అమెరికా కర్రపెత్తనం

Sat,May 11, 2019 12:43 AM

అమెరికా ప్రదర్శిస్తున్న ఆధిపత్య ధోరణి తక్షణం ఇరాన్‌కు ముప్పుగా మారింది. కానీ ఈ అమెరికా పెత్తందారీతనం ప్రపంచానికే ప్రమాదకరం. ఇట్లా ఒక బలమైన దేశం తమకు నచ్చని దేశాలపైపడి అక్కడి ప్రభుత్వాలను కూల్చుతూ పోవడం 21వ శతాబ్దంలో కూడా సాగడం ఆశ్చర్యకరం. ఒక దేశ సార్వభౌమత్వాన్ని మరోదేశం గౌరవించాలని, ఒకరి ఆంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం కలిగించుకోకూడదనే అంతర్జాతీయ సూత్రాలకు విలువలేకుండా పోతున్నది. అమెరికా ఆధిపత్యం ఇట్లానే కొనసాగడం అన్నిదేశాల ప్రయోజనాలకూ ముప్పే.


ఇరాక్, లిబియా, సిరియా తదితర దేశాలపై దాడులు సాగించి విధ్వంసం సృష్టించిన అమెరికా ఇప్పుడు ఇరాన్‌పై దృష్టిపెట్టింది. అమెరికా భీకర యుద్ధనౌకా పటాలమైన క్యారియర్ స్ట్రయిక్ గ్రూప్ ఇరాన్ వైపుగా ప్రయాణిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ యుద్ధనౌకా శ్రేణి ఇప్పటికే ఈజిప్టు సూయెజ్ కాలువను దాటి ఎర్ర సముద్రంలో చేరిందని తెలుస్తున్నది. అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్ నాయకత్వంలోని నౌకా దళంతోపాటు అణ్వాయుధాలతో కూడిన విమాన వాహక నౌకను కూడా అమెరికా పర్షియన్ జలసంధి వైపు తరలిస్తున్నది. అవి ఇరాన్‌కు సమీపంగా ఉన్న ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరానికి ఇప్పటికే చేరుకున్నట్టు తెలుస్తున్నది. క్యారియర్ స్ట్రయి క్ గ్రూప్‌లోని భారీ విమాన వాహక నౌక మీదనే దాదాపు డెబ్బయి యుద్ధ విమానాలుంటాయి. ఈ ప్రధాన నౌకకు తోడు క్రూజర్ అనే భారీ యుద్ధ నౌక ఉంటుంది. మరికొన్ని యుద్ధ నౌకలు కూడా ఈ బృందంలో ఉంటాయి. జలాంతర్గాములు కూడా వీటి వెన్నంటి ఉండవచ్చు. ఇప్పటికే పలు దేశాల్లోని ప్రభుత్వాలను కూలదోసి అక్కడి సమాజాలను ఛిన్నాభిన్నం చేసిన చరిత్ర అమెరికాది. దేశాధ్యక్షుడైన ట్రంప్ మరింత యుద్ధపిపాసిగా కనిపిస్తున్నారు. ఆయన బృందంలోని సభ్యు లలో కూడా యుద్ధోన్మాదం ఆవరించుకొని ఉన్నది. ఇరాన్ తమ వాణిజ్య కేంద్రాలపై జరుపబోతున్నదనే గూఢచార నివేదికలు తమకు అందాయని అందువల్ల ముందు జాగ్రత్తగా ఈ యుద్ధబలగాలను పర్షియన్ జలసంధికి తరలిస్తున్నామని అమెరికా అంటున్నది. ఇరాక్‌పై దాడి చేయడానికి ముందు కూడా అమెరికా ఇటువంటి సాకులే చెప్పిందని ఇరాన్ ప్రత్యారోపణలు చేస్తున్నది. అమెరికా తమవైపు ఏదో ఒక తప్పు చూపి దాడి చేయాలనుకుంటున్నదనీ, తాము ఏ తప్పు చేయకపోయినా, ఏదో ఒకటి తమకు ఆపాదించి దాడి చేయవచ్చునని ఇరాన్ ఆరోపించింది.

అమెరికా ఇరాన్‌ను దెబ్బతీయడానికి మొదటి ఆర్థిక ఆంక్షలు విధించి ఆ తర్వాత యుద్ధానికి కాలుదువ్వుతున్నది. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థి క వ్యవస్థను సంక్షోభంలో పడేయాలని ప్రయత్నిస్తున్నది. కానీ ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు పెట్టడం వల్ల భారత్, చైనా, యూరప్ దేశాలకు ఇబ్బంది కలుగుతున్నది. తాజాగా ఇరా న్ నుంచి ఖనిజాల ఎగుమతులపై కూడా ఆంక్ష లు విధించింది. ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వాత ఇరాన్‌ను లొంగదీసుకొని అక్కడి వ్యవస్థలను కుప్పకూల్చాలని ప్రయత్నిస్తున్నారు. ముందుగా అణు ఒప్పందం నుంచి వైదొలిగారు. తాము శాంతియుత ప్రయోజనాల కోసమే అణు కార్యక్రమాన్ని సాగిస్తున్నామని ఇరాన్ మొదటినుంచి అంటున్నది. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్‌ను అణు ఒప్పందానికి కట్టుబడి ఉండేలా చేశారు. ఇందులో యూరప్ దేశాలను కూడా భాగస్వాములుగా చేశారు. శాంతియుత ప్రయోజనాల కోసం ఎంత మేర ఎంత తక్కువ నాణ్యమైన యురేనియం శుద్ధి అవసరమో అంతే ఉత్పత్తి చేసేవిధంగా కట్టడి చేశారు. ఇందుకు ఇరాన్ కూడా కట్టుబడి ఉన్నది. ఇరాన్‌ను ఇదేవిధంగా కట్టడి చేస్తే సరిపోయేది. కానీ ట్రంప్ అధ్యక్షుడు కావడంతో అమెరికా యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నది. ఇరాన్‌తో అణుఒప్పందంలో అమెరికాతో పాటు భాగస్వాములైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు నిస్సహాయంగా ప్రేక్షక పాత్ర పోషించడం ఆశ్చర్యం కలుగుతున్నది. అమెరికా ఆంక్షలను ఆమోదించబోమని చైనా అంటున్నది.కానీ ఇప్పటివరకు చైనా నుంచి కూడా భరోసా అందలేదు.

ఇక భారత్ ముందే అమెరికా ఆదేశాలకు తలొగ్గింది. అమెరికా ప్రదర్శిస్తున్న ఆధిపత్య ధోరణి తక్షణం ఇరాన్‌కు ముప్పుగా మారింది. కానీ ఈ అమెరికా పెత్తందారీతనం ప్రపంచానికే ప్రమాదకరం. ఇట్లా ఒక బలమైన దేశం తమకు నచ్చని దేశాలపైపడి అక్కడి ప్రభుత్వాలను కూల్చుతూ పోవడం 21వ శతాబ్దంలో కూడా సాగడం ఆశ్చర్యకరం. ఒక దేశ సార్వభౌమత్వాన్ని మరోదేశం గౌరవించాలని, ఒకరి ఆంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం కలిగించుకోకూడదనే అంతర్జాతీయ సూత్రాలకు విలువలేకుండా పోతున్నది. అమెరికా ఆధిపత్యం ఇట్లానే కొనసాగడం అన్నిదేశాల ప్రయోజనాలకూ ముప్పే. అమెరికా కొన్ని దేశాలపై దాడులు చేస్తూ మిగతా దేశాలను సులభంగా బెదిరించగలదు. ఉదాహరణకు భారత్‌పై వాణిజ్య ఆంక్షలను విధించింది. అమెరికా షరతులు భారత్‌కు అంగీకారయోగ్యంగా లేవు. దీనిపై చర్చలు సాగుతున్నాయి. కానీ ఇట్లా ఇటువంటి భయానక పరిస్థితుల్లో సాగే చర్చలు న్యాయబద్ధమైన పరిష్కారాన్ని ఇవ్వవు. బలమైన దేశాన్ని బలహీనమైన దేశాన్ని తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పించగలుగుతుంది. బడుగు దేశాలు తాము నష్టపోతామని తెలిసి కూడా అమెరికా వాణిజ్య ప్రయోజనాలు నెరవేర్చవలసి రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా వలసవాదం మరోరూపంలో ఏర్పడుతున్నది. అందువల్ల అమెరికా పెత్తందారీ పోకడలకు ప్రపంచదేశాలు అడ్డుకట్టవేయాలె. ఏ నిర్ణయాలపైనా ఐక్యరాజ్య సమితి వేదికగా సమిష్టిగా జరుగాలె. అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఏ పక్ష మూ ఉల్లంఘించకూడదు. ఇరాన్ ఏదైనా తప్పు చేస్తే చక్కదిద్దే బాధ్యత ఐక్యరాజ్యసమితి. అంతే కానీ అమెరికా కర్రపెత్తనం చేయకూడదు.

280
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles