కేసీఆర్‌ది ‘మత సోషియాలజీ’

Thu,May 9, 2019 01:33 AM

సూత్రరీత్యా చెప్పాలంటే, సోషియాలజీ ఆలోచనకు ఆద్యులైన ప్లేటో, అరిస్టాటిల్ మతం గురించి అన్నదానికి, కేసీఆర్ అన్నదానికి తేడా లేదు. ఒక సమాజం ఏర్పడాల న్నా, కొనసాగాలన్నా అందుకు కొన్ని నియమాలు, సం ప్రదాయాలు, వ్యవస్థ ఆధారమవుతాయి. ఆ సమాజంలోని సభ్యులను అవి ఒకచోట కట్టిపడవేసి ఉంచుతాయి. అటువంటి అంశాలో మతం కూడా మొదటినుంచి ఒకటి అయింది. మతం అన్నది సాధారణ విశ్వాసాలతో అస్పష్ట రూపంలో మొదలై, అనేక పరిణామాలకు గురవుతూ, ఒక దశలో మత గ్రంథాలను, దేవతలను, గురువులను ఆధారం చేసుకుంది. వివిధ ఇతర నియమాలతో పాటు మత నియమానికి కూడా కట్టుబడి ఉండనివారిని ఆ సమాజం అసమ్మతి వాదులుగా చూసింది. చూడటమే గాక ఒక్కోసారి వెలివేసింది, శిక్షించింది. కాని సమాజం ఈ తొలిదశ నుంచి మలి దశలలోకి ప్రవేశించటం క్రీస్తుకు పూర్వమే మొదలైంది. ఆ విధంగా మనకు చార్వాక సంప్రదాయం, బౌద్ధం, జైనం వంటివి ఉనికిలోకి వచ్చాయి. ఒకే మత విశ్వాసానికి, నియమానికి మాత్రమే ఉనికి ఉండటమేనే దశ గతించిపోయింది. మత విశ్వాసాల విషయంలో సమాజ సభ్యులు స్వేచ్ఛా జీవులయ్యారు. భిన్న మత విశ్వాసాల మధ్య కొంత ఘర్షణ స్థితి ఏర్పడినా చివరకు అందరి మధ్య సహజీవనం తప్పలేదు. ఒకసారి ఒకరిది, మరొకసారి మరొకరిది పైచేయి కావచ్చుగాక. కాని ప్లేటో, అరిస్టాటిల్‌లు అన్న సమాజపు అమరికలో, కొనసాగుదలలో ఇప్పుడు భిన్న విశ్వాసాలు, మతాలు, ఇతర నియమాలు, సంప్రదాయాల వారంతా సహజీవనం ద్వారా భాగస్వాములయ్యారు. భారతదేశంలో జాతులు, తెగలు, మతాలరీత్యా చూసినప్పుడు ఇది ఆర్య-ద్రావిడ నుంచి మొదలై దక్షిణాది యూరప్, పశ్చిమాసియా, మధ్య ఆసియా వాసుల రాక వరకు అనేక వందల సంవత్సరాల పాటు కొనసాగుతూ వచ్చింది. దీనంతటిలో గుర్తించవలసిన సోషియాలజీ ఏమిటి? సమాజాలు రూపొందటం, కొనసాగటం అనే దానిలో భాగంగా, అందుకు ఆధార నియమాలలో మతం ఒకటి కావటమన్నది తొలిదశలో ఒకే మతానికి పరిమితం కాగా, సమాజ విస్తరణ వికాస క్రమంలో అందులో ఒకటికన్న ఎక్కువ మతాలు భాగమయ్యాయి.

మత సోషియాలజీ వేరు, మతతత్వ సోషియాలజీ వేరు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ కీలకమైన వ్యత్యాసం అర్థమైనట్లు లేదు. అందువల్లనే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ఎన్నికల సభలో మతం గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లుగా తోచాయి. దేశంలో హిందూ మతం పేరిట మతతత్వ సోషియాలజీని వ్యాపింపజేసి, ప్రజలను తప్పుదారి పట్టించి, తమ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న స్థితిలో, ఆ ప్రమాదం గురించి అంత ధైర్యంగా హెచ్చరించిన కేసీఆర్‌ను ప్రశంసించాలి.


ఆ మతాలన్నింటి మధ్య సహజీవనం ఒక కొత్త సామాజిక సూత్రంగా రూపుదిద్దుకుంటూ వచ్చింది. ఇది భారతదేశానికి పరిమితమైన మార్పు కాదు, అనేక చోట్ల ఇదే జరిగింది. ఇటువంటి వికాస క్రమాన్ని ఆమోదించి ఆధునికం అయిన సమాజాలు నాగరిక సమాజాలు అయ్యాయి. అందుకు అనుగుణమైన కొత్త సామాజిక సూత్రాలను రూపొందించుకుని, పాటించి, నిలబడ్డాయి. కానివి అశాంతికి గురై అస్తవ్యస్తంగా మారాయి. మత సోషియాలజీ, మతతత్వ సోషియాలజీ, లేదా జాతి సోషియాలజీ, జాతి తత్వ సోషియాలజీలను ఇందులో చూడవచ్చు. సూటిగా చెప్పాలంటే కేసీఆర్‌ది అనేక సామాజికాంశాలలో మతాన్ని ఒక భాగంగా మాత్రమే చూసి, అన్ని మతాలకు స్థానం కల్పించే మత సోషియాలజీ. మతం యొక్క పరిణామక్రమాన్ని, వికాసశీలతను, ఆధునీకరణను అర్థం చేసుకున్న మత సోషియాలజీ. అందుకు విరుద్ధంగా బీజీపీది, సంఘ్ పరివార్‌ది స్వార్థం కోసం మతాన్ని వాడుకొనజూసే మతతత్వ సోషియాలజీ. పరిణామక్రమాలతో, వికాస శీలతతో, ఆధునీకరణతో నిమిత్తం లేని, పూర్తి తిరోగమన దృక్పథంతో కూడుకున్న సోషియాలజీ. అనేక సామాజికాంశాలలో మతానికి పెద్దపీట వేసి, ఇతర మతాలకు అవకాశం లేదనేది. మత సోషియాలజీ ఈ విధంగా వికసించే క్రమం పైన అనుకున్నట్లు క్రీస్తు పూర్వం నుంచే మొదలై మధ్య యుగాల మీదుగా అనేక వందల సంవత్సరాల పాటు సాగగా, భారతదేశంలో ఒక సరికొత్త దశ భారత రాజ్యాంగం అమలుకు రావటంతో మొదలైంది. మనది అన్ని జాతులు, తెగలు, మతాలకు సమాన స్థానం గల రాజ్యంగా, సమాజంగా మారిం ది. ప్లేటో, అరిస్టాటిల్‌లను తిరిగి నిర్వచించి చెప్పుకోవాలంటే, సమాజానిది రాజకీయానిది, రాజ్యానిది మౌలికంగా, నిజమైన అర్థంలో ఏకీభావమే తప్ప భిన్నత్వం లేదు. వైరుధ్యం అంతకన్నా లేదు. అటువంటి స్థితి లో ఏదో ఒక మతానిది ఆధిపత్యం అన్నది కాలం చెల్లిన దృష్టి. వికాసశీలమైన ఆధునిక సమాజాన్ని భంగపరచగల దృష్టి. ఇదే విషయాన్ని మరొక విధంగా చెప్పాలంటే, బ్రిటిష్ పాలకులు మనను వదలిపోతున్న సమయంలోనూ వందలాది సంస్థానాలు, జాతులు, తెగలు, భాషలు, మతాలు, ప్రాంతాలుగా ఉండి ఎవరు ఎటుపోయేదీ అనిశ్చితంగా కనిపించగా, ఆ తర్వాత జాతి నిర్మాణం (నేషన్ బిల్డింగ్) ఒక మహా కర్తవ్యంగా ముందుకువచ్చినప్పుడు, అందుకు మతతత్వ సోషియాలజీ దోహదం చేయగలదా? చేయలేదని, పైగా హానీ కలిగించగలదని స్వాతంత్య్రోద్యమ నాయకులు, రాజ్యాంగ నిర్మాతలు స్పష్టమైన అవగాహనకు వచ్చారు.

వాస్తవానికి కేసీఆర్ ప్రసంగాన్ని బీజేపీ, సంఘ్‌పరివార్ అపార్థమేమీ చేసుకోలేదు. వారికది సరిగ్గానే అర్థమై ఉంటుంది. కానీ, తను హిందువునని అంత స్పష్టంగా ప్రకటించే ఒక ప్రముఖుడు తాను హిందూ మతతత్వవాదిని మాత్రం కాదని, హిందుత్వవాదని కాదని అంతే బలంగా ప్రకటించటం వారిని కలవరపాటుకు గురిచేసి ఉంటుంది. కేసీఆర్ ఇటువంటి ధోరణిలో మార్చి 17 కరీంనగర్ సభకన్న ముందుకూడా మాట్లాడారు. కాని ఇంత సూటిగా, వివరంగా, బలంగా చెప్పటం బహుశా ఇది మొదటిసారి.


కేసీఆర్ కరీంనగర్‌లో అన్న మాటలు కూడా అందుకు అనుగుణమైనవే. ఆయనపై బీజేపీ-సంఘ్ పరివార్ చేసిన ఫిర్యాదులో ఉన్నది అందుకు విరుద్ధమైన మతతత్వ సోషియాలజీ. భారత రాజ్యాంగ లౌకికతత్వాన్ని కాపాడలేదంటూనే కేసీఆర్ గురించి ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. ఇంతకన్నా హాస్యాస్పదమైన మాట ఉండబోదు. మనం ఇంతవరకు చేసిన చర్చనంతా గమనించినప్పుడు, లౌకికతత్వాన్ని కాపాడజూసిందెవరో, భంగపరుచజూస్తున్నదెవరో అర్థం చేసుకోవడం కష్టం కాదు. కేసీఆర్ అన్న మాటలేమిటి? ఆ మాటలు యథాతథంగా కాకపోయినా వాటి సారాంశం ఈ విధంగా ఉంది:-బీజేపీ వారు మాత్రమే హిందువులు కారు, తను కూడా హిందువే. తన వలెనే దేశంలో చాలా మంది హిందువులున్నారు. వీరంతా బీజేపీ చెప్పి తే హిందువులు కాలేదు. తను గుడికి వెళ్లటం, హిందువులు గుడికి వెళ్లటం బీజేపీ చెప్పితే కాదు. హిందూ మతం జీవితంలో భాగంగా ఉండటం వేరు, హిందుత్వ పేరిట రాజకీయంగా మారటం వేరు. తను స్వయంగా ఎన్నో యాగాలు చేయటం ఎవరో చెప్పితే కాదు. ఇదంతా వ్యక్తిగత విశ్వాసం. తన సామాజికతలో భాగం. మతం పేర రాజకీయం చేయటం, మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవటం తప్పు. అం దుకోసం ఇతర మతాలపై కాలు దువ్వటం తప్పు. అయోధ్యపై తన అభిప్రాయం ఏమిటని బీజేపీ నాయకుడు ఒకరు నిలయదీయ చూశారు. గుళ్లు కట్టడం, వాటిపై అభిప్రాయాలు రాజకీయ నాయకులూ ప్రభుత్వా ల పనా? ఆ వివాదాలు విచారించేందుకు మత గురువులు ఉన్నారు, కోర్టులున్నాయి. ఇవీ ఆయన మాటలు. ఆయ ప్రసంగంలో ఈ హిందూగాండ్లు, బొందుగాండ్లు అనే మాట ఒకటి దొర్లింది. దాని అర్థం ఆయన యథాతథంగా హిందువులను దూషించారనా? అది తప్పు నిర్వచనమవుతుంది. ఈ హిందూ గాండ్లు అంటే ఈ హిందుత్వ వాదులు, ఈ హిందూ మతతత్వవాదులని అవుతుంది. మొత్తం సందర్భాన్ని, ఈ అనే అక్షరంతో ఎవరిని ఉద్దేశించారనే భావాన్ని వదిలివేసి తప్పు నిర్వచనాలు చెప్పటం, హిందువులను రెచ్చగొట్టచూడటం బీజేపీ రాజకీయ ప్రయజనాలకు అవసరమే. కాని ఎన్నికల సంఘం అందుకెట్లా లోనైంది? రాజ్యాంగంలోని లౌకికత పరిరక్షణ అనే ఉద్దేశం కేసీఆర్ ప్రసంగం లో చాలా సూటిగా ప్రతిఫలిస్తుండగా, ఆయన మత సోషియాలజీ తప్ప మతతత్వ సోషియాలజీ కాదని అంత బలమైన భాషలో చెప్తుండగా, ఆయ న ప్రసంగాన్ని తన విమర్శకులతో పాటు ఎన్నికల సంఘం కూడా అపార్థం చేసుకోవటం విచారకరం. Ashok
అపార్థానికి కారణం తెలియనితనమా లేక ఏవై నా ప్రభావాలా అన్నది వేరే చర్చ. వాస్తవానికి కేసీఆర్ ప్రసంగాన్ని బీజేపీ, సంఘ్‌పరివార్ అపార్థమేమీ చేసుకోలేదు. వారికది సరిగ్గానే అర్థమై ఉంటుంది. కానీ, తను హిందువునని అంత స్పష్టంగా ప్రకటించే ఒక ప్రముఖుడు తాను హిందూ మతతత్వవాదిని మాత్రం కాదని, హిందుత్వవాదని కాదని అంతే బలంగా ప్రకటించటం వారిని కలవరపాటుకు గురిచేసి ఉంటుంది. కేసీఆర్ ఇటువంటి ధోరణిలో మార్చి 17 కరీంనగర్ సభకన్న ముందుకూడా మాట్లాడారు. కాని ఇంత సూటిగా, వివరంగా, బలంగా చెప్పటం బహుశా ఇది మొదటిసారి. కనుక, బీజేపీ ఫిర్యాదును, ఎన్నికల సంఘం వ్యాఖ్యలను కొట్టివేయాలి మనం. రాజ్యాంగ లౌకికతకు అనుగుణ వైఖరి తీసుకున్న కేసీఆర్‌ను అభినందించాలి.

244
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles