సూడాన్ సంక్షోభం

Sat,June 8, 2019 01:17 AM

ప్రజా ఉద్యమం పేరుతో అంతిమంగా అమెరికా లక్ష్యం నెరవేరింది. తమకు వ్యతిరేకంగా ఉన్న బషీర్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంతోపాటు తమకు అనుకూలంగా ఉండే సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పగలిగింది. బహిరంగంగా అమెరికా సూడాన్ వ్యవహారాలతో సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నది. హింసాకాండను ఖండిస్తూ శాంతిని నెలకొల్పాలని పిలుపు ఇస్తున్నది. మరోవైపు సౌదీ అరేబియా, యునైటెడ్ ఎమిరేట్స్, ఈజిప్టు మొదలైన దేశాల ద్వారా సూడాన్‌లోని సైనిక ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నది.


అరబ్బు ప్రాంతమంతా వైషమ్యాలతో అట్టుడుకుతున్న తరుణంలో ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్‌లో తలెత్తిన సంక్షోభం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ప్రజాస్వామ్య ఉద్యమకారులపై సైనిక ప్రభు త్వం కాల్పులు జరుపడంతో 113 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. సూడాన్‌లో సైనిక ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యవాదులకు పోరాటం సాగుతున్న మాట నిజమే. కానీ తరచిచూ స్తే ఇందులో విదేశీ శక్తుల ప్రమేయమే ప్రధానమైందిగా కనబడుతున్నది. సిరియా, లిబియాల మాదిరిగానే సూడాన్ సంక్షోభంలోకి జారుకుంటున్నదనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా సూడాన్ ఎదుర్కొంటున్న సంక్షోభానికి మూలం అమెరికా విధించిన ఆంక్షలే. ఈ ఆంక్షల మూలంగా తంటాలు పడుతున్న సూడాన్‌కు ఐఎంఎఫ్ మరికొన్ని షరతులు విధించింది. సబ్సిడీలు ఎత్తివేయాలని, సంక్షేమ పథకాలు తగ్గించుకోవాలని సూచించింది. ఇంధనం, ఆహారంపై సబ్సిడీలు ఎత్తివేయడంతో దేశాధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యా యి. నిరసనలను అణిచివేసేందుకు అధ్యక్షుడు బషీర్ గతేడాది డిసెంబర్‌లో ఎమర్జెన్సీ విధించాడు. ముప్ఫై ఏండ్లుగా అధికారంలో ఉన్న బషీర్ రాజీనామా చేయాలంటూ ఉద్యమం తీవ్రమైంది. ఉద్యమకారులకు నాయకత్వం వహిస్తున్న కొన్నివర్గాలు ప్రభుత్వాన్ని కూలదోయవలసిందిగా సైన్యాన్ని కోరడం విచిత్రం. దీనివల్ల మొత్తం ప్రజా ఉద్యమమే పక్కదోవ పట్టింది. సైన్యం అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తుందనే అభిప్రాయాన్ని కలిగించారు. బషీర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వైద్యులు, న్యాయవాదులు ఇతర వృత్తులవారు ఇప్పుడు సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించవలసి వస్తున్నది.

ప్రజా ఉద్యమాన్ని సాకుగా చూపి బషీర్ ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం మొదట్లో ఉద్యమకారులతో ఒప్పందానికి వచ్చింది. మూడేండ్ల పాటు పరివర్తనా ప్రభుత్వం ఏర్పడి, పాత వ్యవస్థ అవశేషాలు తొలిగించిన తర్వాత ఎన్నికలు జరుపాలనేది సైనిక ప్రభుత్వానికి, ఉద్యమకారులకు మధ్య కుదిరిన ఒప్పందం. ఎన్నికలు జరిపే వర కు సార్వభౌమ మండలి, మంత్రిమండలి, శాసనసభ ఉండాలనే అంగీకారం కుదిరింది. పరిపాలనారంగంలో తమ పాత్ర ఉంటుందని ప్రజాస్వామ్యవాదులు భావించారు. కానీ సైనికాధికారుల వైఖరి మారిపోయింది. దీంతో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్ళా ఉద్యమం మొదలైం ది. సైనిక పాలకులు ఉద్యమకారులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి ప్రదర్శకులపై తీవ్రంగా అణిచివేత ప్రారంభించారు. ప్రజాస్వామ్య ఉద్యమకారుల పరిస్థితి పెనంపై నుంచి బొర్లి పొయ్యిలో పడ్డట్టయింది. ప్రజా ఉద్యమం పేరుతో అంతిమంగా అమెరికా లక్ష్యం నెరవేరింది. తమకు వ్యతిరేకంగా ఉన్న బషీర్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంతోపాటు తమకు అనుకూలంగా ఉండే సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పగలిగింది. బహిరంగంగా అమెరికా సూడాన్ వ్యవహారాలతో సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నది. హింసాకాండను ఖండిస్తూ శాంతిని నెలకొల్పాలని పిలుపు ఇస్తున్నది. మరోవైపు సౌదీ అరేబియా, యునైటెడ్ ఎమిరేట్స్, ఈజిప్టు మొదలైన దేశాల ద్వారా సూడాన్‌లోని సైనిక ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నది.

ప్రచ్ఛన్న యుద్ధకాలంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ వంటి దేశాలు అమెరికా వైపు ఉండగా, ఇరాక్, లిబియా, సిరియా వంటి దేశాలలో అరబ్బు జాతీయవాదం, సామ్యవాదం, పాశ్చాత్య వలసవాద వ్యతిరేకత ప్రాతిపదికగల ప్రభుత్వాలు ఉండేవి. ఇప్పుడు అమెరికా ఆధిపత్యానికి ఎదురులేకపోవడంతో అరబ్ దేశాలలో తమకు వ్యతిరేకంగా ఉన్న పాలకవ్యవస్థలను కూలదోయాలని, దేశాల భౌగోళిక స్వరూపాలను మార్చాలని ప్రయత్నిస్తున్నది. ఇరాన్‌పై ఆంక్షలు విధించిన అమెరికా మరోవైపు సౌదీ అరేబియా తదితర దేశాల ద్వారా అస్థిరత్వాన్ని వివిధ దేశాలలో సంక్షోభాన్ని సృష్టిస్తున్నది. హౌతీలో అంతర్యుద్ధం ఇందుకు ఉదాహరణ? హౌతీలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి సౌదీ అరేబియా ద్వారా అంతర్యుద్ధాన్ని సృష్టించింది. హౌతీలో సౌదీ అరేబియాకు మద్దతుగా ఇప్పుడు సూడాన్ ప్రభుత్వం సైనిక బలగాలను పంపింది. సూడాన్‌లో కొంతకాలం సైనిక పాలన సాగించిన తర్వాత గతంలో ఊచకోతలకు పాల్పడిన ముఠా నాయకుడు హెమెటిని పాలకుడిని చేయాలని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. హెమెటి ఆఫ్రికా- అర బ్బు ప్రాంతాలలో సౌదీ అరేబియాకు తోడుగా అమెరికా వ్యూహాన్ని అమలుపరుచవచ్చు. ఇప్పటి కే పాశ్చాత్య దేశాల రాయబారులు హెమెటితో మంతనాలు జరుపుతున్నారు. అమెరికా-సౌదీ అరేబియా పన్నాగాలకు వ్యతిరేకంగా ఖతర్, టర్కీ ఇస్లామిక్ దళాలకు మద్దతు ఇస్తున్నాయి. భద్రతా మండలి చేత తమ అనుకూల తీర్మానాన్ని చేయించాలన్న అమెరికా ప్రయత్నాలను చైనా, రష్యా అడ్డుకున్నాయి. ఆఫ్రికా దేశాలు మాత్రం సైనిక ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే సూడాన్ విదేశీశక్తుల మధ్య ఘర్షణకు వేదికగా మారే ప్రమాదం ఏర్పడ్డది. అంతర్జాతీయ సమాజం కల్పించుకొని ఐక్యరాజ్యసమితి ద్వారా సూడాన్‌లో ప్రజాస్వామ్య స్థాపనకు సహకరించాలె.

389
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles