పగటిచుక్క నాన్న

Mon,July 8, 2019 12:45 AM

Father
నాన్నంటే.. నలుదిక్కుల వెలిగే దివిటి
కాళ్ళకు పొద్దును గట్టుకొని
సంసారాన్ని దున్నే
పగటి చుక్క..
మోత్కదొప్పల తైదంబలై
తనువులను తడిమే
ఆత్మీయనేస్తం నాన్న..
ఎన్ని రాత్రులను
తన కనురెప్పల మీద ఎత్తి దించాడో
కండ్లకింది తడి
గొంతుకు ఉరితాడైనా
మన కలలకు పూసే పువ్వైతాడు..
నాన్న..నువ్వు ఆవేశంగా
మాటలరాళ్లు నాపై విసురుతుంటే
అవే నా జీవితానికి
ఎదిగే మెట్లయితవనుకోలేదు..
కాపొల్ల సేండ్లకాడ జీతముండి అల్లిన
జానపదాలన్ని దెచ్చి నా ఒల్లే వొస్తుంటే
ఎర్కలేకపాయే ..నాన్న
నా కవిత్వానికి కండ్లయి బాట జూపుతాయని..

అరిగిన నీ కాళ్ళ తోళ్లచెప్పులకు
ఎన్ని ముండ్లుడాయో
రెండెక్కువే నీ గుండెకు గుచ్చుకున్న
శెల్లల మూటగట్టి
గుడిసె గూటానికి తగిలిచ్చేటోడు..
ఎతలన్ని పచ్చబొట్లయి
నీ తనువంత పొడిసినా
నవ్వుల పొద్దునే
రాత్రి ఇంటికి తెస్తుంటివి..
నీ కన్నీళ్లను కాపురంల పారబోయడం
ఎప్పుడు ఎరగలేదు నాన్న.. కాని
గుడిసెల దండెం ఎనుక
తడి ఆరని తువాలొక్కటి
ఎప్పుడు ఆరబెట్టుకుంటుండేది..
నాన్నంటే.. తన కలలను కాల్చుకొని
కన్నబిడ్డల స్వప్నాలను నెరవేర్చేటోడు
బతుకంత ఊడిగం జేసినా
త్యాగన్నంత తల్లికిచ్చే నిత్య కూలీ.. నాన్న..!
- బోల యాదయ్య, 9912206427

73
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles