ఉద్యమ దశ, దిశ నిర్దేశకుడు

Fri,June 21, 2019 03:20 AM

నేడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి
professor-jayashankar2
జయశంకర్ సార్ పోయి అప్పుడే ఎనిమిదేండ్లయింది. సార్ గుర్తుకొస్తే ఆయన సూచనలతో మేం సాగించిన ఉద్యమ ఘట్టాలు కండ్ల ముందు కదలాడుతయి. ఆనాటి ఆంధ్రా ఆధిపత్యవర్గాలు ఉద్యమాన్ని దెబ్బకొట్టడానికి అనేక కుట్రలు చేసేవి. అయినా వాటిని ఎదుర్కొంటూ మేం చేసిన పోరాటానికి సార్ సూచనలు ఎంతో ఉపయోగపడినయి. జయశంకర్ సార్‌తో మాకు చాలాకాలం నుంచి పరిచయం ఉన్నది. 1973- 74 నుంచి మాకు బాగా సాన్నిహిత్యం పెరిగింది. తెలంగాణ ఉద్యమమే మమ్మల్ని దగ్గరికి చేసింది. మలిదశ ఉద్యమం సాగినప్పుడు మాకు ఉద్యమ దశ దిశ నిర్దేశించింది సారే. హైదరాబాద్‌లో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (ఇప్పుడు ఇఫ్లూ)లో సార్ రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు వెళ్ళి కలిసివాళ్ళం. సార్ కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా వచ్చిన తరువాత మాత్రం ఇంకా ఎక్కువగా కలిసి పనిచేసే అవకాశం కలిగింది. తెలంగాణ ఉద్యమం గురించి చర్చ ఎప్పుడూ నడుస్తూ ఉండేది. తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళా రాజేసిన క్రమం మరిచిపోలేనిది. అందుకు కొన్ని పరిస్థితులు పురికొల్పాయి. ఉద్యమం ఉధృతమైన దశలో, ఎన్నో ఒత్తిళ్ళ మధ్య ఎంతో జాగరూకతతో ఉద్యమాన్ని నడుపాల్సి వచ్చింది.
professor-jayashankar
1994లో- మేం కాకతీయ విశ్వవిద్యాలయానికి వీసీగా ఆంధ్రాలోని ఒక ఆధిపత్య సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని నియమించారు. అదే సమయంలో వరంగల్ జిల్లా ఎస్పీగా కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ప్రభుత్వం నియమించింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో వీరు రాజవంశీకుల మాదిరిగా వ్యవహరించేవారు. వారి ఆధిపత్య ధోరణి మాకు ఊపిరాడకుండా చేసింది. వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయంలోనూ, వరంగల్‌లోనూ తెలంగాణ వారి నుంచి ప్రతిఘటన మొదలైంది. ఈ విషయాలను నిరంతరం చర్చించుకునేవాళ్ళం. మాకు క్రమంగా ఈ పరిస్థితికి మూలాలు తెలంగాణ మీద ఆంధ్రా ఆధిపత్యంలో నే ఉన్నాయనే విషయం అర్థమైంది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం ద్వారానే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనేది అర్థమైంది. దాంతో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా సాధించాలనే నిర్ణయానికి వచ్చినం. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు జయశంకర్ సార్‌తో చర్చిస్తూనే ఉన్నాం. 1996 ఆగస్ట్ పదిహేనవ తేదీన ప్రధాని దేవెగౌడ ఎర్రకోట మీది నుంచి ప్రసంగిస్తూ, ఉత్తరాఖండ్ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. అప్పటివరకు తెలంగాణవాదు లం పట్టుదలగా మా లక్ష్యానికి కట్టుబడి ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ విధానం చిన్న రాష్ర్టాలకు వ్యతిరేకమనే అభిప్రాయం ఉండేది. దేవెగౌడ ప్రకటన మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. ఏటా నవంబర్ ఒకటిన బ్లాక్ డే పాటించేవాళ్ళం.

కానీ ఈసారి పెద్ద ఎత్తున జరపాలనే నిర్ణయానికి వచ్చినం. భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు. హైదరాబాద్‌లోని ప్రతాప్ కిషోర్ టీపీఎస్ ప్రధాన కార్యదర్శి. రఘువీరారావు కూడా ప్రముఖ తెలంగాణవాది. పదిహేను రోజుల ముందే హైదరాబాద్‌లో ప్రతాప్ కిషోర్ ఇంటిలో సమావేశం అయినం. చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు. వృద్ధులు అయినా తెలంగాణ రావాలనే ఆకాంక్ష ఉన్నవారు. వారిలో నేను అందరికన్నా చిన్నవాడిని! హైదరాబాద్‌లోనా, వరంగల్‌లోనా? ఎక్కడ జరుపాలనే చర్చ వచ్చింది. వరంగల్‌లో జరిపితేనే ప్రభావవంతంగా ఉంటుందనేది నా అభిప్రాయం. పైగా భారీ ఎత్తున నిర్వహించాలని పట్టుదలగా ఉన్నది. అప్పటి పరిస్థితుల్లో సభకు వ్యయం భరించడంతోపాటు, అన్ని హంగులు సమకూర్చుకోవడం వరంగల్‌లో అయితేనే సాధ్యం. చివరికి వరంగల్‌లో జరుపాలనే నిర్ణయం జరిగింది. కేయూ అధ్యాపకులు, వరంగల్‌లోని మిత్రులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అందరిని సంప్రదించాను. ఆర్యవైశ్య సత్రం సమావేశ మందిరంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశాను. ఈ సమావేశానికి భారీ స్పందన వచ్చింది. పది జిల్లాల నుంచి మేధావులు, పాత్రికేయులు, కార్యకర్తలు వచ్చా రు. కొండా మాధవ రెడ్డి గారు వచ్చారు. ఓయూ ఉపాధ్యాయ సంఘం నాయకుడు ప్రొఫెసర్ పురుషొత్తమ్ రెడ్డిగారు వచ్చారు. జయశంకర్ సార్‌కు కూడా ఈసభ ఎంతో ధైర్యాన్నిచ్చింది.

మా అందరికి ఉద్యమాన్ని ఇంకా రాజేయాలనే తపన నెలకొన్నది. తెలంగాణ ఉద్యమంలో ఈ సభ మైలురాయి. వరంగల్ సమావేశం తరువాత ఉద్యమం పుంజుకోవడం మొదలైంది. ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలు చురుగ్గా పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున భావవ్యాప్తి సాగించడం మొదలుపెట్టాం. ఆదిలాబాద్ మొదలుకొని మహబూబ్‌నగర్, ఖమ్మం వరకు తెలంగాణ అంతటా కదలిక వచ్చింది. ఎక్కడ ఎవరు సమావేశం ఏర్పాటు చేసినా వెళ్ళేవాళ్ళం. చూస్తుండగానే వందలాది మీటింగ్‌లు జరిగాయి. తీవ్రవాదశక్తులు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. దీనిని సాకుగా తీసుకొని పోలీసులు అణిచివేత సాగించడం మొదలుపెట్టారు. దీంతో ఆర్‌ఎస్‌యు మొదలుకొని ఆర్‌ఎస్‌ఎస్ వరకు అన్ని సిద్ధాంతాల వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనవచ్చునని జయశంకర్‌సార్ ప్రకటించారు. దీంతో తెలంగాణ ఉద్యమ సార్వజనీనతను స్పష్టంగా చెప్పినట్టయింది. దీనికి ఏ ఒక్కరి ఉద్యమంగా ముద్రవేసి అణచివేయకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. ఉద్యమం ఒక స్థాయికయి తే వచ్చింది. కానీ తెలంగాణ సాధించాలంటే రాజకీయ శక్తి ఉండాలని జయశంకర్ సార్ ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఇంద్రా రెడ్డి కూడా ఉద్యమంలోకి వచ్చారు. చాలామంది ఆసక్తి చూపించారు. కానీ తెలంగాణ రాజకీయ శక్తి ఏర్పడలేదు.

ఈలోగా కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ లో విద్యుత్ పరిస్థితిపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలోని సమాచారం ఒక పత్రికలో ప్రముఖంగా వచ్చింది. దీన్ని చూసిన తరువాత మేం కేయూ నుంచి వెళ్లి కేసీఆర్‌ను కలిసినం. తాను స్టడీ చేయడానికి కొంత టైమ్ తీసుకుంటానని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ హైదరాబాద్‌లో జయశంకర్‌సార్‌ను కలిసారు. తాను ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులను చూశానని. కానీ కేసీఆర్ చాలా షార్ప్‌గా ఉన్నారని ఆ తరువాత జయశంకర్ సార్ మాతో అన్నారు. జయశంకర్‌సార్‌కు కేసీఆర్‌పై మొదట్లోనే గట్టి నమ్మకం ఏర్పడ్డది. కేసీఆర్ ఎత్తుగడలు వేస్తూ పోయే కొద్దీ ఆయనకు అండగా నిలిచారు. కేసీఆర్‌కు జయశంకర్‌సార్ మద్దతుగా నిలువకుండా చేయాలనే ప్రయత్నాలు సాగినయి. కొందరు కుల సంఘాలు నాయకులు కూడా కేసీఆర్‌కు మద్దతు ఇవ్వవద్దని తీవ్ర ఒత్తిడి తెచ్చినా జయశకంర్ సార్ వినలేదు. మనం ఎంతోమంది రాజకీయ నాయకుల ను చూసినం. ఈయనంత ఉత్తములు ఎవరూ కనిపించలేదు. మనకు కొన్ని విభేదాలున్నా సర్దుకుపోవాలె గాని వ్యక్తిగత రాగద్వేషాలు ఉద్యమంలో పెట్టుకోవద్దు అని జయశంకర్ సార్ స్పష్టంగా చెప్పేవారు. కులమతాలకు అతీతంగా ఉద్యమం సాగాలని అన్నారు. మొదట తెలంగాణ సాధించుకోవాలె, ఆ తరువాత ఏవైనా చేసుకోవచ్చు అన్నారు.
T-Papireddy
ఎటువంటి సందేహాలు వచ్చినా, ఒత్తిడులు వచ్చినా జయశంకర్‌సార్ ఎప్పటికప్పుడు మా వెంట ఉండి సూచనలు ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పాడుతుందని జయశంకర్ సార్ బలంగా నమ్మేవారు. తన జీవితమంతా పరితపించిన తెలంగాణ రాష్ర్టాన్ని కళ్ళారా చూడకుండానే ఆయన కాల ధర్మం చెందడం తలుచుకున్నప్పుడల్లా బాధగా ఉంటుంది.
(రచయిత: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్)
(నేడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి)

650
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles