భువనగిరి గుట్ట

Mon,June 10, 2019 01:21 AM

Outcrop
కొండపక్కనే మాయిల్లు
లేదా మాయింటి పక్కనకొండ
నేను పుట్టగానే నాకళ్లనిండా
దాని నీడలు వ్యాపించివుంటాయి
దానిని తెచ్చివ్వమని ఏడ్చిందే
నాతొలి ఏడుపు అయివుంటుంది!

దాని వెనుక నుంచి
తొంగిచూసే సూర్యోదయం,
దానిపై కురిసే
ఐంద్రజాలిక వర్షాలు
నా భావుకతకు చిగురులు తొడిగి
కవిగా మలిచి వుంటాయి..!

మా కొండ కూడా
ఏ ఆకృతిని ఊహించుకంటే
అలాగే కనిపించేది.
మబ్బులతో దానికి సోపతి
ఆ రోజుల్లోనే దానిచుట్టు పక్కల
బోలెడన్ని పల్లెలుండేవి.
ఒక్కో ఊరిలోంచి
ఒక్కో కోణంలో కనిపించేది
దాని సమగ్ర స్వరూపాన్ని
నేనింకా దర్శించవలసేవుంది..!

ఏప్రాక్తన కాలం నాటిదో ఆ కొండ..
దాని శిథిలాలు
నిన్నమొన్నటి చరిత్రకు కూడా
సజీవ సాక్ష్యాలు..!

ఆకాశం
మేఘచాలితమైనప్పుడు
కిందకొండ
కాలమహాసాగరంలో కదుల్తున్న
ఓడలా వుంటుంది..!

ఎప్పుడో నగరానికి వలసపొయ్యాను
కలతలు ముసిరినప్పుడల్లా
చెప్పుకోడానికిప్పుడు
దగ్గర కొండ కూడా లేదు.
మెల్లగా అర్థమౌతుంది
తోడుండటానికి తనకు బదులుగా
కవిత్వాన్నిచ్చింది కాబోలు..!

- డాక్టర్ ఎన్.గోపి

126
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles