సంకల్ప సిద్ధి

Sat,June 22, 2019 01:31 AM

తొలకరి పలుకరించిన శుభదినాన.. ఇరుగు పొరుగు రాష్ర్టాల శుభాభినందనల మధ్య.. దేశ నీటిపారుదల పథకాలలోనే మణిమకుటమైనట్టి కాళేశ్వరం ప్రాజెక్టును అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం పరిపరివిధాల దేశ చరిత్రలోనే మహోజ్వల ఘట్టం. నదీనదాల నీరు సముద్రంలో కలిసిపోతున్నా, ఎడతెగని వ్యాజ్యాలతో పొద్దు పుచ్చే పాలకులు ఉన్న దేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద బహుళస్థాయి, బహుళార్థ సాధక ప్రాజెక్టును ముచ్చటగా మూడేండ్లలోనే పూర్తి చేయ డం కేసీఆర్ సమర్థతకు, చిత్తశుద్ధికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం అవతరించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ తానే ఒక ఇంజినీర్‌గా మారి నీటి సమగ్ర వినియోగానికి ప్రాజెక్టుల రూపకల్పన చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆ ప్రాజెక్టుల విశేషాలను ప్రజలకు అర్థమయ్యేరీతిలో ప్రజా ప్రతినిధుల సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదంతా ప్రజలకు నిన్నమొన్నటి జ్ఞాపకంగా ఉన్నది. ఇంత తక్కువ వ్యవధిలో పల్లాన పారుతున్న జలాలను ఎత్తుకు తరలించి ఒక మహానదికి పునరుజ్జీవం కల్పిస్తారనేది అనూహ్యం. మహారాష్ట్ర పాలకులు ఏ మాత్రం అభ్యంతరం పెట్టకుండా వారిని మెప్పించి ఒప్పందం కుదుర్చుకోవడమూ కేసీఆర్ రాజనీతి చతురతకు నిదర్శనమే. ఈ ఒప్పందం ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా సాగింది. కాళేశ్వరం అంటే ఏదో ఒక సాధారణ ప్రాజెక్టు కాదు. దాదాపు ఇరువై ప్రాజెక్టుల సమాహారం. ఒక ఇంజినీరింగ్ అద్భుతం! కొండలను సైతం తొలిచి భారీ సొరంగాలను నిర్మించడం, ప్రపంచంలోనే అతిపెద్ద పంప్ హౌజ్‌ను భూగర్భంలో నెలకొల్పడం మొదలైనవి ప్రపంచాన్ని అబ్బురపరిచే ఆవిష్కరణలు.

గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించడం జల కలహాలున్న రాష్ర్టాలకు, దేశాలకు సౌహార్ద్ర సందేశంగా నిలుస్తుంది. మా ప్రజలకు ముంపు బాధ లేకుంటే చాలు, మీ వాటా మీరు వాడుకుంటే మాకే అభ్యంతరం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కేసీఆర్ కూడా మహారాష్ట్ర ప్రజల మనోభావాలను గుర్తిస్తూ, వారికీ మేలు జరిగేవిధంగా ఎంతో సృజనాత్మకంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా మహారాష్ట్ర అందించిన తోడ్పాటు మరిచిపోలేనిది.


నాయకులు తలుచుకుంటే ప్రకృతి సంపదను, సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవాళి సంక్షేమానికి చక్కగా ఉపయోగించవచ్చనడానికి కాళేశ్వర అద్భుతం తార్కాణంగా నిలుస్తుంది. కేసీఆర్ పదేపదే చెబుతున్నట్టు దేశవ్యాప్తంగా డెబ్బయి వేల టీఎంసీల నీళ్ళున్నాయి. వాటిని సామరస్యంగా పంచుకొని బీడు భూములకు మళ్ళించడం అసాధ్యమేమీ కాదు. కానీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేకపోవడం వల్ల నిరంతరం కయ్యాలతో కాలం గడుపుతారు. ప్రాజెక్టులను ప్రారంభించినా దశాబ్దాలు గడిచినా పూర్తిచేయ రు. దేశంలో ఎటుచూసినా జలవివాదాలే. రావి- బియాస్‌పై పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ర్టా ల మధ్య ఎడతెగని గొడవలు. నర్మద జలాలకు సంబంధించి రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర మధ్య పంపకాలు తెగడం లేదు. కావేరీ జలాల వివాదం కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చెరి మధ్య రగులుతూనే ఉన్నది. మహాదాయి నదిపై కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ర్టాలకు వివాదం సాగుతున్నది. వీటిపై ట్రిబ్యునల్స్ వేసి కూడా దశాబ్దాలు గడిచిపోవడం మరీ ఆశ్చర్యకరం. కేంద్రంలో, వివాదపడుతున్న రాష్ర్టాలలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ కనబరచక పోవడం నాయకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. కేసీఆర్ వంటి ఒక్క నాయకుడు మూడేండ్లలో ఒక భారీ ప్రాజెక్టును నిర్మించడం వల్ల దాదాపు 45 లక్షల ఎకరాలకు నీటి లభ్యత కలుగుతున్నది. రాష్ర్టానికంతటికీ మంచినీటి కష్టాలు తీరుతున్నాయి. హైదరాబాద్ నగర జనుల దాహం తీరుతుంది. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలలో నీళ్ళు నిండి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురిపుష్టం కాబోతున్నది. భూగర్భ జలమట్టం పెరిగిపోతుంది. పారిశ్రామిక అవసరాలు తీరుతాయి.

స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్దంలోనే సమస్యలను పరిష్కరించుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తే, ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండేది! గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించడం జల కలహాలున్న రాష్ర్టాల కు, దేశాలకు సౌహార్ద్ర సందేశంగా నిలుస్తుంది. మా ప్రజలకు ముంపు బాధ లేకుంటే చాలు, మీ వాటా మీరు వాడుకుంటే మాకే అభ్యంతరం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కేసీఆర్ కూడా మహారాష్ట్ర ప్రజల మనోభావాలను గుర్తిస్తూ, వారికీ మేలు జరిగేవిధంగా ఎంతో సృజనాత్మకంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా మహారాష్ట్ర అందించిన తోడ్పాటు మరిచిపోలేనిది. ఇటీవలే అటవీ భూమిని సేకరించడంలో పూర్తి సహకారం అందించా రు. కర్ణాటక రాష్ట్రం కూడా తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తున్నది. ఇప్పటికే ఒకరికొకరం మూడుసార్లు నీటిని బదలాయించుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. ఇటు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా అధికారం చేపట్టిన క్షణం నుంచి తెలంగాణ రాష్ట్రంతో స్నేహ పూర్వకంగా ఉంటున్నారు. గోదావరి, కృష్ణా జలాలలోని కేటాయింపులను, మిగులు జలాలను వాడుకొని తెలంగాణ, ఏపీలలోని ప్రతి అంగుళాన్ని తడుపాలనే ఇరువురు ముఖ్యమంత్రుల నిర్ణయం ఆదర్శప్రాయమైనది. ఈ రాష్ర్టాలలో వేర్వేరు పార్టీల వారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ, సఖ్యత నెరుపడం వారి విజ్ఞతను ఎత్తి చూపుతున్నది. దేశం 75 ఏండ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోబోతున్న తరుణంలో ఇంతకన్నా గొప్ప సందేశం మరేమి ఉంటుంది!

200
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles