జలియన్‌వాలా జ్వాలాముఖి!


Sat,April 13, 2019 12:25 AM

జలియన్‌వాలాబాగ్ హత్యాకాండపై విచారణ జరుపడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన హంటర్ కమిషన్ అంచనా ప్రకారం 10-20 వేల మంది ఆరోజు సాయంత్రం జలియన్‌వాలా బాగ్‌లో డయ్యర్ ఆంక్షలను ధిక్కరించి సమావేశమయ్యారు. అదొక చరిత్రాత్మక సమావేశం; భారత స్వాతంత్రోద్యమం దశ, దిశ మారడానికి కారణమైన మహత్తర జ్వాలాముఖి. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు గడగడ ఐదేండ్లలో సాధించిన యాభై విజయాల గురించి చెప్పి లక్షల మంది హృదయాలను అవలీలగా గెలువగలుగుతారు. మోదీజీ చెప్పడానికి ఏం లేదు! సున్నకు సున్న హళ్లికి హళ్లి. దేశ ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం గత ఐదేండ్లలో మోదీజీ సాధించింది శూన్యం-అన్నీ వైఫల్యాలే.

Prabhakar-Rao
వందేండ్ల కిందట, 1919 ఏప్రిల్‌లో ఇదే రోజు, కచ్చితంగా ఇదేరోజు ఏప్రిల్ 13 (నాడు ఆరోజు ఆదివారం, వైశాఖి పండుగ రోజు; సిక్కులు, హిందువులు అన్న తేడా లేకుం డా అందరికి అత్యంత ప్రియమైన పండుగ రోజు) నాడు అప్పటి బ్రిటిష్ ఇండియా పంజాబ్ ప్రావిన్స్‌లోని, ఇప్పటి స్వతంత్ర భారత్ పంజాబ్ రాష్ట్రంలోని ముఖ్య నగరం, స్వర్ణ దేవాలయ పవిత్ర పట్టణం అమృత్‌సర్‌లో, స్వర్ణ దేవాలయ సమీపంలోని జలియన్‌వాలా బాగ్ (ఆ రోజుల్లో ఆరేడెకరాల ప్రాంగణం; మూడువైపుల పెద్ద భవనాలు, ఒకవైపున ఎత్తయిన గోడ, మధ్య ఒక పెద్దబావి)లో ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగ ని రీతిలో అమానుష హత్యాకాండ సంభవించింది.

అది ప్రకృతి వైపరీ త్యం కాదు. కానేకాదు. నాటి బ్రిటిష్ పాలకుల ఒక సైనికాధికారి కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ తమ సామ్రాజ్యాన్ని (బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, ఇండియాలో బ్రిటిష్ పాలనను) అంతమొందించడానికి రహస్యంగా కుట్రలు జరుగుతున్నాయని అనుమానించి, భయపడి, విపరీతమైన కసితో, విద్వేషంతో వేలాది అమాయకులపై ఎటువంటి హెచ్చరిక లేకుండా, హఠాత్తుగా తన సైనికులతో పది నిమిషాల పాటు ఎడతెగకుండా తుపాకి కాల్పులు జరిపించి, తుపాకి గుండ్లు అయిపోగానే (1650 రౌండ్ల తర్వా త) కాల్పులను విరమింపజేసిన దారుణ హత్యాకాండ, సామూహిక వధ అది. అప్పటికే బ్రిటిష్ ఇండియాలో చురుకుగా తీవ్రవాద కార్యకలాపా లు నిర్వహిస్తున్న గదర్ పార్టీ తదితర సంస్థలకు జర్మనీతో, రష్యాలోని బోల్షివిక్‌లతో సంబంధాలున్నాయేమోనని బ్రిటిష్ పాలకులు అనుమానిస్తున్న రోజులవి.

తొలి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ పాలకులు ఇండియాలో ప్రవేశపెట్టిన (1917లో) మాంటెగు-క్లెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు భారత జాతీయ రాజకీయవాదులకు ఎంతమాత్రం సంతృప్తి కల్గించలేదు-దేశమంతట, విశేషించి బెంగాల్, పంజాబ్ ప్రావిన్స్‌లలో తీవ్రవాద చర్యలు మరింత హెచ్చి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముఖ్యం గా పంజాబ్‌లో మార్షల్‌లా పాలన మొదలై అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. బ్రిటిష్ న్యాయమూర్తి సిడ్నీ రౌలట్ అధ్యక్షతన ఒక కమిటీ దేశద్రోహ సమస్య పరిశీలనకు నియమిత్తమైంది. ఈ కమిటీ సిఫార్సు ఆధారంగా 1919లో రౌలట్ చట్టం వచ్చింది-1915లో వచ్చిన భారత రక్షణ చట్టం కంటే కఠినమైనది, భారత ప్రజల ప్రాథమిక, పౌరహక్కులను అతి కఠోరంగా హరించడానికి ఉద్దేశించినది రౌలట్ చట్టం. రౌలట్ చట్టా న్ని వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ దేశమంతటా, నిరసన ప్రదర్శనలు, సభలూ, సమావేశాలు జరుపాలని అప్పటికి నాలుగేండ్ల కిందట దక్షిణాఫ్రికా నుం చి స్వదేశం తిరిగివచ్చి, భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం చేపట్టిన గాంధీజీ పిలుపు ఇచ్చారు.

స్వదేశం తిరిగివచ్చిన తర్వాత గాంధీజీ జాతీయస్థాయిలో ఇచ్చిన మొదటి పిలుపు ఇది. దేశమంతటా, విశేషించి నాటి పంజాబ్‌లో (ముఖ్యంగా అమృత్‌సర్, లాహోర్ నగరాల్లో) గాం ధీజీ పిలుపుతో వేలాది ప్రజలు అపూర్వ ఉద్యమస్ఫూర్తిని, సమరోత్సాహాన్ని ప్రదర్శించారు. అమృత్‌సర్‌లో 1919 ఏప్రిల్ 10 నుంచే ఉద్రిక్తత అలుముకున్నది. స్వాతంత్య్ర సమరయోధులు, గాంధీజీ ప్రముఖ అనుయాయులు సత్యపాల్‌ను, సైఫుద్దీన్ కిచ్లూను వెంటనే విడుదల చేయాల ని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 10న అమృత్‌సర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ నివాసం వద్ద వేలాది మంది నిరసన ప్రదర్శన జరిపారు. అక్కడ కాపలా విధుల్లో ఉన్న సైనికులు కాల్పులు జరుపడంతో ప్రదర్శకులు కొందరు మరణించారు, అనేకులు గాయపడ్డారు. రెచ్చిపోయిన ప్రదర్శకులు బ్రిటి ష్ జాతీయులు, బ్రిటిష్ బ్యాంకుల మీద దాడులు చేశారు; ఆంగ్లేయులు కొందరు మరణించారు. ఏప్రిల్ 11న ఒక ఆంగ్లేయ మిషనరీ మహిళ మార్సెల్లా షెర్‌వుడ్ తన పాఠశాలను మూయడానికి (నగరంలో ఉద్రిక్తత కారణంగా) ఇరుకైన ఒక గల్లీ నుంచి సైకిల్‌పై వెళ్తుండగా ఒక మూక ఆమెపై దాడిచేసి వివస్త్రను కావించింది.

మృత్యుకౌగిల్లోకి వెళ్లిన ఆమెను స్థానిక భారతీయులు ఆదుకొని రక్షించారు. షెర్‌వుడ్‌పై దాడి సంఘటన కల్నల్ డయ్యర్‌ను పిచ్చిగా రెచ్చగొట్టింది. ఆమెపై దాడి జరిగిన వీధిలో వెళే భారతీయులు, హిందువులు మోకాళ్ల మీద నడుస్తూ మోకరిల్లాలని కల్నల్ డయ్యర్ జలియన్‌వాలా బాగ్ రాక్షస కృత్యం తర్వాత ఆదేశించా డు. ఏప్రిల్ 13 (1919) వైశాఖి పండుగరోజు అమృత్‌సర్ మిలిటరీ కమాండర్ కల్నల్ డయ్యర్ నగరమంతటా ఉదయం నుంచే కర్ఫ్యూ పరిస్థితి కల్పించి సభలు, సమావేశాలు, ఊరేగింపుల మీద నిషేధం విధించాడు-సైనిక కవాతు జరిపించాడు. కల్నల్ డయ్యర్ ఎన్ని అడ్డంకులు కల్పించినా లెక్కచేయకుండా మధ్యాహ్నం వరకు వేలమంది సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు (కొందరు సమీపంలోని హర్‌మందిర్ సాహెబ్‌లో పూజలు చేసి జలియన్‌వాలాబాగ్‌లో పోగయ్యారు. 5 వేల మంది కిక్కిరిసి కూర్చున్నారని, నిల్చున్నారని ఒక అంచనా. ఆరువేల మంది పోగయ్యారని కల్నల్ డయ్యర్ అంచనా. జలియన్‌వాలాబాగ్ హత్యాకాండపై విచారణ జరుపడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన హంట ర్ కమిషన్ అంచనా ప్రకారం 10-20 వేల మంది ఆరోజు సాయంత్రం జలియన్‌వాలాబాగ్‌లో డయ్యర్ ఆంక్షలను ధిక్కరించి సమావేశమయ్యా రు. అదొక చరిత్రాత్మక సమావేశం; భారత స్వాతంత్రోద్యమం దశ, దిశ మారడానికి కారణమైన మహత్తర జ్వాలాముఖి.

వందేండ్ల కిందట జలియన్‌వాలా జ్వాలాముఖి భారతదేశంలో బ్రిటి ష్ పాలన అంతం కావడానికి మార్గం వేసిందని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ సామ్రాజ్య విచ్ఛిత్తికి తిరుగుబాటు మొదలైందనడానికి జలియన్‌వాలాబాగ్ ప్రబల తార్కాణమని అప్పటి పంజాబ్ లెఫ్టినెం ట్ గవర్నర్ మైఖేల్ ఓ డ్వయర్ (ఇద్దరు డయ్యర్లు!) అనుమానించారు. జలియన్ వాలాబాగ్ హత్యాకాండపై విచారణకు భారత జాతీయ కాం గ్రెస్ నియమించిన కమిటీకి దేశబంధు చిత్తరంజన్‌దాస్ నాయకత్వం వహించారు; ఆయనకు అప్పటి యువ నాయకుడు జవహర్‌లాల్ నెహ్రూ సహాయపడ్డారు. విచారణ జరుగుతున్న రోజుల్లో ఓంజు జవహ ర్‌లాల్ ప్రయాణిస్తున్న రైలు పెట్టెలో కల్నల్ డయ్యర్, ఆయన మిత్రులు ఎక్కి కూర్చున్నారు. డయ్యర్ హత్యాకాండలో వేయిమంది అమాయకు లు అక్కడికక్కడే మరణించారని, అసంఖ్యాకులు తీవ్రంగా గాయపడ్డారని చిత్తరంజన్‌దాస్ కమిటీ నివేదిక వెల్లడించింది.

మదన్‌మోహన్ మాలవీయ స్వయంగా, స్వతంత్రంగా విచారణ జరిపారు. స్వామి శ్రద్ధానందజీ విచారణ జరిపి డయ్యర్ సామూహిక వధలో 1500ల మంది మరణించారని తేల్చారు. అప్పటి బ్రిటిష్ అధికారవర్గాల కథనం ప్రకా రం డయ్యర్ దాడిలో అదేరోజు ప్రాణాలు కోల్పోయింది 379 మంది. కల్నల్ డయ్యర్ బ్రిటిష్ పార్లమెంట్‌కు రాసిన లేఖలో తన లీఎన్‌ఫీల్డ్ రైఫి ల్ గుండ్లకు 379 మంది బలైనారని అంగీకరించాడు. బ్రిటిష్ పార్లమెం ట్ ఎగువ సభ (హౌస్ అఫ్ లార్డ్స్)కు కల్నల్ డయ్యర్ హత్యాకాండ సంతోషం కలిగించింది కానీ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ ఆయన అరాజకత్వాన్ని, అమానుష వధను ఖండించింది. తమ వలస దేశం భారతదేశంలో కల్నల్ డయ్యర్‌కు ఏ పదవీ ఇక ఇవ్వరాదని హౌస్ అఫ్ కామన్స్ ఆంక్ష విధించింది. ప్రపంచ ప్రఖ్యాత రచయిత రుడ్‌యార్డ్ కిప్లిం గ్ మాత్రం కల్నల్ డయ్యర్ తన విధి నిర్వహించాడని మెచ్చుకున్నాడు.

అప్పటికి ఆరేండ్ల కిందట 1913లో నోబెల్ బహుమతి పొందిన (తన గీతాంజలి కవితా సంకలనానికి) రవీంద్రనాథ్ ఠాగూర్ జలియన్‌వాలాబాగ్ హత్యాకాండ పట్ల తీవ్ర నిరసన తెలుపుతూ, బ్రిటిష్ పాలకుల సర్ బిరుదును తిరస్కరిస్తూ హత్యాకాండలు జరిపే వారికి బిరుదులు ఇచ్చే అర్హత లేదు అని ప్రకటించారు. జలియన్‌వాలాబాగ్ హత్యాకాండ గాంధీజీకి అంతులేని ఖేదం కలిగించింది-తన శాంతియుత సత్యాగ్రహ విధానాల పట్ల ఆయన విశ్వాసం మరింత బలపడింది. కల్నల్ డయ్యర్ హత్యాకాండపై ప్రపంచమంతటా చెలరేగిన విమర్శలను గమనించిన తర్వాత లండన్ బ్రిటిష్ పాలకుల్లో తమ సైన్యం పాత్ర పట్ల పునరాలోచన ప్రారంభయమైంది. తమ సైన్యం నిర్వహించగలిగిన పాత్ర పరిమితమైనదన్న జ్ఞానోదయం బ్రిటిష్ పాలకులకు కావడానికి చాలా ఆలస్యమైంది. క్రీ.శ.1600 డిసెంబర్‌లో ఇండియాలో ఈస్టిండియా కంపెనీ స్థాపితమైన తర్వాత లార్డ్ క్లయివ్ మొట్టమొదట 1757లో సిరాజుద్దౌలాను పాస్టీలో ఓడించి బెంగాల్‌ను ఆక్రమించాడు; తర్వాత 1764లో బక్సర్‌లో గెలిచి అవధ్‌ను ఆక్రమించాడు. ఇది రెండో విజయం.

తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా భారత సంస్థానాలు, రాజ్యాలన్నీ బ్రిటిష్ పాలకుల ఆక్రమణ లేక పెత్తనం కిందికి వచ్చాయి. భారత్ ఆక్రమణలో, ఇక్క డ పెత్తనం చేయడంలో బ్రిటిష్ పాలకులకు ప్రధానంగా ఉపకరించింది సైన్యం కాదు-వాళ్ల కుటిల రాజనీతి ఉపకరించింది. సిరాజుద్దౌలాను ఓడించింది ఒక ద్రోహి; అవధ్ ఆక్రమణకు కారణమైంది ఒక ద్రోహి. ద్రోహులను, విభేదాలను, అనైక్యతను, అసహనాన్ని సృష్టించడం, ఎదుటి వాడి నెత్తిమీద చెయిపెట్టి పెత్తనం చేయడం బ్రిటిష్ పాలకుల కుటిల రాజనీతి. రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచినప్పుడు చర్చిల్‌ను, రాజనీతిని పొగిడారు గానీ బ్రిటిష్ సైన్యాన్ని పొగడలేదు. ప్రతి ప్రజాస్వామ్యదేశంలో సైన్యానికి ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. ఆ లక్ష్మణ రేఖను దాటితే ఆ దేశం మరో పాకిస్థాన్ అవుతుంది. నేడు బీజేపీ బ్రాండ్ దేశభక్తులుగా చలామణి అవుతున్న వారందరు గమనించవలసిన విషయం ఇది. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు గడగడ ఐదేండ్లలో సాధించిన యాభై విజయాల గురించి చెప్పి లక్షల మంది హృదయాలను అవలీలగా గెలువగలుగుతారు. మోదీజీ చెప్పడానికి ఏం లేదు! సున్నకు సున్న హళ్లికి హళ్లి. దేశ ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం గత ఐదేండ్లలో మోదీజీ సాధించింది శూన్యం-అన్నీ వైఫల్యాలే. అందువల్ల, ఆయన పుల్వామా, బాలాకోట్ గురించి మాట్లాడుతున్నారు. పుల్వామాలో అమరులైన వారి పేరిట, సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన వారిపేరిట, బాలాకోట్‌పై దాడుల పేరిట జోలె పట్టి ఓట్ల బిచ్చమడిగే నీచస్థాయికి ప్రధాని మోదీజీ దిగజారడం ఘోరం.

384
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles