లెఫ్ట్ కేడర్ తిరగబడాలి

Wed,June 19, 2019 11:20 PM

వామపక్ష నాయకత్వాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు తిరుగబడవలసిన దశ వచ్చింది. తాము ఎన్నెన్ని త్యాగాలు చేసినప్పటికీ పార్టీలను ముందుకు తీసుకువెళ్లలేక నానాటికి బలహీనపరుస్తున్న ఈ నాయకత్వాల వల్ల ఉపయోగం లేదని పదేపదే రుజువవుతున్నది. వారు దిద్దుబాటుకు సైతం అతీతులైపోయారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఈ పార్టీలు మరణశయ్యపైకి చేరగలవు. ఆ స్థితి రాకూడదంటే కార్యకర్తలు ఈ నాయకత్వాలను పడదోసి కొత్త నాయకులను సృష్టించుకోవాలి.ఉమ్మడి రాష్ట్రం విభజన సమయానికే గణనీయంగా బలహీనపడిన కమ్యూనిస్టులు 2014 ఎన్నికలలో తెలంగాణలో చెరొక సీటు మాత్రమే రాగా, తర్వాత కొద్ది మాసాలకు సుందరయ్య కేంద్రం (అది ఈసరికి ఒక ఇంటలెక్చువల్ స్లమ్‌గా మారిపోయింది)లో భిన్న మేధావుల సమావేశాలు జరిపారు. తర్వాత ఒక డజను లెఫ్ట్‌పార్టీల అంతర్గత చర్చలు పెట్టుకొని, 2019 నాటికి తామే ప్రత్యామ్నాయం కాగలమని కార్యకర్తలకు నమ్మబలికారు. తీరా 2018 చివర మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎవరి దారిన వారు పోయారు.

వేర్వేరు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు ఈ రచయితతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. అట్లా మాట్లాడే వారిలో యువకుల నుం చి మొదలుకొని డ్బ్భై-ఎనభై ఏండ్ల మధ్య వయసువా రి వరకు ఉంటారు. వారిలో పట్టణాల వారు, గ్రామీణులున్నారు. వారం తా వేర్వేరు వృత్తివ్యాపకాల వారు. వయసుమీరిన వారైతే నిజాం వ్యతిరేక సాయుధ రైతాంగ పోరాట జ్ఞాపకాలు కలవారు. ఇప్పుడు ప్రత్యేకం గా ఏమీ చేయకున్నా కమ్యూనిజం పట్ల ప్రగాఢమైన విశ్వాసంతోనే మిగిలారు. మొత్తం మీద కొందరు ఏదో ఒక లెఫ్ట్ పార్టీతోనో, లేక ప్రజాసం ఘంలోనో సభ్యులు కాగా, కొందరు పార్టీ అభిమానులు. వీరు, వారి సహచరులు ఈ రచయితతో మాట్లాడటం లోగడకన్నా ఇటీవల ఎక్కువైంది. ఎక్కువసార్లు, ఎక్కువసేపు మాట్లాడుతున్నారు. ఎప్పుడూ లేనం త ఆవేదనగా మాట్లాడుతున్నారు.

ఇటువంటిది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలపు చివరిదశ నుంచి, 2014 ఎన్నికల ఫలితాల నుంచి మొదలై, ఇటీవలి అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాల మీదుగా కొనసాగుతున్నది. వీరందరి ఆవేదన కేవలం ఎన్నికల పరాజయాల గురించి కాదు. అది కూడా వారికి ఆవేదన కలిగిస్తున్న విషయమే. కాని కమ్యూనిస్టులైన తాము ఎన్నికల పరాజయాలకు భయపడేవారం కాదని, అంతకన్న ముఖ్యమైన కారణాలున్నాయని వారంటున్నారు. ఆ కారణాలకు ఎన్నికల ఓటములు తోడవుతున్నాయి. ఆ కారణాలు పుండు కాగా, ఎన్నికల పరాభవం ఆ పుండుపై చల్లిన కారం అవుతున్నాయి. పుండు అని వారు భావిస్తున్న ఇతర కారణాలలోకి వచ్చేవి నాయకత్వపు సైద్ధాంతిక గందరగోళం, క్షేత్రస్థాయి ఆచరణ లేమి, ప్రజా ఉద్యమాల అనుభవం లేక ఏదో మార్గం ద్వారా నాయకత్వ స్థానాలలోకి వచ్చి ఏమి చేయాలో తెలియక గాలిలో గిరికీలు కొడుతున్నవారు, వాస్త వ రాజకీయాలకు రోజువారీగా లేదా ఎన్నికల సమయంలో తమ సిద్ధాంతాలను ఏ విధంగా అన్వయించాలో బోధపడని వారు ఎక్కువమంది. అలాగే వైఫల్యాల నుంచి నేర్చుకోలేనివారు, పార్టీ సమావేశాలలో ఒకటి తీర్మానించి మరొకటి ఆచరించేవారు, పార్టీ యంత్రాంగాలపై పట్టు సాధించలేనివారు, కార్యకర్తల విశ్వాసం పొందలేనివారు నాయకులుగా ఉండటం వంటివి వస్తున్నాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతి అంశానికి సంబంధించి కూడా కార్యకర్తలు స్వయంగా ఉదాహరణలు చెప్తున్నారు.

ఎన్నికల పరాజయాలను అట్లుంచి, ఈ కార్యకర్తలలో పలువురు ఎత్తిచూపుతున్న ముఖ్యమైన విషయం మరొకటి ఉన్నది. అది గత నాయకత్వాలకు, ఇప్పటి నాయకత్వాలకు మధ్యగల నైతికమైన తేడాలు. గత నాయకులు త్యాగాలకు, సాధారణ జీవితాలకు, పొదుపరితనానికి, తమ కుటంబాలను కూడా అదేవిధంగా నడుపటానికి పేరుపడినవారు. ప్రస్తు త నాయకుల్లో అధికులు అందుకు విరుద్ధంగా ఉన్నారు. ఆస్తులు సంపాదించుకుంటున్నారు. పైరవీలు చేస్తున్నారు. భార్యాపిల్లలు సంపన్నుల శైలిలో జీవిస్తారు. ఖరీదైన స్కూళ్లు, కాలేజీలలో చదువుతారు. విదేశాల లో ఉద్యోగాలు, నివాసాలు చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారాలు నడుపుతా రు. వారి బాగు కోసం నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి చేయగలిగినివి చేస్తున్నారు. ఈ పార్టీలకు ఆస్తులకు కొదవలేదు. ఉదాహరణకు ఈ రోజు తెలంగాణలో క్రైస్తవ ఆస్తుల తర్వాత అత్యధిక ఆస్తులు గలవారు బహుశా కమ్యూనిస్టులే. ఇందులో ఎక్కువ భాగం కార్యకర్తలు, అభిమానులు శ్రమపడి చందాల రూపంలో దశాబ్దాల కాలంలో సమకూర్చి పెట్టినవి కాగా, కొన్ని ఆయా ప్రభుత్వాలూ ఇచ్చినవి. సమస్య ఆస్తుల గురించి కాదు. వాటిని ఉపయోగించి వర్తమాన నాయకత్వాలు ఏమి చేస్తున్నాయన్నది ప్రశ్న. అదీ కార్యకర్తల ఆవేదన.
Ashoke
ఇతర పార్టీలలో వలె కమ్యూనిస్టు పార్టీలలో బహిరంగమైన నిరసనలు, తిరుగుబాట్లు, చీలికలు అరుదుగా తప్ప ఉండవు. లేనట్లయితే ఇటీవలి కాలంలో అటువంటివి కొన్నయినా చోటుచేసుకొని ఉండేవని ఈ రచయితతో మాట్లాడినవారు చెప్పిన దానిని బట్టి అర్థమవుతున్నది. బహిరంగ నిరసనలు, చీలికలకు వీలుండటం ప్రజాస్వామిక లక్షణాలలో ఒకటా కాదా, కమ్యూనిస్టులు చెప్పే డెమోక్రటిక్ సెంట్రలిజం ఆచరణలో ఏ విధంగా ఉండి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నదన్నది అనే చర్చను అట్లుంచితే, యథాతథంగా ఈ పార్టీలలో నాయకత్వాల పట్ల పలు అంశాలపై త్రీవ నిరసనలు ఉన్నాయన్నది వాస్తవం. ఆ నిరసనలు ఇటీవలి పరిణామాలు, ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో లావా వలె ఉడుకుతున్నాయంటే అతిశయోక్తి కాబోదు. అది ఉప్పొంగటం వారికి నిజంగానే ఒక చారిత్రక అవసరంగా మారుతున్నది. ఉప్పొంగకపోవటం నాయకులకు ఎంత అవసరమో, ఉప్పొంగటం కార్యకర్తలకు,వారి సిద్ధాంతాలకు, పార్టీలకు, వాటి భవిష్యత్తుకు అంత అవసరంగా పరిణమిస్తున్నది.

కార్యకర్తలు ప్రస్తావిస్తున్న ఇటీవలి కొన్ని ఉదంతాలనే గమనిస్తే.. లెఫ్ట్‌కు పెట్టని కోటలని నమ్మిన బెంగాల్, త్రిపురలలో మొన్న ఒక్కటంటే ఒక్క లోక్‌సభ సీటైనా రాలేదు. అధికారంలో గల కేరళలో ఒకే ఒకటి గెలిచారు. డీఎంకే దయాభిక్ష అన్నట్లు తమిళనాడులో వచ్చిన నాలుగు లేకపోతే పరిస్థితి ఏమిటనే ప్రశ్నతో కార్యకర్తలకు తల తిరుగుతున్నది. తెలంగాణ, ఆంధ్ర పరిస్థితిని చూడండి. ఇవి ఒకప్పుడు బెంగాల్ మించిన కోట. ఈ రెండు రాష్ర్టాలలో రెండు అసెంబ్లీ ఎన్నికలలో వచ్చినవి రెండే రెండు సీట్లు. ఆ రెండు కూడా 2014లో తెలంగాణలో. అక్కడ వీరికి 2019 లో రెండు సున్నాలు. ఏపీలో 2014లో రెండు సున్నాలు. మొత్తమ్మీద రెండు పార్టీలు, రెండు రాష్ర్టాలు, రెండు అసెంబ్లీ ఎన్నికలు, సీట్లు రెండు. ఇటువంటి నాయకత్వాలు ఎందుకు?

ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి దరిమిలా లెఫ్ట్ నాయకత్వం బీజేపీ మత తత్వ ప్రమాదం గురించి ఎక్కడాలేని హడావుడి చేస్తున్నది. తమ ఓటమికి కారణం అదే అయినట్లు పార్టీ కార్యకర్తలను నమ్మించి, వారి దృష్టిని మళ్లించి, తమ వైఫల్యాలను కప్పుకొన జూస్తున్నది. బీజేపీ సమ స్య నిజమే. కానీ ఆ పార్టీ గ్రాఫ్ పైకి తిరుగటం మొదలై 35 ఏండ్లు అయింది. ఆ సమస్యను ఎదుర్కొనేందుకు ఈ సుదీర్ఘ కాలంలో వీరు చేసింది ఏమిటన్నది కార్యకర్తల ప్రశ్న. సీట్ల కోసం, తమ గెలుపు కోసం ఇతరులతో పొత్తులు పెట్టుకొని అదే సెక్యులరిజాన్ని కాపాడగలదంటూ కార్యకర్తలను భ్రమ పెట్టడం మినహా సైద్ధాంతికంగా, క్షేత్రస్థాయిలో చేసిందేమిటి? వినేందుకు దిగ్భ్రాంతి కలుగుతుంది కాని, ఈ పార్టీలకు ఈ 35 ఏండ్లలో కమ్యూనలిజం-సెక్యులరిజాలపై సిద్ధాంతరీత్యా గాని, ఆచరణ దృష్ట్యా గాని ఒక వ్యూహపత్రం అన్నదే లేదు. ఇటువంటి నాయకత్వాలు దేనికోసం?
ఉమ్మడి రాష్ట్రం విభజన సమయానికే గణనీయంగా బలహీనపడిన కమ్యూనిస్టులు 2014 ఎన్నికలలో తెలంగాణలో చెరొక సీటు మాత్రమే రాగా, తర్వాత కొద్ది మాసాలకు సుందరయ్య కేంద్రం (అది ఈసరికి ఒక ఇంటలెక్చువల్ స్లమ్‌గా మారిపోయింది)లో భిన్న మేధావుల సమావేశాలు జరిపారు.

తర్వాత ఒక డజను లెఫ్ట్‌పార్టీల అంతర్గత చర్చలు పెట్టుకొని, 2019 నాటికి తామే ప్రత్యామ్నాయం కాగలమని కార్యకర్తలకు నమ్మబలికారు. తీరా 2018 చివర మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎవరి దారిన వారు పోయారు. ఎవరికీ ఒక్కసీటైనా రాలేదు. అటువంటి అత్యద్భుత చారిత్రక పరాభవం తర్వాత మరింత దివాళాకోరు రాజకీయాలలో మునిగి తేలి పరవశిస్తున్నారు. తృణమూల్‌ను ఓడించేందుకు మొన్న బెంగాల్‌లో బీజేపీకి ఓటు వేసినట్లు, టీఆర్‌ఎస్ పట్ల కక్షతో ఇక్కడ వచ్చేసారి బీజేపీకి రహస్య మద్దతు ఇస్తే ఆశ్చర్యపడనక్కరలేదు. స్వయం గా బలపడటం చేతకాని నాయకత్వం పొత్తులతో ప్రాణాలు నిలుపుకోవటం కూడా అసాధ్యమవుతున్నప్పుడు, ఇటువంటి నాయకులపై కార్యకర్తలు తిరుగుబాటు చేసి, తమ శ్రేణుల నుంచి కొత్త నాయకత్వాలను సృష్టించుకోవటం ఒక్కటే మార్గాంతరం కావచ్చు.

259
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles