బెంగాల్‌లో హింస

Tue,May 14, 2019 01:40 AM

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల హింస ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవలి ఆరవ విడుత ఎన్నికల లో కూడా ఎనిమిది స్థానాలలో కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ హింసాకాండ చెలరేగింది. శనివారం అదృశ్యమైన బీజేపీ కార్యకర్త మృతదేహం బయటపడ్డది. ఇదేరీతిలో కనిపించకుండాపోయిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త మృతదేహం కూడా దొరికింది. మరో ఘటన లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కాల్పులు జరిగాయి. అనేకచోట్ల ఇరుపక్షాల కార్యకర్తల మధ్య ఘర్షణలు సాగాయి. మాజీ ఐపీఎస్ అధికారి బీజేపీ అభ్యర్థి భారతి ఘోష్‌పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె వారి దాడినుంచి తప్పించుకొని ఒక ఆలయంలో ఆశ్రయం పొందారు. ఇరుపక్షాల ఘర్షణతో కేశ్‌పూర్ ప్రాంతం రణరంగంగా మారిపోయింది. ఆమె వాహనశ్రేణిపై బాంబు విసిరినట్టు చెబుతున్నారు. భారతి ఘోష్ ఈ గొడవలకు కారణమని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఆరు విడతల పోలింగ్‌లోనూ హింసకాండ చెలరేగింది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ మధ్యకాలంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మమతాబెనర్జీ కూడా బీజేపీ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీజేపీ రథయాత్ర చేపట్టాలనుకోవడం, మమతా బెనర్జీ అనుమతించకపోవడం వంటి ఉదంతాలతో రెండుపక్షాలు కొన్నినెలలుగా హోరాహోరీ పోరులో నిమగ్నమై ఉన్నాయి.

తృణమూల్ కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత హింసాయుత రాజకీయాలను రూపు మాపి ప్రజాస్వామిక సంస్కృతిని నెలకొల్పితే బాగుండేది. కానీ గ్రామ స్థాయిలో సీపీఎం నెలకొల్పిన వ్యవస్థలనే పార్టీ పరిధిలోకి తెచ్చుకొని మమతా బెనర్జీ అవే హింసాయుత అణిచివేత రాజకీయాలను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తృణమూల్ దాడులకు సీపీఎం, కాంగ్రెస్ నిలువలేకపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మమతను సవాలు చేయడంతో రెండు పార్టీల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి.


నాయకుల స్థాయిలో కూడా పోరు సాగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకర్త లు మరింత చెలరేగిపోతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 282 స్థానాలు రావడానికి హిందీ రాష్ర్టాలలోని ప్రాబల్యమే కారణం. ఈ సారి ఆ రాష్ర్టాలలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదనే అభిప్రాయం ఏర్పడ్డది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం పశ్చిమబెంగాల్, ఒడిశా తదితర రాష్ర్టాలలో సీట్లు పెంచుకోవడానికి దుందుడుకుగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి పశ్చిమబెంగాల్‌లో మతపరమైన విభజన సాగించడానికి ప్రయత్నాలను ప్రారంభించిం ది. పౌరసత్వ చట్టం తేవాలని యత్నించడం, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిలో మతానుగుణమైన విభజన తేవడం ఇందులో భాగమే. సీపీఎం దెబ్బతినడం, కాంగ్రెస్ పుంజుకోలేక పోవడంతో మమతా బెనర్జీ వ్యతిరేక వర్గాలన్నీ బీజేపీ ఛత్రం కింద సమీకృతమవుతున్నాయి. బీజేపీ వస్తున్న ఈ ఆరోపణలలో బలం ఉన్నప్పటికీ పశ్చిమబెంగాల్‌లో పాతుకుపోయిన హింసా సంస్కృతిని ఉపేక్షించలేము. 1977లో వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడిన తరువా త మొదటి కొద్ది ఏండ్లలోనే అణిచివేయడం మొదలైంది. పోలీసులు, సీపీఎం పార్టీ బలగం ఉమ్మడిగా గ్రామస్థాయిలో అమలు చేసిన అణి చివేత ప్రత్యర్థులకు ఊపిరి సలుపకుండా చేసిం ది. పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణస్థాయిలో పార్టీ పట్టును కాపాడే యంత్రాంగంగా మారిపోయింది. వామపక్ష మిత్రపక్ష పక్షాలను కూడా సీపీఎం సహించలేకపోవడం విశేషం. జాతీయ స్థాయి రాజకీయ అవసరాల మూలంగా కాంగ్రెస్ సీపీఎంకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో 1998లో తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించిన మమతా బెనర్జీ సీపీఎంకు వ్యతిరేకంగా దృఢంగా పోరాడుతుండటంతో ప్రజలకు దారి దొరికింది.

సీపీఎంను దెబ్బకొట్టి తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేపట్టింది. తృణమూల్ కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత హింసాయుత రాజకీయాలను రూపు మాపి ప్రజాస్వామిక సంస్కృతిని నెలకొల్పితే బాగుండేది. కానీ గ్రామ స్థాయిలో సీపీఎం నెలకొల్పిన వ్యవస్థలనే పార్టీ పరిధిలోకి తెచ్చుకొని మమతా బెనర్జీ అవే హింసాయుత అణిచివేత రాజకీయాలను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తృణమూల్ దాడులకు సీపీఎం, కాంగ్రెస్ నిలువలేకపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మమతను సవాలు చేయడంతో రెండు పార్టీల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. పలు చోట్ల సీపీఎం కార్యకర్తలు బీజేపీలో చేరడం గమనార్హం. దేశంలోని సగటు విద్యావంతులకు బెంగాల్ అంటే పునరుజ్జీవానికి, రాజకీయ చైతన్యానికి, ఆధునిక భావాలకు ప్రతీకగా మిగతా రాష్ర్టాల ప్రజలలో ముద్ర పడిపోయింది. ఒకప్పుడు బెంగాల్ సమాజం దేశానికి మార్గదర్శనం చేసేది. ఇప్పుడా చైతన్యం, విలువలు ఏమయ్యాయో అనిపిస్తున్నది. ఎన్నికల ద్వారా రాజకీయ మార్పు మాత్రమే వచ్చినప్పుడు, పాత ఆధిపత్య వ్యవస్థలే రంగు మార్చుకొని ప్రజలపై పెత్తనం చేస్తాయి. అందుకే విలువలతో కూడిన మార్పును కోరుకోవాలె. అది మౌలిక పరివర్తనకు దారితీయాలె. జెండాలు మాత్రమే మారుతూ యథాతథ పరిస్థితి కొనసాగడం దీర్ఘకాలికంగా ప్రమాదకరం.

151
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles