దేశీయత లేని బడ్జెట్

Sat,July 6, 2019 12:52 AM

గ్రామీణ, వ్యవసాయ రంగాల్లో తీవ్ర సంక్షోభం ఉన్నది. యువతలో అసంతృప్తి పెరుగుతున్నది. దేశ ఆర్థికవ్యవస్థ బలహీనంగా ఉన్నది. ఈ పరిస్థితిలో దేశానికి దిశానిర్దేశం చేసేదిగా బడ్జెట్ ఉండాలని ప్రజలు ఆశిస్తారు. సూక్ష్మస్థాయిలో సమాజంలోని భిన్నవర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు గమనార్హమైనవి. వ్యవసాయరంగాన్ని కూడా సంక్షోభం నుంచి బయటపడేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సింది.


కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యమే ప్రధానమైందిగా కనబడుతున్నది. ఆర్థికరంగంలో వ్యవస్థాగత సంస్కరణలను చేపట్టడానికి మోదీ ప్రభుత్వం మొదటి పర్యాయం పాలనలో అనుసరించి న విధానాలకు తాజా బడ్జెట్ కొనసాగింపనేది స్పష్టం. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి అనుగుణమైన అనుకూల పరిస్థితులను సృష్టించడానికి భిన్నరకాల చర్యలను బడ్జెట్ ప్రతిపాదిస్తున్నది. విమానయానం, మీడియా, బీమా రంగాలలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళీకరించాలని ఆర్థికమంత్రి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దేశాన్ని 2025 నాటికి ఐదు లక్షల కోట్ల రూపాయల ఆర్థికవ్యవస్థగా వృద్ధి చేయాలనే లక్ష్యం బాగానే ఉన్నప్పటికీ, ఆందుకు అనుసరిస్తున్న విధానాలు మాత్రం సామాజికాభివృద్ధికి దోహదపడేవిగా లేవు. పెట్టుబడులు ప్రవహిస్తే ఉద్యోగ కల్పన జరుగుతుంది, ఎగుమతులు పెరుగుతాయి, మొత్తం ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందనే సాధారణ సూత్రీకరణ ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితులకు వర్తిస్తుందా అనేది సందేహమే. ఇంటింటి కి నీళ్ళందించడం, అందరికి ఆవాసాలు కల్పించడం విధానకర్తల కనీస ధర్మమై ఉండాలె. అది బడ్జెట్‌లో పేర్కొన్నంత మాత్రాన ఎంతవరకు సాధిస్తారనేది చెప్పలేని పరిస్థితి. అయితే గ్రామీణాభివృద్ధి అంటే స్వచ్ఛభారత్, ఇంటింటికి నీళ్ళందించడమనే స్థాయిలో ఆలోచిస్తూ, దేశాన్ని పెద్ద ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పుకోవడం ఆశ్చర్యకరంగా ఉన్నది. గ్రామీణాభివృద్ధిని వ్యవసాయ- వ్యాపారాభివృద్ధిగా కాకుండా సమగ్ర సామాజికాభివృద్ధిలో భాగంగా చూడాలె.

మౌలిక వసతుల రంగంలోకి భారీగా విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తున్నది. మౌలిక వసతుల కల్పన కోసం నిపుణు ల కమిటీని నియమించాలని భావిస్తున్నది. ఈ రంగాన్ని ప్రాధాన్యాంశంగా గుర్తిస్తున్నట్టు మంత్రి సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంగా వెల్లడించారు. ఆర్థికవ్యవస్థ వృద్ధి కోసం దేశవ్యాప్తం గా మౌలికవసతులు, అనుసంధానం అవసరమ ని ఆమె వివరించారు. ఇందుకోసం సమగ్ర నమూనాను రూపొందించారు. జాతీయ రహదారుల కోసం ఇప్పటికే 24 వేల కోట్లను సేకరించారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక పద్దుల్లోనే, రహదారుల అభివృద్ధికి 83,016 కోట్లు, రైల్వేలకు 64, 587 కోట్లు కేటాయించారు. రైల్వే మౌలికవసతుల రంగంలో యాభై లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అవసరమైన నేపథ్యంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నట్టు బడ్జెట్లో పేర్కొన్నారు. కేంద్రం నదీ జలరవాణా ను వృద్ధిచేయాలని నిర్ణయించింది. భారత్ మాల, సాగర మాల వంటి పారిశ్రామిక కారిడా ర్ల పథకాలు కొనసాగుతాయి. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద గ్రామీణ రహదారు ల నిర్మాణానికి 80,250 కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నది. పబ్లిక్‌రంగ సంస్థలను ప్రైవైటుపరం చేయడం కూడా మోదీ విధానాలలో ప్రధానమైనది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో 51 శాతం ప్రభుత్వ వాటాను తగ్గించుకోవాలని కూడా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఎయిర్ ఇండియా ను ప్రైవేటీకరిస్తామని కూడా స్పష్టంచేశారు. విదేశీ పెట్టుబడిదారులకు ఇబ్బంది కలిగించే కార్మిక చట్టాలను సంస్కరించాలనేది కూడా బడ్జెట్‌లో ప్రస్తావించారు.

గ్రామీణ, వ్యవసాయ రంగాల్లో తీవ్ర సంక్షోభం ఉన్నది. యువతలో అసంతృప్తి పెరుగుతున్నది. దేశ ఆర్థికవ్యవస్థ బలహీనంగా ఉన్నది. ఈ పరిస్థితిలో దేశానికి దిశానిర్దేశం చేసేదిగా బడ్జెట్ ఉండాలని ప్రజలు ఆశిస్తారు. సూక్ష్మస్థాయిలో సమాజంలోని భిన్నవర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు గమనార్హమైనవి. వ్యవసాయరంగాన్ని కూడా సంక్షోభం నుంచి బయటపడేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సింది. సమాజాన్ని అర్థం చేసుకొని తదనుగుణమైన పథకాలను రూపొందించుకొని వాటిని సమర్థవంతంగా అమలుచేసినప్పుడే పరివర్తన సాధ్యం. ప్రజల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు, ఎంత ఉత్పత్తి జరిగి ఏమి లాభం? ఆర్థిక సంక్షోభాలన్ని ఈ వాస్తవాన్ని విస్మరించడం వల్ల కలిగేవే. ఇక అంతర్జాతీయరంగంలో ప్రపంచీకరణ మంత్రం పాటించిన దేశాలే ఇవాళ రక్షిత వాణిజ్య విధానాలను అనుసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్పత్తి చేసినంత మాత్రాన ఎగుమతులు సాధ్యం కాదు. దానికి స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉండాలె. విదేశీ ఆర్థిక సంక్షోభాల నుంచి మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కూడా ముఖ్యమే. విదేశీ పెట్టుబడులను నమ్ముకొని దేశ ఆర్థిక సుస్థిరతను సాధించలేం. విదేశీ కరెన్సీ రుణాలను అంగీకరించే పోకడ ఎక్కడికి దారితీస్తుందనే స్పృహ కూడా అవసరం. డాలరీకరణ విధానాల వల్ల ఇతర దేశాల అనుభవాలను గ్రహించాలె. కానీ కేంద్ర బడ్జెట్ దేశ పరిస్థితులను, వాణిజ్యరంగంలో అంతర్జాతీయ పోకడలను గమనంలోకి తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. ఐదు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థకు బాట వేస్తుందంటున్న బడ్జెట్‌లో దేశీయత కొరవడింది.

266
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles