నిరుద్యోగిత రికార్డు

Fri,June 7, 2019 12:20 AM

ఉపాధి, నైపుణ్యాల పెంపుపై క్యాబినెట్ కమిటీని నియమించడం మోదీ ప్రభుత్వం ఈ దిశగా వేసిన తొలి అడుగు. విచిత్రమేమంటే నిరుద్యోగం పెరిగిపోతున్నదని అధ్యయన నివేదికలు ఘోషిస్తుంటే, మన షేర్ మార్కెట్ మాత్రం కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. ఈ రెండూ విపరీతాలే. ఈ విపరీతాల మధ్య ఏమి జరుగుతున్నదో ప్రభుత్వం గుర్తించాలి. స్వచ్ఛంద ఉపాధి రంగం ఎందుకు కుప్పకూలిందో కనిపెట్టాలి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు ఎందుకుకునారిల్లిపోతున్నాయో గుర్తించాలి.


నిరుద్యోగం గత ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేనిస్థాయికి పెరుగడం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. పట్టణ, గ్రామీణ నిరుద్యోగం పెరిగింది. అన్నిస్థాయిల విద్యా కేటగిరీల్లో నిరుద్యోగం ఎక్కువగానే ఉన్నది. దాదాపు నలభైయేండ్ల పాటు నిలకడగా, పెద్దగా మార్పులేకుండా ఉన్న నిరోద్యోగి త రేటు గత ఏడేండ్లలో గణనీయంగా పెరిగింది. జాతీయ నమూనా సర్వే(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నిర్వహించిన తేదీ నాటి నుంచి ఏడాది ముందువరకు ఒక వ్యక్తికి ఎన్నిరోజులు పని దొరికిందన్న అంశం పై ఆధారపడి సాధారణ నిరుగ్యోగితను అంచనా వేస్తారు. సర్వే తేదీ నుంచి వారం రోజుల ముందు వరకు ఒక్కరోజైనా పని దొరికిందా లేదా అన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకొని తక్షణ నిరుద్యోగితను లెక్కిస్తారు. వాస్తవానికి జూన్ 2018లోనే ఈ నమూనా సర్వే ముగిసింది. నివేదిక ఎన్నికల కు ముందే రావలసింది. నమూనా సర్వే వివరాలను కేంద్ర ప్రభుత్వం దాస్తున్నదన్న విమర్శలు కూడా వచ్చాయి. దేశవ్యాప్తంగా 12,773 గ్రామాలు, పట్టణ యూనిట్లలో నమూనా సర్వే నిర్వహించారు. మొత్తం 1,02,113 నివాసాలను సందర్శించి, 4,33,339 మందిని సంప్రదించారు. నూట ముప్ఫై కోట్ల జనాభాతో పోల్చి ఈ నమూనా సర్వే చాలా చిన్నది. ఇది నూటికి నూరు శాతం సరైన అంచనా అని చెప్పలేం. దీనిపై గతంలోనూ వివాదాలు నడిచాయి. కానీ నిరుద్యోగితను వివిధ ఆర్థి క పాటవాలను అంచనా వేయడానికి ఇప్పటిదాకా అనుసరిస్తున్న పద్ధతి ఇదే. జాతీయ నిరుద్యోగి త 6.1 శాతానికి చేరడం ఒక రికార్డు. ఆశ్చర్యకరంగా బాగా చదువుకునే 15-29 వయస్సు యువకుల్లోనూ నిరుద్యోగిత చాలా ఎక్కువగా ఉన్నది.

సార్వత్రిక ఎన్నికలు జరిగి నరేంద్ర మోదీ విజయం సాధించి, అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో ఈ నివేదిక వెలువడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. నిరుద్యోగం పెరిగిందని ఎన్నికలకు చాలాముందునుంచే ప్రతిపక్షాలు ఎన్‌డీఏ ప్రభుత్వం పై విరుచుకుపడ్డాయి. అయితే ఆ విమర్శలకు సమర్థనగా గణాంకాలతో కూడిన నిర్మాణాత్మక సమాచారం ఏదీ ఇచ్చేవారు కాదు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యల వల్ల చిన్న పరిశ్రమ లు, వ్యాపారాలు మూతపడ్డాయని, లక్షలాది మంది వీధిన పడ్డారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బయటికివచ్చిన జాతీయ నమూనా సర్వే ఆ విషయాన్ని ధృవీకరించింది. ప్రస్తుత నిరుద్యోగిత నమూనా సర్వే-2012 అంచనాల తో పోల్చితే పురుషుల్లో రెట్టింపుకంటే పెరిగింది. మహిళల్లో రెట్టింపు అయింది. పట్టణ ప్రాంతా ల్లో నిరుద్యోగిత గ్రామీణ ప్రాంతాలకంటే చాలా ఎక్కువగా పెరిగింది. పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగిత 7.8 శాతానికి పెరుగగా గ్రామీణ ప్రాం తాలలో 5.3 శాతానికి పెరిగింది. సాధారణ నిరుద్యోగిత కంటే తక్షణ నిరుద్యోగిత ఇంకా ఎక్కువగా ఉన్నది. మొత్తంగా తక్షణ నిరుద్యోగిత రేటు 8.9 శాతం. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్య లు చిన్న పరిశ్రమలను, వ్యాపారాలను బాగా దెబ్బతీసింది పట్టణ ప్రాంతాలలోనే. ఆర్థిక నియంత్రణ వచ్చిన తర్వాత మార్కెట్లలో ఉదారంగా లభించిన నిధులు ఆవిరైపోయాయి. కేంద్రం తీసుకున్న ఆర్థిక నియంత్రణ చర్యల వల్ల తక్షణ నిరుద్యోగం విపరీతంగా పెరిగింది.

సామాజికవర్గాల వారీగా చూసినా అన్నివర్గాల ప్రజల్లో నిరుద్యోగం సర్వాంతర్యామిలా విస్తరిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నమూనా సర్వే అంచనాలను యథాతధంగా అంగీకరించడం లేదు. వివిధ ఏజెన్సీల అంచనాలతో పోల్చిచూసిన తర్వాతనే వాస్తవికమైన నిరుద్యోగితను నిర్ధారించుకోవలసి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంటున్నది. ఎన్‌పీఎస్, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐ సీ, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అందించే వివరాలను నమూనా సర్వే వివరాలను పోల్చి చూస్తామని ఆర్థిక మంత్రిత్వశాఖ చెబుతున్నది. కేంద్రం నిరుద్యోగ తీవ్రతను గుర్తించడానికి నిరాకరిస్తున్నట్టు వారి స్పందన తెలియజేస్తున్నది. నమూనా సర్వే వివరాలను బయటపెట్టకుండా ఆపడంలోనూ, ఇప్పుడు వాటిని ఇతర ఏజెన్సీల అంకెలతో పోల్చి చూసి నిర్ధారిస్తామని చెప్పడంలోనూ కేంద్రం అయిష్టతే కనిపిస్తున్నది. కేంద్రానికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాస్తవాలు వాస్తవాలు కాకుండాపోవు. అంకెలలో, శాతాలలో తేడాలు రావచ్చు. కానీ పరిస్థితి విషమిస్తున్నదని మాత్రం అర్థమవుతున్నది. ఎన్నికలు, ఫలితాలు అయిపోయి, అధికారం చేతికి వచ్చినందున, ఇప్పుడైనా కేం ద్రం వాస్తవాలను స్వీకరించి, దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఉపాధి, నైపుణ్యాల పెంపుపై క్యాబినెట్ కమిటీని నియమించడం మోదీ ప్రభుత్వం ఈ దిశగా వేసిన తొలి అడుగు. విచిత్రమేమంటే నిరుద్యోగం పెరిగిపోతున్నదని అధ్యయన నివేదికలు ఘోషిస్తుంటే, మన షేర్ మార్కెట్ మాత్రం కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. ఈ రెండూ విపరీతాలే. ఈ విపరీతాల మధ్య ఏమి జరుగుతున్నదో ప్రభుత్వం గుర్తించాలి. స్వచ్ఛంద ఉపాధి రంగం ఎందుకు కుప్పకూలిందో కనిపెట్టాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు ఎందుకు కునారిల్లిపోతున్నాయో గుర్తించాలి. ఇవన్నీ ప్రభుత్వంతో పెద్దగా ప్రమేయం లేకుండా ఉపాధి కల్పించిన పారిశ్రామిక వ్యాపార కార్యకలాపాలు. ఆ రంగాలను పునరుత్తేజం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బాగా చదువుకున్నవారిలోనూ నిరుద్యోగం పెరుగడం ఏ సమాజానికీ మంచిది కాదు. నిరుద్యోగ భూతం నుం చి యువతను విముక్తి చేయడానికి కేంద్రం తక్షణం దీర్ఘకాలిక విధానాన్ని ప్రకటించాలి.

457
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles