందనుకున్నాం. సేంద్రియ సాగుకు మరింత ఊతమిస్తుందనుకున్నాం. దీనికి భిన్నంగా వ్యవసాయానికి రొటీన్ బడ్జెట్ ప్రతిపాదనలతోనే సరిపుచ్చారు. దీనిఫలితంగా రాష్ర్టాలు రైతుల నుంచి పంట ఉత్పత్తుల సేకరణ, ధరల చెల్లింపులలో కష్టాలు పడనున్నాయి.


వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగవ్వటం లేదు. వ్యవసాయ వృద్ధి, రైతుల ఆదాయాలు పెరుగాలంటే సాగు నీటి అందుబాటు పెరుగాలి. అందుకు రాష్ర్టాల సాగు నీటి ప్రాజెక్టులకు సహాయంగా భారీ కేటాయింపులు ఆశిస్తే పీయం కృషి సించాయి యోజన కింద రూ. 3,500 కోట్ల కేటాయింపు ఏ మూలకు సరిపోవు. అట్లనే వ్యవసాయ పనులకు ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేయాలనే డిమాండులున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పథకానికి నిధులు తగ్గించడం వారి చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. బడ్జెట్‌లో గేమ్ ఛేంజర్‌గా జీరో బడ్జెట్ ఫార్మింగ్‌ను మరోసారి భారత్‌లో అమలుపరుచాలని కేంద్ర ఆర్థికమంత్రి అన్నారు. మరోసారి మన మూలాలకు వెళ్లాలి. దీంతో రైతుల ఆదాయాలు రెట్టింపు సాధ్యమంటున్నారు. ఇది పూర్తిగా నేల విడిచి సాము చేసే ప్రయత్నమే. అసలు పెట్టుబడిలేని వ్యవసాయం అంటూ ఇప్పటి వరకు ఏమీ లేదు. వ్యవసాయం లో కనీస పెట్టుబడి ఖర్చులు ఉంటాయి. అయితే తక్కువ పెట్టుబడి వ్యవసాయం అని చెప్తే బాగుండేది. రోజురోజుకు పంటల ఉత్పత్తిలో కీలకమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఏటా 10-15 శాతం పెరుగుతున్నాయి. ఆ మేరకు రైతులు పండించిన పంటల దిగుబడులకు విపణిలో ధరలు అందటంలేదు. కాబట్టి పంటల సాగు గిట్టుబాటు కావాలంటే ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాలి. ఆ మేరకు మిగిలింది లాభాల కిందే లెక్క. అయితే ప్రభుత్వం మాత్రం స్థానికంగా లభిం చే పంట వ్యర్థాలు, పశువుల పెంట, వర్మీకంపోస్టులతో సాగు చేయాలని అంటున్నది. దీని ఉద్దేశం రసాయన ఎరువులు, పురుగు మందులు, హైబ్రీడ్లు వాడకుండా ప్రకృతి సహజంగా చేసే వ్యవసాయం. పురుగులు, తెగుళ్ల నివారణ కూడా గోమూత్రం, పులిసిన మజ్జిగ, ఇటీవల వచ్చిన వేస్ట్ డీకంపోజర్‌తో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ సాగు పద్ధతికి మరింత మద్దతు వచ్చింది. అయితే ప్రస్తుతానికి కాయగూరలు, పండ్ల తోటల్లో మాత్రమే ప్రకృతి వ్యవసాయ పద్ధతిని రైతులు పాటిస్తున్నారు.

దేశంలో వ్యవసాయానికి మంచి రోజులు ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు సరిపోవు. సాగులో స్వయం సమృద్ధి సాధించాలంటే రైతు కేంద్రంగా పథకాల రూపకల్పన జరుగాలి. వ్యవసాయ అనుకూల సంస్కరణలు అమలుచేయాలి. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌కు రూపకల్పన చేయాలి.


ముఖ్యంగా రసాయనాలు, పురుగు మందుల అవశేషాలు లేకుండా ఉత్పత్తులు ఉంటాయని వారి భావన. కొన్ని ప్రాంతాలలో వరిలోనూ పశువుల పేడతో పండించి, సేంద్రియ బియ్యంగా వాడుతున్నారు. జీరో బడ్జెట్ వ్యవసాయం, సేంద్రియ సాగుకు చాలా దగ్గరి సంబంధం ఉన్న ది. అంతిమంగా ఖర్చులు తగ్గడంతోపాటు ఉత్పత్తులు నాణ్యతగా ఉండి, రసాయనాల అవశేషాలు ఉండకుండా ఉంటాయి. ఈ తరహా వ్యవసాయంలో అయితే మరో పార్శం నుంచి చూస్తే పెట్టుబడి లేని వ్యవసాయంలో దేశీయ పంటలు, రకాలు వాడాలి. వీటి ఉత్పాదకత తక్కువ. హైబ్రీడ్లు, జన్యుమార్పిడి పంటల యుగం నుంచి మళ్లీ దేశవాళి రకాల సాగుకు వెళ్తే సమస్యలు కొత్తగా ఉత్పన్నం కానున్నాయి. దేశంలోని మొత్తం సేంద్రియ ఎరువులు ఉపయోగించుకున్నా సాగుకు కావాల్సిన ఎరువులలో 20 శాతం కూడా సరిపోవు. మరి మిగతా విస్తీర్ణంలో సాగు చేయడానికి ఎరువులు ఎట్లా? పూర్వం దేశవాళి రకాలు, ఉత్పత్తులు అప్పటి జనాభాకు సరిపోయేవి. మరి ఇప్పుడు పెరిగిన జనాభాకు, అప్పుడున్న విస్తీర్ణంలోనే ఐదింతల దిగుబడులు సాధించడం అసాధ్యం. దీనిఫలితంగా మళ్లీ విదేశాల నుంచి ఆహారధాన్యాలు దిగుమతులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆహారభద్రతకే పెను సవాలుగా మారనున్నది. అయితే వర్షాధార ప్రాంతాలలో, స్వతహాగానే దేశవాళీ రకాలు, సూటి రకాలు వాడుతారు. ఉత్పత్తి కారకాలు తక్కువ వాడినా ఎంతో కొంత దిగుబడి వస్తుంది. కాబట్టి కేంద్రం జీరో బడ్జెట్ ఫార్మింగ్ కొనసాగాలం టే.. వర్షాధార ప్రాంతాలలో ముందుగా పైలట్ ప్రాతిపదికన పరీక్షించాలి. ఆ తర్వాత సాగు నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలలో దఫాలుగా అమలుచేయాలి. ఈ పద్థతిని కాయగూరలు, పండ్ల తోటలు, ఔషధ మొక్కల సాగులో ముందుగా వాడేలా ప్రోత్సహించాలి. ముందు ఈ తరహా సాగు కు బడ్జెట్ కేటాయింపులు చేయాలి. సేంద్రియ ఎరువుల అందుబాటు పెరిగేలా పశుగణన అభివృద్ధి, పశువుల సంఖ్య పెరిగేలా కార్యాచరణ రూపొందించాలి.

ప్రస్తుతం రసాయన ఎరువులకు ఇస్తున్న అన్ని రాయితీలను జీవన ఎరువులు, జీవన పురుగు మందులు, ఇతర సేంద్రియ ఎరువులకు అందించాలి. స్థానికంగా లభించే సాగుకు ఉపయోగపడే సేంద్రియ వ్యర్థాలలో పోషక మోతాదులు లెక్కించాలి. పంటల అవసరాలు తీర్చేందుకు ఎంత మొత్తంలో ఎరువులు అవసరమో నిపుణులు, శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేయించాలి. ఈ ఉత్పత్తులు సేంద్రియ ఉత్పత్తులు. కాబట్టి ప్రీమియం ధరలు అందేలా, ప్రత్యేక మద్దతు ధరలు ప్రభుత్వం ప్రకటించాలి. లేకపోతే పెట్టుబడిలేని సాగు సాధ్యం కాదు. ఇక పప్పుదినుసులలో స్వయంసమృద్ధి ఇప్పటికే సాధించింది. ఇదే స్ఫూర్తితో నూనె గింజలలో కూడా స్వయం సమృద్ధి సాధించాలి. ఎగుమతులు చేసే స్థాయికి ఎదుగాలని ఆర్థికమంత్రి కోరారు. కచ్చితంగా చెప్పాలంటే దేశీయ అవసరాలకు కావాల్సిన పప్పుదినుసులు నేడు దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఫలితంగా సాలీనా 85 వేల కోట్ల రూపాయాల మేర దిగుమతి విలువ ఆదా అవుతున్నది. అయితే కేంద్రం కొంతమేరకు మద్దతు పెంచడం, సేకరణ చేపట్టడంతో అది సాధ్యమయ్యింది. అయితే ప్రస్తుతం పరిస్థితి మళ్లీ మారింది. ఉదాహరణకు దేశంలో ఉత్ప త్తి అయిన కందిలో 40 శాతానికి పైగా మద్దతు ధరల కంటే తక్కువకే రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది. అందులో చిన్న, సన్నకారు రైతులు అపరాల సాగు ఎక్కువ చేస్తారు. కాబట్టి మద్దతు ధరలు అందక మళ్లీ వరి సాగునే నమ్ముకుంటున్నారు. అందుకే నూనెగింజలలో స్వయం సమృద్ధి సాధించాలంటే భారీగా మద్దతు ధరలు పెంచాలి. పండించిన ప్రతి నూనె గింజను ప్రభుత్వం సేకరించాలి. రైతులు సంఘంగా ఏర్పడి తే నూనె మిల్లుల ఏర్పాటునకు ప్రభుత్వం సహకారం ఇవ్వాలి. వర్షాధా ర ప్రాంతాలలో ప్రధానంగా సాగవుతున్న నూనె గింజలు అయిన పల్లీ లు, పొద్దు తిరుగుడు, నువ్వులు, కుసుమలలో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు అందుబాటులోకి రావాలి.
pidigum-saidaiah
దేశంలో వ్యవసాయానికి మంచి రోజులు ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు సరిపోవు. సాగులో స్వయం సమృద్ధి సాధించాలంటే రైతు కేంద్రంగా పథకాల రూపకల్పన జరుగాలి. వ్యవసాయ అనుకూల సంస్కరణలు అమలు చేయాలి. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌కు రూపకల్పన చేయాలి.
(వ్యాసకర్త: శాస్త్రవేత్త, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం)

271
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles